‘స్వర’ మాంత్రికుడు నేరెళ్ళ

Ampashayya Naveen Writes About Nerella Venumadhav - Sakshi

మిమిక్రీ కళకు చెందని అనేక అంశాల్ని ముఖ్యంగా ప్రఖ్యాత వ్యక్తుల మానరిజమ్స్‌నీ, స్వరాల్ని అనుకరించడం, వెంట్రిలాక్విజమ్‌ (పెదవులు కదపకుండా కడుపుతో మాట్లాడటం), అనేక రకాల జోక్స్‌ని సృష్టించి ఆ జోక్స్‌కు సంబంధించిన వ్యక్తుల స్వరాల్లో వినిపించడం, ఐటమ్స్‌ని ఊరికేనే ప్రదర్శించడం కాకుండా వాటి ప్రదర్శనకు ముందు వాటి సైద్ధాంతిక నేపథ్యాన్ని ప్రేక్షకులకు విడమర్చి చెప్పడం వేణుమాధవ్‌ ప్రత్యేకత. దీనివల్ల మరొక ప్రయోజనం కూడా సిద్ధించింది. ప్రేక్షకులకు వేణుమాధవ్‌ ప్రదర్శించే ప్రతీ ఐటమ్‌ చక్కగా అర్థమైంది. ఇలా మిమిక్రీ కళనొక గౌరవప్రదమైన కళగా మలచగల్గిన ఖ్యాతి నేరెళ్ళ వేణుమాధవ్‌కే దక్కుతుంది.

 ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ధ్వన్యనుకరణ సామ్రాట్‌ నేరెళ్ళ వేణుమాధవ్‌ ఈరోజు (19–06–2018) శాశ్వతంగా కన్ను మూశారన్న వార్త విని తెలుగు ప్రజలంతా దిగ్భ్రాంతి చెందారు. ఆయన గొప్ప మిమిక్రీ కళాకారుడే కాకుండా గొప్ప సంస్కారవంతుడైన వ్యక్తిగా ప్రపంచ ప్రజల మన్ననలని పొందాడు. ఒక కళాకారుడిగా ఆయన అనేక పురస్కారాలు, అనేక సన్మానాలు పొందాడు. మిమిక్రీ కళ అంటే మొదట్లో ప్రజలు సీరియస్‌గా తీసుకునేవాళ్ళు కాదు. ఆ కళ గొప్ప కళ కాదు అని భావించేవారు. కానీ నేరెళ్ళ వేణుమాధవ్‌ అలాంటి అభిప్రాయాన్ని పటాపంచలు చేశాడు. మిమిక్రీ కళకు ఒక గొప్ప గౌరవాన్ని, ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకువచ్చిన మహా కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్‌.

ఎవరైనా, యే కళలోనైనా అగ్రస్థానానికి చేరుకోవాలంటే, ఆ కళ మీద తన ముద్రను ఏనాటికీ చెరిగిపోలేనంత గాఢంగా ముద్రించాలంటే, రెండు అంశాలను స్పష్టంగా పూరించాలి. అందులో మొదటిది: ఆ కళలో ఆ కళాకారుడికి చాలా సహజమైన నైపుణ్యం అలవడాలి. దీన్నే ప్రతిభ లేక ఇంగ్లిష్‌లో ‘‘టాలెంట్‌’’ అంటారు. పువ్వు పుట్టగానే పరిమళి స్తుందన్నట్టు, ఓ వ్యక్తి పుట్టిన కొద్దిరోజుల్లోనే అతనిలో నిగూఢంగా దాగి ఉన్న కళ యేదోరూపంలో బహిర్గతమవుతూనే ఉంటుంది. అయితే ప్రతిభ ఒక్కటే ఓ కళాకారుణ్ని అగ్రశ్రేణి కళాకారుడిగా రూపొందించదు. అందుకు రెండవది: అచంచలమైన, నిర్విరామమైన కృషి లేక సాధన కావాలి. దీన్నే వ్యుత్పత్తి అన్నారు. 

ఈ ప్రతిభావ్యుత్పత్తులు ఓ కళాకారుడిలో సమృద్ధిగా ఉన్నప్పుడే అతనిలోని కళ బహుముఖాలుగా వికసించి ఆ కళాకారుణ్నొక అగ్రశ్రేణి కళాకారుడిగా నిలుపగల్గుతాయి. డెబ్బయి వసంతాల్ని వీక్షించిన నేరెళ్ళ వేణుమాధవ్‌లో ఈ రెండూ పుష్కలంగా ఉండటం వల్లనే ఆయనను ఇవ్వాళ అందరూ విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సమ్రాట్‌ అని వేనోళ్ళ శ్లాఘిస్తున్నారు. వేణుమాధవ్‌ ఐదారేళ్ళ చిరుతప్రాయంలోనే తన చుట్టూ ఉన్న వ్యక్తుల ధ్వనుల్నీ, జంతువుల ధ్వనుల్నీ అనుకరించడం మొదలెట్టాడు. అంటే ఆయన పుట్టుకతోనే ఆయనలో ఈ కళ నిక్షిప్తమై ఉందని మనకర్థమవుతుంది.  He is a born artist ఆయన పుట్టు కళాకారుడు. తనలో ఈ ధ్వన్యనుకరణ కళ ఉందని ఆయన తన బాల్యంలోనే గుర్తించాడు. తనలోని ఈ కళాకారుణ్ని సజీవంగా కాపాడుకుని, ఇటు తనకూ, అటు సమాజానికి ప్రయోజనకరంగా ఆ కళాకారుణ్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి నేరెళ్ళ వేణుమాధవ్‌ తన బాల్యం నుండి ఈనాటి వరకు దాదాపు ఆరు దశాబ్దాలుగా అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాడు. ఆయన నిరంతర కళాకృషీవలుడు.

మన పూర్వులు ఈ ధ్వన్యనుకరణను ‘‘స్వరవంచన’’ పేరుతో చతుషష్టి కళల్లో (64 కళల్లో) ఒక కళగా గుర్తించారు. ప్రారంభంలో ఈ కళను యే గురువు సహాయం లేకుండా, యే శిక్షణ సంస్థలోనూ శిక్షణ పొందకుండా కేవలం తనంతట తానుగా నేరెళ్ళ వేణుమాధవ్‌ అభ్యసించాడు. ఆరోజుల్లో ఆయనకు ఎన్నో అవాంతరాలెదురయ్యాయి. కుక్కల్నీ, నక్కల్నీ అనుకరించడం కూడా కళేనా అని ఆనాటి పండిత ప్రకాండులు ఎద్దేవా చేశారు. అయినా వేణుమాధవ్‌ ఈ కళను పరిత్యజించలేదు. సాధన చేస్తూనే ఉండిపోయాడు. ఈ కళలోని అనేక నూతన సూక్ష్మాలనెన్నిం టినో తెలుసుకున్నాడు. ఒక్కో ప్రక్రియను (ఐటమ్‌) ప్రదర్శించడానికి ముందు ఆ ప్రక్రియ వెనుక ఉండే కళా సూక్ష్మాలేమిటో ప్రేక్షకులకు విడమర్చి చెప్పడం మొదలెట్టాడు. ఇలా ఒక్కో ఐటమ్‌ని ప్రదర్శించడానికి ముందు ఆ ఐటమ్‌ను గూర్చి వివరణ ఇవ్వడం వల్ల ప్రేక్షకులు ఆ ఐటమ్‌ని చక్కగా అర్థం చేసుకుని ఆస్వాదించగల్గారు. 

మిమిక్రీ కళకు చెందని అనేక అంశాల్ని ముఖ్యంగా ప్రఖ్యాత వ్యక్తుల మానరిజమ్స్‌నీ, స్వరాల్ని అనుకరించడం, వెంట్రిలాక్విజమ్‌ (పెదవులు కదపకుండా కడుపుతో మాట్లాడటం), అనేక రకాల జోక్స్‌ని సృష్టించి ఆ జోక్స్‌కు సంబంధించిన వ్యక్తుల స్వరాల్లో వినిపించడం, ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ ‘బెన్‌హర్‌’ ‘మెకన్నస్‌ గోల్డ్‌’ లాంటి ఇంగ్లీష సినిమాల్లోని కొన్ని సౌండ్స్‌ని అనుకరించడం ద్వారా థియేటర్లో ఆ సినిమాలు చూస్తున్నప్పటి అనుభూతిని కల్గించడం, ‘‘హామ్లెట్‌’’ ‘‘ఒథెల్లో’’ లాంటి షేక్‌స్పియర్‌ నాటకాల్లోంచి డైలాగుల్ని ఆయా నటీనటుల స్వరాల్లో వినిపించడం, గాంధీ, రాధాకృష్ణన్, సుభాస్‌బోస్‌ లాంటి నాయకుల ఉపన్యాసాలను వారి స్వరాల్లో వినిపించడం, పోతన ‘‘గజేంద్రమోక్షం’’ కావ్యంలోని సుదీర్ఘమైన కఠిన సమాస భూయిష్టమైన వర్ణనల్ని గొంతు తిప్పుకోకుండా ఏకధాటిగా వల్లిం చడం– ఇలాంటి ఐటమ్స్‌ని ఊరికేనే ప్రదర్శించడం కాకుండా వాటి ప్రదర్శనకు ముందు వాటి సైద్ధాం తిక నేపథ్యాన్ని ప్రేక్షకులకు విడమర్చి చెప్పడం వేణుమాధవ్‌ ప్రత్యేకత. 

ఈ కారణం వల్ల ఆయన ప్రదర్శించే ఐటమ్స్‌కొక సమగ్రమైన సైద్ధాంతిక భూమికను ఏర్పర్చినట్లయ్యింది (Theoritical framework). దీని వల్ల మరొక ప్రయోజనం కూడా సిద్ధించింది. ప్రేక్షకులకు వేణుమాధవ్‌ ప్రదర్శించే ప్రతీ ఐటమ్‌ చక్కగా అర్థమైంది. ఇలా మిమిక్రీ కళనొక గౌరవప్రదమైన కళగా మలచగల్గిన ఖ్యాతి నేరెళ్ళ వేణుమాధవ్‌కే దక్కుతుంది. తను ప్రదర్శిస్తున్న కళలోని అనేక సూక్ష్మాల్ని అనేకసార్లు వేణుమాధవ్‌ తన ప్రేక్షకులకు విడమర్చి చెప్పడం వల్లనే ఆయనకు ఈ కళకొక శాస్త్రాన్ని (Science) సృష్టించే అవకాశం కల్గింది.  ఏ విషయాన్ని గురించైనా ఒక క్రమపద్ధతిలో రూపొందించిన విజ్ఞానాన్నే శాన్త్రమంటారు. మిమిక్రీ కళకు అలాంటి శాస్త్రాన్ని లేక ఒక సైద్ధాంతిక భూమికను వేణుమాధవ్‌ రూపొందించడం వల్లనే ఇవ్వాళ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో మిమిక్రీనొక డిప్లొమా కోర్సుగా ప్రవేశపెట్టారు. దీనివల్ల అనేకమంది వర్ధమాన ఔత్సాహిక మిమిక్రీ కళాకారులకు ఎంతో ప్రయోజనం కల్గింది. ఇవ్వాళ ఈ విశ్వవిద్యాలయంలో మిమిక్రీ కళాకారులకు ఒక శాస్త్రీయమైన శిక్షణ లభిస్తున్నదంటే అందుకు వేణుమాధవ్‌ చలవే కారణం. 

ఇది డా‘‘ నేరెళ్ళ వేణుమాధవ్‌ మిమిక్రీ కళకు, మిమిక్రీ కళాకారులకు చేసిన మహోపకారమని చెప్పాలి. యే గొప్ప కళాకారుడైనా తన కళ తనతో ఆగిపోవాలని కోరుకోడు. అదింకా ముందుకెళ్ళాలని, కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటాడు. డా‘‘ నేరెళ్ళ వేణుమాధవ్‌ మిమిక్రీ కళకొక సిలబస్‌ను సృష్టించి దానికి శాశ్వతత్వాన్ని కల్పించాడు. డా‘‘ నేరెళ్ళ వేణుమాధవ్‌ ఇప్పటివరకు పదివేలకు పైగా మిమిక్రీ ప్రదర్శన లిచ్చాడు. 1971లో న్యూయార్కులోని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో మిమిక్రీ ప్రదర్శననిచ్చిన మొట్టమొదటి మిమిక్రీ కళాకారుడాయన. ఆయన ప్రపంచాన్నంతా మూడుసార్లు తిరిగి ఇంచుమించు ప్రపంచ దేశాలన్నిట్లోనూ మిమిక్రీ ప్రదర్శనలిచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతులైన ఎందరో నాయకుల్నీ, సినిమా కళాకారుల్నీ అనుకరించి అశేష జనసమూహాల్ని ఆనందడోలికల్లో విహరింపజేశాడు.

తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో మిమిక్రీ చేయగల నేరెళ్ల.. మిమిక్రీ ప్రదర్శనల కోసమే ఎన్నో దేశాలు తిరిగారు. ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన ఇచ్చిన ఏకైక తెలుగు  కళాకారుడాయన. వేణుమాధవ్‌ ప్రదర్శన ముగిసిన వెంటనే ఐక్యరాజ్యసమితిలో అప్పుడు ఆసీనులైన ప్రతి ఒక్కరూ లేచి కరతాళధ్వనులు చేశారంటే ఆయన ప్రతిభను అర్థం  చేసుకోవచ్చు. ‘10  కమాండ్‌మెంట్స్‌’ అనే ఆంగ్ల చిత్రంలోని ఓ ఎపిసోడ్‌ను ఆయన ప్రదర్శించిన తీరు ఇప్పటికే ప్రత్యేకమే. ఇది నేరెళ్ల వేణుమాధవ్‌లోని అసమాన ప్రతిభకు నిదర్శనం. నేరెళ్ల ప్రతిభను  గుర్తించిన అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీవీ నరసింహరావు ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయడం విశేషం. హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లోని ఆడిటోరియానికి ‘నేరెళ్ల  వేణుమాధవ్‌ కళా ప్రాంగణం’గా ప్రభుత్వం నామకరణం చేసింది. ప్రజసు ఆయనకు ఎక్కడకు వెళ్ళినా బ్రహ్మరథం పట్టారు. ఎన్నో సన్మానాలు చేశారు. ఎన్నో పురస్కారాల్ని ప్రదానం చేశారు. ఎన్నో బిరుదులిచ్చారు. జోహార్లు అర్పించారు. అంతమంది ప్రజల, ఇన్ని మన్ననల్ని, ఇంతకాలం నిర్విరామంగా పొందటం ఏ గొప్ప కళాకారుడి జీవితంలోనైనా చాలా అరుదైన ఉపలబ్ధి. ఇది కళాకారుడిగా డా‘‘ నేరెళ్ళ వేణుమాధవ్‌ సాధించిన అద్భుత, అపూర్వ, అనితరసాధ్యమైన విజయం.

అంపశయ్య నవీన్‌
వ్యాసకర్త ప్రముఖ నవలా రచయిత, విమర్శకుడు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top