అమెరికా నెత్తిన కొరియా కొరివి!

Abk Prasad Writes Opinion For Trump Kim Summit - Sakshi

దాదాపు 65 ఏళ్లుగా అనుక్షణం అగ్రరాజ్యం బెదిరింపులకు గురౌతున్న ఉత్తర కొరియా తన ప్రగతిని, భూభాగాన్ని కాపాడుకోవడంకోసమే అణ్వస్త్రవ్యాప్తి ఒప్పందానికి దూరంగా జరిగింది. రాక్షస అణ్వస్త్ర మారణాయుధాన్ని(థర్మో న్యూక్లియర్‌ బాంబు) రూపొందించి, ప్రయోగ సఫలతను ప్రపంచానికి దాచుకోకుండా వెల్లడించింది. దీంతో గంగవెర్రులెత్తిన అమెరికా ప్రభుత్వానికి నిద్రపట్టలేదు. అన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని నిమిషాల్లో చేరుకుని శత్రు సంహారం చేయగల మహమ్మారి మారణాస్త్రం ఉత్తర కొరియా చేతుల్లో ఉందనే వాస్తవం అమెరికాను కలవరపెట్టింది. ఇదే ఉత్తర కొరియాతో శాంతి చర్చలకు కారణం. 

‘‘అమెరికా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరత కోసం అమెరికా, కొరియా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య బంధం బలపడే చర్యలకు కట్టుబడి ఉండాలి. ఈ సానుకూల దృక్పథం కొనసాగించడానికి ఉభయ దేశాల విదేశాంగ మంత్రులూ అత్యున్నత అధికారుల స్థాయిలో వీలైనంత త్వరగా చర్చలు జరపాలి. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ లక్ష్యంగా కృషిచేయాలి.’’ – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌–ఉన్, సింగపూర్‌ చరిత్రాత్మక సమావేశంలో సంయుక్త ప్రకటన

‘‘ఉభయ దేశాల మధ్య ఈ నూతన శకం ఆవిష్కరించాలంటే, 1953 నాటి తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం కాస్తా తొలగి శాశ్వత శాంతి ఒడంబడిక జరగాలి. కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్ర నిరాయుధీకరణ జరగాలంటే ఉత్తర కొరియా రిపబ్లిక్‌ భద్రతకు శాశ్వత ఒప్పందం మాత్రమే గ్యారంటీ కాగలదు. అణ్వాయుధ నిరాయుధీకరణ ప్రక్రియకు సమయం పడుతుందని ట్రంప్‌ అంటున్నారు. ఈ ప్రక్రియ తిరుగులేకుండా కొనసాగాలనేది ట్రంప్‌ ఉద్దేశం. 2018 ఏప్రిల్‌లో ఉభయ కొరియాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సంబంధాల్లో సాధారణ సానుకూల పరిస్థితులు రావాలి. అమెరికా, చైనాల ప్రమేయంతో 2018 చివరకి శాంతి సంధి కుదిరే అవకాశం ఉంది.’’ – మాజీ దౌత్యాధికారి రాజేష్‌ సూద్‌

దేశాల మధ్య శాంతి, సౌహార్దపూర్వక సంబంధాలను శాంతికాముకులుగా కోరుకుంటారు. ఈ లోకరీతికి భిన్నమైనవారే సామ్రాజ్యవాదులు, వలస–సామ్రాజ్య విస్తరణవాదులు. నవంబర్‌లో జరిగే అమెరికా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ట్రంప్‌ కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణ్వస్త్ర నిరాయుధీ కరణకు తొందరపడుతున్నారు. ఏడు దశాబ్దాల క్రితం అవిభక్తంగా ఉన్న దేశం రెండు కొరియాలుగా విడిపోవడానికి జపాన్, అమెరికాలే కారణం. 1953 నుంచీ కొరియాలో శాంతి పేరిట రకరకాల సంధు లు, శాంతి ఒప్పందాలూ జరుగుతూనే వచ్చాయి. అవి ఆచరణలోకి రాకుండా అమెరికా అడ్డుకుంటూనే ఉంది. అయితే, కొరియా ద్వీపకల్పంలో నిరాయుధీ కరణ, అణ్వస్త్ర నిరాయుధీకరణ గురించిన స్పృహ అమెరికా పాలకులకు ఎందుకొచ్చింది?

అగ్రరాజ్యాన్నే గంగవెర్రులెత్తించిన అణ్వస్త్రం
దాదాపు 65 ఏళ్లుగా అమెరికా ఆయుధ విక్రయాలతో దక్షిణ కొరియా కొమ్ముకాయడం వల్లే కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అనుక్షణం అగ్రరాజ్యం బెదిరింపులకు గురౌతున్న ఉత్తర కొరియా తన ప్రగతిని, భూభాగాన్ని కాపాడు కోవడానికి అణ్వస్త్రవ్యాప్తి ఒప్పందానికి దూరంగా జరిగింది. అంతేకాదు, రాక్షస అణ్వస్త్ర మారణా యుధాన్ని (థర్మో న్యూక్లియర్‌ బాంబు) రూపొం దించి, ప్రయోగ సఫలతను ప్రపంచానికి దాచు కోకుండా వెల్లడించింది. దీంతో గంగవెర్రులెత్తిన అమెరికా ప్రభుత్వానికి నిద్రపట్టలేదు. అన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని నిమిషాల్లో చేరుకుని శత్రు సంహారం చేయగల మహమ్మారి మారణాస్త్రం ఉత్తర కొరియా చేతుల్లో ఉందనే వాస్తవం అమెరికాను కలవరపెట్టింది. పైగా 1994–2011 మధ్య కాలంలో గోప్యంగా జరిపిన దాదాపు 80 రకాల ప్రయోగాలను అమెరికా పసిగట్టలేకపోయింది. అనితర సాధ్యమైన హైడ్రో జన్‌ బాంబును హాసాంగ్‌ పేరుతో ఉత్తర కొరియా పరీక్షించింది. ఈ అణ్వస్త్రానికి 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా నడిబొడ్డును లక్ష్యంగా చేసుకుని దెబ్బ దీయగల శక్తి ఉంది. అందుకే, ట్రంప్‌ ఉత్తర కొరియా నేత కిమ్‌ను ‘‘అత్యంత శక్తిమంతు డైన విజ్ఞాని’’ అని ప్రశంసించడం వ్యంగ్యమా, వాస్తవమా అని లోకం చర్చించుకోవడం విశేషం. అయితే, ‘‘అమెరికా బుద్ధి జాఢ్య జనితోన్మాదానికి ఎలా జవాబు చెప్పాలో ఉత్తర కొరియాకు తెలుసు,’’ అని కిమ్‌ ఎదురు సమాధానం ఇచ్చారు.

చర్చలకు ముగ్గులోకి  దింపింది అదే
కిందటి సెప్టెంబర్‌లో అసాధారణ మహమ్మారి అణ్వస్త్ర ప్రయోగం జరిపిన తర్వాతే ఉత్తర కొరియా శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. చివరికి ట్రంప్‌తో అధినాయక సమావేశాన్ని సింగపూర్‌లో జయప్రదంగా జరపగలిగింది. సోషలిస్ట్‌ దేశంగా తనకు తానుగా దురాక్రమణకు గాని, యుద్ధానికిగాని దిగననీ, అలా అని సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశాల పాలకులు కవ్విస్తే చేతులు ముడుచుకు కూర్చుంటానని భావించవద్దనేది ఉత్తర కొరియా ఇచ్చే సందేశం. అందుకే, అమెరికా, దాని మాట వినే సోదర దేశం దక్షిణ కొరియా ఎలా వ్యవహరించినాగాని ఉత్తర కొరియా మాత్రం తనకు తానుగా యుద్ధ విరమణ సరిహద్దు గీతను ఉల్లం ఘించలేదు. తన హైడ్రోజన్‌ బాంబు పాటవ పరీక్ష నిర్వహించుకున్నాక అణ్వస్త్ర పరీక్షల నిలుపుదలకు అమెరికా ఆకస్మికంగా చేసిన ప్రతిపాదనకు ఉత్తర కొరియా వెంటనే సానుకూలంగా స్పందించడం కిమ్‌ విశుద్ధ నిజాయితీకి తాజా ఉదాహరణ. మూడు వేల మంది ప్రపంచ పాత్రికేయుల కళ్ల ముందే ఉత్తర కొరియాలోని అణుబాంబు పరీక్షా ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేయడమే కిమ్‌ చిత్తశుద్ధికి మరో నిదర్శనం. వీటికి ప్రత్యుపకారంగా ట్రంప్‌ రేపటి నుంచి ఎలాంటి విధానాలు అనుసరిస్తారోనని ప్రపంచం వేయి కళ్లతో చూస్తూనే ఉంటుంది. 

ఇంతకు ముందు జర్మనీ విభజనకు, రెండు జర్మనీల ఏర్పాటుకు కారకుడైన నాజీ నియంత హిట్లర్‌ విధానాలు ప్రపంచానికి అనుభవమే. అలాగే, కొరియా, వియత్నాంలను రెండు దేశాలుగా చీల్చి, సామ్రాజ్య విస్తరణకాంక్షకు రెక్కలు తొడిగిన అమె రికా పాలకుల పోకడలను లోకం మరచి పోరాదు. ఈ విధానాల వల్ల ఈ దేశాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పంట పొలాలు నాశనమై క్షామ పరిస్థితులు ప్రజలను పీడించాయి. ఫలితంగా కొన్ని దేశాలు అమెరికా ఆర్థిక సాయంపై ఆధారపడే దుస్థితికి చేరుకున్నాయి. కొరియా ద్వీపకల్పాన్ని 1910లోనే ఆక్రమించుకుని దుర్మార్గమైన పాలన సాగించిన జపాన్‌ను లొంగదీసే అవకాశం అమెరికాకు రెండో ప్రపంచయుద్ధం కల్పించింది. జపాన్‌ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణుబాంబులు వేసి మారణహోమం సృష్టించింది. లక్షలాది మంది జపాన్‌ ప్రజలు ప్రాణాలు కోల్పో యారు. ఫలితంగా, అమెరికా ఆధ్వర్యంలో నడిచే మిత్రమండలి సైన్యానికి కొరియా ద్వీపకల్పాన్ని జపాన్‌ పాలకులు అప్పగించక తప్పలేదు. 

రెండో ప్రపంచయుద్ధానంతరం రెండు ముక్కలు
అప్పుడు కొరియా ద్వీపకల్పాన్ని రెండు భాగాలుగా చీల్చారు. ఆ తర్వాత ఉత్తర కొరియా దాడులకు పాల్పడుతోందన్న ‘ప్రచార సాకు’తో దక్షిణ కొరియా లో సర్వ హంగులతో అమెరికా ఆక్రమణ ప్రారం భమైంది. ఫలితంగా, ఉత్తర కొరియాకు పూర్వపు సోవియెట్‌ యూనియన్‌ సాయంగా నిలబడవలసి వచ్చింది. భౌగోళికంగా తన ఉనికిని కాపాడుకోవడానికి, వనరుల అభివృద్ధికి ఉత్తర కొరియా నానా బాధలు పడింది. స్వతంత్ర దేశంగా నిలదొక్కు కోవడానికి ఈ చిన్న దేశం సోషలిస్ట్‌ దేశాల సహ కారంతో ముందుకుసాగింది. నిరంతర ఉద్రిక్తలు, యుద్ధ వాతావరణం మధ్య ఉత్తర కొరియా ప్రగతి పథంలో పయనించినాగాని దేశంలో వ్యవసాయోత్ప త్తులు బాగా తగ్గిపోయాయి. 1990ల్లో ఆహార నిల్వల తీవ్ర కొరతతో సతమతమైంది. పరిమితంగా ఉన్న మైదాన భూముల్లోనే వరి, బంగాళా దుంపల సాగుపై ఉత్తర కొరియా ఆధారపడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండేసి పంట లకు అవకాశాలు కుదించుకుపోయాయి. అయినా 1988లో ఐక్యరాజ్యసమితి ఆర్థికాభివృద్ధి సంస్థతో ఉత్తర కొరియా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో దేశంలో కూరగాయల సాగు, పండ్ల తోటల పెంప కాన్ని ఆధునికీకరించుకోగలిగింది. అమెరికా పాల కుల అనుచిత జోక్యం వల్ల యుద్ధవాతావరణంలో ఈ సోషలిస్ట్‌ దేశం పంట నష్టాలతోపాటు విపరీత జననష్టాన్ని కూడా భరించాల్సి వచ్చింది. 

చర్చలతోటే శాశ్వతశాంతి 
1954–1990 దశకం చివరి వరకూ ఉత్తర కొరియాను కరవు కాటకాలు అతలాకుతలం చేశాయి. ఈ సంక్షో భాన్ని సోషలిస్ట్‌ విధానాల ద్వారా ఉత్తర కొరియా అధిగమించగలిగింది. సామ్యవాద పంథాలో పయని స్తూనే సంస్కరణలు ప్రవేశపెట్టి పారిశ్రామికీకరణను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లింది. సాంకేతిక ప్రగతి ద్వారా సాగునీటి సరఫరా విస్తరణకు తీసు కున్న చర్యల ఫలితంగా ఉత్తర కొరియాలోని వర్షా ధార ప్రాంతాలు సైతం పంట పొలాలతో కళకళ లాడటం ప్రారంభించాయని పాశ్చాత్య నిపుణుల అంచనా. గ్రామీణ విద్యుదీకరణ 92 శాతం పల్లెలకు విస్తరించింది. ఇప్పటికైనా అమెరికా పాలకులు కొరివితో తల గోక్కోకుండా ఉత్తర కొరియాను బతికి బట్టకట్టనిస్తే, శ్రీశ్రీ అన్నట్టు యుద్ధాలు లేకపోతే ‘‘మానవుడే దేవుడవుతాడు’’. ఇక ఆర్థిక ఆంక్షలనే దుర్మార్గపు ఎత్తుగడలకు అమెరికా పాలకులు స్వస్తి పలికితే కొరియా ద్వీపకల్పంలో శాంతి, ప్రగతి శాశ్వతంగా నిలబడతాయి.


- ఏబీకే ప్రసాద్‌(సీనియర్‌ సంపాదకులు)
ఈ–మెయిల్‌: abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top