ఏ సేవైనా గుజరాత్‌ తోవకే

abk prasad writes on gst - Sakshi

రెండో మాట

చివరికి ట్యాక్స్‌ అధికారులకు సహితం ఈ జీఎస్టీ చట్టం సంక్లిష్టంగా తయారైంది. వ్యాపార సంస్థల జమా ఖర్చులను సరిజూసి, తారుమారు చేసో లేదా సరిచేసో సమర్పించే ఆడిటర్లను సహితం ఇది కంగారుపెడుతోంది. అన్నింటికన్నా విశేషం–ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు సయోధ్యతో వ్యవహరించుకోవాలన్న రాజ్యాంగ నిబంధనల్ని గౌరవిస్తున్నట్టు నటిస్తూ వచ్చిన బీజేపీ పాలకులు, దేశానికంతకూ ఏకైక పన్నుల వ్యవస్థ ఉంటుందని చెప్పి 2 నెలలు గడవకముందే, జీఎస్టీతో పాటు రాష్ట్ర పన్నులూ విధించుకోవచ్చని చెప్పారు. 

‘దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి (ప్రగతి) రేటు 7.5 శాతం నుంచి 5.7 శాతానికి పడిపోయిన మాట నిజం. దాన్ని కాదనలేను. అదే సమయంలో అభివృద్ధి రేటును పెంచడానికి తగిన ద్రవ్య ప్రోత్సాహకాలూ(ఫిస్కల్‌ సిమ్యులస్‌) అందుబాటులో లేవు. అయినా ఆర్థికాభివృద్ధిని పునరుద్ధరించడానికీ, తద్వారా వస్తు–సేవల పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టినందువల్ల ఏర్పడిన అన్ని అడ్డంకులను నివారించడానికీ అవసరమైన చర్యలన్నింటిని ప్రభుత్వం తీసుకోగలదు. దేశం భారీ ద్రవ్యోల్బణ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఈ సమయంలో కొందరు దేశంలో నిరాశావాదాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నేను ఆర్థికవేత్తను కాను. అయితే అవినీతి పైన, నల్లధనం పైన ఏడాది క్రితం తలపెట్టిన యుద్ధం చరిత్రాత్మక నిర్ణయంగా నిలిచిపోతుంది’. – నరేంద్ర మోదీ (4–10–17)

‘దేశ జాతీయాదాయం విషయంలో మాదిరిగానే దఫదఫాలుగా దేశం లోని నల్లధనం విషయంలో వేసే అంచనాలనేవి ఆ ఏడాది తేలిన జమాఖర్చుల మదింపులో ఉంటాయి. నల్లధనం అనేది నిల్వలో ఉండే సరుకు కాదు. కాబట్టి ఒక ఏడాదిలో మేట వేసుకునే బ్లాక్‌మనీ పెట్టుబడిగా తరలించుకునే మార్గాలు వెతుక్కుంటుంది, లేదా ఆ తరువాత జరిగే లావాదేవీలలో ఆ నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవచ్చు. అవినీతి రెండురకాలు : చిన్నస్థాయిలో జరిగేది, గల్లీ అవినీతి. దినసరి అవినీతి. చిల్లర అవినీతి. ఇదికాక, భారీ స్థాయిలో ఘరానా అవినీతి రాజకీయవేత్తల, ఉన్నతాధికారుల, బడా వ్యాపార వర్గాల స్థాయిలో ఉంటుంది.’ – ప్రొ. జి. నరసింహారెడ్డి

కిందపడినా ‘నాదే గెలుపు’ అని ప్రగల్భించే వితండవాదులు జనసామాన్యంలోనే కాదు, ఉన్నతస్థాయి వ్యక్తులలో కూడా ఉంటారు. ఇందుకు మంచి ఉదాహరణ– ప్రధాని నరేంద్ర మోదీ. తాను ఆర్థికవేత్తను కానని చెబుతూనే, 2016 నవంబర్‌ 8న ఆకస్మికంగా దేశం మీద రుద్దిన భారీ వస్తుసేవల పరోక్ష పన్నుల వ్యవస్థ వల్ల ఆర్థికరంగం కకావికలైన విషయాన్ని మనసారా ఒప్పుకోవడానికి చివరిక్షణం వరకు వెనుకాడారు. లంచగొండితనం, అవినీతి లక్ష్యంగా ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం విఫలమవుతూ వచ్చిన యుద్ధం. దానికి తోడుగా తలపెట్టిన భారీ పరోక్ష పన్నుల జీఎస్టీ వ్యవస్థ కూడా ప్రజా బాహుళ్యంలో ప్రధానంగా చిన్న, మధ్య తరగతి వ్యాపార వర్గాలు, సరుకుల ఎగుమతిదారులు సహా భారీ పరిశ్రమలకు ముడిసరుకులు ఉత్పత్తి చేస్తూ ఇతర ఉపాంగాలను సమకూర్చి పెట్టే కోట్లాదిమంది మాన్యుఫ్యాక్చరింగ్‌  పరిశ్రమ సిబ్బంది తదితర వృత్తిదారుల ఉపాధిని కోలుకోలేనంతగా దెబ్బతీసింది. అయినా సరే, అనాలోచితమైన ఈ జమిలి దాడి (భారీ నోట్ల రద్దు, జీఎస్టీ) మోదీ ఆశించిన ఫలితాలకు మారుగా విరుద్ధ ఫలితాలు రావడానికి కారణం– ఆయన ‘ఆర్థికవేత్త’ కాకపోవడమేకాదు, సర్వం తానుగా భావించుకుని కేబినెట్‌ను ఒక మూజువాణీ సరుకుగా చూస్తూ ఏకపక్షంగా నిరంకుశ నిర్ణయాలకు అలవాటుపడడం కూడా. ఈ వాస్తవాన్ని పలువురు బీజేపీ నాయకులు, మాజీ ఆర్థికవేత్తలు పదేపదే చెప్పినా కూడా మోదీ పెడచెవిన పెడుతూనే ఉన్నారు. 

జీఎస్టీ ఓ బ్రహ్మపదార్థం
దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా తీర్చిదిద్దదలిచిందో రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌గా ఇంతకు ముందు పనిచేసిన రఘురామ్‌రాజన్‌ ఉద్వాసనతోనే తెలిసింది. రాజన్‌ తరువాత ఉర్జిత్‌ పటేల్‌ ఆ పదవిలోకి వచ్చారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి బదులు మోదీ వైపు మెడలు రిక్కించి చూడడంతోనే ఈయనకు సరిపోతోంది. నిజానికి మిగతా గవర్నర్ల పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. అలాగే కొందరు సలహాదారులు, కార్యదర్శులకు కూడా తరచు స్థానచలనాలు సంభవిస్తున్నాయి. ఇది క్రమంగా ఎక్కడికి దారితీసింది? నోట్ల రద్దు, జీఎస్టీ బలవంతపు విధింపు చర్యలు విరుద్ధ ఫలితాలకు కారణమై, ప్రజా వ్యతిరేకతకు దారి తీసింది. అప్పుడు కూడా ఈ రగడ అంతా తనని విమర్శిస్తున్న దుష్టశక్తులు పన్నిన పన్నాగంగానే మోదీ భావించారు. ఆయన విధానాలను, వాటి ఫలితాలను అంచనా వేయడానికి కొన్ని గణాంకాలే నిదర్శనం: యూపీఏ హయాంలో దేశ జనాభాలో కేవలం ఒక శాతం ఉన్న సంపన్న వర్గాలే దేశ సగటు జాతీయోత్పత్తుల విలువలో 49 శాతంపైన ఆధిపత్యం చెలాయించేవారు. కానీ ఇప్పుడో! బీజేపీ–ఎన్డీయే పాలనలో ఆ ఒక్కశాతం సంపన్న వర్గాలే, అదే జాతీయోత్పత్తిలో 60 శాతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మన ద్రవ్యలోటు, రెవెన్యూలోటు పోటాపోటీగా పెరుగుతున్నాయి. వస్తుసేవల మీద భారీగా పరోక్ష పన్నులను పెంచాలన్న నిర్ణయానికి జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలూ ఆమోదం తెలిపాయన్న వాదన చాటున మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ దాక్కోవాలని చూస్తున్నారు. కానీ ఆ సమావేశాలలో పలువురు ప్రత్యామ్నాయ సూచనలు చేశారు. అయినా అర్థం చేసుకోవడానికి వీలుకాని అనంతమైన క్లాజులు, పరస్పర విరుద్ధ సూచనలతో, చిన్న తరహా, మధ్య తరహా వర్తక వ్యాపారులకు బుర్ర పనిచేయనంత స్థాయిలో జీఎస్టీ చట్టం, చట్ట నిబంధనలు (2017) రూపొందాయి.

చివరికి ట్యాక్స్‌ అధికారులకు సహితం ఈ జీఎస్టీ చట్టం అత్యంత సంక్లిష్టంగా తయారైంది. వ్యాపార సంస్థల జమా ఖర్చులను సరిజూసి, వీలునుబట్టి తారుమారు చేసో లేదా సరిచేసో సమర్పించే ఆడిటర్లను సహితం ఇది కంగారుపెడుతోంది. అన్నింటికన్నా విశేషం– ఫెడరల్‌ (సమాఖ్య) వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు సయోధ్యతో వ్యవహరించుకోవాలన్న రాజ్యాంగ చట్ట నిబంధనల్ని గౌరవిస్తున్నట్టు నటిస్తూ వచ్చిన బీజేపీ పాలకులు, దేశానికంతకూ ఏకైక పన్నుల వ్యవస్థ (సింగిల్‌ ట్యాక్స్‌) ఉంటుందని చెప్పి రెండునెలలు గడవకముందే, జీఎస్టీతో పాటు రాష్ట్ర పన్నులూ విధించుకోవచ్చని చెప్పారు. అంటే– జీఎస్టీ ఏకైక భారీ పన్నుగానే కొనసాగుతూ రాష్ట్రాలు అదనంగా పన్నులు ప్రజలపైన మోపవచ్చునట. ఈ భారీ పరోక్ష పన్నుల విధానంలో (జీఎస్టీ) కలసిపోయే పన్నుల చట్టాలు ఎన్నో తెలుసా– ఒక్క ఆరు సరుకులకు తప్ప, విలీనమైపోయే చట్టాలు సుమారు 20. ఇది, మొదట్లో కేంద్రం దేశానికంతకూ ప్రకటించిన ‘ఒకే పన్నుల విధానా’నికి విరుద్ధం. అందువల్లనే జీఎస్టీ కౌన్సిల్‌ నవంబర్‌ 9–10 తేదీల్లో జరిగిన సమావేశంలో రాష్ట్రాలు జీఎస్టీ వల్ల కోల్పోయే ఆదాయ వనరుల గురించి ఏకరువు పెట్టాల్సివచ్చింది.

తగ్గింపు గుజరాత్‌ ఫలితాల కోసమే
బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్‌లో ఎన్నికల ఫలితాలు తారుమారు కాకుండా చూసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్కాలికంగా 178 సరుకులపై పన్నులను 28 శాతం కంటే తక్కువగా కుదించాలని నిర్ణయించింది. 50 రకాల విలాస వస్తువులపైన మాత్రం 28 శాతం పన్నును ఉంచి, పేద, మధ్యతరగతి ప్రజలు వాడే నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నా వాటిని పట్టించుకోకుండా చ్యూయింగ్‌ గమ్స్, చాకొలేట్లు, సౌందర్య పోషకాలు, షాంపూలపైన జీఎస్టీని 18 శాతానికి కుదించారు. రైతులు వాడే ఎరువులు, వ్యవసాయ పనిముట్లకు తగిన వెసులుబాటు పూజ్యం. ఇదంతా చైనీస్‌ ప్రసిద్ధ డిజిటల్‌ కంపెనీతో భారతదేశ ఐటీ నిపుణుడొకరిచే ‘పేటీఎం’ వ్యవస్థకు జతకలిపి ‘డిజిటల్‌’ చెల్లింపుల ద్వారా నగదు లావాదేవీలను ప్రోత్సహించాలని పాలకులు ప్రయత్నించి, ఏ గుత్తాధిపత్య ధోరణుల్ని ప్రోత్సహించరాదని పైకి కబుర్లు చెబుతున్నాయో ఆ ధోరణికే పాలకులు చేయూతనిస్తున్నారు. తద్వారా సాధారణ నగదు లావాదేవీలకు సామాన్యుల్ని పనిగట్టుకుని దూరం చేశారు. జీఎస్టీ ఆధారంగా అదనపు పన్నులు మాత్రం కట్టించుకుని తీరా అదనంగా ప్రభుత్వం వసూలు చేసుకున్న మొత్తాన్ని వాపస్‌ చేయాల్సి వచ్చేసరికి పన్ను చెల్లింపుదార్లను ఈరోజు దాకా (నవంబర్‌ 14) ఏడిపిస్తూనే ఉన్నారు. వ్యవస్థను పకడ్బందీగా స్థిరపరచలేని ప్రజా వ్యతిరేక ఆర్థిక వ్యవస్థకూ, ప్రజా ప్రయోజన రాజకీయ విధానానికీ పాలకులు దూరమైపోయిన చోట పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఈ పరి ణామాన్ని ప్రసిద్ధ ఆర్థిక, రాజకీయ వ్యాఖ్యాత వి. శ్రీధర్‌ ఇలా క్లుప్తంగా వర్ణించాడు: ‘నోట్ల రద్దు తరువాత సంవత్సరానికి దేశ వ్యవసాయ రంగం కుదేలైంది. చిన్న వ్యాపారాలు నాశనమైపోయాయి, ఈ ఏడాది జూలైలో వస్తు–సేవా పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో మోదీ పాలన నిరంతర గందరగోళ ప్రభుత్వమన్న అప్రతిష్టను పొందింది’. అందుకే ఇక నుంచి జీఎస్టీ కాదు దాన్ని ‘జి.సి.ఎస్‌.టి.’గా (గుజరాత్‌ కన్సెషనల్‌ సేల్స్‌ ట్యాక్స్‌) చెప్పుకోవడం బాగుంటుందేమో!

అపహాస్యమైన ప్రభుత్వం
ఇదంతా, భారతదేశం లాంటి ప్రధాన వ్యవసాయక దేశంలో, కార్మికులు, వృత్తిదారులు, నిత్యం నగదు అవసరాలున్న చోట, నిరక్షరాస్యత తాండవి స్తున్న చోట, అత్యంత సాంకేతిక సంజ్ఞలతో కూడుకున్న డిజిటల్‌ యంత్రాల ద్వారా నగదు లావాదేవీలు జరుపుకోమంటూ తీసుకువచ్చిన ఒత్తిడి. ఆ ఒత్తిళ్లకు బలవంతంగా జనాన్ని అలవాటు చేసే క్రమంలో బ్యాంకుల, ఏటీఎంల ముందు 125–150 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కానీ ఆ ఊసే ఎత్తని పాలకుడు– 125 కోట్ల మంది ప్రజలు నన్ను మెచ్చుకుంటున్నారని ముచ్చటపడుతున్నాడు. అదే సమయంలో–ట్వీటర్‌లు ఎలాంటి ట్వీట్స్‌ను మోసుకొస్తున్నాయో ఆయన గమనించాలి. మోదీ పన్నెండేళ్లు ఏలిన గుజరాత్‌లో 20 ఏళ్ల తరువాత మొట్టమొదటిసారిగా పాలక పార్టీ బీజేపీనీ, ‘గుజరాత్‌ అభివృద్ధి’ నమూనానూ ప్రజలు వ్యంగ్యంగా, పరిహాస చిత్ర రచనల ద్వారా ఎలా విమర్శించుకుంటున్నారో జవహర్‌లాల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ (ఏమిరిటస్‌) జోయా హసన్‌ ఇలా పేర్కొంటున్నారు: ‘ఒక రైలు ప్రయాణీకుడు పట్టాలు నీళ్లల్లో మునిగిపోవటం చూసి, తోటి ప్రయాణీకుడిని ఇలా ప్రశ్నించాడు– ఏమండీ ఇక్కడ ‘వికాస్‌’ (అభివృద్ధి) ఎక్కడా కన్పించడం లేదేమిటి అని. దానికి ఆ పక్కనున్న ప్రయాణీకుడొకడు అన్నాడట– వికాస్‌ బుల్లెట్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు గదా, అందుకని అతను కనిపించడంలేదు’ అని.

అలాగే ‘వాట్సప్‌’లో మరో ట్వీట్‌: ‘మూడేళ్లలో మోదీ మనకెన్నో ఇచ్చాడనుకున్నాం. కానీ మన నుంచి ఆయన ఎన్నో లాక్కున్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో మాత్రం మనం ఆయనకు బకాయి పడకుండా వాపసు ఇచ్చేయాలనుకున్నాం, లేకపోతే మనం అడుక్కుతిని పోతాం’(31.8.17). ఈ ‘జోకు’ లకేం గానీ, ‘గోరక్షకుల’ బారి నుంచి దారిమళ్లి, పద్ధతులు మార్చుకుని మోదీ పాలన కొనసాగిస్తే, ఎవరు మాత్రం అదనంగా కోరుకునేదేముంది?!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top