మన ‘టెక్కీ’లకు ట్రంప్‌ ‘చెక్‌’

ABK Prasad Article On Donald Trump Visa Decisions - Sakshi

అమెరికాలోని నిరుద్యోగ యువత ‘మా నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా మాకు దక్కాల్సిన ఉద్యోగాలను భారతదేశానికి ధారాదత్తం చేస్తున్నావ’ని ఒబామాపై విరుచుకుపడిన ఫలితంగా అప్పట్లోనే వీసా ఆంక్షలు ప్రారంభమైనాయి. ఇప్పుడు ట్రంప్‌ హయాంలో ఈ ఆంక్షలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. ‘హెచ్‌–1బి’ వీసాలపై భార్యాసమేతంగా అమెరికా చేరుకునే భారత ఉద్యోగార్థులపై మరొక ఆంక్ష విధించారు. ఏటా అమెరికాకు ఉద్యోగార్థులై వచ్చే వేలాదిమంది హెచ్‌–1బి భారత సాంకేతిక నిపుణులలో 90 శాతం మంది భార్యలకు ఉద్దేశించిన ‘హెచ్‌–4’ వీసాలకు కూడా ‘కత్తెర’ పడింది. మన దేశంలోని 70 శాతం ఐటీ కంపెనీలు అమెరికా గుత్త కంపెనీలపై ఆధారపడి ఉన్నందున ఇప్పుడు 5 లక్షలమందికి పైగా మన ఐటీ ఉద్యోగుల పరిస్థితి ‘ముందు గొయ్యి, వెనుక నుయ్యి’ సామెతగా మారింది.

‘‘అమెరికాలో తగిన సాంకేతిక నైపుణ్యం కొరవడినందున అమెరికన్‌ కంపెనీలలో ప్రత్యేక నిపుణులను ఆయా ఉద్యోగాలలో చేర్చుకునేందుకుగాను అవసరమైనంతమంది విదేశీ నిపుణులను అక్కడ స్థిరపడకుండా ఉండే ప్రాతిపదికపైన రిక్రూట్‌ చేసుకునే ‘హెచ్‌–1బి’ వీసాలను భారతీయులకు ఇకపై గణనీయంగా తగ్గించి వేయాలని అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ప్రతి నాలుగు ‘హెచ్‌–1బి’ వీసా దరఖాస్తులలో ఒక దానిని అమెరికా తిరస్కరించాలని నిర్ణయించింది.

భారత యువ సాంకేతిక నిపుణుల రిక్రూట్‌మెంట్‌కు ఉద్దేశించిన ఈ వీసా పిటిషన్‌లో 2019వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 27,707 దరఖాస్తులను అమెరికా నిరా కరించింది. మిగిలిన నిపుణులందరికీ కూడా ‘హెచ్‌–1బీ’ వీసాలు అను మతించాలని, ఇది ఉభయదేశాల ప్రయోజనాలకు పరస్పరం అవసర మని భారత ప్రభుత్వం తరఫున వాదిస్తున్నాం’’
– భారత విదేశాంగమంత్రి ఎస్‌. జయశంకర్‌ (22.11.2019)

దేశీయంగా స్వతంత్ర ఆర్థిక విధాన రూపకల్పనపైన, దానిని ఆచరణలో అమలు జరపడంపైననే మన విదేశాంగ విధానం కూడా ఆధారపడి ఉంటుంది. ఆ విధానం కొరవడినందుననే డెబ్బై రెండేళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా విదేశాలవైపు మన యువత మోరలెత్తి ఉద్యోగాల కోసం ఖండాంతరాలకు పరుగులు పెట్టవలసిన దుస్థితి వచ్చింది. వీరంతా దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలకు చెందిన వారున్నారు, వీరంతా ఇంగ్లిష్‌ చదువుకున్న విద్యాధికులే, అయినా ఉద్యోగాలకు పడిగాపులు పడవలసిన దుస్థితిలో ఉన్నవారే.

మనకు ‘దూరపు కొండలు నునుపు’ అన్న సామెత ఉంది. దగ్గరకుపోతేగానీ గరుకు అని గుర్తుకు రాదు. ఎందుకని? దూరదర్శనితో చూసిన కొండ చిన్నదిగానే కన్పిస్తుంది, అదే భూతద్దంతో చూస్తే పెద్దదిగా కన్పి స్తుంది. అంటే.. మారింది, మారవలసిందీ మన దృష్టేగానీ కొండ కాదని తెలుసుకునేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అలా కథ కంచికి మనం ఇంటికి అన్న చందంగా ఇప్పుడు ‘దూరపు కొండల్లో’ చదువుల ‘వీసా’ల కథ మోసాల కథగా మారుతోంది. 

తంపులమారి అమెరికా అధ్యక్షుడు (రిపబ్లికన్‌ పార్టీ) డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే కాదు, డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అమెరికా ప్రెసి డెంట్‌గిరీ చెలాయించి ఉన్న ఒబామా హయాంలోనే అమెరికాలోని నిరుద్యోగ యువత ఒక్కుమ్మడిగా ‘మా నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా మాకు దక్కాల్సిన ఉద్యోగాలను భారతదేశానికి ధారాదత్తం చేస్తున్నావ’ని ఒబామాపై విరుచుకుపడిన ఫలితంగా అప్పట్లోనే ఈ వీసా ఆంక్షలు ముందు ‘వాచా’ ప్రారంభమైనాయి. ఇప్పుడు పూర్తిగా ట్రంప్‌ హయాంలో ఈ ఆంక్షలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. దీనికితోడు అమెరికా సామ్రాజ్య పాలకుల వలస విధానాల కొనసాగింపు ఫలితంగా, ఆర్థిక సంక్షోభాలకు, వాటి సాకుతో తమ సామ్రాజ్య రక్షణ కోసం, వ్యాప్తి కోసం ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలో అశాంతి పరిస్థితులు సృష్టించి రాజకీయ తిరుగుబాట్లకు కారణమవుతోంది. ఇలా నిరంతరం తమ ఉనికిని, అమెరికా సైనిక–పారిశ్రామిక గుత్తాధిపత్యాన్ని మరి కొన్నాళ్ల పాటు కొనసాగించుకోవడానికి ప్రపంచ వర్తక వాణిజ్య సంస్థ ద్వారా వాణిజ్య సంబంధాలపై ఆంక్షలను శాసిస్తోంది.

ఈ దశలో ఇండియా లాంటి వర్ధమాన దేశాల పరాధార స్థితిని ఆసరాగా తీసుకుని ‘ఉద్యోగ వీసా’లపై ఆంక్షల నెపంతో మన చేతులు విరగ్గొడుతోంది. ఒక్క ‘హెచ్‌–1బి’ వీసాలకే ఈ ఆంక్షలు పరిమితం కాలేదు, ఈ వీసాలపై భార్యాసమేతంగా అమెరికా చేరుకునే భారత ఉద్యోగా ర్థులపై మరొక ఆంక్ష విధించారు. ఏటా అమెరికాకు ఉద్యోగార్థులై వచ్చే వేలాదిమంది హెచ్‌–1బి భారత సాంకేతిక నిపుణులలో 90 శాతంమంది భార్యలకు ఉద్దేశించిన ‘హెచ్‌–4’ వీసాలకు కూడా ‘కత్తెర’ పడింది. ఈ విషయాలపై ఆగమేఘాలపై అమెరికా అధికారు  లతో మన విదేశాంగమంత్రి ఎన్ని చర్చలు జరిపినా అమెరికాలోని నిరుద్యోగ తీవ్రత దృష్ట్యా ప్రయోజనం ఉండదు. ట్రంప్‌ నిర్ణయాల ఫలితంగా ఉద్యోగ వీసాలు ‘అడకత్తెరలో చిక్కిన వక్క’ బతుకుగా మారాయి.

తమ అభ్యర్థుల వీసాల కోసం పెట్టుకునే దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గిపోవలసి వచ్చింది. ఆ మేరకు వ్యాపార, సామాజిక ప్రయోజనాలకూ ఎసరు వచ్చింది. మన దేశంలోని 70 శాతం ఐటీ కంపెనీలు అమెరికా గుత్త కంపెనీలపై ఆధారపడి ఉన్నందున ఇప్పుడు 5 లక్షలమందికి పైగా ఉద్యోగుల పరిస్థితి ‘ముందు గొయ్యి, వెనుక నుయ్యి’ సామెతగా మారింది. భారీ స్థాయిలో చోటు చేసు కుంటున్న ఈ అనిశ్చిత పరిస్థితి మూలంగా దేశంలోని స్థానిక ఐటీ కంపెనీలు నిర్దిష్టమైన టార్గెట్‌ పెట్టుకుని మరీ రేటింగ్‌ ‘ముసుగు’లో వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నారని సమాచారం. బీజేపీ పాలకుల ‘ముక్కూ–ముఖం’ లేని అరాచకపు ఆర్థిక విధానాల ఫలితంగా అగ్రశ్రేణి నిపుణులను సహితం ఉద్యోగ ధర్మంగా తమ సీట్లలో కూర్చునే సమయానికే ఉద్వాసనల చిట్టీలు (పింక్‌ స్లిప్స్‌) వారి బల్లలపై ఎదురుచూస్తున్నాయి.

ఆధునికమైన స్వయంచాలిత (ఆటో మాటిక్‌) యంత్ర భూతాలు వచ్చి పనివాళ్ల పనిభారాన్ని తగ్గిస్తాయ నుకుంటే ‘ఆటోమాటిక్‌ ఉద్వాసన’కు దారితీస్తున్నాయి. ఇన్ఫోసిస్‌ లాంటి అగ్రస్థాయి కంపెనీ 15,000 మంది ఉద్యోగులను తొలగించ డానికి నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ పాలకుల సాంఘిక, విధానరహిత లేదా కార్పొరేట్‌ గుత్తవర్గాల ప్రయోజనాలకు అనుకూ లమైన విధానాల ఫలితంగా నేడు దేశ ఆర్థిక పరిస్థితులు ఇంతగా అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఇంతకుముందు భారతదేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ఒక పెద్ద మనిషి తన పదవీ విరమణ సమ యంలో చేసిన ప్రకటన గుర్తుకొస్తోంది. ‘నేడు అమెరికా ఆర్థిక వ్యవ స్థను నిలబెడుతున్నది భారత యువతీయువకులే’ అని ప్రకటించడం ‘విష్ణుశర్మ ఇంగ్లిష్‌ చదువులు’ (విశ్వనాథ రచన) కూడా అక్కరకు రాలేదనిపిస్తుంది. అంటే అమెరికాలో నిరుద్యోగ పరిష్కారం ఉద్యో గార్థులైన భారత నిపుణులను అమెరికా కంపెనీల నుంచి ఉద్వాసన చెప్పించడంపైన ఆధారపడి ఉందని ట్రంప్‌ నిర్ణయం.

ఈ గుణపాఠం నుంచి మనకు అందవలసిన సందేశం ఏమిటి? స్వాతంత్య్రోద్యమ కాలంనాటి అత్యున్నత స్థాయి ఆర్థిక వేత్తలయిన దాదాభాయ్‌ నౌరోజీ, ఆర్‌సీ దత్‌ లాంటి దార్శనికులు భావించి, ఉద్బోధించిన ట్టుగా వలస పాలనా విధానాల దారిద్య్రం నుంచి బయటపడవలసిన స్వతంత్ర ఆర్థిక విధానాన్ని అనుసరించడమే. నాడు బ్రిటిష్‌ వలస పాలనలో ఇంగ్లండ్‌కు ఊడ్చుకుపోతున్న భారతదేశ సంపదను నిలు వరించవలసిన ఆవశ్యకత గురించి దాదాభాయ్‌ నౌరోజీ ‘డ్రెయిన్‌ థియరీ’ రచన ద్వారా లోకానికి వెల్లడించాల్సి వచ్చింది. కాగా, ఈ రోజున ఏడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌–బీజేపీ (ఆరెస్సెస్‌)ల పాలనా శకాల్లో స్వదేశీ గుత్త పెట్టుబడి వర్గాలు స్వల్ప వ్యవధిలోనే ఒక్కొక్కరు లక్షల కోట్ల ఆస్తులకు అధిపతులై కూర్చుని, దేశ దారిద్య్రాన్ని చక్రవడ్డీలతో పెంచేశారు. అంతేగాదు, ఎన్నికల్లో పాలనా శక్తుల మోసాలకు వీలుగా దేశ సెక్యులర్‌ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ.. న్యాయ, శాసన వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టిస్తూ, కోట్లకు పడగలెత్తిన వారిని కేసులనుంచి తప్పించడానికి అర్ధరాత్రి స్వాతంత్య్ర ప్రకటన మాదిరిగానే అర్ధరాత్రి చడీ చప్పుడూ లేకుండా విదేశాలలో తలదాచుకునేందుకు అనుమతిస్తున్నారు పాలకులు. చివరికి నైతిక భ్రష్టులైన పాలక ప్రాపకం సంపాదించిన కుహనా స్వాముల్ని కూడా విదేశాలకు తప్పించేస్తున్నారు.

అన్నట్టు, ఏటా 2 కోట్లమంది చొప్పున ఐదేళ్లలో 10 కోట్లమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ గత అయిదేళ్లలోనూ ఇంతవరకూ ఆ హామీకి ‘జమా ఖర్చుల్ని’ ప్రజాబాహుళ్యానికి చూపలేదు, వివరించలేదు. మోదీ విధానాలవల్ల నిర్మాణ రంగంలో తీవ్ర స్తబ్ధత ఏర్పడి, దేశ వ్యాప్తంగా 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు నిలిచిపోయాయని నిపుణుల అంచనా. 
ఇంతకీ ఈ విపరిణామాలకు, దోషం ఎవరిలో ఉంది, ఎక్కడ ఉంది అన్న ప్రశ్నకు సమాధానం దొరకని క్షణాల్లో ఓ కవి ఇలా ప్రశ్న వేశాడు: ‘‘ఎవరిలో ఉంది దోషం?/ మేం వహించడం ఎవరిపక్షం?/ శత సహస్ర లక్షల తలల/ చేతుల కార్మికవర్గం/ బుర్ర గోక్కుంటోంది/ గ్రహించుకోలేక కర్తవ్యం!’’

    ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు, 
abkprasad2006@yahoo.co.in​​​​​​​
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top