రొయ్య నంజుకుంటే ఉంటుందీ..

Yummy Prawn Recepie - Sakshi

స్నాక్‌ సెంటర్‌

పిస్తా పుడ్డింగ్‌
కావలసినవి: అవకాడో – 4 లేదా 6 (పైతొక్క తొలగించాలి), పిస్తా – అర కప్పు (నీళ్లలో నాబెట్టినవి), కొబ్బరి నీళ్లు – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – అర టీ స్పూన్, రోజ్‌ వాటర్‌ – అర టీ స్పూన్‌
ఆలివ్‌ నూనె – అర టీ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్‌, పాల కూర – ఒకటిన్న కప్పులు
తయారీ: ముందుగా మిక్సీ బౌల్‌లో అవకాడో ముక్కలు, పిస్తా, కొబ్బరినీళ్లు, ఉప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, రోజ్‌ వాటర్, ఆలివ్‌ నూనె, నిమ్మరసం వేసుకుని మెత్తగా చేసుకోవాలి. తర్వాత పాలకూర కూడా అందులో వేసుకుని మరో సారి మిక్సీ పట్టుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుని.. సర్వ్‌ చేసుకునే ముందు దానిపై నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ వేసుకుంటే అదిరే రుచి మీ సొంతమవుతుంది.

చాక్లెట్‌ –బీట్‌రూట్‌ మఫిన్స్‌
కావలసినవి:  బీట్‌రూట్‌ – 2 మీడియం సైజ్‌ (మెత్తగా ఉడికించుకుని గుజ్జులా చేసుకోవాలి), గుడ్లు – 3, పెరుగు – ముప్పావు కప్పు, శనగపిండి – అర కప్పు, కోకో పౌడర్‌ – పావు కప్పు, పంచదార పొడి – అర కప్పు పైనే (అభిరుచిని బట్టి), బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్, డార్క్‌ చాక్లెట్‌ పౌడర్‌ – అర కప్పు
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో బీట్‌రూట్‌ గుజ్జు, పెరుగు, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో శనగపిండి, కోకో పౌడర్, పంచదార పొడి, బేకింగ్‌ పౌడర్, డార్క్‌ చాక్లెట్‌ పౌడర్‌ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత బీట్‌ రూట్‌ మిశ్రమాన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మఫిన్స్‌ బౌల్స్‌లో పెట్టుకుని 23 నుంచి 25 నిమిషాల పాటు ఓవెన్‌లో ఉడికించుకోవాలి.

రొయ్యల పకోడా
కావలసినవి: రొయ్యలు – 25 లేదా 30, శనగపిండి – పావు కప్పు, బ్రెడ్‌ పౌడర్‌ – 4 టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి – 1 టేబుల్‌ స్పూన్, మొక్క జొన్న పిండి – 1 టేబుల్‌ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నిమ్మరసం – 1 టేబుల్‌ స్పూన్, నీళ్లు, నూనె – సరిపడా
తయారీ: ముందుగా రొయ్యలు బాగా కడిగి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్‌ పౌడర్‌ వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని కళాయిలో నూనె వేడి చేసుకుని.. ఒక్కో రొయ్యను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top