బుస్‌స్‌స్‌...

బుస్‌స్‌స్‌...


పాములంటే జనాల్లో చాలామందికి భయం...పాములంటే తిరుగులేని బాక్సాఫీస్‌ సెంటిమెంట్‌...పాముల చుట్టూ ఎన్నో కథలు, పురాణాలు...పాముల్లో విషపూరితమైనవి తక్కువే...పాములు కూడా పర్యావరణంలో భాగమే...పాములే లేకుంటే మనుషుల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.‘వరల్డ్‌ స్నేక్‌ డే‘ సందర్భంగా పాముల కథా కమామిషూ...



పాము పేరు వింటేనే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి వాళ్లు పాము కళ్లెదుటే కాదు, కలలో కనిపించినా భయంతో వణికిపోతారు. ఇక కళ్ల ముందే పాము కనిపించిందంటే వాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. చివరకు పాము బుసకొట్టిన శబ్దం వినిపించినా భయంతో బిగదీసుకుపోతారు. పాములంటే మనుషుల్లో వ్యాపించిన భయం ఈనాటిది కాదు. ఈ భయానికి మూలాలు ఆదిమకాలం నుంచే ఉన్నాయి. విషసర్పాలు కాటు వేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనే సంగతి ఆదిమానవులకు తెలుసు. పాముల పట్ల భయానికి ముఖ్యకారణం అదే. కాలం మారే కొద్దీ మనుషులు బాగా ముదిరారు. పాములతో చెలగాటమాడే స్థాయికి ఎదిగారు. పాముకాటుకు పరలోకానికి పయనమవుతున్న వారు నేటికీ ఉంటున్నా, మనుషుల దాడుల్లో చనిపోతున్న పాములే ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి.



పాము వల్లే భయభక్తులు

భయం గొలిపే వాటన్నిటినీ పూజించడం ఆదిమకాలం నుంచే మనుషులకు అలవాటైంది. సూర్యుడిని, చంద్రుడిని, నిప్పును, నీటిని పూజించడానికి మూలం వాటి పట్ల గల భయమే. పాములను పూజించడానికి కూడా మనుషుల్లో గల భయమే మూలకారణం. పాములంటే జనాల్లో భయంతో పాటు భక్తిప్రపత్తులూ మెండుగానే ఉన్నాయి.     నిప్పు, నీరు సహా పంచభూతాలను ఆరాధించడానికి ముందే మనుషులు పాములను పూజించడం ప్రారంభించారనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇంకోలా చెప్పాలంటే మనుషులకు భయభక్తులను మప్పిన ఘనత పాములకే దక్కుతుంది. దాదాపు 70 వేల ఏళ్ల కిందటే ఆఫ్రికా ప్రాంతాల్లోని ఆదిమానవులు పాములను ఆరాధించినట్లు ఆఫ్రికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ బోత్సా్వనా, నార్వేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ట్రోమ్సో, యూనివర్సిటీ ఆఫ్‌ ఓస్లోలకు చెందిన పురాతత్వశాస్త్ర పరిశోధకులు ఇటీవల కొన్ని ఆధారాలను కనుగొన్నారు. బోత్సా్వనా వాయవ్య ప్రాంతంలో ఉన్న సుజిలో పర్వతాల్లోని ఒక గుహలో 70 వేల ఏళ్ల కిందట అప్పటి మనుషులు కొండచిలువను ఆరాధించినట్లు ఆధారాలు దొరికాయి. కొండచిలువను ఆరాధించిన ఆ గుహ ‘కొండచిలువ గుహ’ (పైథాన్‌ కేవ్‌)గా ప్రసిద్ధి పొందింది.ఇందులో రాతియుగం నాటి భారీ కొండచిలువ విగ్రహం ఇప్పటికీ నిలిచి ఉంది.



నాగారాధన

పాములను ఆరాధించడం ప్రాచీన ఈజిప్టులో కూడా ఉండేది. ఈజిప్షియన్లు బోత్సా్వనా వారిలా కొండచిలువలను కాకుండా నాగుపాములను పూజించేవారు. మడగాస్కర్‌లో ఒక్కో జాతికి చెందిన పాములు ఒక్కో కుటుంబానికి లేదా తెగకు చెందిన దేవతలుగా భావించేవారు. ఆఫ్రికాలోని ఇంకొన్ని ప్రాంతాల్లో పాములను గతించిపోయిన తమ పూర్వీకుల అవతారంగా ఆరాధించేవారు. ఉత్తర అమెరికాలో అమెరికన్‌ మూలవాసులు రక్తపింజరను ‘సర్పాలకు రాజు’గా పరిగణించేవారు. వారు ‘నాచ్చెజ్‌’ సూర్య దేవాలయంలో రక్తపింజరకు పూజలు జరిపేవారు. దక్షిణ అమెరికాలో ఇన్‌కా నాగరికతకు ముందే అక్కడి ప్రజలు పాములను ఆరాధించేవారనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.చిలీ, కొలంబియాలలోని పలు పురాణ గాథలలో పాముల ప్రస్తావన ఉంది. భారత్, నేపాల్, కంబోడియాలలో ‘నాగ’ ఆరాధన ప్రాచీన కాలం నుంచే విస్తృతంగా ఉంది. భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ‘సర్పాలలో నేను అనంతుడిని’ అని చెప్పుకున్నాడు. అనంతుడంటే ఆదిశేషుడు. ఆదిశేషుడిపైన శ్రీమహావిష్ణువు సేదదీరుతూ ఉంటాడని దాదాపు అన్ని పురాణాలూ చెబుతున్నాయి. శివుడు నాగుపామును కంఠాభరణంగా ధరిస్తాడు.



వినాయకుడు యజ్ఞోపవీతంగా ధరిస్తాడు. భారతీయ పురాణాల్లో ఆదిశేషుడితో పాటు వాసుకి, తక్షకుడు, కాళీయుడు వంటి సర్పాల గురించి రకరకాల కథలు ఉన్నాయి. చైనా, కొరియా, జపాన్‌ తదితర ప్రాచ్య దేశాలలో సైతం పాముల ఆరాధన, పాముల గురించిన పురాణగాథలు ఉన్నాయి. పురాతనకాలంలో ఆస్ట్రేలియన్‌ మూలవాసులు కూడా పాములను ఆరాధించేవారు. వారి పురాణాల ప్రకారం ‘రెయిన్‌బౌ సర్పెంట్‌’ అనే భారీ కొండచిలువ భూమిని, సముద్రాన్ని సృష్టించిందని నమ్మేవారు. తప్పులు చేసేవారిని ఆ కొండచిలువ కఠినంగా శిక్షిస్తుందని కూడా వారి నమ్మకం. ప్రాచీన రోమన్లు ‘అంగీషియా’ అనే దేవతను సర్పాలకు అధిదేవతగా కొలిచేవారు. ప్రాచీన గ్రీకులకు ‘మినోవన్‌’ అనే నాగదేవత ఉండేది. పాములకు సంబంధించి గ్రీకు పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. క్రైస్తవమతం మాత్రం పాములను చెడుకు సంకేతంగా పరిగణిస్తుంది.



ప్రమాదంలో పాములు

పాముల వల్ల మనుషులకు వాటిల్లుతున్న ప్రమాదాల కన్నా మనుషుల వల్ల పాములకు ఏర్పడుతున్న ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఔషధాల తయారీలో ఉపయోగపడే పాము విషం కోసం, అలంకరణ వస్తువుల తయారీకి వాడే చర్మం కోసం ప్రపంచవ్యాప్తంగా స్మగ్లర్లు పాముల వేట సాగిస్తున్నారు. వాళ్ల ధాటికి కొన్ని అరుదైన జాతుల సర్పాలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకుంటున్న నాథులు లేరు. పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్న వారు తరచు పట్టుబడుతున్నా ఫలితం కనిపించడం లేదు. పశ్చిమబెంగాల్‌లో గత ఏడాది అక్టోబరులో అటవీశాఖ అధికారులు జరిపిన దాడిలో పాములను వేటాడే దుండగుల వద్ద ఏకంగా రూ.250 కోట్ల విలువ చేసే పాము విషం దొరికింది. పాము విషాన్ని అక్రమంగా తరలించే దుండగులు గత ఏడాది కాలంలో పట్టుబడిన సంఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయి. పట్టుబడిన ప్రతిసారీ కోట్లాది రూపాయల విలువ చేసే పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే, ఇంకొందరు ఏకంగా సజీవంగా ఉన్న పాములనే గుట్టుచప్పుడు కాకుండా దేశాలు దాటించేస్తున్న సంఘటనలు ఉంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పాము విషం ధర లీటరుకు 2.15 లక్షల డాలర్ల (సుమారు రూ.13.92 కోట్లు) వరకు ఉండటంతో తేలికగా డబ్బు సంపాదించాలనుకునే మాఫియా ముఠాలు పాములను, పాము విషాన్నీ స్మగుల్‌ చేస్తున్నాయి.



కలలూ... కాలనాగులూ...

మనుషులను భయపెట్టే వాటిని అనవసరంగా ‘సింహస్వప్నం’ అంటారు గానీ, నిజానికి భయపెట్టే కలలను ‘సర్పస్వప్నం’ అనడమే సంమంజసం. చాలామందికి కలల్లో సింహాల కంటే పాములే ఎక్కువగా భయపెడుతుంటాయి. కొందరికి అసంకల్పితంగానే సర్పస్వప్నాలు చిరకాలం వెన్నాడుతూ ఉంటాయి. పాములు తరచుగా కలల్లోకి రావడంపై మతపరంగా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. జాతకాల్లో నాగదోషం, కాలసర్పదోషం వంటివి ఉంటే పాములు కలల్లోకి వస్తాయని చెబుతారు. ఇలాంటి సర్పస్వప్నాల నివారణ కోసం రకరకాల పరిహార మార్గాలనూ సూచిస్తారు. పాములను కుండలినీ శక్తికి ప్రతీకగా కూడా భావిస్తారు. చిరకాలమైన ఆలోచనలు ఆచరణలోకి రాబోయే ముందు కూడా పాములు కలల్లోకి వస్తాయని కొందరు నమ్ముతారు. అయితే, అంతశ్చేతనలో అడుగంటిన లైంగిక వాంఛలే కలల్లో పాములుగా కనిపిస్తాయని ఫ్రాయిడ్‌ వంటి ఆధునిక మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణ. ఆధునిక విశ్లేషణలు ఎలా ఉన్నా, మన దేశంలో మాత్రం పాములకు సంబంధించి మతపరమైన నమ్మకాలే ఎక్కువ.



ఈ దేశాల్లో అసలు పాములే ఉండవు!

ప్రపంచంలో పాములు మచ్చుకైనా కనబడని దేశాలు కూడా ఉన్నాయి. ఐర్లాండ్, న్యూజిలాండ్, ఐస్‌లాండ్‌ దేశాల్లో ఒక్క పాము అయినా కనిపించదు. దాదాపు పదివేల ఏళ్ల కిందట మొదలైన మంచుయుగం తొలినాళ్లలో ఈ ప్రాంతాల్లో జీవం మనుగడ సాగించే పరిస్థితులే ఉండేవి కాదు. అప్పటి వరకు అక్కడ ఉంటూ వచ్చిన పాములతో పాటు నానా జీవులు ఆ ప్రాంతాలను వదిలి వెళ్లడమో లేదా అక్కడికక్కడే అంతరించిపోవడమో జరిగిందని శాస్త్రవేత్తల అంచనా. కాలక్రమేణా పరిస్థితులు మారినా పాములు మళ్లీ ఆ ప్రాంతాలకు రాలేదు. ఐదో శతాబ్ది కాలంలో ఐర్లాండ్‌లో కొన్ని పాములు కనిపించినా, బిషప్‌ సెయింట్‌ ప్యాట్రిక్‌ అనే మతాధికారి వాటిని సముద్రంలో వదిలేయించారట. ఆ తర్వాత ఐర్లాండ్‌లో మళ్లీ పాములు కనిపించలేదు. న్యూజిలాండ్‌ తీరం వద్ద అరుదుగా సముద్రంలో కొట్టుకువచ్చిన పాముల కళేబరాలు మాత్రం కనిపిస్తుంటాయి.



సినిమాల్లో పాము!

హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌... ఇలా ఏ వుడ్‌ అయినా పాము సెంటిమెంట్‌ ఒక తిరుగులేని బాక్సాఫీస్‌ ఫార్ములా. సినీ పరిశ్రమలో ఈ నమ్మకం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. పామును నమ్ముకుని సినిమాలు తీసిన నిర్మాతలు ఆర్థికంగా లాభపడ్డ దాఖలాలే ఎక్కువ. హాలీవుడ్‌లో ‘అనకొండ’ సిరీస్‌లో ఏకంగా ఐదు సినిమాలు వచ్చాయి. ఇవన్నీ బ్లాక్‌బస్టర్లే. ఇక తెలుగులో నాగులచవితి, పున్నమినాగు, దేవి వంటి సినిమాలు, బాలీవుడ్‌లో నాగిన్, నగీనా వంటి సినిమాలు కూడా నిర్మాతలకు కాసులవర్షం కురిపించాయి.



ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌!

పాముల పరిరక్షణ కోసం హైదరాబాద్‌లోని ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌’ స్వచ్ఛంద సంస్థ 1995 నుంచి కృషి చేస్తోంది. జీవవైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న పాములు అంతరించిపోకూడదనే సదుద్దేశంతో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం సుమారు రెండువందల మంది వరకు వాలంటీర్స్‌ పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పాము జాతుల గురించి అధ్యయనం చేయడం, పాములపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఎవరైనా పాములు కనిపించినట్లు చెబితే వెంటనే వెళ్లి వాటిని పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌’ ప్రధాన కార్యదర్శి అవినాష్‌ చెప్పారు. మన దేశంలో దాదాపు మూడువందల జాతుల పాములు ఉంటే, వాటిలో కేవలం 66 జాతులు మాత్రమే విషపూరితమైనవని ఆయన తెలిపారు. స్నేక్‌ స్మగ్లింగ్‌ వంటివి తమ దృష్టికి వచ్చినా ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తుంటామని తెలిపారు. పాముకాటుకు గురైన వ్యక్తి వెంటనే చనిపోవడం జరగదని, కాటుకు గురైన వ్యక్తికి వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, రెండు గంటల్లోగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.



వరల్డ్‌ స్నేక్‌ డే కథేంటీ?

ప్రపంచవ్యాప్తంగా జూలై 16న ‘వరల్డ్‌ స్నేక్‌ డే’ని జరుపుకుంటారు. ఈ రోజున పాము ప్రేమికులంతా వాటి గురించి ప్రజల్లో ఉన్న భయాలను తొలగించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. స్వచ్ఛంద సంస్థలు పాములను తీసుకెళ్లి జన సంచారం ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇక ఆన్‌లైన్‌లోనూ ఈ రోజున పెద్ద ఎత్తున పాములకు సంబంధించిన అధ్యయనాల వివరాలను విడుదల చేస్తూ, జీవ వైవిధ్యంలో పాము ఒక భాగమని, వాటిని సంరక్షించడం అవసరమని ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు.



పాముల గురించి అవీ... ఇవీ...

భూమ్మీద కనిపించే పాముల్లో 70 శాతం పాములు గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగేందుకు ఏమాత్రం అనువుగా లేని కొన్ని శీతల ప్రాంతాల్లోని పాములు మాత్రం నేరుగా పిల్లలను ఈనుతాయి.



కొన్ని లక్షల ఏళ్ల కిందట పాములకు కాళ్లు ఉండేవనేందుకు ఆధారాలు ఉన్నాయి. కాలక్రమేణా జరిగిన పరిణామక్రమంలో పాముల్లో కాళ్లు అంతరించాయి. ఇప్పుడైతే కాళ్లుండే పాములు దాదాపు లేవు. అయితే, బ్రెజిల్‌లో నాలుగేళ్ల కిందట మొదటిసారిగా ఒక పాము కాళ్లతో కనిపించింది.



అనకొండ, కొండచిలువ... పాముల్లో భారీ జాతులు. బరువులో అనకొండ నంబర్‌ వన్‌ అయితే, పొడవులో కొండచిలువలే నంబర్‌ వన్‌. అనకొండ బరువు సుమారు 250 కిలోలు, పొడవు 28 అడుగుల వరకు ఉంటుంది. కొండచిలువలు దాదాపు 33 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి.



అపోహలు, వాస్తవాలు :

పాములు పాలు తాగవు. వాటికి పాలను జీర్ణించుకునే శక్తి లేదనేది పరిశోధనలు తేల్చి చెప్పాయి.

పాముకు అసలు చెవులే ఉండవు. భూమ్మీద ఏదైనా జంతువు లేదా మనిషి నిలబడ్డప్పుడు, ఏదైనా చప్పుడు వచ్చినప్పుడు తగిలే తరంగాల ద్వారానే అది ఒకరి జాడను పసిగట్టగలుగుతుంది.



చనిపోయిన తర్వాత కూడా పాము తల ద్వారా కొన్ని గంటలవరకూ కాటు వేయగలదు. బతికి ఉన్నప్పటికంటే తల వేరయినప్పుడే విషం ప్రభావం ఎక్కువ ఉంటుంది.



ప్రపంచవ్యాప్తంగా మూడు వేలకు పైగా పాము జాతులు ఉన్నాయి. అందులో 750 జాతులు మాత్రమే విషం కలిగి ఉన్నవి. అందులోనూ ఒక్క కాటులోనే చంపగలవి 250 జాతుల పాములే!



త్రాచు పాములు సుమారు 8 అడుగుల దూరం వరకు విషాన్ని చిమ్మగలవు.



పాములు నమలలేవు. కేవలం మింగగలవు. దాదాపుగా దాని సైజ్‌ ఉన్న జంతువులను కూడా మింగగలదు. పాము కింది దవడ ఇందుకు అనుకూలంగా ఉంటుంది.



పాముల్లో కింగ్‌ కోబ్రా అత్యంత విషపూరితమైనది. దీని విషం ఒక ఏనుగును సైతం చంపగలదు.



పాములు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. అయితే ఒక వయసొచ్చాక ఈ పెరుగుదల తక్కువగా ఉంటుంది.



పాము కనుపాపను పట్టి అవి విషపూరితమైనవో, కావో చెప్పేయొచ్చు. కనుపాప గుండ్రంగా ఉండేవి ఎక్కువగా విషపూరితమైనవి కావు.



పాములు... పర్యావరణం...

పాములు కూడా ఇతర జీవుల్లాగే పర్యావరణంలో భాగం. పర్యావరణ సమతుల్యతలో పాములు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. కప్పలు, ఎలుకల వంటి వాటిని ఆహారంగా తినే పాములు ప్రకృతిలో వాటి సంఖ్య పెరగకుండా కాపాడుతున్నాయి. మనుషులు భయం వల్లనో, స్వార్థం వల్లనో పాములను ఎడాపెడా చంపేస్తూ పోతే ఎలుకలు, పందికొక్కుల వంటి వాటి జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. ఇవి పంటలను నాశనం చేస్తాయి. ఎలుకల వంటి జీవులు విపరీతంగా పెరిగితే ఒకవైపు ఆహార కొతర ఏర్పడటమే కాకుండా, ప్లేగు వంటి వ్యాధులు కూడా మానవాళికి ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు. పర్యావరణంలో సమతుల్యత కొనసాగాలంటే పాములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



పాము.. గిన్నిస్‌ రికార్డ్‌!

1. 1998లో వారం రోజుల పాటు పాములతో గడిపి బూన్రెంగ్‌ బౌచన్‌ అనే వ్యక్తి గిన్నిస్‌ రికార్డు నమోదు చేశారు. కాగా 2004లో పాము కాటు వల్లే ఆయన చనిపోవడం విషాదకరం.



2. మిసోరీలో మెడుసా అనే కొండచిలువ 25 అడుగుల పొడవుతో 2011లో అతిపెద్ద పాముగా గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది. 158 కిలోల ఆ పామును కొలవడానికి దాన్ని పదిహేను మంది పట్టుకోవాల్సి రావడం విశేషం.



3. ‘ఆంటిగ్యూ రేసర్‌’ అనే పాము జాతి ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతిగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.



4. జాకీ బిబ్బీ.. నోటిన అదిమిపెట్టి ఎక్కువ పాములను నిలబెట్టిన వ్యక్తిగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. అతను ఏకకాలంలో తన నోట పది పాములను అదిమిపట్టి ఉంచాడు.



– పన్యాల జగన్నాథదాసు, వి. మల్లికార్జున్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top