మరుజన్మలో ఆ చాన్స్ వదులుకోను!

మరుజన్మలో ఆ చాన్స్ వదులుకోను! - Sakshi


నువ్వు బాధపడకు, ఎదుటివాళ్లను బాధపెట్టకు. నువ్వు కడుపు మాడ్చుకోకు. అలాగని ఎదుటివాడి కడుపు కూడా కొట్టకు. ఇదే నా సిద్ధాంతం.


ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది?

నచ్చేది ఫ్రాంక్‌నెస్, నచ్చనిది హిపోక్రసీ.


 మీలో మీకు నచ్చేది?

మనసులో ఏమీ పెట్టుకోకుండా మాట్లాడతాను. ఏదైనా నచ్చకపోతే ముఖమ్మీదే చెప్పేస్తాను తప్ప మనసులో పెట్టుకోను. పగ, ప్రతీకారాల్లాంటివి ఉండవు నాకు.


మీలో మీకు నచ్చనిది?

కోపం, బద్దకం. బద్దకాన్ని ఎప్పుడో జయించేశాను. కోపాన్ని కూడా ఓ యాభై శాతం జయించాను.


మీ ఊతపదం?

ప్రతిదానికీ ఓ మై గాడ్ అంటుంటాను.


మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు?

మా అమ్మ. మేముండేది మద్రాసులో. ఆంధ్రా నుంచి ఎవరు వచ్చినా ఇంట్లో ఆశ్రయమిచ్చేది అమ్మ. అతిథుల్లా కాకుండా మాతో సమానంగా చూసేది. అలాగే, ఎంత చక్కగా సలహాలిచ్చేదంటే, అవి పాటిస్తే ఇక తిరుగుండదు. ఇండస్ట్రీలో చాలామంది అమ్మ దగ్గర సలహాలు తీసుకునేవారు.


అత్యంత సంతోషపడిన సందర్భం?

షూటింగ్ అయిపోయి ఇంటికొచ్చాక అమ్మ, నేను, నా ఇద్దరు అసిస్టెంట్స్ రంగా, శ్రీను కలిసి అష్టాచెమ్మా ఆడుకునేవాళ్లం. అలాగే అమ్మ, నాన్న, మా గురువుగారు పూర్ణచంద్రరావుగారు... ఇలా ఓ తొమ్మిదిమంది వరకూ కలసి పేకాడేవాళ్లం. ఒక్కొక్కరూ రెండు రూపాయలు పెట్టేవాళ్లం. ఆ పద్దెనిమిది రూపాయల కోసం తీవ్రంగా పోటీ పడేవాళ్లం. చెప్పడానికివన్నీ చిన్నవే. కానీ నా జీవితంలో అవి అత్యంత విలువైన, ఆనందకరమైన సందర్భాలు, జ్ఞాపకాలు.


మనోవేదనకు గురైన సందర్భం?

అమ్మానాన్నల మరణం. నాన్న క్యాన్సర్‌తో కొన్ని నెలల పాటు నరకం చూశారు. అందుకే ఆయన పోయినప్పుడు విముక్తి లభించిందని సర్ది చెప్పుకున్నాం. కానీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్న అమ్మ బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయింది. మంచానికి పరిమితమై కొన్నాళ్లకు కన్నుమూసింది. ఇది తట్టుకోవడం నా వల్ల కాలేదు.


ఆకలి విలువ తెలిసిన క్షణం?

ఓసారి నేను, నా స్నేహితులు శరత్, ఎస్.గోపాల్‌రెడ్డి (కెమెరామేన్) కలిసి శిరిడీ వెళ్లాం. బాబా దర్శనం చేసుకుని రెలైక్కాం. అంతే, తుఫాన్ మొదలైంది. రెండు రోజులపాటు రైలు ఆగిపోయింది. శరత్ పర్స్ ఎవరో కొట్టేశారు. మా ఇద్దరి దగ్గరా డబ్బుల్లేవు. దాంతో టీ కూడా తాగలేని పరిస్థితి. ఎప్పటికో రైలు బయలుదేరింది. నెక్స్ట్ స్టేషన్లో మరో ఫ్రెండ్ కలిస్తే, వాడి దగ్గర పది రూపాయలు తీసుకుని ఆరు ఇడ్లీలు కొనుక్కున్నాం. రెండేసి తిని ఆకలి చల్లార్చుకున్నాం. అప్పుడు తెలిసింది... ఆకలి బాధ ఎలా ఉంటుందో!


ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?

ఈ మధ్య నా ఆప్తమిత్రుడు సుమన్‌కి చెప్పాల్సి వచ్చింది. మా అబ్బాయి సినిమా ఆడియో ఫంక్షన్‌కి అతణ్ని పిలిచాను. కానీ అనుకోకుండా ప్రోగ్రామ్ వాయిదా పడింది. ఆ విషయం అందరికీ చెప్పాను కానీ తనకు చెప్పడం మర్చిపోయాను. పాపం షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాడు. ‘సారీరా, మర్చిపోయాను’ అన్నాను. ఇలాంటి చిన్నచిన్నవి తప్ప క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంతగా రాదు నాకు.


మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం?

ఒకప్పుడు డ్రగ్స్‌కి బానిసైపోయాను. దాన్నుంచి బయటపడెయ్యడానికి అన్నయ్య నన్ను మార్షల్ ఆర్ట్స్‌లో చేర్పించాడు. దాంతో డ్రగ్స్ కంటే మార్షల్ ఆర్ట్స్ కిక్ ఇస్తాయని తెలుసుకున్నాను. మెల్లగా మామూలయ్యాను. ఇది కొందరికి తెలుసు. కానీ తెలియని వాళ్లు కూడా చాలామంది ఉన్నారు.


మీరు దేనికి భయపడతారు?

(నవ్వుతూ) మా ఆవిడకి. నేనేం చేసినా మా ఆవిడ ఏమీ అనదు. కానీ తనలో తను బాధ పడుతుంది. పొరపాటున ఏ పార్టీలోనో కాస్త ఎక్కువ తాగాననుకోండి, సెలైంట్‌గా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది నేను తట్టుకోలేను. తననెక్కడ హర్ట్ చేస్తానోనని ప్రతిక్షణం భయపడుతుంటాను.


ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?

నేను గిటార్ బాగా వాయిస్తాను. స్టేజిమీద నేను గిటార్ వాయిస్తుంటే ‘భాను, భాను’ అని ఆడియెన్స్ హుషారుగా అరవాలి అని కలలు కనేవాణ్ని. కానీ అమ్మ ‘నువ్వు మ్యుజీషియన్‌గా కంటే నటుడిగా పైకొస్తావు’ అనేసరికి అటువైపు అడుగులు వేశాను. దాంతో ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. ఎప్పటికైనా తీరుతుందేమో చూడాలి!


దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దాంతో ఏం చేస్తారు?

‘ఆకలి’ అన్న పదాన్ని ఈ లోకంలో లేకుండా చేస్తాను.


మీ జీవితానికి లాంటి ముగింపును కోరుకుంటారు?

అందరూ నాకు డబ్బు ఇవ్వు, అదివ్వు, ఇదివ్వు అని అడుగుతూ ఉంటారు దేవుణ్ని. నేను మాత్రం మంచి మరణాన్ని ఇవ్వమని అడుగుతుంటాను. నాన్నగారు నరకం చూస్తుంటే మేమెంత వేదన అనుభవించామో! నా వల్ల మావాళ్లకు ఆ బాధ కలగకూడదు. నిద్రలోనే నా ప్రాణం పోవాలి.


అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు?

‘భానుచందర్ మంచి వ్యక్తి’ అని అందరూ చెప్పుకునేలా!


మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు?

క్రీడాకారుడిగానో, సంగీతకారుడిగానో పుట్టాలి. ఈ జన్మలో కాలేకపోయాను. ఆ జన్మలో చాన్స్ వదులుకోను!


- సమీర నేలపూడి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top