డోలుబాబా

Venkateshwar Written Story In Funday On 10/11/2019 - Sakshi

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి.... నన్ను దోచుకొందువటే... బస్టాండ్లో కూర్చుని డోలు వాయిస్తూ, గొంతు చించుకుని పాడుతున్నాడతను. చింపిరి జుట్టూ, చిరిగిన బట్టలూ, మాసిపోయిన గడ్డం, ముడుతలు పడ్డ ముఖం. చూడ్డానికి అచ్చం పిచ్చోడిలా ఉందతని వాలకం. వాయించీ, వాయించీ కాయలు కాసిన చేతులు డోలుకి ఇరువైపులా నాట్యమాడుతున్నాయి. చూపులు ఏవో సుదూర తీరాలను తాకుతున్నాయి. అతనెవరో, అతని పేరేంటో, ఊరేంటో అక్కడి వారెవరికీ తెలియదు. ఎప్పుడూ ఆ బస్టాండులో కూర్చుని డోలు వాయిస్తుంటాడు కాబట్టి అందరూ అతన్ని డోలుబాబా అని పిలుస్తుంటారు. రోజూ ఉదయాన్నే బస్సులు కదిలే వేళకి అతనా బస్టాండుకి వస్తాడు. ఓ మూల పాత తువ్వాలు ఒకటి పరిచి, దాని ముందు కూర్చుని సాయంత్రం వరకూ డోలు వాయిస్తూ, పాడుతాడు. ఎవరైనా డబ్బులిస్తే పట్టుకెళ్ళి, బస్టాండు పక్కనే ఉన్న సుందరయ్య హోటల్లో ఏదైనా తింటాడు. లేకుంటే అలాగే ఒట్టి కడుపుతో ఎక్కడో ఓ చోట పడుకుంటాడు. ఇదే కొన్ని సంవత్సరాలుగా అతని దినచర్య. మామూలుగా ఉన్నప్పుడు అతన్ని చూస్తే ఏ చీకూచింత లేనట్టుగా అనిపిస్తుంది కానీ, పాడుతున్నప్పుడు మాత్రం పొడిబారి, నిస్తేజంగా మారిన తన కళ్ళలోంచి, హృదయాంతరాంతరాల్లో ఊరిన నీరేదో తొంగి చూస్తుంది.

దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం నాటి మాట. అప్పుడతనికి సరిగ్గా ఇరవై ఏళ్ళుంటాయి. చిన్నప్పుడే అమ్మా, నాన్న చనిపోవడంతో ఓ భూస్వామి దగ్గర పాలేరుగా పని చేసేవాడతను. పొద్దు పొడవక మునుపే లేచేవాడు. గేదెల పాలు పితికి, గొడ్ల కొట్టం మొత్తం శుభ్రం చేసేవాడు. తరువాత భూస్వామి భార్య చద్దన్నం పెడితే తిని, గేదెల్ని అడవిలోకి మేతకు తీసుకెళ్ళిపోయేవాడు. అప్పుడు వెళితే మళ్ళీ ఎప్పుడో సంధ్య వేళకి గాని ఇంటికి చేరేవాడు కాదు. ఇళ్ళంటే అదేదో ఇటుకలతో కట్టింది కాదు. గొడ్ల కొట్టం పక్కనే కొట్టం లాంటిదే ఓ చిన్న పాక. అందులో అతనికి తోడుగా ఉండేవి రెండే రెండు. ఒకటి ఒంటరితనం, రెండోది ఓ పాత రేడియో. అందరిలాగే తనకూ అమ్మా, నాన్న ఉండుంటే బాగుండేదని ఎప్పుడూ అనుకునేవాడతను. ఏవేవో పిచ్చి పిచ్చి కలలు కంటుంటేవాడు. ఎవ్వరికీ తెలియకుండా లోలోపల ఏడ్చుకునేవాడు. కారణం లేకుండా నవ్వుకునేవాడు. రాత్రి పూట ఆ రేడియోలో ప్రసారమయ్యే పాటలు వింటూ సాంత్వన పొందేవాడు.

చివరికి దేవుడు ఏం చేసినా దానికో అర్థం ఉంటుందనుకుని, తనను తాను సంభాళించుకుని పడుకునేవాడు. ఆ రోజు రాత్రి కూడా అతను నిద్రరాక కునికిపాట్లు పడుతుండగా బయటి నుండి ఎవరిదో కేక వినిపించింది. వెళ్ళి చూస్తే సూరిగాడు. వీధిలో నిలబడి నవ్వుతూ ‘రే..రంగా..ఈ రోజు మనూళ్ళో వీధి నాటకాలేస్తారంట. రా పోదాం’ అంటూ పిలిచాడు. ఎలాగో నిద్ర పట్టి చావడం లేదు. నాటకానికైనా పోదాం అనిపించింది రంగడికి. రచ్చబండ దగ్గరికి చేరుకునే సరికి అంతా కోలాహలంగా ఉంది. ‘ఏం నాటకం?’ అన్నాడు సూరిగాడు పక్కనే నిలబడిన వ్యక్తితో. ‘విశ్వామిత్ర’ అన్నాడతను. ‘ఇస్వామిత్రా? ఇదేదో కొత్త నాటకంలాగుందే’ అంటూ రంగడి వైపు చూశాడు. రంగడు అవన్నీ పట్టించుకోకుండా నాటకంలో ఏం జరుగుతుందో ఉత్సాహంగా చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడు మొదలైందా ఘట్టం. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి మేనక అతని ముందు నాట్యమాడే సన్నివేశం. మేనకగా నటించడానికి ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఇంతలో గల్లు గల్లుమని మువ్వల శబ్దం వినవచ్చింది. యువకులంతా ఒక్కసారిగా బిగ్గరగా అరిచారు.

మేనక వయ్యారంగా నడుచుకుంటూ స్టేజి మీదకొచ్చింది. మర్రిచెట్టు చుట్టూ కూర్చోవడానికి కట్టిన సిమెంటు తిన్నెనే స్టేజిగా మార్చినట్టున్నారు. ఆ చెట్టు మొదట్లో కూర్చుని విశ్వామిత్ర వేషధారి తపస్సు చేసుకుంటున్నాడు. హర్మోనియం, డోలు వాయించే వాళ్ళు చెరో వైపు కూర్చుని వాయిస్తున్నారు. స్టేజి వెనుక నుండి ఎవరో పాడుతుంటే, స్టేజి మీద ఆమె అందంగా ఆడుతోంది. యువకులంతా ఇష్టం వచ్చినట్టు గోల చేస్తున్నారు.  రంగడు మాత్రం కంటి మీద రెప్ప వేయకుండా, మైమరచి ఆమెనే చూస్తూ నిలబడి పోయున్నాడు. నాటకం అయ్యేదాకా ఆమెనే చూస్తున్న రంగడు, అయిపోగానే పరిగెత్తుకుంటూ స్టేజీ దగ్గరికెళ్ళి, జేబులో ఉన్న పది రూపాయలు నోటు తీసి, మర్యాద పూర్వకంగా ఆమె చేతిలో పెట్టి వచ్చేశాడు. ఆ నోటు తీసుకుంటున్నప్పుడు ఆమె చేయి పొరపాటున అతని చేతికి తగిలింది. దాంతో ఆ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు.

తరువాత రోజు పొద్దున్నుంచి మనిషెందుకో పరధ్యానంగా ఉండటం మొదలుపెట్టాడు. ఎంత సేపూ ఆమె ధ్యాసే. ఆ ధ్యాసలో పడి గేదెల్ని కాయడం కూడా  మర్చిపోయేవాడు. అవి అదే అదనుగా ఏ చేనులోనో పడి దొంగతనంగా మేసేవి. సాయంత్రానికి ఆ చేను యజమాని భూస్వామి దగ్గరకి వచ్చేవాడు. రంగడికి చివాట్లు పడేవి. అలా మూడు నాలుగు సార్లు జరిగే సరికి ఇక లాభం లేదనుకుని రంగడ్ని పనిలోంచి తీసేశారు. అందుకు అతను బాధపడలేదు. మూట ముల్లె సర్దుకుని నేరుగా ఆ వీధి నాటకాలేసే వాళ్ళ దగ్గరికెళ్ళాడు. వాళ్ళలో తనతో మొదటగా మాట్లాడింది డోలు వాయించే ముసలాడు. ఇతను వాళ్ళెక్కడికి వెళితే అక్కడికి రావడం చూసి, విషయం ఏంటో అని ఆరా తీశాడు. రంగడు పని కావాలన్నాడు దీనంగా మొహం పెట్టి. కనీసం అక్కడ ఏదైనా పనికి కుదిరితే ఆమెను చూస్తూ గడపొచ్చన్నది అతని ఆలోచన. దానికా ముసలోడు ఎగాదిగా చూసి–

‘ఏం పని చేస్తావ్‌?’ అన్నాడు కళ్ళెగరేస్తూ. ‘ఏదైనా పరవాలేదు.’ అన్నాడు రంగడు ఉత్సాహంగా. ‘సరే..జీతంఎంత కావాలి?’ ముసలాడు మళ్ళీ అడిగాడు. ‘జీతం అవసరం లేదు. తినడానికి ఇంత కూడు, ఉండటాని అంత చోటు ఇస్తే చాలు.’  మెడలో ఉన్న తువ్వాలు సవరించుకుంటూ చెప్పాడు రంగడు. ఆ తర్వాత రోజు నుంచీ అతనూ వాళ్ళలో ఒకడైపోయాడు. చేరిన మొదటి రోజే ఆమెను పరిచయం చేసుకున్నాడు. తన పేరు సుభద్ర అని, ఆమె కూడా తనలాగే అనాధని తెలుసుకున్నాడు. అప్పట్నించీ రంగడు వాళ్ళు ఏ పని చెప్పినా శ్రద్ధగా చేసేవాడు. సుభద్ర కనిపించినప్పుడల్లా ఆరాధనగా చూసేవాడు. అందరినీ నవ్వించేవాడు. ఖాళీగా ఉన్నప్పుడు ముసలోడ్ని అడిగి డోలు నేర్చుకునేవాడు. సమయం దొరికినప్పుడు బయట ఏదో ఒక పని చేసి, ఆ వచ్చే డబ్బులు దాచుకునేవాడు. పోను పోనూ రంగడు, సుభద్ర మంచి స్నేహితులయ్యారు. రంగడు డోలు కూడా పూర్తిగా నేర్చుకున్నాడు. ఎప్పుడైనా ముసలాడికి ఒంట్లో బాగుండకపోతే నాటకంలో తనే డోలు వాయించేవాడు. అప్పుడప్పుడూ తను దాచుకున్న డబ్బుతో సుభద్రకి చీరలో, గాజులో కొని తెచ్చేవాడు. ముందు ఆమె వద్దని వారించేది.

అతను బతిమిలాడేవాడు. తరువాత అడ్డు చెప్పలేక తీసుకునేది. దానికి బదులుగా అతనికి చదవడం, రాయడం నేర్పించేది. అలా కొంతకాలం గడిచింది. ఆ గడిచిన కాలం నిత్యం మనిషి కోరుకునే వినోదంలో కొన్ని పెనుమార్పులు తెచ్చింది. టీవీ యుగం మొదలైన తరువాత రాను రానూ నాటకాలకు గిరాకీ తగ్గిపోయింది. ఎక్కడైనా నాటకం వేస్తే పట్టుమని పదిమంది కూడా వచ్చేవారు కాదు. వచ్చిన వారిలో ఒకరో,  ఇద్దరో మాత్రమే డబ్బులిచ్చేవారు. ఆ డబ్బు వాళ్ళ ఖర్చులకు కాదు కదా తిండికి కూడా సరిపోయేది కాదు. అందుకే నాటకాలు మానేసి ఏవైనా తిండి పెట్టే పనులు చేసుకుందామనుకుని చాలామంది బయటకు వెళ్ళిపోయారు. చివరికి రంగడు, సుభద్ర, ముసలాడు మాత్రం మిగిలారా నాటక మండలిలో. మరి కొంత కాలానికి ముసలాడూ అనారోగ్యంతో చనిపోయాడు. పోతూ పోతూ తన డోలును జ్ఞాపకార్థంగా రంగడికి ఇచ్చి, సుభద్రకి ఎవరూ లేరనీ, తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కన్నుమూశాడు. ఆనాటి నుంచీ రంగడే సుభద్రకి కావాల్సినవన్నీ చూసుకునేవాడు. ఆమె కూడా అతనితో ముందుకంటే ఇంకా చనువుగా ఉండేది.

ఆమె కళ్ళలో అతనంటే ఇష్టం కనబడేది. అందుకే రంగడు ఓరోజు సుభద్రను పెళ్ళి చేసుకుంటానన్నాడు. ఆమె ఒప్పుకుంది. ఒకరిద్దరు తెల్సినవాళ్ళ సహాయంతో వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగింది. పెళ్ళైన రెండో రోజే బతుకు తెరువు వెతుక్కుంటూ పట్నం దారి పట్టారా దంపతులు. పాట పూర్తయ్యాక ఓసారి తువ్వాలు కేసి చూశాడు డోలుబాబా. దానిమీద ఒక్క రూపాయి కూడా లేకపోయే సరికి, గట్టిగా నిట్టూర్చి, గొంతు సరిచేసుకుని మళ్ళీ ఇంకో పాటందుకున్నాడు. ఓ ప్రియతమా...ప్రియతమా...ప్రియతమా... నా మది నిన్ను పిలిచింది గానమై వేణూ..గానమై నా..ప్రాణమై రంగడు, సుభద్ర పట్నానికొచ్చి ఆరు నెలలు గడిచాయి. ఇద్దరూ ఉండటానికి తక్కువ అద్దె గల ఇంటిని ఒకదాన్ని తీసుకున్నారు. రంగడు రోజూ కూలి పనికి వెళ్ళేవాడు. సుభద్ర ఇంటి పట్టునే ఉండి వంటా వార్పూ చూసుకునేది.

దేవుడి దయ వల్ల కనీస అవసరాలకు ఏ కొదవా లేకుండా సాగిపోయేది వాళ్ళ జీవితం. కొన్ని దినాలకు రంగడు కూలి పనులు మానేసి, ఫ్యాక్టరీలో పనికి చేరాడు. అక్కడ పొద్దునుంచి సాయంత్రం దాకా విపరీతమైన వేడి వాతావరణంలో పనిచేయాల్సి వచ్చేది. అలా ఒక వారం ఎడతెరిపి లేకుండా చేసే సరికి, రంగడికి జ్వరం పట్టుకుంది. దాదాపు పది రోజులైనా తగ్గలేదు. దాచుకున్న డబ్బంతా అప్పటికే ఆస్పత్రి ఖర్చులకు అయిపోయింది. మళ్ళీ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళడానికి డబ్బులేదు. అప్పు చేద్దామంటే, ఈ పట్నంలో వారిని నమ్మి అప్పిచ్చేదెవరు. అప్పటికీ సుభద్ర ఒక రోజంతా కషాయంతో ఎలాగోలా జ్వరం తగ్గించే ప్రయత్నం చేసింది. అయినా ప్రయోజనం లేకపోయింది. తర్వాతి రోజు జ్వరం ఇంకా ఎక్కువైంది. రంగడు మంచంలోంచి లేవలేకుండా, మూలగడం మొదలు పెట్టాడు. ఆమెకి ఏం చేయాలో తోచలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాక్టర్ని వెంట బెట్టుకొచ్చింది. ఆయన ఇంజక్షన్‌ ఇచ్చి, ఏవో మందులు కూడా రాసిచ్చాడు. మందులు కొనడానికి కొంత డబ్బు కూడా ఇచ్చెళ్ళాడు. తర్వాత కొన్ని రోజుల పాటూ డాక్టర్‌ రోజూ వచ్చి రంగడిని చూసెళ్ళేవాడు. అందుకు డబ్బులు అడిగేవాడు కాదు.

కొన్నాళ్ళకి రంగడు కోలుకుని పనికెళ్ళడం ప్రారంభించాడు. ఆ డాక్టరు మీద అతనికి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఎక్కడ ఎదురుపడినా ఎంతో  గౌరవంగా పలకరించేవాడు. అతను కూడా రంగడి ఇంటికి అప్పుడప్పుడు వచ్చివెళ్తుండేవాడు. రంగడు ఆయన తనకిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వబోతే ‘ఫర్వాలేదులే ఉంచు’ అనేవాడు. ‘ఒక మనిషి ఏమీ ఆశించకుండా ఇంత సహాయం చేస్తాడా?’ అనే ప్రశ్న రంగడి మనసులో అప్పుడప్పుడూ మెదిలేది. కానీ దానికి సరైన సమాధానం తట్టేది కాదు. అదేంటో ఎరుకపడటానికి దాదాపు నెలరోజులు పట్టిందతనికి. ఆ వేళ రంగడు ఫ్యాక్టరీ నుంచి ఇంటికివచ్చే సరికి చీకటి పడిపోయింది. ఇంట్లో సుభద్ర లేదు. బయటెక్కడో వెళ్ళుంటుందిలే అనుకుని స్నానం ముగించుకుని, కాసేపు ఆమె కోసం ఎదురు చూశాడు. రెండు గంటలైంది. ఆమె రాలేదు. అతని మనసెందుకో కీడు శంకించింది. లేచి గబా గబా తెల్సిన వాళ్ళ ఇళ్ళన్నీ వెతికాడు. ఎక్కడా ఆమె జాడ లేదు. డాక్టర్ని సాయమడుగుదామని క్లీనిక్‌ దగ్గరకు వెళ్ళాడు. క్లీనిక్‌ మూసేసి ఉంది. అతనికేం చేయాలో పాలు పోలేదు.

ఒకవేళ తను ఇంటికి వచ్చేసుంటుందేమోనని ఇంటికి వెళ్ళాడు. ఆమె లేదు. నిస్సహాయంగా మంచంలో కూర్చుని, కిటికీలోంచి బయటకు చూశాడు. బయటంతా దట్టమైన చీకటి. భయమేసిందతనికి. భార్యకేమైనా అయ్యుంటుందేమోననే ఆలోచన అతని గుండెని పిండేయడం మొదలు పెట్టింది. తరువాత మెల్లిగా అతని చూపు కిటికీ దగ్గర వేసున్న స్టూలు మీద పడింది. దాని మీదున్న కాగితం కిటికీలోంచి వీస్తున్న గాలికి రెపరెప లాడుతోంది. అది ఎగిరిపోకుండా ఓ రాయి దాని మీద పెట్టబడుంది. ఆ కాగితాన్ని తీసుకుని చదవడం మొదలు పెట్టాడతను. అందులో– ‘రంగా...నేను ఎందుకీ పని చేస్తున్నానో తెలీదు. ఇది తప్పో, ఒప్పో కూడా నాకు తెలీదు. నేనూ, డాక్టరుగారు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నాం. నేను ఆయనతో ఉంటేనే నా జీవితాన్ని ఎలా ఉండాలని ఊహించుకున్నానో అలా ఉంటుదను కుంటున్నాను. నీకు ఈ విషయం చెప్పేంత ధైర్యం నాకు లేదు. అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. క్షమించు.’ అని రాసుంది. చదివిన తర్వాత రంగడికి ఎందుకో కోపం రాలేదు. కళ్ళ నిండా నీళ్ళు, గుండె నిండా ఆవేదనతో కాసేపు నిశ్చలంగా నిలబడ్డాడతను.

తర్వాత చేతిలో ఉన్న కాగితాన్ని ముక్కలుగా చింపి, కిటికీలోంచి బయటకు విసిరేశాడు. తనింత కాలం సుభద్రతో ఉన్నదీ, తనను ప్రేమించిందీ, పెళ్ళిచేసుకుందీ అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా గుర్తొచ్చాయి. ఆమె తనకు చదవడం నేర్పింది బహుశా ఈ లెటరు చదవడానికేనేమో అనిపించింది. అతనిలో ఏదో నిర్వేదం అలుముకుంది. ఆ ఇంట్లో ఒక్క నిముషం కూడా ఉండాలనిపించలేదు. అక్కడున్న ఏ వస్తువును తాకాలనిపించలేదు. కేవలం ముసలాయన ఇచ్చిన డోలును మాత్రం తీసుకుని, కట్టు బట్టలతో బయటికెళ్ళిపోయాడతను. అతనటు వెళ్ళిపోగానే ఆ ప్రదేశమంతా ఎందుకో హోరున గాలి వీచింది. భోరున వర్షం కురిసింది. అక్కడి నుంచి అతను ఎన్ని మైళ్ళు నడిచాడో తెలియదు. ఎన్ని ఊళ్ళు దాటాడో తెలియదు. ఆఖరికి ఆ బస్టాండ్లో చేరి డోలు వాయించుకుంటూ, పాటలు పాడుకుంటూ గడపడం మొదలుపెట్టాడు.

డోలుబాబా పాడటం మొదలు పెట్టి చాలా సేపయినా, తువ్వాల్లో ఒక్క రూపాయి కూడా రాలలేదు. మూడు రోజులుగా అదే పరిస్థితి. ఈ మూడు రోజుల్లో తను ఒక్కపూట కూడా తినలేదు. కేవలం నీళ్ళతోనే నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు కనీసం డోలు వాయించడానికి కూడా శక్తి లేదతనిలో. ఒకవైపు ఆపేద్దామనిపిస్తోందతనికి. కానీ కడుపులో ఉన్న ఆకలి మాత్రం పాడమని శాసిస్తోంది. పాడుతుంటే మధ్య మధ్యలో గొంతు కీచుగా వస్తోంది. అతను సాయంత్రం వరకూ ఆపకుండా  పాడుతూనే ఉన్నాడు. అయినా ఆ బస్టాండులో ఎవరూ అతన్ని పట్టించుకోవడం లేదు. కొందరు సెల్‌ ఫోన్లలో ఏదో వెతుక్కుంటున్నారు. కొందరు చెవుల్లో ఇయర్‌ ఫోన్సు పెట్టుకుని పాటలు వింటున్నారు. మరి కొందరు బస్టాండులో ఉన్న టీవీల్లో లీనమైపోయున్నారు. పొద్దు పోతోంది. చుట్టూ మసక చీకటి కమ్ముకుంటోంది. దాన్ని పారద్రోలడానికి టౌన్లో అక్కడక్కడా లైట్లు వెలుగుతున్నాయి.

బాబాకి ఓపిక పూర్తిగా నశించిపోతోంది. ఇక అదే ఆ రోజుకి చివరి పాటనుకుని పాడుతుండగా అప్పుడు పడింది అతని ముందొక రూపాయి. దాన్ని తీసుకుని ఆదరాబాదరాగా పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళాడతను. దాంతో టీ కూడా రాదని తెలుసతనికి. అందుకే ఓ బన్ను కొనుక్కుని, తిందామని కూర్చుబోతుండగా, నిస్సత్తువకు కాబోలు అతన్ని వేళ్ళు ఓ క్షణం పాటూ వణికాయి. దాంతో పట్టుకున్న బన్ను కాస్తా చేతిలోంచి జారిపోయింది. అప్పటి దాకా తన పక్కనే కాచుకున్న కుక్క ఒకటి వెంటనే దాన్ని నోటకరచుకుని అక్కడి నుంచి ఉడాయించింది.

బాబాకి పరిగెడుతున్న కుక్కని చూసినప్పుడు తనని తాను చూసుకుంటున్నట్టు అనిపించింది. ఇక చేసేదేమీ లేక బాటిల్లో పోసి పెట్టుకున్న నీళ్ళు కడుపునిండా తాగి, ఆ రాత్రి రోడ్డు పక్కనే పడుకున్నాడతను. అయితే ఈసారి అవి కూడా అతని ప్రాణాల్ని నిలుపలేకపోయాయి. మరుసటి రోజు పొద్దున మళ్ళీ అతను లేవలేదు. మళ్ళీ అతని పాటెప్పుడూ ఆ బస్టాండులో వినబడలేదు. అయినా అక్కడ పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఎందుకంటే డోలుబాబా లాంటి వ్యక్తులతో ఈ సమాజానికి ఎటువంటి అవసరం లేదు. ఆ ప్రదేశమంతా ఎందుకో హోరున గాలి వీచింది. భోరున వర్షం కురిసింది. అక్కడి నుంచి అతను ఎన్ని మైళ్ళు నడిచాడో తెలియదు. ఎన్ని ఊళ్ళు దాటాడో తెలియదు. ఆఖరికి ఆ బస్టాండ్లో చేరి డోలు వాయించుకుంటూ, పాటలు పాడుకుంటూ గడపడం మొదలుపెట్టాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top