వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

Variety Dishes On Snack Centre - Sakshi

స్నాక్‌ సెంటర్‌

బ్రెడ్‌ పౌడర్‌ మంచూరియా
కావలసినవి:  బ్రెడ్‌ పౌడర్‌ – ఒకటిన్నర కప్పులు, ఓట్స్‌ – పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు(చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), అల్లం తరుగు –  పావు టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – పావు టీ స్పూన్‌, పచ్చిమిర్చి పేస్ట్‌ – అర టీ స్పూన్, క్యారెట్‌ తురుము – పావు కప్పు+2 టీ స్పూన్లు, ఉప్పు – అభిరుచిని బట్టి, నీళ్లు – సరిపడా, మిరియాల పొడి – చిటికెడు, సోయాసాస్‌ – పావు కప్పు, చిల్లీ సాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, టమాటా కెచప్‌ – అర కప్పు, ఉల్లి తరుగు – 1 టేబుల్‌ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్, పెప్పర్‌ సాస్‌ – 1 టేబుల్‌ స్పూన్, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. బ్రెడ్‌ పౌడర్, ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్‌ తురుము, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని కొద్ది కొద్ది నీళ్లు కలుపుకుంటూ ముద్దలా చేసుకుని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న బాల్స్‌ చేసుకుని మరో ఐదు నిమిషాలు పక్కన ఉంచి.. నూనె వేడి చేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో పాత్రలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని, వేడి చేసుకుని.. ఉల్లి తరుగు, 2 టీ స్పూన్లు క్యారెట్‌ తురుము, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి.

బాగా మగ్గిన తర్వాత సోయాసాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్, పెప్పర్‌ సాస్‌ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక కప్పు నీళ్లలో మొక్కజొన్న పిండి వేసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని అందులో వేసుకుని.. మరికొన్ని నీళ్లు కూడా జోడించి.. గరిటెతో దగ్గరపడేదాక తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దోరగా వేయించి పక్కన పెట్టుకున్న బాల్స్‌ని అందులో వేసుకుని ఆ మిశ్రమం బాల్స్‌కి బాగా పట్టేలా తిప్పుతూ.. రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. సర్వ్‌ చేసుకునే ముందు నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి.

కొబ్బరి మఫిన్స్‌
కావలసినవి:  ఓట్స్‌ – ఒకటిన్నర  కప్పులు, కొబ్బరి తురుము – 1 కప్పు, బేకింగ్‌ సోడా –1 టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, ఆరెంజ్‌ జ్యూస్‌ – 1 కప్పు, గుడ్డు – 1, బటర్‌ – 1 టేబుల్‌ స్పూన్‌ (కరించుకోవాలి), పాలు – పావు కప్పు, ఆరెంజ్‌ స్లైస్‌ – 6 లేదా 8

తయారీ: ఒక బౌల్‌ తీసుకుని అందులో ఓట్స్, కొబ్బరి తురుము, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్‌ జ్యూస్, గుడ్డు, బటర్, పాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా ముద్దలా కలుపుకోవాలి. ఐదు లేదా పది నిమిషాల పాటు పక్కన పెట్టి మఫిన్స్‌ ట్రేలో కొద్దికొద్దిగా ఆ మిశ్రమాన్ని వేసుకుని.. ఒక్కో దానిపైనా ఒక్కో ఆరెంజ్‌ స్లైస్‌ వేసుకుని ఓవెన్‌లో ఉడికించుకోవాలి.

బీట్‌రూట్‌ బాల్స్‌
కావలసినవి:  బీట్‌రూట్‌ – ఒకటిన్నర కప్పులు (ముందు మెత్తగా ఉడికించుకుని ముద్దలా చేసుకోవాలి), ఉల్లి తరుగు – 4 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు – 3 టీ స్పూన్లు, కొత్తిమీర తురుము – కొద్దిగా, శనగపిండి – 3 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర – 1 టీ స్పూన్‌, మొక్కజొన్న పిండి – 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్‌(అభిరుచిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు), గడ్డ పెరుగు – 1 టేబుల్‌ స్పూన్‌, గరం మసాలా – 1 టీ స్పూన్, నూనె – డీప్‌  ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బీట్‌రూట్, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, గడ్డ పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత శనగపిండి, జీలకర్ర, మొక్కజొన్న పిండి, కారం, గరం మసాలా, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top