కన్నులు కమనీయ లోకం

కన్నులు కమనీయ లోకం


ఎన్నో పుణ్యాలు చేస్తే స్వర్గలోకానికి వెళ్తాం అంటారు. అయితే పుణ్యం చేసినా చేయక పోయినా ఈ లోకంలోనే స్వర్గాన్ని చూడ వచ్చేమో అనిపిస్తుంది... ‘ఉబుద్’ పట్టణాన్ని చూస్తే. పుడమి కన్యకి పచ్చచీర చుట్టినట్టుగా ఉండే వరిపైర్లు... నయనాలకూ నాసికాలకూ ఒకేసారి అద్భుతమైన అనుభూతిని పంచే పూల తోటలూ... నలుమూలల్లో ఎటువైపు వెళ్లినా తాకే ఆధ్యాత్మిక పవనాలు... అడుగడుగునా కనిపించే కళామతల్లి కాలి గురుతులు... అన్నీ కలిస్తే ఉబుద్!

 

 ఇండోనేసియాలో ఉన్న ద్వీపాల్లో ఒక ద్వీపం బాలి. ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ ద్వీపంలో ఉన్న ఒక పట్టణమే ఉబుద్. ముప్ఫై వేల మంది జనాభా ఉండే ఈ పట్టణం పేరుకి పట్టణమే కానీ... పల్లెను తలపిస్తుంది. దానికి కారణం ఉబుద్ చుట్టూ బోలెడన్ని పల్లెలు విస్తరించి ఉండటమే. అవన్నీ కలిసిపోయినట్టుగా ఉండటంతో ఉబుద్‌లో పట్టణపు అభివృద్ధితో పాటు పల్లె ఛాయలూ కనిపిస్తుంటాయి. నిజానికి ఆ పల్లెవాసనలే ఉబుద్‌ని అందరికీ నచ్చేలా చేస్తున్నాయి.

 

 సాధారణంగా ఒక ప్రాంతం ప్రాచుర్యం పొందిందంటే అక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉందని అర్థం. అయితే ఉబుద్‌లో ఏదో ఒకటి కాదు... ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. వాటి గురించి వింటే వెంటనే రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోవాలనిపిస్తుంది ఎవరికైనా.

 

 కళలకు కాణాచి...

 ఉబుద్‌లో కళామతల్లి కోట కట్టుకుని కూచుంది. ఇక్కడ ఎప్పుడూ సంగీతం పరవళ్లు తొక్కి ప్రవహిస్తుంది. సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. నాట్యం సరికొత్త ముద్రలు నేర్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా అక్కడ సంగీత కచేరీలు, సాహితీ సమ్మేళనాలు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం ఎరీ స్మిత్ అనే డచ్ చిత్రకారుడు. పూర్వం ఎప్పుడో ఇతగాడు బాలి ద్వీపాన్ని సందర్శించడానికి వచ్చాడు. ఉబుద్‌లోని ప్రకృతి సౌందర్యాన్ని ఎన్నో చిత్రాలుగా గీశాడు.

 

  వాటి ద్వారా ఉబుద్ అందాల గురించి ఎంతోమందికి తెలిసింది. వాళ్లంతా ఉబుద్‌ని చూడటానికి వచ్చే వారు. వాళ్లలో కళాకారులే ఎక్కువగా ఉండే వారు. అక్కడికి రాగానే అందరి మనసులూ పరవశించేవి. ఆ పారవశ్యంలో పాటలల్లేవారు. కవితలు రాసేవారు. కొందరు అక్కడే నెలల పాటు ఉండిపోయేవారు. దాంతో మెల్లగా కళల కాణాచిగా మారిపోయింది ఉబుద్. అందుకే దీన్ని ‘కల్చరల్ సెంటర్ ఆఫ్ బాలి’ అంటారు.

 

 ఆధ్యాత్మికతకు ఆలవాలం...

 కళాకారులే కాదు... దైవ చింతన ఉన్న వారూ తప్పక వెళ్లాల్సిన చోటు ఉబుద్. కొన్ని శతాబ్దాల క్రితంనాటి హిందూ దేవాలయాలు అక్కడున్నాయి. ముఖ్యంగా తీర్థ ఎంపల్ అనే దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ఆ దేవాలయ ఆవరణలో ఉన్న పెద్ద కొలను దగ్గర కొబ్బరి ఆకులతో తయారు చేసిన పూల బుట్టలో (ఆ బుట్టను కంనాంగ్ అంటారు) పూలు, పండ్లు తీసుకెళ్లి పెడతారు. ఈ కొలనులో స్నానమాచరిస్తే పుణ్యం దక్కు తుందని, కోరికలు నెరవేరుతాయని అంటారు. క్రీ.శ. 926లో వర్మదేవ వంశస్తులు నిర్మించిన ఈ ఆలయం నిత్యం సందర్శకులతో, భక్తులతో కిటకిటలాడుతుంది. ఇలాంటి ప్రాశస్తం కలిగిన దేవాలయాలు బాలిలో చాలానే ఉన్నాయి!

 

 వరితిన్నెల శోభ వర్ణనాతీతం...

 పచ్చని వరిచేలను చూస్తే ప్రకృతిలోని సౌందర్యమంతా వాటిలోనే ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఉబుద్‌లోని వరి తిన్నెలను చూస్తే మాత్రం... నయనానందంతో పాటు ఆశ్చ ర్యమూ కలుగుతుంది. ఎందుకంటే ఆ వరిచేలు మన చేలల్లా సమాంతరంగా ఉండవు. స్టేడియంలో సీట్ల వరుసల్లా ఉంటాయి. ఏట వాలుగా ఉన్న నేలమీద వరుసలు వరుసలుగా వరినాట్లు వేస్తారు. ఎత్తుమీద పడిన వర్షపునీరు జారుకుంటూ, పంట అంతటినీ తడుపుకుంటూ పల్లానికి పారేందుకే ఈ పద్ధతి. పేర్చినట్టుగా ఉండే ఆ చేల పచ్చదనం మనసును పులకరింప జేస్తుంది. కానీ ఆ సంతోషం ఊరికే దొరకదు. కాస్త ఖర్చవుతుంది. అవును. ఆ చేలను చూడాలన్నా, వాటి మధ్య సంచరించాలన్నా, ఫొటోలు తీయాలన్నా ఫీజు చెల్లించక తప్పదు.

 

 హ్యాపీ న్యేపీ న్యూ ఇయర్..

 న్యేపీ అనేది బాలి న్యూ ఇయర్ డే. అయితే ఈ వేడుక అన్నిచోట్ల కంటే బాగా ఉబుద్‌లో జరుగుతుంది. బాలిలో ఈ పండుగ జరిగిననాడే ఇక్కడ మనకు ఉగాది జరుగుతుంది. ఆరోజున బాలిలో, ముఖ్యంగా ఉబుద్‌లో రకరకాల కార్య క్రమాలు ఉంటాయి. సంగీతం హోరెత్తుతుంది. వీధులన్నీ జనంతో నిండిపోతాయి. నృత్యాలు, విందు వినోదాలతో సందడి సందడిగా ఉంటుంది. యువకులు వేషాలు వేసుకొని ఊరేగింపుగా రోడ్లమీద తిరుగుతారు. వివిధ రకాల బొమ్మలను తయారు చేసి వాటిని మోసుకుంటూ వీధుల్లో తిరుగుతారు. అయితే ఈరోజు వాళ్లకు ఎంత ముఖ్యమో, దీని ముందు రోజు కూడా అంతే ముఖ్యం. ఆ రోజును వాళ్లు ‘డే ఆఫ్ సెలైన్స్’ అంటారు. కొత్త సంవత్సర మంతా మంచే జరగాలని కోరుతూ ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ధ్యానంలోనే గడుపుతారు. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడరు. దాంతో ఎక్కడా శబ్దమన్నదే ఉండదు. పబ్లిక్ హాలీడే కావడంతో ఆఫీసులు, దుకాణాలు అన్నీ బంద్. వాహనాలు కూడా తిరగవు. అందుకే ఆ రోజును ‘డే ఆఫ్ సెలైన్స్’ అంటారు.

 ఆరోగ్యధామం...

 

 ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు. కానీ ఉబుద్ వాసులు పెట్టినంతగా ఆరోగ్యం మీద శ్రద్ధ ఎవ్వరూ పెట్టరు. ఆ విషయం ఒక్కసారి అక్కడకు వెళ్తే తెలుస్తుంది. ఉబుద్‌లో అడుగుకో జిమ్ ఉంటుంది. స్పా ఉంటుంది. యోగా సెంటర్ ఉంటుంది. మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. ఇక ఆహారం విషయంలో అయితే వారు పెట్టే శ్రద్ధే వేరు. ఎరువులకు వీలైనంత దూరంగా ఉంటారు. చాలావరకు సేంద్రీయ పద్ధతిలోనే పంటలు పండిస్తుంటారు. దాంతో ఆర్గానిక్ ఫుడ్ విరివిగా దొరుకుతుంది. వారాంతంలో పెద్ద ఎత్తున ఆర్గానిక్ మార్కెట్ జరుగుతుంది. రెస్టారెంట్లలో సైతం ఆర్గానిక్ ఫుడ్‌కే పెద్ద పీట. బహుశా ఇక్కడ తిన్నతంగా ఆర్గానిక్ ఫుడ్‌ని మరెక్కడా తినరేమో!

 

 ఇంకా... రంగురంగుల పూలతోటలు, ఎప్పుడూ ఎక్కడో ఒకచోట జరుగుతూ ఉండే సేవాకార్యక్రమాలు, సంప్రదాయ దుస్తులు, వస్తువులతో నిండిన దుకాణాలు... మొత్తంగా ఏ విధంగా చూసినా ఉబుద్ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంటుంది. సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటుంది. సందర్శించినవారిని మళ్లీ మళ్లీ తన దగ్గరకు రప్పించుకుంటూ ఉంటుంది!

 

  బాలిలో హిందువుల సంఖ్య చాలా ఎక్కువ. అందువల్లే ఉబుద్‌లో హిందూ దేవాలయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

 

  ఇక్కడి కరెన్సీ... ఇండోనేసియన్ రూపయా. మన రూపాయి అక్కడ 197 రూపాయలతో సమానం.

 

  ఉబుద్‌లో ఇండోనేసియన్, బాలినీస్, ఆంగ్లభాషలు మాట్లాడతారు.

 

  ఉబుద్‌వారు తమ స్థానిక వంటకా లకు ఫ్రెండ్ శైలిని మిక్స్ చేస్తారు. ఆసక్తి ఉన్న సందర్శకుల కోసం క్రియేటివ్ కుకింగ్ క్లాసులు కూడా నిత్యం నిర్వహిస్తుంటారు.

 

  ఉబుద్‌లో రకరకాల పూలు ఉంటాయి. వాటితో పెర్‌ఫ్యూమ్స్ తయారు చేస్తారు. అని కార్యక్రమాల్లోనూ అంలకర ణకు పూలనే ఎక్కువ వాడతారు.

 

  ఇక్కడి మంకీ ఫారెస్ట్‌లో లెక్కలేనన్ని కోతులుంటాయి. వాటిని ప్రభుత్వం జాగ్రత్తగా సంరక్షిస్తోంది. ఇక్కడ కోతులకు ఓ గుడి కట్టారు. యేటా మంకీ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు.

 

 గ్యామెలాన్ అనే సంగీత సాధనం ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు.

 

  ఉబుద్ సంప్రదాయ నృత్యం పేరు ‘జామ్’. దీనికి ప్రత్యేక ముద్రలేమీ ఉండవు. నచ్చినట్టు చేసేయొచ్చు. కాకపోతే ఈ డ్యాన్‌‌స కళ్లు తిరిగేంత వేగంగా ఉంటుంది!

 

  ‘బతిక్’ అనే తరహా ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌ని మనం బాలిలో మాత్రమే చూడొచ్చు. ముఖ్యంగా ఉబుద్ అంతటా ఎంతోమంది ఈ రకమైన పెయింటింగ్ చేస్తూ కనిపిస్తారు. ఇది పదిహేను వందల యేళ్ల నాటి పురాతన కళ.

 

 - సమీర నేలపూడి

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top