బంగారయ్యను చంపేశారు

Suspense Crime Story By Chennuri Sudarshan In Funday - Sakshi

క్రైమ్‌ స్టోరీ

సనత్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌. అప్పుడే స్టేషన్‌లోకి అడుగు పెడ్తున్న ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ ఫోన్‌ మోగడంతో ఎత్తాడు. అవతల నుండి ‘‘సర్‌..పోలీసు స్టేషనా...సర్‌.. నా పేరు పేరయ్య. మూసాపేట నుండి మాట్లాడుతున్నాను. మా అద్దె పోర్షన్‌లో ఒక శవం ఉంది సర్‌’’ అని వినిపించింది.
ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్‌ను తీసుకుని మూసాపేటకు బయలుదేరాడు ఇన్‌స్పెక్టర్‌. వ్యానుకు ఎదురుగా పరుగెత్తుకుంటూ వెళ్ళాడు పేరయ్య. ముక్కు మూసుకున్న చెయ్యిని లిప్తకాలం సడలించి ‘‘సర్‌..రండి..’’ అంటూ శవమున్న ఇంట్లోకి దారి చూపుతూ మళ్ళీ ముక్కు మూసుకున్నాడు. ఒక గన్నీబ్యాగులో సగం శవం బయట పడి  భయంకరంగా కనబడుతోంది. శవం  తాలూకు రెండు చేతులు  గన్నీబ్యాగుకు ఇరువైపులా రక్తపు మడుగులో పడి ఉన్నాయి.  
వెంటనే బయటికి వచ్చాడు కృష్ణ. రెండు చేతులు కట్టుకుని భుజాలు వంచి బిక్కుబిక్కు మంటూ నిలబడ్డ పేరయ్యను చూశాడు.     
‘‘పేరయ్యా.. ఇంట్లో కిరాయకు ఉన్నవాడిదేనా శవం..!’’ అంటూ విషయం వివరంగా చెప్పమన్నట్టుగా అడిగాడు.

‘‘కాదు సర్‌..ఇంట్లో శీనయ్య అనే ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మూడు నెలలుగా ఉంటున్నాడు. ఒక  నెల కిరాయ మాత్రమే ఇచ్చాడు. ఇంకా రావాల్సిన కిరాయ ఎప్పుడు అడుగుదామన్నా చిక్కడు దొరకడు. ఒక్కొక్కసారి వారం రోజులవరకూ రాడు. మొన్న రెండవ తారీఖున వచ్చి కిరాయ మొత్తం ఇచ్చాడు. ఇంట్లో నుండి గ్యాసు లీకైన వాసన వస్తోందని జాగ్రత్తలు చెప్పాను. అలాంటిదేమీ  లేదని తాళమేసి వెళ్లి పోయాడు. నిన్నంతా రాలేదు. ఎక్కువగా రాత్రుల్లే వస్తాడు. తెల్లవారు ఝామున్నే వెళ్లి పోతాడు’’
‘‘శవాన్ని ఎప్పుడు చూశావో చెప్పు?’’
‘‘గ్యాసు వాసన అయితే మంటలు రావాలి కదా, ఎలుకలేమైనా చచ్చాయి కాబోలని అనుమానంతో ఇంతకు ముందే తాళం బద్దలు కొట్టి తలుపులు తెరిచాను. గన్నీబ్యాగులో శవం కనబడేటాళ్ళకు నా గుండె ఆగిపోయింది.’’ అంటూ కళ్ళనీళ్ళు ఒత్తుకోసాగాడు.
క్లూస్‌ టీం వాళ్ళు ఫోటోలు తీస్తుంటే ఇద్దరు పోలీసులు, చేతులకు గ్లౌస్‌ తొడుక్కొని అత్యంత జాగ్రత్తగా గన్నీబ్యాగును  కత్తిరించారు. శవం పూర్తిగా బయటపడింది. శవం ముఖాన్ని చూడగానే  ఇన్‌స్పెక్టర్‌ ఎక్కడో చూశానన్నట్టుగా తోచింది. కాసేపు ఆలోచించాడు. క్లూస్‌ టీం తమ పనులు పూర్తి చేసుకొని బయటకు వచ్చి..హతుని వయసు దాదాపు 50 సంవత్సరాలు ఉండవచ్చని, శవంపై ఉన్న బట్టల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని,  తలపై, ఛాతిపై గాయాలు  కనబడుతున్నాయని  చెప్పారు.

సమయం దాదాపు పది కావస్తోంది. ‘సాయంత్రానికల్లా పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌ రావచ్చు. అయినా ఏం లాభం? వాటితో హంతకుణ్ణి పట్టుకునే ఆధారాలు దొరకవు. సరియైన ఆనవాలు చిక్కకుండా వాడెవడో గాని పకడ్బందీగా ప్లాను వేశాడు. రేపు న్యూస్‌పేపర్లలో హతుని ముఖ చిత్రం వేయించాలి’ అని మనసులో అనుకుంటూ దీర్ఘాలోచనలో ఉన్న  ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ,  రైటర్‌ రమణ వచ్చేసరికి తలెత్తి చూశాడు. 
‘‘సర్‌..ఎవరో ఒకతను  వచ్చాడు. మిమ్మల్ని అడిగి కంప్లైంట్‌ తీసుకుందామని..’’ అంటూ సంశయంగా నిలబడ్డాడు. లోనికి పంపించమన్నట్లు చేత్తో సైగ జేశాడు  ఇన్‌స్పెక్టర్‌. 
‘‘నమస్కారం సర్‌..’’ అంటూ లోనికి వస్తూనే రెండు చేతులా నమస్కరించాడతను.
‘‘సర్‌..నా పేరు అఖిల్‌. బంగారయ్య అబ్బాయిని’’ 
‘‘ఓ..! బజ్జీల బంగారయ్య అబ్బాయివా! పేరు విన్నాను గాని ఎప్పుడూ చూసే అవకాశం రాలేదు. మీ బడ్డీ కొట్టులో బజ్జీలు బాగుంటాయి అఖిల్‌. నేనూ రోజూ తెప్పించుకుంటాను’’ అంటుంటే మనసులో చిరునవ్వు మొలిచింది ఈ రోజు తినడం వీలు కాలేదని. 
‘‘ఫిర్యాదేంటి?’’ అంటూ నింపాదిగా అడిగాడు.
‘‘సార్‌..మా నాన్న ఒకటవ తారీఖు  శనివారం నుండి కనిపించడం లేదు. మా బంధువులకు, స్నేహితులకు ఫోన్లు చేశాను. తెలియదన్నారు. నాన్న ఫోన్‌ స్విచాఫ్‌ వస్తోంది’’ అంటూ కార్డు సైజు ఫోటో తీసి చూపించాడు. దాన్ని  చూడగానే కృష్ణ నుదురు ముడిపడింది. ఇంతలో అఖిల్‌ సెల్‌కు  ఏదో మెసేజ్‌ వచ్చింది. అఖిల్‌ ఆ మెసేజ్‌ చూసి నిలువెల్లా కంపించి పోయాడు. 
 ‘‘సార్‌..’’ అంటూ చిన్నగా కేక పెట్టాడు. 
అది బంగారయ్య ఫోన్లో నుండి వచ్చిన మెసేజ్‌.

 ‘మీ నాన్న క్షేమంగా ఇంటికి రావాలంటే అరవై లక్షలు తయారు చేసుకొని సిద్ధంగా ఉండు. పోలీసు స్టేషన్‌ గడప తొక్కావనుకో మీ నాన్నను తొక్కి పాతరేస్తాను. ఖబడ్దార్‌..’ 
‘‘అఖిల్‌..ఎలాగైనా  వాణ్ణి పట్టుకుంటాను. గుండె నిబ్బరం చేసుకో’’ అని ధైర్యం చెబుతూ మెల్లిగా చెవి దగ్గర తన ప్లాన్‌ చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌.
సేఫ్టీ లాకర్లో నుండి డబ్బు బయటకు తీసి చిన్న స్టూల్‌ మీద పెట్టాడు కృష్ణ. అఖిల్‌  వీడియో తీశాడు. బంగారయ్య ఫోన్లో నుండి వచ్చిన మెసేజ్‌కు జవాబుగా ‘‘ప్రస్తుతం నా దగ్గర ఇరవై  లక్షలున్నాయి. డబ్బు ఎక్కడ అందజెయ్యాలో చెప్పండి. మానాన్న షుగర్, బి.పి. పేషంట్‌. దయచేసి డబ్బు తీసుకుని వదిలేయండి’ అని వీడియో  అటాచ్‌ చేసి  పంపించాడు. 
‘‘ప్రతీ  శనివారం బజ్జీలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తుల గిరాకీ తట్టుకోలేకుండా వుంటుంది సర్‌. మా  బజ్జీల బడ్డీకొట్టు పై ఒక షార్ట్‌ఫిల్మ్‌  రావడం దానికి మరో కారణం. మొన్న ఒకటవ తారీఖున శనివారం రోజున అలాగే రద్దీ వుంది. నాన్న రాత్రి ఎనిమిది గంటల వరకుండి, స్నేహితుని ఇంట్లో పుట్టిన రోజు వేడుకని వెళ్ళాడు. రాత్రి దాదాపు పదకొండు  గంటలకు నేను కొట్టు కట్టేసి  ఇంటికి వెళ్లాను. నాన్న ఇంకా రాలేదని అమ్మ చెప్పింది. ఫోన్‌ చేశాను. స్విచ్చాఫ్‌ వస్తోంది. అప్పుడప్పుడు అలా వెళ్లి రెండు రోజులుండి రావడం మామూలే అనుకుని ఈరోజు ఉదయం వరకూ చూశాను. అలాగే స్విచ్చాఫ్‌ వస్తోంది. అమ్మ గాబరా పడి పోయి నన్ను మీ దగ్గరికి తరిమింది’’ అంటూ తల దించుకుని నుదురు పట్టుకున్నాడు అఖిల్‌.

‘‘మీ బడ్డీకొట్టు మీద షార్ట్‌ఫిల్మ్‌ ఎవరు తీశారు?’’ 
‘‘మా పాత ఇంట్లో ఇదివరకు అద్దెకున్నతను. అప్పుడప్పుడు టీ.వీ.లలో, సిన్మాలలో చిన్న, చిన్న వేషాలు గూడా వేస్తుంటాడు. అతని పేరు హరిబాబు. చాలా మంచి వాడు సార్‌. మా నాన్నతో చాలా క్లోజ్‌ గా ఉండే వాడు’’ అంటూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తన సెల్‌ ఫోన్‌ తెరచి గూగుల్‌ ఫోటోలు వెదికాడు. హరిబాబు ఫ్యామిలీ ఫోటోతో సహా మరికొన్ని ఫోటోలు చూపించాడు. హరిబాబు ఫోటో చూడగానే తానిదివరకు పనిచేసిన బాలానగర్‌ పోలీసు స్టేషన్లో భార్యాభర్తల తగువులాట  కేసు గుర్తుకు వచ్చింది. 
‘‘మీ ఇంట్లో ఫ్యామిలీతో ఉండే వాడా?’’ అని ఆరా తీస్తూ హరిబాబు ఫోటోలన్నీ తన సెల్‌లోకి బదిలీ చేయించుకున్నాడు.
‘‘సర్‌..మెసేజ్‌ వచ్చింది’’ అంటూ ఫోన్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఇచ్చాడు  అఖిల్‌.
‘లింగంపల్లి  రైల్వేస్టేషన్లో డబ్బు తీసుకుంటాను. బీదరు నుండి ఒక ఫాస్ట్‌ ప్యాసింజర్‌ దాదాపు సాయత్రం ఏడు గంటలకు వస్తుంది. సరిగ్గా ఆ సమయానికి డబ్బు తీసుకొని రైలు  చివరి బోగీ చివరన నిలబడు. నేను డబ్బు తీసుకొని మీ నాన్న ఎక్కడున్నాడో  చెబుతాను’ 
మనసులో నవ్వుకున్నాడు కృష్ణ. జరగాల్సిన పనులు  అఖిల్‌కు చెప్పి పంపించాడు. రమణయ్యను పిలిచి  హరిబాబు ఫోటోలు చూపించాడు. తన అనుమానాన్ని చెబుతూ వివరాలు కనుక్కోడానికి ఇద్దరు పోలీసులకు డ్యూటీ వేయమన్నాడు. ఫోటోలను ఆఫీసు సెల్‌ ఫోన్లోకి బదిలీ చేశాడు.

లింగంపల్లి రైల్వే స్టేషన్‌. పోలీసులంతా సాధారణ ప్రయాణీకుల్లా  సంచరించసాగారు. అఖిల్‌ డబ్బుల చేసంచి పట్టుకుని ప్లాట్‌ ఫాం చివరన నిలబడ్డాడు. రైలు వచ్చి ఆగింది. అఖిల్‌ చివరి బోగీ చివరికి పరుగెత్తి నిలబడ్డాడు. నెత్తికి రుమాలు చుట్టుకుని, కళ్ళకు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని, చేతి కర్ర సాయంతో ముసలాడిలా నడుచుకుంటూ ఒకతను అఖిల్‌ వద్దకు వచ్చి చేసంచి తీసుకోబోయాడు. ఒక్కసారిగా పోలీసులు అతనిపై పడి పట్టుకున్నారు. అతను బిత్తరపోయాడు.  ఇన్‌స్పెక్టర్‌  కళ్ళద్దాలు, రుమాలు లాగి వేసే సరికి అతణ్ణి చూసి నివ్వెర పోయాడు అఖిల్‌. అతను హరిబాబు!  కృష్ణ  అనుమానమూ నిజమయ్యింది. హరిబాబును తీసుకొచ్చి సెల్లో వేశారు. కానిస్టేబుల్‌ను పిలిచి పేరయ్యను అర్జంటుగా తీసుకు రమ్మని పంపాడు ఇన్‌స్పెక్టర్‌. అరగంటలో పేరయ్య వస్తూనే ఇన్‌స్పెక్టర్‌ని  చూసి భయం భయంగా నమస్కరించాడు.
‘‘పేరయ్యా.. ఇతనెవరో తెలుసా..!’’ అంటూ సెల్లో ఉన్న హరిబాబును చూపించాడు కృష్ణ.

‘‘శీనయ్య సర్‌..ఇతనే మా ఇంట్లో అద్దెకున్నది’’ అంటూ రూఢిగా చెప్పాడు. 
హరిబాబు తలదించుకున్నాడు. రమణను పిలిచి పేరయ్యతో స్టేట్‌మెంటు రికార్డు చెయ్యమన్నాడు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ హరిబాబు జీవన సమాచారం సేకరించి తెచ్చిచ్చారు. లాకప్‌లో ఉన్న హరిబాబు దగ్గరకు వెళ్లి చిట్టా విప్పుకుంటూ  రెండు ముఖ్యమైన ఫోటోలు  చూపించాడు ఎస్సై ఒకటి అఖిల్‌ చూపించిన రాజేశ్వరీ, ఇద్దరు పిల్లలతో హరిబాబు. రెండవది.. హరిబాబు ప్రేమించి రహస్యంగా పెళ్ళాడిన రుక్సానాతో దిగింది.
‘‘బంగారయ్యను ఎందుకు హతమార్చావో నాకు క్షుణ్ణంగా అర్థమయ్యింది. నా లాఠీకి పని చెప్పకుండా జరిగిన వాస్తవం చెబితే నీకే మంచిది’’ అంటూ ఎస్సై కళ్ళు పెద్దవిగా చేసుకుని హూంకరించాడు. హరిబాబు కళ్ళు జలపాతాలయ్యాయి. నోరు విప్పక తప్పలేదు.
‘‘నాపేరు హరిబాబు. మాది శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం. ఓడరేవులో పనిచేసే వాణ్ణి. అక్కడ స్మగుల్డ్‌ గూడ్స్‌ ఎక్కువగా అమ్ముతారు. నేనొక వీడియో కెమెరా కొన్నాను. ఒకసారి సరదాగా చిన్న టాపిక్‌ మీద ఒక షార్ట్‌ఫిల్మ్‌  తీశాను. హైదరాబాదు కల్చరల్‌ అసోసియేషన్‌ వారు నిర్వహించిన  పోటీలో దానికి బహుమతి వచ్చింది.ఈ ఊపుతో  నా మకాం హైదరాబాదుకు మార్చి షార్ట్‌ఫిల్మ్స్‌ తీయసాగాను. 

రాజేశ్వరీ అనే ఒక జూనియర్‌ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకున్నాను. భరత్‌ నగర్‌లో బంగారయ్య ఇంటిని అద్దెకు తీసుకున్నాను. బంగారయ్య బజ్జీల బడ్డీ దినం, దినం ఎదిగి పోసాగింది. అప్పుడప్పుడు టీ.వీ.సీరియల్స్‌లో సినిమాలలో చిన్న, చిన్న వేషాలు వేసే వాణ్ణి. అప్పుడు పరిచయమయ్యింది రుక్సానా. ఆమెతో హఫీజ్‌ పేటలో సహజీవనం చెయ్యసాగాను. ఆమె సహకారంతో  అక్కడొక వీడియో సెంటర్‌ తెరిచాను. ఫంక్షన్లలో వీడియోలు తీసేవాణ్ణి. అయినా ఖర్చులకు సరిపోయేవి కావు. పిల్లలను మంచి స్కూల్లో వేద్దామని రాజేశ్వరి పోరు పెట్టేది. ఆమెను నమ్మించి  ఒంటి మీద నగలు  కుదువబెట్టాను. నగలూ పోయాయి..పిల్లల చదువు పోతోంది. చివరికి మన  బతుకులు బజారున పడుతున్నాయని ఒకరోజు పెద్ద గొడవ చేసింది. చెయ్యి చేసుకున్నాను. ఆమె తండ్రి బాలానగర్‌లో నా మీద ఫిర్యాదు చేశాడు. రాజీ పడ్డాను. కొన్నాళ్ళకు  వీడియో సెంటర్‌ అమ్మాల్సి వచ్చింది. రుక్సానాతో పోరు. వేషాలు రావడం లేదు.

సులభంగా డబ్బు సంపాదనకు మార్గాలు వెదకసాగాను. బంగారయ్య బడ్డీకొట్టు మీద ఒక షార్ట్‌ఫిల్మ్‌ తీయడంతో వారి వ్యాపారం మరింత పెరిగే సరికి బంగారయ్య నేనంటే అత్యంత అభిమానం చూపేవాడు. దాన్ని నేను క్యాష్‌ చేసుకోవాలనుకున్నాను. అతను కన్నెపిల్లలంటే కాసులు కురిపిస్తాడని పసిగట్టాను. అప్పుడప్పుడూ అమ్మాయిలను ఎర వేసి డబ్బులు దండుకునే వాణ్ణి. దీని కోసం మూసాపేటలో పేరయ్య ఇల్లు అద్దెకు తీసుకున్నాను. 
మొన్న బంగారయ్యకు అమ్మాయి ఉందని మభ్యపెట్టి  మూసాపేటకు పిలిచాను. పాతిక వేలు పట్టుకొని వచ్చాడు. అమ్మాయి వచ్చేలోగా మందు తాగుదామని ఇద్దరం కూర్చున్నాం. పథకం ప్రకారం అతని మందులో నిద్ర మాత్రలు కలిపాను. నిద్రమత్తులో గూడా ‘ఏదిరా పిల్లా..!’ అని వాగడం మొదలు పెట్టాడు. నాకు కోపమొచ్చి తల మీద, ఛాతి మీద సుత్తితో బాదాను. బంగారయ్య నేల మీద వాలి పోయాడు. నులక తాడులా ఉన్న అతని బ్రాస్లెట్, మెడలో గొలుసు, ఉంగరాలు ఒలుచుకుని ఇంటికి తాళమేసి బయట పడ్డాను. మరునాడు ఉదయం నగలు విడిపించుకుని రాజేశ్వరికిచ్చాను. 

మధ్యాహ్నం ఒక గన్నీబ్యాగు, పెద్ద కత్తి కొనుక్కొని మూసాపేటకు వెళ్లాను. బంగారయ్య భారీ శరీరం గన్నీబ్యాగులో పట్ట లేదు. చేతులు నరికాను. కాళ్ళు నరకుతుంటే ఆ శబ్దానికి పేరయ్య వచ్చి తలుపు తట్టాడు. వెంటనే  తలుపు ఓరగా తెరచి బయటికి వెళ్ళి ఇంటి అద్దె బకాయిలను చెల్లించాను. పేరయ్య  సంతోషంగా వెళ్తూ..గ్యాసు వాసన వస్తోందని అన్నాడు. నాకూ భయమేసింది. అది శవం తాలూకు వాసన. షాపుకు వెళ్లి రూం ఫ్రెష్‌నర్, నాఫ్తలిన్‌ ఉండలు తెచ్చాను. శవాన్ని గన్నీబ్యాగులో కుక్కి  ఇల్లంతా ఫ్రెష్‌నర్‌ వాసనలు వెదజల్లాను. బంగారయ్య సెల్‌ ఫోన్‌ తీసుకున్నాను. ఇంట్లో ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా జాగ్రత్త పడి బయట పడ్డాను.
బంగారయ్య కొడుకు అఖిల్‌ ఫోన్‌ చెయ్యగానే కట్‌ చేసి స్విచ్చాఫ్‌ చేశాను. అప్పుడొక ఐడియా తట్టింది. బంగారయ్య చనిపోయాడన్న విషయం ఇప్పుడప్పుడే తెలియదు. అఖిల్‌ ఉత్త అమాయకుడు. అతణ్ణి మోసగించి వీలైనంత డబ్బు లాగాలనుకున్నాను. 
బంగారయ్య క్షేమంగా ఉండాలంటే అరవై లక్షలు కావాలని, పోలీసులకు చెప్పొద్దని బెదిరిస్తూ ఒక మెసేజ్‌ పెట్టాను. ఇరవై లక్షలున్నాయని డబ్బుతో ఒక వీడియో పంపించాడు అఖిల్‌. డబ్బు తీసుకొని, బంగారయ్య మొబైల్‌ నా దగ్గరున్నా ప్రమాదమే వదిలేసి పారి పోదామనుకున్నాను. కాని మీరు నన్ను చుట్టుముట్టి...’’ అంటూ మరోసారి భోరుమన్నాడు హరిబాబు.
- చెన్నూరి సుదర్శన్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top