ఒక సాయంత్రం వాన!

A story by mallaram srikanth - Sakshi

మా నాన్నగారికి ఇల్లే స్వర్గం. ఇల్లు దాటి బయటకు రావడం ఆయనకొక నరకం. ఆయనను ఇల్లు దాటి ఎలాగైనా బయటికి తీసుకురావాలని మేము ప్రయత్నిస్తుంటాం. ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసి కొడుతుంటాయి. ‘‘నాన్నా... ఫలానా సినిమా బాగుందట. మంచి ఫ్యామిలీ  పిక్చరట... మనంవెళదాం’’ అన్నాను ఒక సండే  రోజు. ‘‘ఎందుకు నాన్న పనిగట్టుకొని సినిమాకు వెళ్లడం.  రెండు నెలలు ఓపిక పడితే టీవీలో వస్తుంది కదా. చక్కగా కుర్చీ కదలకుండా చూడవచ్చు’’ అన్నారు ఆయన కాఫీ చప్పరిస్తూ. ‘‘సినిమా అని కాదు... సరదాగా అలా బయటికి వెళ్లినట్లు ఉంటుంది. అందరం కలిసి హాయిగా ఇవ్వాళ హోటల్లోనే భోజనం చేయవచ్చు’’ అన్నాను ఆయన మూడ్‌ను మార్చడానికి. ‘‘ఇంట్లో ఉన్న సరదా బయట ఎక్కడుంటుంది నాన్నా! మనమందరం సినిమా హాలుకు వెళ్లాలంటే మూడు ఆటోలు మాట్లాడుకోవాలి!  ఆటో వాళ్లతో బేరం కుదర్చుకోవడానికి తలప్రాణం తోకకు వస్తుంది. సరే చచ్చిచడి బేరం మాట్లాడుకొని ఆటోలో కూర్చున్నామా..... అది కదిలిన కొద్దిసేపటికే ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది.

సినిమాకు టైమ్‌ అవుతుంది కదా అని మనలో టెన్షన్‌ మొదలువుతుంది. మంచి విషయాలకే టెన్షన్‌ తీసుకోకూడదు...అలాంటిది టైమ్‌పాస్‌ సినిమా కోసం ఎందుకు టెన్షన్‌ తీసుకోవాలి? ఎందుకు హెల్త్‌ పాడు చేసుకోవాలి? పైగా రోడ్డు మీద అడుగు పెడితే చాలు విపరీతమైన కాలుష్యం.  ఇవన్నీ కాదు...సినిమాకు వెళ్లామే  అనుకుందాం. మనం వెళ్లేసరికి షో మొదలైపోతుంది. టికెట్లు చించిన తరువాత...లోపలికి  వెళ్లగానే చిమ్మ చీకటి. మన సీటు వెదుక్కోవడానికి నరకం కనబడుతుంది. పొరపాటున ఆ చీకట్లో ఎవడో ఒకడి కాలును తొక్కుతాం. వాడు తిట్టడం మొదలు పెడతాడు. మేమేం కావాలని తొక్కలేదు అని మనం అంటాం... అయినా సరే వాడు వినిపించుకోడు. గొడవ మొదలవుతుంది. అది పెరిగి పెద్దదవుతుంది. ఈలోపు గేట్‌కీపర్‌ వచ్చి ఇద్దర్నీ తిడతాడు. ఆ తరువాత సీట్లో కూర్చొని సినిమా చూస్తుంటాం.

అదేంటో సినిమా కనిపించి చావదు... ఇంతకు ముందు జరిగిన గొడవే కనిపిస్తుంటుంది. నాన్న.... ఇదంతా అవసరమా?’’ అన్నారు.‘‘సినిమాకు వెళదాం అన్న పాపానికి ఇంత పెద్ద స్పీచా?’’ అన్నాను. ఆయన గట్టిగా నవ్వారు. ఆయన నవ్వులోని అందాన్ని ఆస్వాదించడం తప్ప ఏంచేయగలం? ఒకరోజు మాత్రం నన్ను పిలిచి...‘‘నాన్నా... ఈవెనింగ్‌ అలా సరదాగా బయటికి వెళ్లాలనిపిస్తుంది. నీకు ఓకేనా?’’ అన్నారు నాన్న  ఎన్నడూ లేనిది. ‘‘నాకేంటి నాన్న...మన ఇంట్లో వాళ్లందరికీ ఓకే. మా ఫ్రెండ్స్‌కు కూడా ఓకే. అందరం మీతో పాటు వస్తాం’’ అన్నాను ఉత్సాహంగా. సాయంత్రం ఎక్కడెక్కడికి వెళ్లాలి, ఏంచేయాలి అనే ప్రణాళిక పది నిమిషాల్లో రెడీ అయిపోయింది.

సరిగ్గా మేము బయటికి వెళ్లే సమయానికి సన్నగా వర్షం మొదలైంది. కాస్త ఆగి వెళదాం అనుకున్నాం. ఈలోపే అది భారీ వర్షం అయింది. మా పర్యటన క్యాన్సిల్‌ అయింది. ‘‘మీకే కాదు....ఆ వాన దేవుడికి కూడా మీరు బయటకు వెళ్లడం ఇష్టం లేనట్లు ఉంది!’’ అని అమ్మ మూతి ముడిచింది. అందరం నవ్వాం. ఈలోపు మా అన్నయ్య కొడుకు పింటుగాడు ఇలా మొదలెట్టాడు... ‘‘ఎందుకు నాన్న బయటకి వెళ్లడం. బయటికి వెళితే వర్షం వస్తుంది. వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుంది. బిల్లు తడిసి మోపెడవుతుంది....’’ మళ్లీ అందరం నవ్వాం. ఆరోజు... బయట నీళ్ల వర్షం ఇంట్లో నవ్వుల వర్షం!

– మల్లారం శ్రీకాంత్, హైదరాబాద్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top