మండన మిశ్రుడు

Special Story Written By Neeti Suryanarayana Sharma In Funday On 17/11/2019 - Sakshi

నేతి సూర్యనారాయణ శర్మ

మాహిష్మతిలో మండనమిశ్రుని గృహం రాజప్రాసాదాన్ని తలపిస్తోంది. చుట్టూ ప్రాకారానికి శిలాతోరణాలున్నాయి. వాటిని దాటుకుని లోనికి వెళితే విశాలమైన ఆవరణ. దూరదూరంగా విభిన్నమైన వేదికలున్నాయి. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి, సభా సమావేశాలకు, గోశాలకు ఏర్పాట్లున్నాయి. ఆవరణకు సరిగ్గా మధ్యలో ఉన్న మండువా లోగిలి మండన మిశ్రుని ప్రధాన నివేశన గృహం. చూరుకు కట్టిన ధాన్యపు కంకులను మేయడానికి శుకపికాలు చేరాయి. అవన్నీ మాటలాడ నేర్చినవి.
స్వతః ప్రమాణం... పరతః ప్రమాణం
ఫలప్రదం కర్మ ఫలప్రదోషః
జగద్ధ్రువం స్యాజ్జగ దద్ధ్రువం స్యాత్‌... వేదాలు అపౌరుషేయాలు అవునా కాదా... కర్మ ఫలాన్నిచ్చేవాడు భగవంతుడేనా... మానవుడు నిర్వహించే కర్మలకు దానంతట అదే ఫలం వస్తున్నదా... జగత్తు నిత్యమేనా... కాదా... ఇవీ ఆ చిలుకలు, గోరువంకల చర్చల్లోని ముఖ్యాంశాలు. భరతభూమికి నాలుగు చెరగుల నుంచి ప్రతినిత్యం  మహాపండితులెందరో మండనమిశ్రుని వద్దకు వస్తుంటారు. వారితో ఆయన జరిపే చర్చల్లో నిత్యం దొర్లుతున్న మాటలనే ఆ పక్షులు కూడా వల్లిస్తున్నాయి. పంచాదిలో కొంతమంది శిష్యులు పాఠాలు వల్లె వేసుకుంటున్నారు.
‘‘అబ్బాయిలూ! మండన మిశ్రుల వారున్నారా?’’ ప్రశ్నించారు శంకర శిష్యులు.
‘‘ఉన్నారండీ. ఈవేళ వారింట పితృకార్యం. ఈ సమయంలో వారు యతులను చూడరు. ఎవరికీ భిక్ష ఇవ్వరు. దయచేసి పైకి వెళ్లండి’’ అని సమాధానమిచ్చాడో శిష్యుడు.
వారిమాటలింకా పూర్తికాకముందే శంకరుడు ఒంటరిగా పెరటివైపు మళ్లాడు. మండన మిశ్రుని శిష్యులు వెళ్లవద్దంటూ వారించబోయారు కానీ, ఆయనను ఆపడం వారికి సాధ్యం కాలేదు.
మండన మిశ్రునికి పరమ గురువు జైమిని మహర్షి. ఆయనను, ఆయన గురువైన  వ్యాసుణ్ణి భోక్తలుగా నియమించుకుని మండనుడు పితృకార్యం నిర్వహిస్తున్నాడు. వాళ్లిద్దరికీ కాళ్లు కడగడం కోసం అప్పుడే పెరటిౖ వెపుకు వచ్చాడు. అటువంటి సమయంలో కాషాయ వస్త్రాలతో సంన్యాసి దర్శనం కావడంతో భగ్గుమంటూ మండిపడ్డాడు మండనుడు.
‘‘కుతో ముండీ?... ఏయ్‌ బోడీ! ఎక్కడి నుంచి ఊడిపడ్డావ్‌?’’ అన్నాడు నిప్పులు కురిపిస్తూ. 
ఆ మొరటు సంబోధనకు అంతే పెడసరంగా ‘‘ఆగళాన్ముండీ... నేను కంఠం వరకే ముండిని. అక్కడివరకే గొరిగించుకున్నాను’’ అని సమాధాన మిచ్చాడు శంకరుడు... ‘కుతో’ అన్న పదానికి ఎక్కడివరకూ అన్న అర్థాన్ని స్వీకరిస్తూ.
‘‘శిఖా యజ్ఞోపవీతాలను విడిచిపెట్టి నున్నగా గొరిగించుకోవడానికి సిగ్గేయడం లేదూ? ఎందుకీ అపమార్గం పట్టావ్‌?’’ అన్నాడు మండన మిశ్రుడు. 
‘‘నేనూ అదే అడుగుతున్నాను. మహాశాస్త్ర పారంగతుడివి కదా! నువ్వెందుకిలా అపమార్గం పట్టావ్‌?’’
‘‘అసందర్భం’’ విసుక్కున్నాడు మండనుడు. ‘‘భార్యను పోషించుకునే సామర్ధ్యం లేక ఇల్లూ వాకిలి వదిలిపెట్టిన బైరాగి వాళ్లు మాకు బోధించాల్సిన అవసరం లేదు. కాషాయ దండాలు ధరించగానే అందరూ సాగిలపడి మొక్కుతారని అహంకరిస్తారు. ధర్మాధర్మాలను విసర్జించి విచ్చలవిడి తనానికి తెరతీస్తారు. ఎవరికి తెలియని కథలు’’ మరీ విసురుగా తిట్టిపోస్తున్నాడు మండన మిశ్రుడు.
అతడి ఉరవడిని ధిక్కరిస్తూ, ‘‘కాముకులే గృహస్థాశ్రమంలో మగ్గిపోతారు. ఆత్మతత్త్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించరు’’ అన్నాడు శంకరుడు.
‘‘అగ్నులను విడిచిపెట్టినవాడు వీరహత్య చేసినవాడితో సమానం’’ అన్నాడు మండనుడు వేదప్రమాణంతో.
‘‘పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోనివాడు ఆత్మహత్యను చేసినవాడే’’ని అదే వేదప్రమాణం వినిపించాడు శంకరుడు.
‘‘మత్తెక్కినవాడిలా విపరీతార్థాలు తీస్తున్నావ్‌. కల్లు తాగి వచ్చావా?... అహో! పీతా కిము సురా?’’ అని ప్రశ్నించాడు మండనుడు.
ఆ మాటకు మరో విపరీతార్థం తీసిన శంకరుడు, ‘‘కల్లు ఎక్కడైనా పచ్చగా ఉంటుందా?! నాకు దాని వర్ణం తెలుసు. రుచి మాత్రం నీకు బాగా తెలిసినట్లుగా ఉంది’’ అన్నాడు మాటకు మాటా అంటిస్తూ.
ఇద్దరూ ఒకరికొకరు తీసిపోరు. ఎవ్వరూ వెనక్కు తగ్గడం లేదు. అంతకంతకూ తగాదా ముదిరి పాకాన పడుతోంది. ఆ సమయంలో జైమిని మహర్షి అడ్డుపడ్డాడు. 
‘‘ఆర్య మండనమిశ్రా! నీవు చేస్తున్నది పితృయజ్ఞం. ఈ సమయంలో ఇటువంటి సంభాషణ కూడదు. వచ్చినవాడు మహాపురుషుడు. మాతో పాటు అతడిని కూడా అర్చించు. మీ విభేదాలను తరువాత పరిష్కరించుకోవచ్చు’’ అన్నాడు. 
మండనుడు పడగ దించాడు. బుసలు వదిలేశాడు. కొద్దిగా నవ్వుముఖం తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. శంకరునికి పాద్యం సమర్పించి అర్చించడానికి సిద్ధపడ్డాడు.
చతుర్ముఖ బ్రహ్మ కలియుగంలో శంకరావతార సమయంలో మండన మిశ్రునిగా అవతరించాడని ప్రతీతి. అతడు విష్ణు సన్నిభుడైన వ్యాసుణ్ణి పితృస్థానంలోనూ, జైమిని మహర్షిని విశ్వేదేవ స్థానంలోనూ ఉంచి అర్చించాడు. శంకరుని కోసం నారాయణ స్థానాన్ని కల్పించాడు. పితృకార్యం పూర్తయింది. చివరిలో భోక్తలకు దక్షిణ తాంబూలాది సత్కారాలు అందిస్తున్నాడు మండనుడు. 
శంకరుడు వాటిని అందుకోకుండా, ‘‘ఇవి వద్దు. నాకు వాదభిక్ష కావాలి’’ అన్నాడు.
మండనుడు కన్నులెగరేసి పరిహాసంగా నవ్వాడు. ‘‘ఈ మండనుడంటే సహస్రముఖుడైన అనంతుడు తెలుసా? వాదానికి వచ్చినవాడు ఎవడైనా కానీ ఓడిస్తాడు కానీ, జితోస్మి అని పలుకనే పలుకడు. చూస్తుంటే పదహారేళ్లైనా నిండినట్లు లేదు. అబ్బాయీ! ఎందుకొచ్చిన రభస? చేతిదాకా వచ్చిన ఈ భిక్ష తీసుకుని వెళ్లిపో’’ అన్నాడు.
శంకరుడు అంగీకరించలేదు. ‘‘సంసార తాపాన్ని పోగొట్టి పరమానందాన్ని అందించేది జ్ఞానమార్గమొక్కటే. నీవు దానిని తిరస్కరించావు. కర్మపరతంత్రుడివైనావు. జ్ఞానమార్గం నీబోటి వారినెందరినో పరాభవించి రాజమార్గంగా నేడు వెలుగొందుతోంది. నువ్వూ ఈ మతాన్ని అంగీకరించు. లేదా వాదానికి పూనుకో’’ కవ్వించాడు. 
‘‘నీ వాదానికి ప్రమాణాలేమిటి?’’ గంభీరంగా అడిగాడు మండనుడు.
‘‘వేదాంతభాగాలైన ఉపనిషత్తులే’’ అని సమాధానమిచ్చాడు శంకరుడు.
ఆ మాటతో అప్పటివరకూ శంకరునిపై తానేర్పరుచుకున్న దురభిప్రాయాన్ని వదులుకున్నాడు మండనుడు. మేఘగర్జనలాంటి గళంతో కన్నులింతలు చేసి, ‘‘వేదసమ్మతమైన కర్మమార్గాన్ని అనుసరించడమే నా మతం. జైమిని మహర్షి నాకు పరమ గురువు. దానిని కాదని, జ్ఞానమే గొప్పదంటూ మీ ఉపనిషత్తులు కొత్తగా కల్పించిన మతాన్ని అంగీకరించే ప్రశ్న లేదు’’ అన్నాడు. 
‘‘అయితే వాదానికి సిద్ధపడు’’ రెట్టించాడు శంకరుడు.
‘‘మంచిది... నీతో వాదానికి నేను సిద్ధమే. కానీ జయాపజయాలను నిరూపించి చెప్పే సమర్ధుడైన మధ్యవర్తి లేని వాదం వృధాయే అవుతుంది కదా! వాది ప్రతివాదులకు కంఠశోషనే మిగుల్చుతుంది కదా! మన వాదానికి మధ్యవర్తులెవ్వరు?’’ అని ప్రశ్నించాడు మండనుడు. 
అందుకు శంకరుడు సమాధానం చెప్పేలోగానే, ‘‘మీరిద్దరే న్యాయనిర్ణేతలుగా ఉండాలని నా ప్రార్థన’’ అన్నాడు వ్యాస జైమినులను ఉద్దేశించి మండన మిశ్రుడు.
కానీ అప్పటికే తిరుగుప్రయాణమైన మహర్షులిద్దరూ నిలిచిపోవడానికి అంగీకరించలేదు. ‘‘ఆర్యా! నీ భార్య సాక్షాత్తూ సరస్వతియే. ఆమె మధ్యస్థురాలిగా మీ గెలుపు ఓటములను నిశ్చయించగలదు’’ అని సమాధానమిచ్చారు. 
‘‘సరే... ఓ యతివరా! నేటికి మూడోనాడు మన వాదం ప్రారంభిద్దాం’’ అన్నాడు మండన మిశ్రుడు. ఆ మాటతో వ్యాస జైమినులతో పాటుగా శంకరుడు కూడా అక్కడి నుంచి నిష్కమ్రించాడు.   
ఆషాఢ శుద్ధ పంచమినాడు ప్రారంభమైన లోకోత్తరమైన సంవాదానికి మండనమిశ్రుని గృహమే వేదిక అయింది. మండనమిశ్రునితో ఆచార్య శంకరులు తలపడ బోతున్నారు అన్న వార్త గాలికంటే వేగంగా వ్యాపించింది. ఎక్కడెక్కడి నుంచో విభిన్న వర్గాలకు చెందిన పారిషదులు అక్కడ గుమికూడారు. 
శంకరుడు ప్రవేశించి, ఆసనం స్వీకరించాడు. ఆయనకు ఎదురుగా మండనమిశ్రుడు ఆసీనుడయ్యాడు.
గృహాంతరం నుంచి ఉభయభారతి వెలికి వచ్చింది. ఆమెను సింహద్వారం నుంచి వేదిక వద్దకు మహాకవి కాళిదాసు తోడ్కొని తెస్తున్నాడు. అటు శాస్త్ర పాండిత్యంలోనూ, ఇటు లోకవ్యవహారాలలోనూ ఆనాటి భారతీయ సమాజంలో ఉభయ భారతికి సాటిరాగల స్త్రీ లేదని ప్రసిద్ధి. భర్తచాటు ఇల్లాలిగా ఉంటూనే, కుటుంబానికి, పరివారానికి తలలో నాలుకలా ఉంటూనే ఆ తల్లి... దేశవిఖ్యాతమైన పాండిత్య ప్రకర్షనూ ప్రదర్శిస్తోంది. సంగీత సాహిత్యాది కళలలో సైతం ఉభయ భారతి ఒక తీర్మానం చేస్తే దానిని అందరూ మారుమాట లేకుండా సమ్మతించేవారు.
ఆమెను చూస్తుంటే సత్యలోకమే దిగి వచ్చినట్లనిపిస్తోంది. ఒకప్పుడు దుర్వాసుడిచ్చిన శాపాన్ని అనుభవించడానికే సరస్వతి, బ్రహ్మలిద్దరూ ఉభయ భారతి, మండన మిశ్రులుగా అవతరించారని మహాపండితులు చెప్పుకునే వారు. కాళిదాసు వెనుకనే ఉభయ భారతి, ఆ వెనుక వరరుచి సభావేదికకు చేరుకున్నారు. 
వీణ తీగలు సవరించినట్లు ఉభయ భారతి పలికింది. ‘‘ముందుగా ఇద్దరూ వాదప్రతిజ్ఞలు చేయండి. వాదం కోరి వచ్చినవాడు శంకరుడే కనుక ముందుగా ఆయన వంతు.’’ 
‘‘బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. మాయతో కూడిన వాడై పరమాత్మ చేస్తున్న జాలమే జగత్తు. ఆ పరమాత్మకు ఈ జీవాత్మకు భేదం లేదు. రెండూ ఒకటే.  సత్యజ్ఞానాలతోనూ సుఖంతోనూ అనంతమై శోభిల్లే బ్రహ్మపదార్ధాన్ని నేనే. ఈ విషయాన్ని ఉపనిషత్తుల ఆధారంగా చేసుకుని నేను వాదించి నిరూపిస్తాను. నీ చేతిలో ఓడితినా...’’ అని ఒక్కక్షణం ఆగాడు శంకరుడు. 
సభలోని ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. ‘‘నీ చేతిలో ఓడితినా... సంన్యాసం వదిలి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాను’’ అని అసాధారణమైన ప్రతిజ్ఞ చేశాడు శంకరుడు చేశాడు. 
సభలో కలకలం రేగింది. ‘అన్నింటి కంటే గొప్పదైన సంన్యాసాశ్రమంలో ఉన్నవాడు, అద్వైత జయకేతనం ఎగురవేస్తూ ప్రజలందరి నీరాజనాలు అందుకుంటున్న వాడు తాను గృహస్థుగా మారతాను అని చెప్పడం ఎంతటి ఘోరం? పంతానికైనా, సరదాకైనా ఒక సంన్యాసి ఈ విధమైన ప్రతిజ్ఞ చేయవచ్చునా? అటువంటి అమంగళానికి ఇది వేదిక కాకుండు గాక!’ అని ధర్మపరులంతా మనసా కోరుకున్నారు.
తదుపరి మండనమిశ్రుడు ప్రతిజ్ఞ చేశాడు. ‘‘మానవజాతి ఇలాగే మోసపోతోంది. దేనికైనా వేదమే ప్రమాణం. వేదాన్ని అర్థం చేసుకోవడంలో ఎవరేమి వక్రభాష్యాలు చెప్పినా నమ్మకూడదు. వాటిని యధాతథంగానే స్వీకరించాలి. దాన్నే ఆచరించాలి. అప్పుడే కర్మ ప్రయోజనం నెరవేరుతుంది. ఫలసిద్ధి లభిస్తుంది. ముక్తిసాధనకు కర్మకాండను మించినది లేదు. ఈ విషయాన్ని నేను వేదాల ఆధారంగా వాదిస్తాను. నీ చేతిలో ఓడితినా... ఈ శిఖోపవీతాలు తీసివేసి కాషాయం ధరించి నీకు శిష్యుడనవుతాను’’ అని మండనుడు ప్రతిజ్ఞ చేశాడు.
ఉభయ భారతి నెమ్మదిగా కన్నులెత్తి భర్తను చూసి, ఒక్కక్షణంలోనే చూపు తిప్పేసింది. అప్పటికే అక్కడ రెండు పూలదండలు సిద్ధం చేయబడి వున్నాయి. ఆ ప్రతిజ్ఞల తర్వాత ఆ రెండింటిలో ఒకటి మండన మిశ్రుని గళసీమను అలంకరించింది. రెండో మాలిక శంకరుణ్ణి సేవిస్తోంది.  
‘‘మీ వాదన ప్రారంభించవచ్చు. ఇది కొనసాగినన్ని రోజులూ మీ ఇద్దరి మెళ్లలోనూ పూలమాలలు ఉండాలి.  ఈ పూలమాలలు ఇద్దరూ ధరించి ఉండాలి. ఎవరి మెడలో పూలు వాడిపోతాయో వారు ఓడిపోయినట్లు లెక్క. రెండోవారు విజేత అవుతారు’’ అని ప్రకటించింది. 
వాదనకు దిగిన వారిద్దరితోపాటు సభలోని వారంతా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉభయ భారతి మెల్లగా అక్కడినుంచి కదిలింది. వాదనలతో ప్రమేయం పెట్టుకోకుండా తనవైన బాధ్యతల్లో మునిగి పోయింది. మహాకవి కాళిదాసు, వరరుచి ప్రేక్షకులలోనే ఉన్నారు. మాహిష్మతీ పాలకుడైన అమరుకుని కొలువునుంచి ఎవరూ వచ్చిన జాడలేదు. ఎలా తెలుసుకున్నారో కానీ, ఎక్కడినుంచి వచ్చారో తెలియదు కానీ కొందరు బౌద్ధులు కూడా సభలో ఓ ప్రక్కగా చోటుచేసుకుని కూర్చుని ఉన్నారు.   
శంకర మండనమిశ్ర సంవాదం ఆసక్తికరంగా మొదలైంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top