బతుకు తీపి

Special Story By Simhaprasad On 26/01/2020 In Funday - Sakshi

సింహప్రసాద్‌

‘నా మీద పిడికెడు సానుభూతి చూపని ప్రపంచమా, గుడ్‌బై ఫరెవర్‌!’ ఆఖరిసారిగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ అనుకున్నాడు చిట్టిబాబు.
నది ఒడ్డున ఎల్తైన బండమీద నిలబడి, గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని దూకబోయేంతలో, ‘‘ఏమోయ్‌’’ అని పిలిచాడో బట్టతల పెద్దాయన.
నుదురు చిట్లించి చిరాగ్గా చూశాడు. నోట్లో చుట్ట పెట్టుకుని జేబులు తడుముకుంటున్నాడాయన.
‘‘నా దగ్గర అగ్గిపెట్టె లేదు’’ ముఖం చిట్లించి చెప్పాడు చిట్టిబాబు.
నవ్వాడాయన. ‘‘నిండా ఆరిపోయిన వాడివి. నీలో ఫైర్‌ ఉందనుకోవట్లేదులే’’ అంటూ, జేబులోంచి తాపీగా అగ్గిపెట్టె తీసి, గీసి, చుట్ట అంటించుకున్నాడు.
విసుగ్గా చూసి అన్నాడు ‘‘మీరు పిలవకపోయి ఉంటే ఈపాటికి చచ్చుండే వాణ్ణి’’
‘‘రెండు నిమిషాలు ఆలస్యమైంది. కొంపలేం మునగలేదుగా. నువ్వూ నేనూ ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. ముందుకు పోతూనే ఉంటుంది గాని, చచ్చి ఏం సాధించాలనుకుంటున్నావో కొంచెం చెప్పవోయ్‌’’
‘‘బతికి చేసేదేముంది?’’
‘‘ఏమైనా చేయొచ్చు. ఎంతైనా సాధించొచ్చు’’
‘‘అది కుదరకే ఛస్తున్నా’’
‘‘నీ చావు నువ్వే చద్దువుగాన్లే గాని, ఎప్పుడైనా పారిజాతం పాకం గారెలు రుచి చూశావుటోయ్‌’’
‘‘లేదు. వాటికీ, నాకూ, నా పరిస్థితికీ ఏవిటి సంబంధం?’’ చిరాగ్గా ముఖం పెట్టుకుని, స్వరం పెంచి నిలదీశాడు.
‘‘ఏదో బాదరాయణ సంబంధం లేకుండా ఎలా ఉంటుంది గానీ, పారిజాతం బెల్లం పాకం గారెలు తినకుండా చచ్చిపోవడం, అబ్బే బొత్తిగా బాలేదోయ్‌. నీకు తెలిసుండదుగానీ, ఈ చుట్టుపక్కల అవసాన కాలంలో గొంతులో ఇన్ని తులసినీళ్లు పోయమని ఎవరూ అడగరు. పారిజాతం గారెల పాకాన్ని నాలిక్కి రాయమంటారు తెలుసా...’’ నాలిక చప్పరిస్తూ అన్నాడాయన.
‘‘నా నోరేం ఊరిపోవట్లేదు. నాకలాంటివి అయిష్టం. అసలు స్వీట్లంటేనే అసహ్యం’’ వికారంగా ముఖం పెట్టి మరీ అన్నాడు.
‘‘బతుకంటే అసహ్యం అను. ఒప్పుకుంటాను. బతకడం పరమ అసహ్యం అను. అదీ ఒప్పుకుంటాను. పారిజాతం పాకం గారెల్ని తీసిపారేస్తే ఊరుకోనోయ్‌...’’
‘‘ఏంటి వాటి గొప్ప?’’
నవ్వాడాయన. ‘‘తింటేనే కదా ఆ రుచీ, ఆ యవ్వారం తెలిసేది! నువ్వోసారి తిన్నావే అనుకో, అహ అనుకో, నువ్వు పోయాక స్వర్గానికెళితే గిళితే, అక్కడ అమృతం పోస్తే గీస్తే, దాని రుచి కన్నా మా పారిజాతం పాకం గారెలే యమ యమగా ఉన్నాయని అరిచి గీపెడతావు!’’
‘‘అంత మహారుచిగా ఉంటాయా?’’
‘‘వాటి ముందు అమృతం దిగదుడుపు అని చెబుతుంటే చెవికెక్కించుకోవేం? నన్నడిగితే పాకం గారెలు– ఏదీ పారిజాతం బెల్లం పాకం గారెలు రుచి చూడని లైఫ్‌ పరమ వేస్ట్‌. మళ్లీ పుట్టినా, ఆ లైఫూ వేస్టే!’’
అపనమ్మకంగా చూశాడు. సందేహంగా చూశాడు. పిమ్మట అటూ ఇటూ ఊగాడు చిట్టిబాబు.
ఎలాగూ చచ్చిపోతున్నప్పుడు ఈయన చెప్పిన ఆ గారెలేవో రుచి చూసి పోతే?
జేబులో చెయ్యి పెట్టి డబ్బులు బయటికి తీశాడు. అయిదు రూపాయల చిల్లర ఉంది.
ఇవెలాగూ వేస్టే అవుతాయి. పోనీ వెళ్లి ఒక్కటైనా పాకం గారె తినేసి వచ్చి తృప్తిగా చనిపోతే?
‘‘ఆ పాకం గారెలు ఎక్కడ దొరుకుతాయి?’’
‘‘పారిజాతం పాక హోటల్లో’’
‘‘అదెక్కడుంది?’’
‘‘క్రిష్ణాపురంలో’’
‘‘అది ఎక్కడుంది?’’ విసుక్కుంటూ అడిగాడు.
‘‘ఒకప్పుడది చిన్న ఊరు. ఇప్పుడు దాన్ని ఈ నగరం మింగేసింది. ఇందులో ఓ పేట అయిపోయింది’’ బాధగా చెప్పేడు.
‘‘అక్కడికెలా వెళ్లాలి?’’
‘‘అదిగో ఆ రోడ్డంట తిన్నగా ఫో, ఆ దరిదాపులకెళ్లగానే బెల్లం పాకం గారెల ఘుమఘుమలు నీ ముక్కు పట్టుకుని మరీ లాక్కెళతాయి’’
‘‘అంత గొప్పవంటారు?’’
‘‘రుచి చూసిన నాలుక అబద్ధమాడదు’’
కాసేపు వెనకా ముందూ ఊగాడు. దిక్కులు చూశాడు. ‘ఒక గంట ఆలస్యమైతే నష్టమేమీ లేదులే’ అనుకున్నాడు. బండ దిగి రోడ్డెక్కాడు చిట్టిబాబు.
క్రిష్ణాపురం దరిదాపుల్లోకెళ్లేసరికి ఒక పాక హోటల్లోంచి తీయని మధురమైన వాసన వచ్చి అతడ్ని ముంచెత్తింది. గబగబా లోపలికి నడిచాడు.
లోపల చాలామంది లొట్టలేసుకుంటూ తింటున్నారు. మాటా మంతీ లేకుండా ఆరగింపు ఆనందాన్ని దోసిళ్లతో జుర్రుకుంటున్నారు.
నోరు లాలాజలంతో నిండిపోగా మింగేసి, ధరల పట్టిక కోసం చుట్టూ చూశాడు. అలాంటిదేమీ కనిపించలేదు.
‘‘నిలబడే ఉన్నావేం, కూర్చో అబ్బీ’’ అంది గారెలు వేస్తున్న పారిజాతం.
ఆమె నల్లగా ఉంది. ఎత్తుగా ఉంది. వయస్సు నలభై ఏళ్ల లోపలే ఉంటుంది. నవ్వు ముఖం. రూపాయి బిళ్లంత ఎర్రని బొట్టు. జుట్టు పొడవు కాబోలు పెద్ద ముడి వేసుకుంది. చీర గోచి పోసి కట్టుకుంది.
ఆమెలో, ఆమె చూపులో, ఆమె మాటలో ఏవో చాలా ప్రత్యేకతలు ఉన్నాయనుకొంటోంటే ఆమె అతడి దగ్గరికొచ్చింది.
‘‘పాకం గారెలు తింటావా అబ్బీ’’
తల నిలువుగా ఆడించాడు.
‘‘మరి కూర్చో. కూచోడానికి కర్సునేదులే...’’ నవ్వింది.
ఆ నవ్వు ముచ్చటగొల్పగా అడిగాడు. ‘‘ప్లేటు ఎంత?’’
‘‘రెండూ నాలుగు రూపాయలు’’
‘‘ఒక ప్లేటిస్తావా’’
‘‘బంగారంలాగా ఇత్తాను, కూర్చో అబ్బీ..’’ మూకుట్లోంచి గారెలు మాడిపోతున్నాయని గబగబా వెళ్లింది.
దిక్కులు చూస్తూ చతికిలబడ్డాడు.
ఆకులతో కుట్టిన దొప్పలో రెండు పాకం గారెలు, ఇంత పాకంతో తెచ్చిచ్చింది పారిజాతం. చిన్న వెదురు స్పూను కూడా ఉంది.
చిన్న ముక్క కట్‌ చేసి ఆబగా నోట్లో వేసుకున్నాడు.
ఆ అద్భుత రుచికి నాలుక మురిసిపోయింది. ‘అబ్బో... ముసలాయన చెప్పినట్లు చాలా బావుందే’ అనుకున్నాడు. మరో ముక్క నోట్లోకి వెళ్లగానే ‘వావ్‌ అద్భుతం’ అనుకున్నాడు. ఒక్కో ముక్కకీ ‘వావ్‌’ పెరిగిపోతూ పోతూ పోతూ ఉండగా గారెలు మరి మిగల్లేదు. దొప్పలో మిగిలిన పాకాన్ని నోట్లో పోసుకున్నాడు.
చిట్టిబాబుకి చాలా అసంతృప్తిగా అనిపించింది. ఇంకో రెండు తినమని మనస్సు గోలగోల చేస్తోంది. అన్ని జేబుల్లో చెయ్యి పెట్టి మళ్లీ మళ్లీ వెతికాడు. ఎన్నిసార్లు లెక్కవేసినా అయిదు రూపాయలే ఉన్నాయి.
నాలుగు రూపాయలిచ్చాడు.
‘‘నచ్చినాయా అబ్బీ’’ అడిగింది పారిజాతం.
‘‘అమృతం’’
‘‘అయితే బతికిత్తాది’’
నుదురు ముడివేసి చూశాడు. తృప్తిగా నడుచుకుంటూ వెళ్లి తన పనిలో నిమగ్నమైపోయింది. ఆమె యథాలాపంగా అన్నదో, కావాలనే అన్నదో తేల్చుకోలేకపోయాడు.
చేతిలో మిగిలిన రూపాయి వంక జాలిగా చూశాడు.
అది రెండు రూపాయలుగా మారితే ఎంత బావుణ్ణు. ఇంకొక్క పాకం గారె తినేవాడు ప్చ్‌..!
పోనీ, ఆ రూపాయి రేపిస్తానంటే?
ఉలిక్కిపడ్డాడు. రేపు తనే ఉండడు. పోయే ముందు అంత దారుణమైన అబద్ధం ఎలా ఆడగలడు?
మౌనంగా హోటల్లోంచి బయటికి నడిచాడు. పాకం గారెల సుమధుర వాసన ఊరిస్తోంది. కళ్లెం వేసి బలంగా వెనక్కి లాగుతోంది!
ఉహు. లాభం లేదు. ఎలాగైనా ఇంకో రూపాయి సంపాదించాలి. ఇంకో పాకం గారె తిన్నాకే చచ్చిపోవాలి.
లేకపోతే ఇది తీరని కోరికై జన్మజన్మలకూ వెంటాడుతుంది. వేధిస్తుంది!
నడుస్తూ నడుస్తూ సెంటర్లోకెళ్లాడు. అప్పుడప్పుడే చీకటి పడుతోంది. మెల్లగా బడ్డీ దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఆ పక్కనే గల బ్రాందీ షాపు ముందు సీసాల కోసం జనం తోసుకుంటూ ఎగబడుతున్నారు.
అటూ ఇటూ చూశాడు. ఎవరైనా పిలిచి, ఏదైనా చిన్న పని చెప్పి, మూడు రూపాయలు– కనీసం ఒక్క రూపాయి ఇస్తే బావుణ్ణు!
ఆశగా దిక్కులు చూస్తుంటే, ఒక మాంసం పకోడీల బండి అతను పిలిచాడు. ‘‘ఇదిగో నిన్నే. ఖాళీగా ఉంటే కాసేపు సాయం రాకూడదూ. నీ కష్టం ఉంచుకోన్లే. ఒంట్లో బాగోక మా ఇంటిది రాలేదు’’
తలాడిస్తూ వెళ్లాడు చిట్టిబాబు.
అతడు చకచకా కోడిమాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోశాడు. కడిగాడు. ఉప్పు కారం మసాలా కలిపి పిసికాడు. గిన్నెలోని శనగపిండితో వాటిని కలిపి నీరు పోసి బాగా కలిపాడు. మూకుడులో పోసిన నూనె మరగగానే పకోడీలు వేశాడు.
జనం మెల్లగా రాసాగారు.
తూకం వేసి, పకోడీలు పొట్లం కట్టి ఇచ్చే బాధ్యత చిట్టిబాబుకి అప్పగించాడు. పకోడీలు వేయడం, డబ్బు తీసుకోవడం తను చేసుకోసాగాడు.
గిరాకీ పెరిగింది. చకచకా చక్కబెట్టసాగారిద్దరూ.
రాత్రి పది గంటలదాకా సాగింది వ్యాపారం. మిగిలిపోయిన పకోడీలు తినమని ఇచ్చాడు. తిన బుద్ధి కాలేదు చిట్టిబాబుకి. జిహ్వ పారిజాతం పాకం గారెల కోసం అర్రులు చాస్తోందాయె!
అతడు ఇరవై రూపాయలు చేతిలో పెట్టి, ‘‘కాలీగా ఉంటే రేపూ రా’’ అన్నాడు.
తల అడ్డంగా ఊపి, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ పారిజాతం హోటల్‌కెళ్లాడు. మూసేసి ఉంది. అంతులేని నిరాశ ఆవరించింది. దిగాలు పడ్డాడు.
ఇప్పుడేం చేయటం?
తిన్నగా నది దగ్గరికెళ్లి దూకేసి చచ్చిపోవడమా, లేక రేపటి దాకా బతికుండి పాకంగారెలు తిన్నాక తృప్తిగా చనిపోవడమా?
మనస్సు, చేతిలోని డబ్బు, నాలుక– ముప్పేటగా రెండోదానికే ఓటు వేశాయి.
ఉస్సురని నిట్టూర్చి, కాళ్లీడ్చుకుంటూ ఇంటికెళ్లాడు. ఇల్లంతే ఒక చిన్న గది. అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
ఖాళీ రూము నోరు తెరచి అమాంతం మింగేయడానికి కాచుక్కూర్చున్న కొండచిలువ నోరులా అనిపించింది.
‘ఇంకొక్క రోజు... ఒక్క రోజు... ఈ నరకంలో ఉండక తప్పదు’ అనుకుంటూ గోడ మూలకెళ్లి కాళ్లు ముడుచుకుని పడుకున్నాడు.
బారెడు పొద్దెక్కేక లేచాడు చిట్టిబాబు.
ముఖం కడుక్కోవడం ఆలస్యం పారిజాతం హోటల్‌కి పరుగెత్తాడు.
అతడ్ని చూస్తూనే విప్పారిన మొహంతో మందహాసం చేసింది. ‘‘రా అబ్బీ’’ అని ఆహ్వానించింది.
‘‘రెండు ప్లేట్లు..’’ ప్లేటుకీ ప్లేటుకీ మధ్య విరామం భరించలేనన్నట్టు ఒకేసారి చెప్పాడు.
పారిజాతం ఆశ్చర్యపోలేదు. తెచ్చిచ్చి, అతడి తల నిమిరి ‘‘చల్లగా ఉండు బిడ్డా’’ అంది.
యమాశ్చర్యబోయాడు చిట్టిబాబు.
అలాగ అందేమిటి? తను చచ్చిపోబోతున్నట్టు ఈవిడ సిక్స్‌›్తసెన్స్‌ చెప్పిందా?
కలవరపడ్డాడు. కంగారుపడ్డాడు. తలొంచుకుని గబగబా తిన్నాడు.
క్రితం రోజు కన్నా మరింత మధురంగా, రెట్టింపు తీయగా అనిపించింది. 
‘‘ఇదేం చిత్రం. రోజురోజుకీ రుచి పెరిగిపోతోందేవిటి. ఇవి రోజూ తినడం కోసమైనా ఇంకా ఇంకా బతికితే బావుణ్ణు’– అనిపించిందో క్షణం.
బెల్లం పాకం పూర్తిగా నాకినట్టు ఊడ్చుకుని తినేశాడు. అయినా పూర్తిగా సంతృప్తి పడలేకపోయాడు. 
‘‘ఇంకో ప్లేటియ్యి..’’
వేగిన గారెల్ని బెల్లం పాకంలో వేస్తోందల్లా తలెత్తి ఆరాగా చూసింది. ఆ పని అవుతూనే లేచి వచ్చింది పారిజాతం. ‘‘ఒక్కసారే ఎక్కువ తింటే మొహం మొత్తుతుంది. రేపు తిందూగాన్లే’’
‘‘రేపు?’’ దిగ్భ్రమగా అన్నాడు.
‘‘రేపంటే ఆశ అబ్బీ’’
చిద్విలాసంగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు కనిపిస్తోంటే భుజాలు తడుముకున్నాడు చిట్టిబాబు. డబ్బిచ్చి బయటపడబోతూ పారిజాతాన్నీ, హోటల్నీ, పాకం గారెల్నీ ‘ఇదే ఆఖరిసారి’ అనుకుంటూ చూసి, నిట్టూర్చాడు.
‘‘ఏమోయ్‌’’
హోటల్‌ బయట బెంచీ మీద పేపర్‌ చదువుతోన్న నిన్నటి పెద్దాయన పిలిచాడు. ఆయన్నక్కడ చూసి ఉలిక్కిపడ్డాడు. దొరికేసిన దొంగలా ఫీలయ్యాడు. లోలోపల తిట్టుకుంటూనే సమీపించాడు చిట్టిబాబు.
‘‘రా, కూర్చో. పారిజాతం పాకం గారెలు రుచి చూశావా?’’
అవునన్నట్టు తలాడించాడు.
‘‘నచ్చాయా’’
లేదని అబద్ధమాడదామనుకున్నాడు గాని సాధ్యం కాలేదు. ‘‘బాగానే ఉన్నాయి...’’
‘‘మళ్లీ రేపు తినాలనిపించట్లేదూ?’’
జవాబు చెప్పలేకపోయాడు. ‘‘వెళ్లాలి. నుంది...’’ లేచాడు.
‘‘నీకూ నాకూ పనులేంటోయ్, కాటికి కాళ్లు చాచుకున్నవాళ్లం! కూర్చో కూర్చో..!’’
అయిష్టంగానే చతికిలబడ్డాడు.
‘‘పారిజాతాన్ని చూశావా? ఎలా ఉంది?’’
‘‘ఆవిడకేం, దివ్యంగా ఉంది. ఆ మనిషికి చీకూ చింతా ఉంటేగా అసలు! వ్యాపారమూ మూడు పువ్వులూ ఆరుకాయల్లాగ ఉంది!’’
‘‘అదంతా ఒక్కరోజులో వచ్చి పడలేదోయ్‌. దాని వెనుక ఎంతో కృషి ఉంది. శ్రమ ఉంది. పట్టుదల ఉంది. అంకితభావం ఉంది’’
‘‘అవన్నీ నాకెందుకు?’’ విసుగ్గా చూశాడు.
‘‘పారిజాతం కథ తెలుసా?’’
‘‘పెట్టి పుట్టింది. ఓ వెలుగు వెలుగుతోంది. అదృష్టవంతురాలు!’’ నిట్టూర్చాడు.
‘‘నువ్వు పై పై మెరుగులు చూస్తున్నావు. లోపలి చిరుగులు చూడటం లేదోయ్‌’’
ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘ఆవిడకన్నా నువ్వే ఎంతో అదృష్టవంతుడివి. చదువుకున్నావు. ఆరోగ్యంగా ఉన్నావు. నీకేం లోటు చెప్పు?’’
విరక్తిగా నవ్వాడు. ‘‘అన్నీ ఉన్నా భవిష్యత్తు లేని నిరుద్యోగిని! దురదృష్టదేవత ముద్దుబిడ్డని!’’
‘‘ఉద్యోగం ఎంతలో వస్తుందిగాని, నాకెందుకో పారిజాతం కథ నీకు చెప్పాలనిపిస్తోందోయ్‌...’’
అతడి ముఖంలోకి ఆసక్తి తోసుకొచ్చింది. చెప్పమన్నట్టు చూశాడు.
‘‘పారిజాతానికి ఊహ తెలీక ముందే తల్లీ తండ్రీ వరదల్లో మునిగి చనిపోయారు. పారిజాతం ఒక దుంగ మీదెక్కి కొట్టుకుపోతోంటే ఒక పుణ్యాత్ముడు రక్షించాడు. ఊరు అక్కున చేర్చుకుంది. ఒక్కోరోజు ఒక్కో ఇంట్లో తినేది. వారాలు చేసుకునేదన్న మాట. ఆయా ఇళ్లల్లో పనీ పాటా చేస్తూ ఎదిగింది. చదువు లేదు గాని శక్తి సామర్థ్యాలున్నాయి. అందంగానూ ఉండేది. నలుగురూ కలిసి సూరిగాడికిచ్చి పెళ్లి చేశారు...’’
‘‘ఆ తర్వాత వాళ్లు సుఖంగా జీవించారు. శుభం’’ నవ్వాడు చిట్టిబాబు.
‘‘అన్ని కథలకూ శుభం కార్డు పడదు. పారిజాతం కథకూ పడలేదు. వాళ్లీ నగరానికి వలస వచ్చారు. సూరిగాడు లారీ డ్రైవరుగా పని చేసేవాడు. మొదట సంసారం చక్కగానే సాగింది. బిడ్డ పుట్టాడు. మురిసిపోయారు. వాడికి అయిదారేళ్లొచ్చాయి. సూరిగాడు ఇంకో ఆడదాన్ని మరిగాడు. ఒకనాడు ఆమెని లేవదీసుకుని ఎక్కడికో పారిపోయాడు. తిరిగొస్తాడని చూసి చూసి నిరాశ పడింది పారిజాతం. కన్నీరు మున్నీరయ్యింది. చచ్చిపోవాలనుకుంది. కాని తననే నమ్మి పుట్టిన బిడ్డకి ద్రోహం చేయడానికి మనస్సు రాలేదు. ధైర్యం కూడదీసుకుంది. తనకి వచ్చిన వంటల్నే వృత్తిగా మలచుకుంది. ఇంట్లోనే గవ్వలు, అరిసెలు, పాకం గారెలు, కారప్పూస, జంతికలు, చేగోడీలు తయారు చేసి అమ్మేది. పాకం గారెల కోసమే జనం మళ్లీ మళ్లీ రావటం చూసి దాని మీదే దృష్టి పెట్టింది. వాటి కోసమే ప్రత్యేకంగా ఈ హోటల్‌ పెట్టింది..’’
‘‘డబ్బు చూసి మగాళ్లు చేరి ఉంటారు. మళ్లీ పెళ్లి చేసుకునుంటుంది. అందుకనే అంత ఆనందంగా వ్యాపారం చేస్తూ ఎడాపెడా సంపాదించేస్తోంది. అంతే కదా?’’
‘‘ఉహు, కాదు. కొడుకే ప్రపంచంగా మలచుకుంది. వాడు చక్కగా చదువుకున్నాడు. పెద్దవాడయ్యాడు. ఉద్యోగమూ వచ్చింది. వాడికి పెళ్లి చేద్దామని చూస్తోంటే ఒకమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. పారిజాతం వాళ్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడింది. కాని వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడుగాని, ఆ అమ్మాయి వీడిని ప్రేమించలేదు. ఆమె ఆ మాట చెప్పేసరికి భరించలేకపోయాడు. నిన్న రాత్రి నువ్వెక్కిన బండమీంచే నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు!’’
అదిరి పడ్డాడు. గుటకలు మింగాడు చిట్టిబాబు. ఎందుకో అతడి వెన్ను జలదరించింది.
‘‘అయినా చనిపోవాలనుకోలేదు పారిజాతం. అంతా పాకం గారెలు సంతోషంగా తింటుంటే, వారిలోనే తన కొడుకునీ, తన ఆనందాన్నీ, భవిష్యత్తునీ చూసుకుంటూ నదిలా నిండుగా ప్రవహిస్తోంది. ఒక్కనాడూ తన కడుపులో దాగి ఉన్న బడబాగ్నుల్ని ఎవరికీ కనపడనీయలేదు. అంతా నువ్వనుకున్నట్టే పారిజాతం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టవంతురాలు అనుకుంటూ ఉంటారు...’’
చిట్టిబాబుకి పారిజాతం గుర్తు రాలేదు. తల్లి ముఖం గుర్తొచ్చింది. బావురుమని ఏడుస్తూ విసవిసా వెళ్లిపోయాడు.
పరుగులాంటి నడకతో రూమ్‌కెళ్లాడు చిట్టిబాబు. పల్లెలోని తల్లి జ్ఞాపకాలు వెంటబడి తరమసాగాయి.
తల్లి, తండ్రి ఇద్దరూ వ్యవసాయ కూలీలే. అన్ని రకాల కూలి పనులూ చేస్తారు. అష్టకష్టాలు పడి తనని పెద్ద చేశారు. చదువు చెప్పించారు. ఉద్యోగం సంపాదించి వస్తాను. మిమ్మల్ని తీసుకెళ్లి సుఖపెడతానని నమ్మకంగా చెప్పి పట్నం వచ్చాడు. ఉద్యోగం రాలేదు. వస్తుందన్న ఆశ ముందే చచ్చిపోయింది. దాంతో తనూ చచ్చిపోవాలనుకున్నాడు. అయినా చిత్రంగా ఇంకో రోజు అదనంగా బతికేశాడు!
తను అర్ధంతరంగా తనువు చాలించినట్టు ఎవరో అమ్మా నాన్నలకి చెబితే, ఇరవై ఏళ్ల ఆశ, కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యాయని తెలిస్తే, గుండె పగిలి మొదలు తెగిన వృక్షంలా..!
‘వద్దు వద్దు. ఆ పిచ్చి ఆలోచనలొద్దు. బతుకు బంధాల తేనెతుట్టను కదపొద్దు. ఈ భూమ్మీద తనీ ఒక్క రోజు అతిథి మాత్రమే. ఈ రాత్రికి ఖాయంగా బకెట్‌ తన్నేస్తాడు!’
చిట్టిబాబు గుండెల్లో ఎగసిపడిన కెరటాలు మెల్లగా శాంతించాయి.
సాయంత్రం దాకా రకరకాల ఆలోచనలు వేధిస్తున్నా పట్టించుకోలేదు. ఆకలినీ లెక్క చేయలేదు.
సాయంత్రమవుతోంటే లేచాడు. రూముకి గడియ పెట్టకుండానే బయటపడ్డాడు.
గుడి ముందు ఆగి, ‘‘నేను హాయిగా చచ్చిపోయేలా దీవించు స్వామీ’’ అని దణ్ణం పెట్టుకుని చెంపలేసుకున్నాడు.
‘నిన్నటి బండ మీంచే నదిలోకి దూకెయ్యాలి! ఎవరు పిలిచినా వెనక్కి తిరిగి చూడకూడదు. వెనుకడుగు వేయకూడదు’ అని తనకి తాను గట్టిగా చెప్పుకున్నాడు చిట్టిబాబు.
బజార్లోంచి వెళ్తూ అప్రయత్నంగా రాత్రి పని చేసిన మాంసం పకోడీల బండి వైపు చూశాడు.
‘‘రా రా టైముకొచ్చావ్‌..’’ అంటూ పిలిచాడు బండి అతను.
పారిజాతం పాకం గారెలు గుర్తొచ్చాయి. నోట్లోకి లాలాజలం ఉరికి వచ్చింది. ఇతడూ పిలుస్తున్నాడు గనుక, ఇవాళ్టికి ఆగి, రేపు పాకం గారెలు ఇంకో ప్లేటు తిని రేపు చచ్చిపోతే?
యాంత్రికంగా బండి వైపు అడుగులేశాడు.
అతడు చిట్టిబాబు చేతే అన్ని సరుకులూ తెప్పించాడు. వేడి వేడి పకోడీలు హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మెదడులోనే లెక్కలేశాడు చిట్టిబాబు. సరుకంతా అమ్ముడైపోతే రెండొందల వరకు మిగుల్తుంది. అంటే నెలకు మినిమం ఆరువేలు!
బాపురే! డబ్బు సంపాదించడం ఇంత తేలికా! ఈమాత్రం సంపాదించలేకే తను లైఫ్‌కి గుడ్‌బై చెప్పాలనుకున్నాడు! డబ్బు కోసం ఉద్యోగమే చెయ్యక్కర్లేదు, వ్యాపారమూ చేయొచ్చు– అన్న ఆలోచన ప్రథమంగా పుట్టి కలవర పెట్టింది.
అన్ని విధాలా దగా పడినా, అందరినీ ఆనందపరుస్తూ సంతోషంగా బతుకుతున్న పారిజాతం పదే పదే గుర్తొచ్చింది.
ఆమె బతకగా లేంది, తనెందుకు బతకకూడదు? ఆమె కన్నా ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తను నిరాశా నిస్పృహల వరదలో పడి ఎందుకు కొట్టుకుపోవాలి? తను బతికి ప్రయోజకుడైతే తన కన్నా అధికంగా సంతోషిస్తారు అమ్మా నాన్నా. తమని ఉద్ధరిస్తాడనుకుంటున్న వారిని వారి కర్మకు వదిలేసి తన దారి తను చూసుకోవడం అన్యాయం! దారుణం! అమానుషం!
ఆ రాత్రంతా మథనపడుతూనే ఉన్నాడు చిట్టిబాబు.
మర్నాడు పారిజాతం హోటల్‌కెళ్లాడు. ఆమె కంటబడేసరికి ఆమె విషాదగాథ గుర్తొచ్చింది. కళ్లు నీళ్లతో నిండిపోయాయి. జాలిగా చూశాడు.
అతడి చూపుల్ని పట్టించుకోలేదామె. ప్లేటు గారెలు అతడి ముందు పెడుతూ అతడ్ని చూసి నుదురు ముడి వేసింది. ‘‘అలా ఉన్నావేంటబ్బీ. ఒంట్లో బాగోలేదా?’’ అంటూ అతడి నుదుటి మీద చెయ్యేసి చూసింది. ‘‘వేడిగా లేదు. తీపి గారెలు తిను. అంతా తీయగా అయిపోద్ది’’ పక్కనే నిలబడి చెప్పింది.
తలొంచుకుని బెల్లం పాకం గారెలు తింటూ అడిగాడు ‘‘నీకెవరూ లేరంట. నిజమేనా పారిజాతం’’
తేలిగ్గా నవ్వేసింది. ‘‘మీరంతా ఉన్నారుగా!’’
దిమ్మెరబోయాడు. ‘‘నీ ఒక్కదాని కోసమే ఇంత కష్టపడుతున్నావా?’’
తీయగా నవ్వింది. ‘‘నీలాంటి ఎందరి మొకాల్లోనో తీయని ఆనందం చూడటం నాకిట్టం. నా తనువిలాగ తీయ తీయగానే గడిచిపోతే శాన!’’
ఆవిడ పెద్ద జీవిత పాఠమేదో చెప్పినట్టు చూశాడు. ఆమెలో గీత బోధించిన కృష్ణుడు కదిలాడు.
మరి పది రోజులు గడిచాక తిన్నగా పారిజాతం దగ్గరికెళ్లాడు చిట్టిబాబు.
పారిజాతం అని పిలవబోయి మింగేసి అన్నాడు ‘‘మీరు కారం అమ్మటం లేదుగా. నేను మీ కొట్టు ముందు మాంసం పకోడీల బండి పెట్టుకోనా?’’
‘‘వద్దబ్బీ. అన్ని కులాల వారూ వస్తారు. ఉల్లి పకోడీలు, పచ్చిమిర్చి బజ్జీలు అమ్ముకో, బాగుంటుంది. బాగుంటావు’’
ఆ సలహా నచ్చింది. ఆమె హోటల్‌ ముందే చిన్న బండి మీద వ్యాపారం మొదలెట్టాడు. పకోడీలు మొదటి వాయ తీయగానే ప్లేటులో పట్టుకెళ్లి పారిజాతానికిచ్చాడు. 
‘‘నాకు కాదు, దేవుడికి పెట్టు’’ అందామె.
‘‘దేవుడికే పెడుతున్నా’’
ప్రేమాభిమానాలతో చూసింది. పకోడీల ప్లేటు అందుకుని ఒకటి కొరికింది.
‘‘చాలా బాగున్నాయి అబ్బీ. నోట్లో వేసుకోగానే కరిగిపోయాయి. ఎప్పటికీ రుచి ఇలానే ఉండేలా చూసుకో. నీకంతా మంచే జరుగుద్ది’’
పారిజాతం మాటలు నిజమయ్యాయి. మరి వెనుదిరిగి చూడలేదతడు.
చిట్టిబాబు వ్యాపారం బాగా పుంజుకుంది. రెండేళ్లు తిరక్కుండా పారిజాతం హోటల్‌ పక్కనే చిన్న పాక హోటల్‌ పెట్టేశాడు. తీపివి తప్ప అన్ని రకాల ఆహార పదార్థాలూ అమ్మసాగాడు.
తల్లిదండ్రుల్ని పల్లె నుంచి తీసుకొచ్చేశాడు. పెళ్లి చేసుకున్నాడు. మరి మూడేళ్లు గడిచాయో లేదో పాక స్థలం కొని చిన్న డాబా కట్టాడు. ‘పారిజాతం తమ్ముడి హోటల్‌’ అని బోర్డు వేలాడదీశాడు.
పాకం గారెల తీపినే గాక, బతుకు తీపినీ రుచి చూపించిన పారిజాతం గారెల్ని రోజూ పొద్దుటే వెళ్లి ఒక ప్లేటు తినడం అలవాటుగా మారింది. జేబునిండా డబ్బు ఉన్నా సరే రెండే రెండు పాకం గారెలు తింటాడు. ఆ మరుక్షణం నుంచే ఆ మర్నాడు తినబోయే మరో ప్లేటు తలచుకుని ఊరిపోతుంటాడు.
సాయంత్రం అయిదు గంటలకు హోటల్‌ కట్టేసి తిన్నగా నది దగ్గరకెళ్లి పెద్ద బండ సమీపంలో కూర్చుంటాడు. ఒకనాడు తను ఆత్మహత్య చేసుకోబోతోంటే ఆపిన పెద్దాయన కనిపిస్తాడేమో, కృతజ్ఞతలు చెబుదామని ఆశగా వెదుకుతాడు. అతడు మరి కనిపించకపోయినా, ప్రతిరోజూ ఎదురు చూస్తూ ఆయనుంటే ఏం చేసేవాడో అదే చేస్తున్నాడు చిట్టిబాబు.
ఎవరైనా పరీక్ష ఫెయిలయ్యో, ప్రేమ విఫలమయ్యో, ఉద్యోగం రాలేదన్న నిస్పృహతోనో, ఆర్థిక ఇబ్బందుల వల్లనో ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడికొస్తే– అలాంటి భావనతో ఊగుతోంటే– వారిని పిలిచి, చేతిలో ఇరవై రూపాయల నోటు కుక్కి, ‘తిన్నగా వెళ్లి పారిజాతం బెల్లం పాకం గారెలు తినిరా, ఫో నాయనా’’ అని పంపిస్తున్నాడు ఇప్పటికీ.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top