సెల్ఫీ ప్లీజ్‌..!

special  story to selfie - Sakshi

నేటికి కొన్నేళ్లు వెనక్కి వెళితే, ఈరోజుకి మనలో భాగమైనవి చాలావరకు ఇలా భవిష్యత్‌లో వస్తాయని కూడా ఊహించం! యాభై ఏళ్లు వెనక్కి వెళ్తే మొబైల్‌ ఫోన్‌ ఉండదు. వందేళ్లు వెనక్కి వెళ్తే టీవీ ఉండదు.
అలా అలా వెళ్తూ పోతే సినిమా ఉండదు. టెలీఫోన్‌ ఉండదు. కెమెరా ఉండదు. ఇలాంటివెన్నో.. అవన్నీ కాలంతో పాటు పుట్టుకొచ్చినవి. సెల్ఫీ అలాంటిదే! ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఒక్కటైనా ఓ సెల్ఫీ ఉండి తీరుతుంది. అంత ఫ్యాషన్‌ సెల్ఫీ అంటే! మరి ఈ సెల్ఫీ ఎప్పుడు పుట్టిందన్నది కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌!! ఇంత సడెన్‌గా ఇది హాట్‌ టాపిక్‌ అవ్వడానికీ ఓ కారణం ఉంది. కొద్దిరోజుల క్రితం సోషల్‌ యాక్టివిస్ట్‌ పారిస్‌ హిల్టన్‌ తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో ఒక ఫొటో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలో ఆమెతో పాటు పాపులర్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ కూడా ఉంది. ఈ ఫొటో పోస్ట్‌ చేస్తూ.. ‘‘11 ఏళ్ల క్రితం.. ఇదేరోజు.. నేను, బ్రిట్నీ కలిసి సెల్ఫీని కనిపెట్టాం’’ అంది పారిస్‌ హిల్టన్‌. ఆమె ఏదో సరదాకే అన్నా, ఆ ట్వీట్‌కు వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి. ‘‘సెల్ఫీ మీరేం కనిపెట్టలేదమ్మా!’’ అంటూ వెటకారంగా కామెంట్స్‌ చేశారు నెటిజన్లు. అవును నిజమే! సెల్ఫీని ఎవరు కనిపెట్టారు? సెల్ఫీ కథేంటీ? సెల్ఫీ అన్న కాన్సెప్ట్‌ ఇప్పటిదేం కాదు. కాకపోతే అప్పటికి దానికి ఈ పేరు లేదు అంతే!!

ఏనిమల్‌ సెల్ఫీ
పెంపుడు జంతువుల అభిమానులకు లెక్కే లేదు. కొందరి ఫోన్లలో అయితే అంతా పెట్స్‌ ఫొటోలే ఉంటాయి. కొన్ని పెట్స్‌ ఇంకాస్త అడ్వాన్స్‌ కూడా అయిపోయి అవే ఫొటోలు తీసేసుకుంటాయి. అలాంటివాటిల్లో బాగా ఆకర్షించిన ఒక ఏనిమల్‌ సెల్ఫీ..

ఫస్ట్‌ సెల్ఫీ
1839లో రాబర్ట్‌ కార్నిలస్‌ ఫస్ట్‌ సెల్ఫీ తీసుకున్నాడు. తమ ఇంటి వెనక ఖాళీ స్థలంలో కెమెరా పెట్టి, మూడు నిమిషాల వరకు కెమెరా ముందు నిలబడి తనను తానే ఫొటో తీసుకున్నాడు. అప్పటికి కెమెరా అన్నది ప్రపంచానికి పూర్తిగా పరిచయం కూడా కాలేదు.  

స్పేస్‌ సెల్ఫీ
అంతరిక్షంలో వ్యోమగాములు సెల్ఫీలు తీసుకోవడం ఇప్పుడు ఒక ఆనవాయితీ. 1966లో బజ్‌ ఆల్డ్రిన్‌ అనే వ్యక్తి అంతరిక్షంలో ఫస్ట్‌ సెల్ఫీ తీసుకున్నాడు.

ఫేమస్‌ సెల్ఫీ
గిటారిస్ట్‌ జార్జి హారిసన్‌ 1966లో తన ఇండియా టూర్‌లో, తాజ్‌మహాల్‌ వద్ద తనకు తానే ఓ ఫోటో తీసుకున్నాడు. రాబర్ట్‌ ఫస్ట్‌ సెల్ఫీ తర్వాత, సెల్ఫీ జనరేషన్‌ రాకముందు.. ఆ స్థాయిలో ఫేమస్‌ అయిన సెల్ఫీ ఇదే!

ఈ సెల్ఫీ పక్కా!
బాలీవుడ్‌ బాద్‌షా ఏటా తన బర్త్‌డేకి తీసుకునే ఓ సెల్ఫీ.. సెల్ఫీ అన్నది పాపులర్‌ అయ్యాక ఒక మ్యాండేటరీగా మారిపోయింది. తనకు విషెస్‌ చెప్పడానికి వచ్చిన వేలాది అభిమానులతో కలిసి షారుఖ్‌ ఈ సెల్ఫీ తీసుకుంటాడు. (ఫొటో..   2017 బర్త్‌డే సెల్ఫీ)

సెల్ఫీ పిచ్చి
కిరిల్‌ ఒరెష్కిన్‌ ఎల్తైన ప్రదేశాల్లో నిలబడి సెల్ఫీలు తీసుకోవడంలో ఎక్స్‌పర్ట్‌. రష్యాకు చెందిన కిరిల్‌ చూడ్డానికే భయపడేంత ఎత్తులో నిలబడి, ఈజీగా సెల్ఫీలు తీసుకుంటాడు.  దీన్ని కొందరు డేర్‌డెవిల్‌ సెల్ఫీ అంటారు. ఇంకొందరు పిచ్చి అంటారు. సెల్ఫీ పిచ్చి.

ఆ పేరెలా వచ్చింది?
సెల్ఫీ అన్న పదానికి మూలం నాధన్‌ హోప్‌ అనే ఓ ఆస్ట్రేలియన్‌. 2002లో మొదటిసారి ఈ పదాన్ని వాడారు. 2017కల్లా ఇది ప్రపంచమంతటా పాపులర్‌ అయిపోయింది. రోజువారీ మాటల్లో ఓ భాగం అయిపోయింది. 2013లో ఆక్స్‌ఫర్డ్, తమ డిక్షనరీలో ‘సెల్ఫీ’ అన్న పదాన్ని చేర్చింది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top