వివేక చూడామణి

Special Story By Neeti Suryanarayana Sharma In Funday On 01/12/2019 - Sakshi

నేతి సూర్యనారాయణ శర్మ

శంకర మండనమిశ్ర సంవాదం కొనసాగుతోంది. మండనుడు గురువు ప్రాధాన్యం తెలియనివాడు కాదు. అయినప్పటికీ సన్యాసులు ప్రజాబాహుళ్యంలోకి రావడాన్ని వ్యతిరేకించాడు. వారు అడవులకే పరిమితం కావాలన్నాడు. సంఘంతో ప్రమేయం పెట్టుకోవడం వల్ల  సంన్యాసాశ్రమానికి విలువ, గౌరవం తగ్గుతుందని వాదించాడు. కానీ శంకరుని మనోభీష్టం వేరుగా ఉంది. 
శాంతా మహాంతో నివసంతి సంతో
వసంతవల్లోకహితం చరంతః
తీర్ణాః స్వయం భీమభవార్ణవం జనా
నహేతునాన్యానపి తారయంతః 
సాధు సన్యాసులు శాంతులు, ఉదార హృదయులు. వారు లోకహితం కోసమే ప్రజల మధ్య తిరుగాడుతుంటారు. తీక్షణమయిన సూర్యాతపంతో కాలిన నేలను ఏమీ ఆశించకుండానే చంద్రుడు తన కిరణాలతో చల్లబరిచి రక్షించినట్లు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన గురువులు తమ శిష్యులను ఉద్ధరిస్తారు. వివేకవంతుడైన మానవుడు సద్గురువును ఆశ్రయించాలి. తాపత్రయాలను పోగొట్టి మోక్షమార్గాన్ని బోధించమని ప్రార్థించాలి అంటాడు శంకరుడు. 
మండనుడు ఆ ప్రతిపాదనను తేలిగ్గా కొట్టిపారేశాడు. ‘‘ఒకడు తలపై పెద్ద కట్టెలమోపు ఎత్తుకుని మెడలు కుంగిపోతుంటే నడవలేక బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఎవరైనా కనికరించి బరువు పంచుకుంటే వీడు గమ్యస్థానానికి చేరతాడు. మీరు చెప్పే జ్ఞానమార్గంలోని గురువులు ఇలా బరువు పంచుకునేవారే. కొద్దికొద్దిగా శ్రమ తగ్గిస్తూ ముందుకు నడిపిస్తారు. కట్టెలు చేరాయి కనుక, ఎసరు కాగి బియ్యం అన్నమవుతుంది. కానీ బరువు పంచుకున్నట్లు గురువు పాపం శిష్యుడి ఆకలిని కూడా తాను పంచుకోలేడు కదా! కర్మమార్గంలో ఉన్నవాడు వేదాన్ని గురుముఖతః వింటున్నాడు. క్రియాలోపం లేకుండా క్రతువులు నిర్వహించి దాని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. ఇక్కడ గురువు కడుపు నింపినవాడు’’ నిక్కచ్చిగా నొక్కి చెప్పాడు మండనుడు. 
 ‘‘మనిషికి ఎప్పుడైనా చేసిన పనికి రావలసిన ఫలితాన్ని చెడగొట్టేవి మూడే మూడు... తెలుసుకుంటున్న విషయం అనుభూతిలోకి రాకుండా చేసే అసంభావన, అది నిజమో కాదో తెలియని సంశయ భావన, అసలు విషయాన్ని పక్కతోవ పట్టించే విపరీత భావన. ఈ మూడూ ఉన్నవాడు క్రియాలోపం లేకుండా చూసుకున్నా కర్మమార్గంలో రాణించలేడు. ఈ మూడూ లేకపోతే కర్మమార్గం కంటే వేగంగా తరింప చేసేది జ్ఞానమార్గమే’’ అన్నాడు శంకరుడు. 
మొదటిసారిగా తానే తప్పు, శంకరుడు చెప్పినదే నిజమనే భావన మండన మిశ్రునిలో ప్రవేశించింది. అయినప్పటికీ ‘‘వేదం శబ్ద ప్రధానమైనదే. అది కర్మకాండను మాత్రమే బోధించింది’’ అన్నాడు వాదన కొనసాగిస్తూ. 
‘‘ముక్కస్య ముక్కర్థం తీసుకునేవాడికి నిరర్థకాలైన స్వర్గ సుఖాలు బులిపిస్తాయి. నిద్రించేవాడు పూర్వ సంస్కారంతో కలలు కన్నట్లు కర్మిష్ఠి మాయలో పరిభ్రమిస్తాడు. అంతేకాని మోక్షసుఖం పొందలేడు. జ్ఞాని అలా కాదు. అతడు శరీరధారణకు అవసరమైనంత మేరకే నిస్సారమైన భోగాలను స్వీకరిస్తాడు. జాగరూకుడై మెలగుతాడు’’ చెప్పాడు శంకరుడు.
‘‘మీరు చెబుతున్నది చూస్తుంటే జన్మంతా జాగరణతోనే సరిపోయేట్లుంది. జ్ఞానం అబ్బడానికి ఎంత సమయం కావాలి? గుర్రం రికాబులో కాలుపెట్టి జనక మహారాజు దాన్ని అధిరోహించేలోగానే అష్టావక్రుడు బ్రహ్మజ్ఞానం బోధించాడట. జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇచ్చేటట్లయితే... భాగవతంలో ఖట్వాంగుడు ఒక్క ముహూర్తకాలంలోనే మోక్షం పొందాడు. పరీక్షిత్తుకు ఏడురోజుల్లో శుకమహర్షి మోక్షం కరతలామలకం అయ్యేలా చేశాడు. జ్ఞానం పొందడానికి, మోక్షాన్ని సిద్ధింప చేసుకోవడానికి జన్మంతా గొడ్డుచాకిరీ చేయనక్కర లేదు కదా?!’’ విసుగుదల ప్రదర్శించాడు మండనుడు.
‘‘జీవులందరికీ ఇంద్రియజ్ఞానం ఉంటుంది. అది వారినెప్పుడూ మహాలోభానికి గురిచేస్తూ ఉంటుంది. వేటగాళ్లు సృష్టించే శబ్దాలకు భ్రమసి లేడి పరుగులు తీస్తుంది. శబ్దేంద్రియానికి లోబడి లేడి ప్రాణాలు కోల్పోతుంది. ఆడ ఏనుగు స్పర్శ కోసం తహతహలాడే మగ ఏనుగు వెంటబడి వెళ్లి గోతుల్లో కూలిపోతుంది. రూపాన్ని అపేక్షించి మిడత దీపపు మంటల్లో కాలిపోతుంది. రసాసక్తితో చేప గేలానికి వేలాడుతున్న వానపాము ఎరకు చిక్కుతుంది. ఘ్రాణపాటవాన్ని అణచుకోలేక తుమ్మెద సంపెంగ పువ్వుపై వాలి తలదిమ్ముతో మరణిస్తుంది. ఏనాటికి ఎవరి బుద్ధి ఎలా పనిచేస్తుందో చెప్పలేం. చివరి నిమిషంలో మోక్షాన్ని చేజార్చుకున్న బ్రహ్మజ్ఞానులున్నారు. తెలియక చేసిన కర్మ ఒక మంచి ఆలోచన దిశగా నడిపినప్పుడు మోక్షం సాధించుకున్న అజ్ఞానులూ ఉన్నారు’’ వివరించాడు శంకరుడు.
‘‘అదంతా జీవవైవిధ్యం. సృష్టికర్త చాతుర్యం. అధర్వనిష్ఠా వరిష్ఠులు విశ్వమే బ్రహ్మ చెబుతుండగా మీరు జగత్తు మిథ్య అని బోధిస్తున్నారెందుకు?’’
‘‘ఈ విశ్వం బ్రహ్మకంటే భిన్నమైనది కాదు. ఈ విశ్వానికి, ఇందులోని జీవులకు కల్పితత్వమే కానీ యదార్థసత్త లేదు. అది ఉన్నది కేవలము పరబ్రహ్మమే. అందుకే జగత్తు మి«థ్య అని చెప్పింది.’’
‘‘కానీ మీ మిథ్యావాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. మీరు ప్రచ్ఛన్న బౌద్ధులనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈనాటి సభలో బౌద్ధుల రాకకు కారణం కూడా అదే.’’
‘‘విభిన్న వాదాల మధ్య సమన్వయం సాధించడం నాకు ఇష్టమైన పని. కానీ నేను తీవ్రంగా ప్రతిఘటించేది క్షణికవాదాన్ని, శూన్యవాదాన్ని చెప్పే బౌద్ధాన్ని మాత్రమే. మీకు తెలియదా?’’
‘‘ఆదిబుద్ధులు మాత్రమే ముక్తులైనట్లుగా మీ పరమ గురువైన గౌడపాదులు సెలవిచ్చినట్లున్నారు. మీరిప్పుడు బోధిస్తున్న అద్వైతానికి కూడా మూలం వారి కారికలే కదా?! బుద్ధస్య జ్ఞానం, బుద్ధేన భాషితం అంటూ మూడుసార్లు మాండూక్య కోరికల్లో మీ ఆచార్యులు బుద్ధదేవుణ్ణి స్మరించుకున్నారు. ఇంతకూ ఎవరా బుద్ధుడు?’’ ప్రశ్నించాడు మండనుడు.
‘‘ఆర్య మండనమిశ్రా! మీరు మాట్లాడుతున్నదేమిటో నాకు బోధపడడం లేదు. సంస్కృత భాషా సంప్రదాయాలు తెలియని వారివలె మాట్లాడుతున్నారు. మొదటి పదంలో గౌడపాదులు తెలివికి ప్రతిరూపంగా ఉండేవారిని గురించి నిత్య శుద్ధ బుద్ధ స్వభావులని చెప్పారు. ఇక బుద్ధస్య జ్ఞానం అంటే బుద్ధివల్ల కలిగే జ్ఞానం అని, బుద్ధేన భాషితం అంటే బుద్ధి మనకు బోధపడేలా చెప్పిన విధంగా అనే అర్థం చెప్పుకోవాలి. అంతేకానీ బుద్ధుడనే ఒక దైవం ఉన్నట్లుగా గౌడపాదులు ప్రతిపాదించలేదు.’’
‘‘అదేమిటి... బుద్ధుడు స్వయంగా విష్ణు అవతారమేనని కొందరు సనాతన ధర్మపరులు కూడా భావిస్తున్నారిప్పుడు. భాగవతంలోనూ, కొన్ని పురాణాలలోనూ బుద్ధుణ్ణి గురించి వ్యాసుడే స్మరించుకున్నాడట.’’ 
‘‘భాగవతంలోని ఖట్వాంగుని కథలో కానీ, దశమస్కంధంలో అక్రూరుని కృష్ణస్తోత్రంలో కానీ బుద్ధ అనే పదాన్ని ప్రయోగిస్తూ వ్యాసుడు చెప్పినవన్నీ బుద్ధి అనే అర్థాన్నిచ్చేవే. భగవానుడు ఎప్పుడు అవతరించినా మోక్షకారకుడు, దానవ సంహారకుడు మాత్రమే అవుతాడు. దుష్టశిక్షణ దుష్కరమైనప్పుడు శివకేశవులు ఒకరికి ఒకరు సహాయపడినట్లుగా పురాణాలు వర్ణిస్తాయి. ధర్మాల వలె కనిపించే ఉపధర్మాలను బోధించి విష్ణువు ఎన్నోమార్లు రాక్షసుల బుద్ధులను చెడగొట్టాడు. ఆ  కపట గురువు వేషాన్ని ఒక అవతారంగా విష్ణుభక్తులు భావించరు.’’
‘‘బుద్ధుడు ప్రతికల్పంలోనూ అవతరిస్తూనే ఉన్నాడట. ఇప్పుడు ఈ కల్పంలో తథాగతునిగా రాబోతున్నాడని భారతదేశంలో ఎన్నో రాజవంశాలు నమ్ముతున్నాయి. బుద్ధాంశ కలిగిన వారి అస్థికలపై స్థూపాలను నిర్మిస్తూ బుద్ధుని రాక కోసం వారంతా నిరీక్షిస్తున్నారు. బౌద్ధ సంగీతులను నిర్వహిస్తూ మతనిర్మాణం చేసుకుంటున్నారు’’ వృథా ఆరాటం ప్రదర్శించాడు మండనుడు.
‘‘ఉపధర్మాలు ఎన్నటికీ అసలు ధర్మాలు కానేరవు. చూడబోతే పైకి మాత్రం సిసలు ధర్మాల్లా కనిపిస్తూ మాయ చేస్తాయంతే. అవి ప్రభుత్వాల మనుగడకు పనికి వస్తాయి. ప్రజామోదాన్ని మాత్రం పొందలేవు’’ కుండబద్దలు కొట్టాడు శంకరుడు.
ఇంతలో కాళిదాసు అందుకున్నాడు. ‘‘స్వామీ! ఇది నిన్నమొన్న బయలుదేరిన తగాదా. దయచేసి దీనిని పక్కన పెడదాం. ఇంతకంటే పాతదైన పురాణవైరం ఒకటుంది. అదిప్పుడు మా అవంతీరాజ్యానికి ఒక సమస్య సృష్టించింది. అనుమతిస్తే ప్రస్తావిస్తాను’’ అని కొద్దిసేపు ఆగాడు.
శంకరుని మౌనాన్నే అంగీకారంగా భావించి కాళిదాసు కథాప్రారంభం చేశాడు. 
‘‘భగవంతుని మీద పగపట్టిన వాడొకడున్నాడు. వాడు పచ్చి కాముకుడు. వాడిని పడగొట్టడానికి వెలుగుతున్న సూర్యునికి తన సుదర్శన చక్రానికి అడ్డంపెట్టి సాయంసంధ్యను సృష్టించాడు భగవానుడు. యుద్ధం ముగిసిపోయిందని భ్రమించిన పగవాడు బయటికి వచ్చేశాడు. అర్జునుడు విడిచిన పాశుపతం వాడి శిరస్సును ఎగుర గొట్టేసింది. ఇంతకూ చచ్చిన తరువాత కూడా వాడి పగ చల్లారలేదు. నేపాళ, కాశ్మీర, మగధ రాజవంశాలను వివిధ రకాలుగా పీడించాడు. జన్మహేతువును మర్చిపోకుండా అనేక జన్మలెత్తాడు. ఒక్కొక్కచోట ఒక్కొక్క తీరుగా ఉండేది వాడి ప్రవర్తన. శ్రీకృష్ణ భగవానుని ప్రియభక్తులైన కాశ్మీర రాజుల మీద వాడి నిరంకుశత్వం ఎక్కువ కాలం సాగలేదు. నేపాళం వెళ్లిన కొత్తల్లో తానే భగవంతుడినని ప్రకటించుకోవాలని ప్రయత్నించాడు. గోస్వామి అనేవాడు వాడినొక యాగసమిధగా చేసి హతమార్చాడు. అయినప్పటికీ ఆ నాస్తికధూమం చల్లారలేదు. మగధ పాలకుల పట్టపురాణులను వశం చేసుకున్నాడు. వారితో తన కామదాహం తీర్చుకోవడంతో సరిపెట్టుకోక, మగధలో వైదికమతానికి స్థానం లేకుండా చేశాడు. ఆంధ్ర శాతకర్ణులు మగధను ఆక్రమించుకున్న తరువాత ఇన్నేళ్లకు వాడు అక్కడ కూడా పట్టు కోల్పోయాడు. ఇప్పుడు వాడి చూపు ఖగోళవేత్త అయిన మా వరాహమిహిరునిపై పడింది. ఆయన కుమార్తె వేదవతిని ఎక్కడో రహస్యంగా నిర్బంధించి ఆమె ద్వారా ఖగోళ రహస్యాలను భేదించడానికి ప్రయత్నిస్తున్నాడు. వేదవతిని వెతికించడానికి చక్రవర్తి నాలుగు దిక్కులకూ వేగులను పంపాడు. కొన్ని రాజ్యాలపై యుద్ధానికి సైతం తలపడ్డాడు. ఆ యమ్మ ఎక్కడున్నదో తెలియ రావడం లేదు. మీకు తెలిస్తే చెప్పగలరా?’’
సుదీర్ఘమైన వేడి నిశ్వాసలతో సభాంగణం వేడెక్కింది. అది కొంత సద్దుమణిగిన తరువాత  శంకరుడు గొంతు విప్పాడు.
‘‘మీ ప్రశ్నకు సమాధానం త్వరలో వరాహమిహిరునికే స్ఫురిస్తుంది. ఆమె ఉనికిని విక్రమార్కుడు తపశ్శక్తి చేత ఒక కలలా తన చారుల మనస్సులలో దీపింప చేస్తాడు. ఏది ఏమైనా వేదాత్మ శత్రువుల చేతిలో శాశ్వతబందీ మాత్రం కాదు’’ అన్నాడు.
‘‘రక్షించారు. ఇంతకూ ఆ ధూమరేఖ నశిస్తుందా?’’ ఆత్రుతగా అడిగాడు కాళిదాసు.
‘‘వేదవతిని చేజార్చుకున్న తరువాత అది మాహిష్మతి వైపుకే దూసుకొస్తుంది. ఈసారి ఒక క్రూర జంతువు రూపాన్ని ధరిస్తుంది. అదే జరిగితే మా పద్మపాదుడు దానిని అణిచేస్తాడు’’ అని తన దర్శనాన్ని చెప్పాడు శంకరుడు. 
వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తో బాణః పశ్చాత్తుగోమతౌ
న తిష్ఠతి చ్ఛినత్త్యేవ లక్ష్యం వేగేన నిర్భరం
ఇది పెద్దపులి. అవశ్యం చంపదగినది అని విలుకాడు గురిచూసి బాణం విడిచిపెడతాడు. విడిచిన తర్వాత అది పులికాదు... గోవు అని తెలుస్తుంది. అప్పుడు నాలిక కరుచుకుంటాడు. గోలపెడతాడు. ఏమైనా విడిచిన బాణం ఆగదు. వడివడిగా పోయి లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. వర్తమానంలో నిర్వహిస్తున్న ప్రారబ్ధకర్మ అటువంటిదే. అది ఫలమును కల్పించేందుకే పుట్టింది. బ్రహ్మజ్ఞానం కలిగినంత మాత్రాన ఫలానుభవం లేకుండా చేయదు. ప్రారబ్ధ అనుభవం పూర్తయిన తరువాతనే నశిస్తుంది అని వివేక చూడామణి చెబుతోంది. 
మండనమిశ్రుడు ఇప్పుడు పొందదగిన అనుభవం ఓటమి. 
‘‘ఆర్య మండనమిశ్రా! జీవేశ్వర ఏకత్వాన్ని బోధించే ఆత్మజ్ఞానమే మోక్షం. యజ్ఞయాగాదులు ఆత్మనిష్ఠను కలిగించే ఉపకరణాలే. కానీ అవే ముఖ్యమంటే వేదాంతులు అంగీకరించరు. మీ గురువైన జైమిని మహర్షి కర్మకాండను ప్రధానంగా చేసుకుని పూర్వామీమాంసా శాస్త్రం రూపొందించారు. సత్కర్మాచరణతో చిత్తశుద్ధిని పొంది తద్వారా మానవులందరూ ఆత్మజ్ఞానాన్ని సాధించాలన్నదే జైమిని మహర్షి అసలు ఉద్దేశ్యం. కర్మాచరణతో ఈశ్వర నిర్దేశాన్ని మనపట్ల సానుకూలం చేసుకోవాలన్నారు కానీ, పూర్తిగా మార్చివేయడం సాధ్యమని చెప్పలేదు. కర్మకాండను అతిగా ప్రేమిస్తూ యజ్ఞయాగాలు చేసేవారిని వేదవ్యాసుడు పొగచూరిన బుద్ధి కలిగిన వాళ్లు అన్నాడు. వాళ్లే వేదాన్ని సకర్మకం అన్నారు కానీ, నిజానికి వేదం జ్ఞానప్రధానమైనది’’ అన్నాడు శంకరుడు.
మండనమిశ్రుని హృదయ ప్రకృతిని అతని మెడలో వేలాడుతున్న పూలదండ ప్రతిఫలిస్తోంది. శిశిరం దాటిన వసంతంలా అతడి ముఖమండలం వేయికాంతులతో సత్యదర్శన అనుభవాన్ని ప్రకటిస్తోంది. – సశేషం

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top