ముసుగు

Special Story In Funday On 24/11/2019 - Sakshi

తప్పిపోయిన మచ్చల మేక కోసం వెతికి వెతికి అలసిపోయిన శరీరం నిద్రపోవాలని ఆశిస్తున్నా, ఆలోచనలు రేపే మనసు అంతరాయం కలిగిస్తోంది. చలి మంటల్లో కాలుతున్న కట్టెలను చూస్తూ కళ్ళముందే అంతమయిపోయిన కాలాన్ని గుర్తుతెచ్చుకుంటున్నాడు నాగయ్య.
పేరు నాగేశ్వరావు. కాని పూర్తిపేరు ఇప్పటికి చాలామందికి తెలియదు. ఊహ తెలిసిన దగ్గరనుంచి మేకలు కాస్తుండటంతో ‘మేకల నాగయ్య’గానే మిగిలిపోయింది.
కుటుంబంలో నాగయ్య ఐదవవాడు కావడంతో అప్పట్లో చదివించే స్థోమత లేక నాగయ్యని మాత్రం చిన్నప్పటినుంచే మేకలు కాయడానికి పంపారు. మిగిలిన అన్నదమ్ములు గవర్నమెంట్‌ ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాల్లో బాగా స్థిరపడివుంటే నాగయ్య జీవితం మాత్రం మేకలకి అంకితం అయిపోయింది.
 నాగయ్య లోకం తెలియని అమాయకుడు అవ్వడంతో కుటుంబ శుభకార్యాలకు పెద్దగా ఎవరూ పిలవరు. ఒకవేళ పిలిచి అక్కడికి వెళ్ళినా ఎవరూ పట్టించుకోరు. దానితో నాగయ్య ఊరు దాటి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు.
అవసరమైనప్పుడు తప్ప మిగతా సమయంలో తన బంధువులకి గుర్తురాని నాగయ్య తన పరిస్థితి తన పిల్లలకి రాకూడదని  మేకలు కాసుకుంటూనే పెద్ద ఇల్లు కట్టాడు. ముగ్గురు కొడుకుల్ని చదివించి పెళ్ళి చేసాడు. 
‘‘నీకేం నాగయ్య, లంకంత ఇల్లు, ముగ్గురు కొడుకులు, ఏ ఇబ్బంది లేకుండా రారాజులాగ బతుకుతున్నావ్‌’’ అని ఊళ్లో  వాళ్ళందరూ ఎప్పుడూ పొగుడుతూ ఉండటంతో ఎవరి దిష్టి తగిలిందో ఏమో ముగ్గురు కొడుకులకి ఉద్యోగాలు రాగానే పెళ్ళిళ్ళు చేసుకొని సిటీలకి వెళ్ళిపోయారు. 
ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పెట్టుకొంటూ సాయంత్రం ఇంటికి రాగానే ఆ కోపాన్ని తన మీద చూపిస్తూ తోడుగా ఉండే భార్య కూడా సంవత్సరం క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా తయారయ్యింది. 
ఈ వయసులో తోడులేకపోతే జీవితం ఇంత కష్టంగా ఉంటుందని ఊహించలేకపోయాడు. ‘‘ఒక్కడివే ఊర్లో ఎందుకు? మా దగ్గరికి వచ్చేయ్‌’’ అని కొడుకులు అడుగుతుంటే ‘‘వచ్చే వారం వస్తా...వచ్చే వారం వస్తా..’’ అని చెప్పిన వారాలు కాస్తా నెలలు అయ్యాయి.
 నెలలు సంవత్సరాలు అయ్యాయి. కొడుకుల మాటల్లో సానుభూతి తప్ప అభిమానం అనేది కనపడకపొయేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనసు ఒప్పేది కాదు. సానుభూతి ఎక్కువ రోజులు ఉండదనేది నాగయ్య నమ్మకం.
 దారిలో ఎదురైన వాళ్ళని ‘‘బాగున్నావా?’’ అని అడిగితే ‘బాగున్నా గాని బాదలు తప్పలేదు’ అన్నట్లు ప్రతి ఒక్కరు మొదట సానుభూతి చూపించడం, తరవాత వాళ్ళ కష్టాలు గురించి చెప్పడం, చివరిగా ఎంతోకొంత అప్పు అడగడం!
 కష్టాలు రాగానే నాగయ్య గుర్తొస్తాడో లేక నాగయ్యని చూడగానే కష్టాలు గుర్తొస్తాయో తెలియదు గాని ఒకరు ఇద్దరు అని కాకుండా ఊరంతా ఇదే వరస మొదలయ్యింది. 
నాగయ్య భార్య ఉన్నంత వరకు ఇంటికొచ్చి అప్పు అడగటానికి అందరూ భయపడేవారు. ఆమె చనిపోవడంతో ఊళ్లో  ఉన్న ప్రతి ఒక్కరి కన్ను నాగయ్య దగ్గర ఉన్న నలభై మేకల మీద పడింది.
‘‘ఒక్కడే అంత పెద్ద ఇల్లు, అన్ని మేకలు ఏం చేసుకుంటాడు?’’ అనే  అసూయ అందరిలో తెలియకుండానే మొదలయ్యింది.
డబ్బులు అడిగితే ‘లేవు’ అని చెప్పటానికి వీలు లేదు. మేకలు అమ్మి ఇవ్వమంటారు. కుదరదు అంటే కోపంతో దూరమవుతారు. ఇద్దామంటే ఎదుటి వారి ఆశకి అంతం ఉండదు. ఇవ్వాలే గాని ఆ దేవున్ని కూడ బిచ్చగాడిని చేసే శక్తి మన దగ్గర ఉంది.
 ఒకవేళ మనసు కరిగి మేకలను అమ్మి డబ్బులు ఇద్దామన్నా, ఎవ్వరికీ ఇవ్వకపోవడం కంటే ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపొతేనే ఎక్కువ కోపాలు వస్తాయి. 
మేకలను అమ్మేసి ఎక్కడకైనా వెళ్ళిపోదాం అనుకుంటే, నాగయ్యకి మేకలు కాసుకోవడం తప్ప వేరే ప్రపంచం తెలియదు. నిదానంగా నాగయ్యకి ఊరి మీద ఉన్న ప్రేమ తగ్గిపోతూ వచ్చింది. ఏదొక రోజు ఊరు తనని దూరం చేయడం కంటే తనే ఊరికి దూరంగా వెళ్ళిపోవడం మంచిది అనుకొని ఊరు వెలేసిన వాడిలాగా ఇలా ఊరు బయట తన పొలం దగ్గర ఒక పాక వేసుకొని మేకలు కాసుకుంటూ నివసిస్తున్నాడు.
రాత్రి పడుకునే ముందు కొంచెం సేపు అయినా సంతోషంగా మనవళ్ళు మనవరాళ్ళుతో మాట్లాడదా మనుకుంటే, తాతయ్యని ఇలా అడగటం తప్పో కాదో కూడా తెలియని చిన్న పిల్లలు చేత వాళ్ళమ్మ వాళ్ళు డబ్బులు పంపమని అడిగిస్తుంటే తరవాత పిల్లలతో మాట్లాడటానికి నాగయ్యకి మాటలు రావడం లేదు.
‘మనుషులుకి అభిమానాలు అనేవి ఉండవు, ఉండేది కేవలం అవసరాలు మాత్రమే’ అనే విషయాన్ని అర్థం చేసుకొని దారిలో ఎవరైనా ఎదురుపడినా ఏదో అంటరాని వాళ్ళలాగ చూసి చూడనట్లు మేకలు తోలుకుంటూ పక్కకి వెళ్ళిపోయేవాడు.
మనుషులంటేనే భయపడే విధంగా తయారయ్యాడు.
మంచు ఎక్కువ అవడంతో చలిమంట నిదానంగా ఆరిపోయింది. దానికి అనుకూలంగా కనురెప్పలు కూడా నిదానంగా మూసుకుపోయాయి. తప్పిపోయిన మచ్చలమేక గుర్తొచ్చి ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. అప్పటికే తెల్లారింది. పక్షులు పలకరించుకుంటూ శబ్దాలు చేస్తున్నాయి. 
బయటికి వెళ్ళడానికి తడిక తలుపు తీయమని మేకలు అరుస్తూ వున్నాయి. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టమని చీకటిని తరుముతూ వచ్చిన సూర్యకిరణాలు వాటి వెలుగును పెంచుతూ భవిష్యత్తు అనే కొత్త ఆశలు కోసం వర్తమానంలో మనుషుల్ని పరుగెత్తించడానికి ప్రయత్నిస్తున్నాయి. 
మేక కోసం అన్ని చోట్ల వెతికిన నాగయ్యకి వెతకటం మర్చిపోయిన పాడుపడిన బావి గుర్తొచ్చింది. అందులో కూడ చూస్తే ఒక సందేహం పోతుందని వేగంగా నడుచుకుంటూ బావి దగ్గరికి వెళ్ళాడు. 
నాగయ్య అనుకున్నదే నిజమయ్యింది. మేక కనపడగానే ఎక్కడలేని సంతోషం తిరిగొచ్చింది. బావిలో పడిన మేకను బయటికి తీయడానికి ఊళ్ళో వాళ్ళని సాయం అడిగితే ఎక్కడ దాన్ని ఆసరాగా తీసుకొని దగ్గరయ్యి డబ్బులు అడుగుతారేమోనన్న భయంతో ఇంటి వెనుక కొట్టంలో ఉన్న నిచ్చెన తీసుకొచ్చి అతి కష్టం మీద ఒక్కడే మేకని బయటికి తీసుకొచ్చాడు.
 తోటి మేకలను చూసి సంతోషంతో అరుచుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళింది. అది చూసి నాగయ్య ఆనందంతో పడకమీద ఉన్న దుప్పటిని విదిలించి, మడతేసి, మంచం లేపి ప్రక్కనపెట్టి ‘హేయ్‌..హేయ్‌..’ అని శబ్దాలు చేస్తూ మేకలను తోలుకొని వెళ్ళాడు. 
అవసరమైనపుడు అమాయకత్వంతో అడగటానికి, సహాయం చేసినపుడు ఆనందంతో పొగడటానికి దేవుడు మనుషులుకి మాటలు ఇచ్చినట్లు మేకలకి ఇవ్వకపోవడంతో మచ్చల మేక నాగయ్య ఎక్కడకి వెళ్తే అక్కడికి వెళ్తూ, నాగయ్య వెంట ఉంటూ తన కృతజ్ఞతను తెలియజేస్తూ ఉంది. 
రాత్రి కూడ మంచం దగ్గర పడుకోవడంతో నాగయ్యకి విషయం అర్థమయ్యి చిరునవ్వుతో దాని తల మీద చెయ్యిపెట్టి ప్రేమతో నిమిరాడు. నాగయ్య మీద ఉన్న కృతజ్ఞత కాస్త ఇష్టంగా మారింది. 
నాగయ్య మీద ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ మేక తలతో పొడుస్తున్నట్లు పైకి పోయేది. నాగయ్య కుడా నవ్వుతూ తన తలతో మేక తలని ‘ఢీ’ కొట్టినట్లు చిన్నగా ముందుకు తోస్తూ ఆడుకునేవాడు. తెలియకుండానే వీళ్ళిద్దరి మధ్య  ఒక బంధం ఏర్పడింది. పంచుకోవడానికి పక్కన ఎవ్వరూ లేకపోవడంతో అర్థమవుతుందో లేదో అనేది పట్టించుకోకుండా తన విషయాలన్నీ మేకతో చెప్పుకునేవాడు.
ఉన్నట్టుండి నాగయ్య శరీరమంతా ఒక్కసారిగా వేడిగా అయ్యి చలి ఎక్కువయ్యింది. వాతావరణం మార్పు వలన అలా అనిపిస్తుందేమోనని పట్టించుకోలేదు. తెల్లవారుజామున నిద్ర లేవగానే ఒళ్ళంతా నొప్పులు ఉండటంతో జ్వరం వచ్చిందని అర్థమయ్యి ఊళ్లో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాడు.
డాక్టర్‌ చూసి ‘‘జ్వరం పెద్దగా ఏం లేదే నాగయ్యా’’ అనగానే పని లేక ఎప్పుడూ డాక్టర్‌ దగ్గర కూర్చొని వచ్చిన వాళ్ళందరని వేళాకోళం చేసే పుల్లయ్య ‘‘ఈ మధ్య నాగయ్య ఒక్కడే పొలిమేర దగ్గర పడుకుంటున్నాడు. ఏదో మంచి వయసులో ఉన్న ఆడగాలి సోకినట్లుంది’’ అని అందరికీ వినపడేలా అన్నాడు.
 చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళంతా పెద్దగా నవ్వారు. ఊళ్లో  వాళ్ళు నాగయ్యని ఇలా వేళాకోళం చేసి మాట్లాడటం ఇది ఏమి కొత్త కాదు. నాగయ్య కూడా ఎప్పుడూ వాళ్ళతో కలిసి నవ్వుకునేవాడు. కాని ఇప్పుడు మాత్రం నవ్వురావడం లేదు. ఎప్పుడెప్పుడు ఇక్కడనుంచి వెళ్ళిపోదామా అన్నట్లుగా ఉన్నాడు. 
డాక్టర్‌ నవ్వుతూనే నాగయ్యని గమనించి ‘‘ఇది ఒంటికి వచ్చిన రోగం కాదు నాగయ్య, నెత్తికి వచ్చిన రోగం. కొన్ని రోజులు ఆలోచించడం ఆపేసి, అప్పుడప్పుడైనా మనుషులతో మాట్లాడుతుండు. సరేనా ?’’ అని సలహా ఇచ్చాడు.
 నాగయ్య ‘‘సరే’’ అన్నట్లు తలూపాడు. ‘‘ఎందుకయినా మంచిది ఉండు’’ అని జ్వరానికి ఇంజక్షన్‌ చేసి మాత్రలు ఇచ్చాడు డాక్టర్‌. 
నాగయ్య వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు అది పట్టించుకోకుండా మాటలతో ఆపేస్తున్నారు.
‘‘అది కాదు నాగయ్య. మిగిలిన శేష కాలమంతా అందరూ గుళ్ళూ, గోపురాలూ తిరుగుతూ, పుణ్యకార్యాలు చేస్తూ బతికేస్తుంటే నువ్వేంది ఆదిమానవుడిలా అడవుల్లో బ్రతుకుతానంటావ్‌. గుళ్లకి పోవడానికి దార్లు తెలియక ఆగిపోయావేమో చెప్పు నేను, పుల్లయ్య తోడుగా వస్తాం. నీతో వస్తే మాకు కొంచెం ఖర్చులయినా తగ్గుతాయ్‌.’’ అని డాక్టర్‌ అనగానే  దానికి పుల్లయ్య– ‘‘అబ్బే, అవన్ని ఇప్పుడు కుదిరే పనులు కాదు డాట్టరు. మీకర్థం కావట్లా. ఇప్పుడు నాగయ్యకి రెండో పెళ్ళి చెస్తేనే మనిషి మళ్లీ  మన లోకంలోకి వస్తాడు.’’ అని పుల్లయ్య అనగానే అందరూ పెద్దగా నవ్వారు.
 ‘‘వీళ్ళు ఇంకెప్పటికీ మారరు’’ అన్నట్లు మధ్యలోనే నాగయ్య అక్కడ నుంచి బయటికి వచ్చేశాడు. తనతోపాటు ఒక పెంచుకున్న కుక్కలాగా తిరుగుతున్న మేకను చూసి అందరికి విచిత్రంగా అనిపించింది. అలవాటులో మర్చిపోయి మేకతో మాట్లాడుతుంటే ఊళ్ళో వాళ్ళు నాగయ్యకి పిచ్చి పట్టినట్లుంది అనుకున్నారు.
మొదటి రెండు రోజులు జ్వరం తగ్గినట్లుగా అనిపించి మళ్ళీ రాత్రి అవగానే చలి ఎక్కువవడం, పగలు ఉన్నట్లుండి కళ్ళు తిరగడంతో అనుమానం వచ్చి ఈసారి పక్క ఊళ్లో ఉన్న స్వామీజీని కలిసాడు. ఆ స్వామీజీ ఆత్మలతో మాట్లాడతాడని చుట్టుప్రక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరి నమ్మకం. ప్రతి శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది  వరకు పూజలో ఉంటాడు. ఆరు లోపు ఆయనకి తమ సమస్యలు చెప్తే పూజ చేసి వచ్చి వాళ్ళ సమస్యకి గల కారణం, దానికి పరిష్కారం చెబుతాడు. 
ఉదయం నాలుగున్నర కే మేకతో కలిసి స్వామీజీ ఇంటికి వెళ్ళిన నాగయ్య తన పరిస్థితి గురించి చెప్పడంతో పూజ చేసి బయటికి వచ్చిన స్వామీజీ –
‘‘నువ్వు  ఒంటరిగా బతుకుతూ బాధపడటం చూసి తట్టుకోలేని నీ భార్య ఆత్మ నీ చుట్టే తిరుగుతూ నీ వెంటే ఉంటుంది. ఇప్పుడు నిన్ను  కూడా తనతోపాటు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది’’ అని  చెప్పడంతో నాగయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. 
తన భార్య ఆత్మ తనతోనే ఉందన్న సంతోషాన్ని, తనని ఏమైనా చేస్తుందేమోనన్న భయం తొక్కేస్తుంటే దాన్ని ఎలా ఆపాలో అర్థం కాక పరిష్కారం కోసం నాగయ్య స్వామీజీ వైపు దీనంగా చూసాడు. 
‘‘కులదేవతకి పూజ చేస్తే ఆత్మ ప్రభావం నీ మీద పనిచేయదు’’ అంటూ  పూజ ఎలా చెయ్యాలో చెప్పి చివర్లో రెండు తాయెత్తులు ఇచ్చి ఒకటి నాగయ్య చేతికి కట్టుకోమని, ఇంకొకటి మేక మెడకి కట్టమని చెప్పాడు.
ఇంటికి వెళ్ళిన నాగయ్య తల స్నానం చేసి పసుపు బట్టలు వేసుకొని గుడికి వెళ్ళడానికి తయారవుతుంటే ఇంటి ముందు పడుకొని ఉన్న మచ్చల మేక ఇదంతా చూస్తూ ఉంది. అది గమనించిన నాగయ్య మేకని కుడా పసుపు నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి తనతోపాటు గుడికి తీసుకెళ్ళాడు. 
అక్కడ ఉన్న జనాలు, డప్పు శబ్ధాలకి మేక గుడిలోకి రావడానికి భయపడింది. అది అర్థం చేసుకున్న నాగయ్య మేకని గుడి బయట ఉన్న వేప చెట్టుకి కట్టేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని స్వామీజీ చెప్పిందంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఆయన చెప్పినట్లుగానే పూజ చేయించాడు. చెట్టు దగ్గర ఉన్న రక్తం చూసి మేకకి భయం వేసింది. పూజ అయిపోయి బయటికి వస్తున్న నాగయ్యని చూసి తొందరగా ఇంటికి వెళ్దాం అన్నట్లు అరుస్తూ ఉంది.
 నాగయ్యతోపాటే బయటికి వచ్చిన ఇద్దరు మేక దగ్గరికి వచ్చి ‘‘ఎన్ని కేజీలు ఉండొచ్చు? ఎంత వయసు ఉండొచ్చు? అమ్మితే ఎంతకి కొనవచ్చు?’’ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. 
వాళ్ళని చూసి మేక కదులుతూ భయపడుతుంటే ఇంకొక తాడు కట్టి కదలకుండా ఉండేలా గట్టిగా పట్టుకున్నారు. మేక అరుస్తూ ఉంది. నాగయ్యకి ఇష్టం లేకపోయినా తప్పదు అన్నట్లు చివరిసారిగా కళ్ళు మూసుకొని దేవతని తలుచుకొని కళ్ళు తెరవడం తెరవడం మేక మెడ మీద కత్తితో గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. 
తల తెగి నాగయ్య కాళ్ళ ముందు పడింది. రక్తం కొంచెం నాగయ్య ముఖం మీద పడింది. మొదటిసారి మానవత్వం అనే ముసుగు తొలిగిపోయిన మనిషిని చూసిన మేక బాధతో కళ్ళు మూసింది. రక్తంలో కొట్టుమిట్టాడుతున్న దాని శరీరం నిదానంగా కదలడం ఆగిపోయింది. నాగయ్యకి తన మీద అభిమానం అనేది లేదు ఉన్నది కేవలం ‘అవసరం’ మాత్రమే అనే విషయాన్ని తెలుసుకునేలోగా మేక ప్రాణం గాల్లో కలిసిపోయింది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top