భక్తవత్సలుడు

Special Story By DVR Bhaskar - Sakshi

ఆకాశరాజు సోదరుడు తొండమాన్‌ చక్రవర్తికి శ్రీనివాసుడంటే వల్లమాలిన భక్తి. శ్రీనివాసునికి కూడా పినమామగారంటే ఎనలేని ప్రేమ. అల్లుడిగారి కోసం ఆనంద నిలయం కట్టించింది తొండమాన్‌ చక్రవర్తే. అనందనిలయంలోనే మనం స్వామిని దర్శించుకుంటున్నాం. తొండమాన్‌కి సంబంధించిన ఒక గాథ... ఒకసారి తొండమాన్‌ చక్రవర్తి వద్దకు కూర్ముడు అనే విప్రుడొచ్చాడు. తాను తీర్థయాత్రలకు వెళుతున్నానని, తన భార్యా పిల్లలను అంతదూరం తీసుకు వెళ్లడం వీలుపడదనీ కాబట్టి తాను తిరిగి వచ్చేంతవరకూ వారిని మీరే సంరక్షణ వహించవలసిందని కోరాడు. తొండమాన్‌ అందుకు అంగీకరించడంతో ఆ బాపడు సంతోషంగా తీర్థయాత్రలకు వెళ్లాడు. రాజు అప్పటికప్పుడే వారిని సకల సదుపాయాలూ కల ఒక ఇంటిలో ఉంచి, కొద్దిరోజులకు సరిపడా సంభారాలు ఏర్పాటు చేసి, భద్రత కోసం ఆ ఇంటికి తాళాలు వేయించి తన రాజకార్యాలలో మునిగిపోయి, ఆ తర్వాత వారి సంగతి మరచిపోయాడు. 

విప్రుడి కుటుంబం కొద్దిరోజులపాటు ఆ ఇంటిలోని వెచ్చాలతో వండుకుని తింటూ హాయిగా గడిపింది. ఆ తర్వాత సరుకులు అయిపోవడంతో తిరిగి తెచ్చుకుందామని చూస్తే ఇంటికి తాళం వేసి ఉందని తెలుసుకుని హతాశులయ్యారు. కొద్దికాలం ఎలాగో కళ్లలో ప్రాణాలు పెట్టుకుని బతికారు కానీ, తర్వాత తిండిలేక నీరసించి ఒక్కొక్కరుగా అశువులు బాశారు. కాశీయాత్రకు వెళ్లిన విప్రుడు కొంతకాలానికి తిరిగి రాజు వద్దకు వచ్చాడు. తన కుటుంబాన్ని తిరిగి తనకు అప్పగిస్తే వెళ్లిపోతానన్నాడు. రాజుకు అప్పుడు గుర్తుకొచ్చింది వారి విషయం. వెంటనే భటులను ఆ ఇంటికి పంపించి సగౌరవంగా తీసుకుని రమ్మన్నాడు. భటులు ఇంటి తాళం తెరిచి ఆ ఇంటిలో మనుషులకు బదులు అస్థిపంజరాలు ఉండటం చూసి భయభ్రాంతులకు గురై, అదే విషయం రాజుకు రహస్యంగా చెప్పారు. రాజు తన తప్పిదానికి ఎంతగానో బాధపడ్డాడు. అయినా, అవేమీ ఆ బ్రాహ్మణునకు తెలియనివ్వకుండా ‘‘అయ్యా! మీ కుటుంబ సభ్యులు తమ పొరుగు వారితో కలిసి తిరుమలలో జరిగే వేంకటేశ్వర స్వామివారి అభిషేకంలో పాల్గొనడానికి నిన్ననే వెళ్లారు. రేపు వచ్చేస్తారు. అంతవరకూ మీరు విశ్రాంతి తీసుకోండి’’ అని చెప్పి, బ్రాహ్మణుడు అటు వెళ్లగానే పరుగు పరుగున వేంకటాచలం చేరి శ్రీనివాసుని పాదాలపై పడి జరిగిన విషయమంతా చెప్పి స్వామి శరణు వేడాడు. 

శ్రీనివాసుడు ‘‘రాజా! నీకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. కానీ నీవు నాకు ప్రియభక్తుడివైనందువల్ల నేను వారిని బతికించి ఆ పాతకం నుంచి నిన్ను తప్పిస్తాను. అయితే ఇందుకు ప్రతిగా నేను ఇక నుంచి భక్తులెవరికీ దర్శనమివ్వడం కానీ, మాట్లాడటం కానీ జరగబోదు’’ అని చెప్పాడు. తను చేసిన అపరాధానికి ఇతర భక్తులను శిక్షించవద్దని అంటూ పరిపరివిధాలా స్వామిని వేడుకున్నాడు తొండమానుడు. భక్త సులభుడైన శ్రీనివాసుడు కరిగిపోయి, ‘‘నేను ఎవ్వరితోనూ మాట్లాడను, దర్శనమివ్వను కానీ నిష్కల్మషంగా ప్రార్థించే భక్తుల మనోనేత్రానికి దర్శనమిస్తాను. నా మౌనభాషలోనే సమాధానం ఇస్తాను. కలౌ వేంకట నాయకా’ అంటూ నేను ఈ తిరుమలపై ప్రసిద్ధి పొందుతాను’’ అంటూ తన శపథాన్ని సడలించాడు. తొండమానుడు కన్నీళ్లతో మరోసారి స్వామి కాళ్లు కడిగాడు. స్వామి ఆ నాటినుంచి తన భక్తులకు దివ్యదర్శనం మాత్రమే ఇçస్తూ ఆపదమొక్కులవాడయ్యాడు. భగవంతుడు భక్తుల మానప్రాణాలను కాపాడుతూనే ఉంటాడనేందుకు ఇదే మంచి నిదర్శనం. –డి.వి.ఆర్‌.భాస్కర్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top