రంగరంగ వైభవముగా...ప్రకృతి విందు చేయగా!

Special Story By AP Rao In Funday - Sakshi

దక్షిణ భారత సినిమా చిత్రీకరణ ‘వడ పళని’ స్టూడియోల గేటు దాటని రోజుల్లో, ప్రణయ గీతమైనా, కలహ పోరాటాలైనా షూటింగ్‌లకు ఛలో ‘హోగెనకల్‌’ అనేవాళ్లు. జలపాతాల అందాలతో పాటు, దట్టమైన అడవి, ఎల్తైన కొండలు, నిండుగ పారే కావేరి నది, డెబ్బై ఆరు కి.మీ సమీపంలో ‘మెట్టూరు జలాశయం’ శాండల్‌వుడ్‌ రాజధాని బెంగళూరుకు కేవలం 130 కి.మీలో వుండటం కలిసొచ్చే అంశాలు.
శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) సినిమాలో ‘మనసు పరవశించెనే..’ పాట. లొకేషన్‌ చూసినప్పుడే (నా పదహారవ ఏట) హోగెనకల్‌పై మనసు పారేసుకున్నాను. మా తిరుపతిలో, వానాకాలంలో మాత్రమే ఉరికే కపిలతీర్థం, తలకోన మొదలు, సముద్రంలా హోరెత్తే సంపూర్ణ నయాగరం వరకు చూసి పరవశించినా ‘హోగెనకల్‌’ కల మాత్రం ఊరిస్తూనే ఉంది. అది 2 నవంబర్‌ 2019లో నెరవేరింది.
హోగెనకల్‌ జలపాతం, ధర్మపురి జిల్లా తమిళనాడులో ఉంది. సమీప నగరం ‘హోసూరు’ పారిశ్రామిక నగరం, కోయంబత్తూరు రైలు మార్గంలో ఉంది. ఈ జలపాతానికి ‘భారతీయ నయాగరా’గా కూడా ముద్దు పేరు ఉంది. ఇది స్నానఘట్టాలకు, తైలస్నానాలకు, చేపల వంటకాలకు, కావేరి నదిలో జలవిహారాలకు పర్యాటకులకు అనువైన ప్రదేశం. జలపాతం చుట్టూ  ఆవరించి ఉన్న ఛ్చిటbౌn్చ్టజ్టీ్ఛ శిలలు, ప్రపంచంలో కెల్లా చాలా పురాతనమైనవి అంటారు. 
‘హోగెనకల్‌’కు అర్థం కన్నడంలో...‘హోగె’ అంటే పొగ, ‘కల్‌’ అంటే రాయి. అతి వేగంగా జలపాతం, రాళ్ళ మీద పడి పొగలాగ చిమ్మడం వల్ల ఈ పేరు వచ్చింది. తమిళులు ‘మరికొట్టాయం’ అని కూడా పిలుస్తారు.
పశ్చిమ కనుమల్లో, బ్రహ్మగిరి పర్వతాల్లో తలకావేరి వద్ద పుట్టిన కావేరి మాత పల్లంలో ప్రవహించి, ఉపనదులను కలుపుకొని ఇక్కడ విశాలంగా ప్రవహిస్తుంది. 
ఎల్తైన బండల మధ్య నుంచి, 66 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ, పిడుగులు పడ్డట్టు శబ్దాలు చేస్తుంది. ఇక్కడి నుంచి దక్షిణంగా 76 కి.మీ ప్రవహిస్తూ మెట్టూరు జలాశయంలో చేరుతుంది.
నీళ్లతో పాటు సారవంతమైన మట్టిని కూడా, తనతో తీసుకుపోయి వ్యవసాయానికి ఎంతో సాయపడుతుంది. ఈ ఊరు కొంత భాగం కర్ణాటక హద్దుల్లో, ఇంకొంత తమిళనాడులో వుంది, ఇది ‘ఉభయ రాష్ట్ర నగరం’
నైరుతి రుతుపవనకాలం హోగెనకల్‌ వరదలతో కళకళలాడుతూ, పర్యాటకులతో కిటకిటలాడుతుంది. మిగతా కాలంలో శని, ఆదివారాలు మాత్రమే జనంతో నిండి ఉంటుంది.
సీజన్‌లో పెద్ద పెద్ద బండలు, అంటే రాజనాల, కాంతారావు, ఎన్‌టిఆర్, సత్యనారాయణలు కత్తులు దూసిన ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి కనబడవు.
ఉష్ణోగ్రతలు వేసవిలో కూడా చల్లగా ఉంటాయి.
మా ప్రయాణం తిరుపతి నుంచి రెండంచెలుగా చేద్దాం అనుకున్నాం. తెల్లారే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి మధ్యాహ్నం సకాలంలో బెంగళూరు చేరాం. ఆరోజు అక్కడే బస చేసి పక్కరోజు ఉదయం ఏడు గంటలకు ‘ఎన్నేళ్లో వేచిన హోగెనకల్‌’ అంటూ హుషారుగా, జోరుగా ట్యాక్సీలో ప్రయాణం ప్రారంభించాము.
ఎలక్ట్రానిక్‌ సిటీ దాటగానే, తమిళనాడు సరిహద్దు టోల్‌గేట్‌లో పర్మిట్‌ తీసుకొని హోసూరులో ప్రవేశించాం. కన్నడంలో హోసూరు అంటే ‘కొత్త ఊరు’ అని అర్థం. దగ్గరలోని ‘అడయార్‌ ఆనందభవన్‌’లో అల్పాహారం తీసుకొని ప్రయాణ వేగం పెంచాం.
దారి పొడుగునా పచ్చని చెట్లు, పంట పొలాలు, కేరళలోలాగే రోడ్డు పొడవున ఇళ్ళు, ప్రతి అయిదు కిలోమీటర్లకు ఒక పల్లె ఉంది.
కాసేపట్లో కారు ‘ఘాట్‌ సెక్షన్‌’ ఎక్కింది. చుట్టు ఎల్తైన కొండలు, చెట్ల నడుమ చీల్చుకుపోతున్నాము. ఒక వీడియో తీద్దామన్నా పార్కింగ్‌ జాగాలేదు.
ఒక గంట తర్వాత మైదాన ప్రాంతంలోకి వచ్చాం. మళ్ళీ చిన్న చిన్న పల్లెలు, మరో అరగంటలో మరలా పర్వత ప్రాంతం మొదలైంది. లోయలోకి చూస్తే దట్టమైన అడవి, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు వగైరా క్రూరమృగాలు, విలువైన చందనం, ఔషధ చెట్లు ఉంటాయని డ్రైవర్‌ చెప్పాడు. ఒకప్పుడు ఈ కొండల్లో వీరప్పన్‌  ఉండేవాడని చెప్పాడు. తర్వాత ‘సత్య మంగళం’ అడవికి మకాం మార్చేశాడట. అక్కడే, కన్నడ సినిమా కథానాయకుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్‌ చేసింది.
రెండు గంటల ఘాట్‌ సెక్షన్‌ ప్రయాణంలో కడుపులో కలవరమయింది. లవంగాలు నమిలాము. బ్రేక్‌ఫాస్ట్‌ మితంగా తిన్నందున, ఏ సమస్య రాలేదు.
ఇక కావేరి నది ప్రాంతానికి వచ్చాం. కొండల నడుమ నదిలో నీళ్ళు మెరిశాయి. ఈ కొద్ది దూరం దారి ఏం బాగలేదు. మధ్య మధ్య నీళ్ళు పాయలుగా పారుతున్నాయి. పదినిమిషాల్లో విశాలంగా నది పారుతూ, హుందాగా దర్శనమిచ్చింది.
అహో! అందమైన ప్రకృతి!
చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు, తనిఖీలు చేసి హోగెనకల్‌కు వదిలారు.
ఊరు చాలా చిన్నది. లాడ్జీలు, హోటళ్ళు ఏవో ఉన్నాయి. ఇది పూర్తిగా పర్యాటకులపై ఆధారపడ్డ ఊరు.
మెయిన్‌గేట్‌ ముందు పార్కింగ్‌ ప్రాంతంలో కారు ఆపగానే ‘‘మీకు రుచిగా చేపల పులుసు చేస్తాం. చేప బజ్జీలు వేస్తాం’’ అంటూ మూగారు.
నది వద్దకు చేరాలంటే మెయిన్‌గేట్‌ నుంచి అరకిలోమీటర్‌ నడవాలి. బండ్లను అనుమతించరు. ఎడమవైపు తమిళనాడు పర్యాటకశాఖ ఆఫీసు, హోటళ్ళు ఉన్నాయి. కుడి ప్రక్క  చేపలను శనగపిండి, కారం అద్ది బజ్జీలు వేయడానికి సిద్ధంగా వున్నారు.
కార్తీక శనివారం అవటం చేత నదిలో పవిత్ర స్నానాలు చేసి వస్తున్నారు. ఏటి గట్టున వెదురుతో చేసిన పుట్టిలతో కళాసిలు ‘‘రండి రండని’’ చుట్టుముట్టారు. నేరుగా జలపాతాల దగ్గరికి పోవడానికి జలమార్గం తప్ప వేరే మార్గం లేదు. పుట్టిలో పోతేగాని జలపాతాలను చూసి ఆనందించలేము. ఇదే ఛాన్సు అని నలుగురికి గంట ‘జలయాత్ర’కు రూ,1400 డిమాండ్‌ చేస్తున్నారు.
 ఒక్కరూ తగ్గరు! టూరిజం వాళ్ళు ‘రూ.700 మాత్రమే’ చెల్లించండి’ అని బోర్డు పెట్టి తలుపులు తాళం వేసుకొని జారుకున్నారు. ఇంత దూరం వచ్చింది. ఊరికే ఏరు చూసి పోవడానికా?
రామచంద్ర అనే కళాసిని(బోట్‌మెన్‌) కుదుర్చుకున్నాం.
‘‘ఈ లెక్కన రోజుకు పదివేలు సంపాదిస్తావా?’’ అని అడిగాను. 
విషాదంగా నవ్వి ‘‘అంతా యూనియన్‌  వాళ్ళు తీసుకుంటారు. నాకు కూలి మాత్రమే ఇస్తారు’’ అని నిజం బయట పెట్టాడు.
‘‘వెళ్లడమా? మానడమా?’’ అని కొందరు తర్కించుకుంటున్నారు. 
రామచంద్ర పుట్టి మోసుకొచ్చి ఏట్లోకి వదిలాడు. మా నలుగురికి జాగ్రత్తలు చెప్పి కూర్చోపెట్టాడు. నీటిలో ప్రయాణం, ప్రధాన జలపాతం వైపు సాగుతోంది. మా అందరికి ఇదే మొదటి ‘పుట్టి’ ప్రయాణం–పుట్టి మీద పుట్టెడు భయం పుట్టింది. ఇటీవల గోదావరిలో జరిగిన సంఘటనలు మెదళ్ళలో మెదులుతున్నాయి. పైగా లైఫ్‌జాకెట్స్‌ కూడా లేవన్నాడు. కాసేపట్లో ఒక గట్టుకు చేర్చాడు.
బండల మీది నడిచి,శిథిలావస్థలో ఉన్న కర్రె వంతెనల మీద చిన్న ప్రవాహాలు దాటి ప్రధాన జలపాతం చేరుకున్నాం.
పక్క నుంచే హోగెనకల్‌ జలపాతం, ఉధృతంగా పడుతోంది.
‘‘ఆహా! ఏ బండలపైన, సినిమా యుద్ధాలు చేశారో, వలపు గీతాలు పాడారో ఆ ప్రసిద్ధ ప్రాంతంలో ఉన్నాం కదా!’’ అని థ్రిల్‌ అనుభవించాము.
మా వెనకే జలపాతం అగా«థంలో పడుతోంది. తుంపర్లు చిమ్ముతున్నాయి. ఫోటోలు, వీడియోలు తీయించుకున్నాం.
అగాథం తలచుకుంటే వెన్నులో వణుకు పుట్టింది. ఈ కొద్దిపాటి ఇరుకు బండల మీద ఎలా షూటింగ్‌ చేశారో? ఈ స్పాట్‌ నుంచి చూస్తే వరుసగా అక్క చెల్లెళ్ళలా పాయలు, పాయలుగా ఆరేడు జలధారలు పడుతున్నాయి.
మనోహర దృశ్యం!
ప్రధాన జలపాతం నుంచి పడ్డ కావేరి నది రెండు పాయలుగా పారుతుంది. ఒకటి విశాలంగా, మరొకటి ఇరుకుగా లోతుగా వున్నాయి.
రామచంద్ర పుట్టిని గొడుగులా మోసుకొచ్చి నదిలో వదిలాడు. మమ్మల్ని జాగ్రత్తగా మెట్లు దింపి సహాయం చేశాడు. దక్షిణంగా ‘మెట్టూరు’ వైపుగా నడిపాడు.
ఈ మార్గం విఠలాచార్య ఎన్నో సినిమాల్లో (జ్వాలాద్వీప రహస్యం) వాడుకున్నారు. ఒకచోట నీరు జోరుగా వస్తోంది. అక్కడ అయిదు నిమిషాలు ఆపాడు. నీటితుంపరులు పన్నీరు చల్లాయి. కార్తీకస్నానం షవర్‌బాత్‌లా అయిపోయింది. చెప్పలేని ఆ హాయి ఆహా! అనిపించింది.
ఇరుకు మార్గం నుంచి విశాలమైన నదిలోకి వచ్చాం. మైసూరు నుంచి వచ్చే వాళ్ళు ఆ గట్టు నుంచి ఎక్కుతారట! వాళ్ళు లైఫ్‌జాకెట్‌ వేసుకున్నారు.
‘‘ఏంటి రామచంద్రా’’ అంటే–
‘‘అవి కంపు కొడతాయి’’ అని సర్దేశాడు.
అక్కడ నది లోతు  150 అడుగులు. నురగలు కక్కుతూ కావేరి పారుతోంది. కుడిప్రక్క ఎల్తైన కొండలు రాత్రిపూట, పులులు, ఏనుగులు...వగైరా క్రూర మృగాలు కొండదిగి దాహం తీర్చుకుంటాయట.ఆ గట్టున ఇసుకు తిన్నెలు కూడా ఉన్నాయి. స్టంటు, దృశ్యాలు ఇక్కడ కూడా తీస్తారట.
రామచంద్ర ఇక్కడ పుట్టిని చక్రంలా గుండ్రంగా కాసేపు తిప్పాడు.
‘తెలి మబ్బుల కొండ కోనల పై, హంస వలె ఆడగా, రంగరంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా మనసు పరమళించింది. తనువు పులకరించింది.
ఇక తిరుగు ప్రయాణమయ్యాం. ప్రవాహానికి ఎదురు వెళ్తున్నాము..పాపం రామచంద్రా! శ్రమించి తెడ్డు వేస్తున్నాడు. గంటసేపు, నదిలో తిప్పినందుకు రూ,1400 మొదట ఎక్కువనిపించినా ఇప్పుడు మాత్రం తక్కువేమో! అనిపించింది.
నీళ్ళు నురగలతో పారుతుంది. జలపాతం నుంచి రావడం కదా!
కాసేపట్లో పుట్టిని గట్టుకు చేర్చాడు. రామచంద్ర సమేత ఫోటో దిగి కృతజ్ఞతలు తెలిపాం.
దగ్గర్లో ఉన్న ‘మొసళ్ళ పునరావసాల కేంద్రం’లో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రవేశించాం. ముప్పై మొసళ్ళు ఉంటాయి. భోంచేసి సుఖనిద్రలో ఉన్నాయి. ఇవన్నీ కావేరిలో కొట్టుకొచ్చినవే!
ఇక అక్కడ చూసేవి ఏం లేవు. వెంటనే తిరుగు ప్రయాణం ప్రారంభించాం. అందరు అలిసి నిద్రపోయారు. నాలుగు గంటలకు బెంగళూరు శివార్లలో ప్రవేశించాం. ఉడిపి హోటల్లో  కమ్మటి భోజనం చేసి బసకు చేరాం. పక్కరోజు శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయల్దేరాం.
ఇలా నా పదహారవ ఏట వచ్చి డెబ్బై రెండవ ఏట నిజమైంది.... నా స్వప్న సుందరి హోగెనకల్‌!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top