లేజీ టీన్స్

Special Story About Teens On 08/12/2019 - Sakshi

టీనేజీ కుర్రాళ్లు సాధారణంగా కళ్లాల్లేని గుర్రాల్లా ఉండాలి. ఆటపాటల్లో అలుపెరుగని ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉండాలి. టీనేజీ కుర్రాళ్లు ఎక్కడైనా ఎప్పుడైనా అలాగే ఉండాలి. అది వారి వయసు సహజ స్వభావం. ఇదివరకటి కాలంలో టీనేజీ కుర్రాళ్లు అలాగే ఉండేవాళ్లు. బడి ముగిశాక వీలుంటే స్కూలు మైదానాల్లో, వీల్లేకుంటే వీధుల్లో ఆటలాడుతూ, పరుగులు తీస్తూ కనిపించేవాళ్లు. అలసి సొలసిపోయే వరకు ఆటలాడి, ఆకలేసినప్పుడు ఇళ్లకు వెళ్లి కడుపునిండా శుభ్రంగా భోంచేసేవాళ్లు. సమీప గతంలో ఎక్కడ చూసినా టీనేజీ కుర్రాళ్ల దినచర్య ఇలాగే ఉండేది.

ఇప్పుడు పరిస్థితి మారింది. టీనేజీ కుర్రాళ్లు బడుల నుంచి ఇళ్లకొచ్చాక లేజీ లేజీగా టీవీలతోనూ, స్మార్ట్‌ఫోన్లతోనూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని నిరుపేద దేశాలను మినహాయిస్తే, భారత్‌ సహా మిగిలిన అన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇదేవిధంగా ఉంది. టీనేజీ కుర్రాళ్లు శారీరక వ్యాయామాన్నిచ్చే పనులకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి ప్రజారోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా బడికి వెళ్లే పిల్లల్లో దాదాపు 80 శాతం మంది రోజుకు కనీసం గంటసేపైనా శారీరక వ్యాయామాన్నిచ్చే ఆట పాటల్లో గాని, ఇంటి పనుల్లో గాని పాలు పంచుకోవడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల ప్రకటించింది. బాలురలో 78 శాతం, బాలికల్లో 85 శాతం మంది శారీరక వ్యాయామానికి దూరంగా ఉంటున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలను ‘ది లాన్సెట్‌ చైల్డ్‌ అండ్‌ అడాల్సెంట్‌ హెల్త్‌ జర్నల్‌’ బయటపెట్టడంతో అంతర్జాతీయంగా ఈ పరిస్థితిపై మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.

వివిధ ఆర్థిక పరిస్థితులు గల 146 దేశాలలో 11–17 ఏళ్ల వయసు గల 16 లక్షల మంది పిల్లలపై డబ్ల్యూహెచ్‌వో అధ్యయనం జరిపింది. ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఈ వయసు పిల్లలకు రోజూ కనీసం గంటసేపైనా శారీరక శ్రమ కలిగించే ఆటపాటలు, వ్యాయామం వంటి కాలక్షేపం ఉండాలి. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం నిరుపేదరికంలో మగ్గిపోతున్న టోంగా, సమోవా, అఫ్ఘానిస్తాన్, జాంబియా– ఈ నాలుగు దేశాల్లోని పిల్లలు మాత్రమే రోజూ కనీసం గంటసేపు శారీరక శ్రమనిచ్చే కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ నాలుగు దేశాల్లోనూ పిల్లలకు శారీరక శ్రమ ఉంటున్నా, అంతకు మించి పోషకాహార లోపం దారుణంగా ఉంటోంది. అది మరో సమస్య.

ప్రజారోగ్యానికే పెనుముప్పు
ఆర్థికంగా సంపన్న దేశాల్లోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అత్యధిక సంఖ్యలో పిల్లలు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో అధ్యయనం చేపట్టిన 146 దేశాల్లోనూ 107 దేశాల్లోనైతే శారీరక శ్రమ విషయంలో బాల బాలికల మధ్య వ్యత్యాసం 15 శాతం కంటే ఎక్కువగానే ఉంది. బాలుర కంటే బాలికలు శారీరక శ్రమలో బాగా వెనుకబడి ఉంటున్నారు. పరిస్థితి ఇదే రీతిలో కొనసాగితే సమీప భవిష్యత్తులోనే ప్రజారోగ్యానికి పెనుముప్పు ఏర్పడగలదని డబ్ల్యూహెచ్‌వో తరఫున ఈ అధ్యయనం చేపట్టిన నిపుణుల్లో ఒకరైన డాక్టర్‌ రెజీనా గథోల్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బాలలను శారీరక వ్యాయామం వైపు మళ్లించేందుకు ప్రపంచ దేశాలన్నీ సత్వరమే విధానపరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆటలాడటం, శారీరక వ్యాయామం బాలల హక్కు అని, వారికి అందుకు తగిన అవకాశాలు కల్పించాలని అన్నారు. టీనేజీ పిల్లలను శారీరక వ్యాయామం వైపు మళ్లించేందుకు ప్రభుత్వాలు సత్వరమే సమర్థమైన విధానాలను, కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలని, ఇందుకు సంబంధించి విద్య, పట్టణ ప్రణాళిక, రోడ్డు భద్రత వంటి అంశాల్లో మౌలికమైన మార్పులు తేవాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేస్తోంది. పిల్లలకు తగినంతగా శారీరక వ్యాయామం లేకుంటే, వారు స్థూలకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై, అకాల మరణాలకు బలయ్యే పరిస్థితులు తలెత్తగలవని డబ్ల్యూహెచ్‌వో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల మానసిక, శారీరక వికాసానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని, వారిని ఆ దిశగా మళ్లించేందుకు ప్రభుత్వాలకు గట్టి రాజకీయ సంకల్పం ఉండాలని డబ్ల్యూహెచ్‌వో నిపుణురాలు డాక్టర్‌ ఫియోనా బుల్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు పిల్లల్లో నలుగురు శారీరక వ్యాయామానికి దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దకుంటే భవిష్యత్‌ తరాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

పిల్లలకు వ్యాయామం ఎందుకంటే..?
ఎదిగే వయసులో పిల్లలకు తగినంత శారీరక వ్యాయామం అవసరం. ముఖ్యంగా 11–17 ఏళ్ల మధ్య పిల్లల్లో ఎదుగుదల వేగంగా ఉంటుంది. ఆ వయసు పిల్లలకు రోజూ కనీసం గంటసేపు సాధారణ శ్రమ కలిగించే స్థాయి నుంచి కాస్త తీవ్రస్థాయి శ్రమ కలిగించే వ్యాయామాలు అవసరం.ఈ వయసులో వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవీ...
►వేగంగా పరుగులు తీయడం, సైకిల్‌ తొక్కడం, ఆరుబయట ఆటలాడటం వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
►ఆరుబయట శరీరానికి శ్రమ కలిగించే ఆటలాడటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
►బరువులు ఎత్తడం, క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్‌ వంటి ఆటలు ఆడటం వల్ల కండరాలకు, ఎముకలకు దారుఢ్యం పెరుగుతుంది. వెన్నెముకకు దారుఢ్యం కలిగి నిలుచునే తీరు చక్కగా మారుతుంది.
►శ్రమ కలిగించే ఆటల వల్ల శరీరంలో కొవ్వు కరిగి స్థూలకాయం రాకుండా ఉంటుంది. బరువు ఆరోగ్యకరమైన రీతిలో అదుపులో ఉంటుంది.
►భవిష్యత్తులో స్థూలకాయం కారణంగా వచ్చే టైప్‌–2 డయాబెటిస్, హైబీపీ వంటి రుగ్మతలు రాకుండా ఉంటాయి.
►పిల్లలంతా కలసి మెలసి బృందాలుగా ఏర్పడి ఆడుకోవడం వల్ల పిల్లల్లో స్నేహశీలత, సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మానసిక ఆందోళన, డిప్రెషన్‌ దూరమవుతాయి.
►కొత్త కొత్త ఆటలు ఆడే క్రమంలో పిల్లలు కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలుగుతారు. ఆటల ద్వారా పిల్లల్లో ఆకళింపు శక్తి పెరుగుతుంది.
►గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఆటల వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి దూరమై, చక్కగా నిద్రపడుతుంది.

ఎలాంటి వ్యాయామాలు అవసరం?
ఎదిగే వయసులోని పిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. తరగతి గదుల్లో గంటల తరబడి కూర్చు ని గడిపేవారికి రోజూ కాస్త ఆటవిడుపు కావాలి. ఆటవిడుపు సమయంలో పిల్లలు టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా, కాస్త ఆరుబయట ఆట పాటల్లో కాలక్షేపం చేయాలి. సాధారణ శ్రమ కలిగించే వ్యాయామాలతో పాటు తీవ్ర శ్రమ కలిగించే వ్యాయామాల్లో పాల్గొనాలి. టీనేజీ పిల్లలకు రోజుకు కనీసం గంట సేపు శారీరక వ్యాయామం అవసరం. వారానికి మూడు రోజులు కాస్త తీవ్ర శ్రమ కలిగించే వ్యాయామాలు ఉండేలా చూసుకోవాలి.

►వేగంగా నడక, ఈత, సైకిల్‌ తొక్కడం, డ్యాన్స్‌ చేయడం, తోట పని, ఇంటి పనులు వంటివి సాధారణ శ్రమ కలిగించే వ్యాయామాలు. వ్యాయామంతో కూడిన ఇలాంటి వ్యాపకాలు ప్రతిరోజూ ఉండేలా చూసుకోవాలి.
►పరుగు, పరుగులతో కూడిన క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ వంటి ఆటలు శరీరానికి కాస్త తీవ్ర శ్రమను కలిగిస్తాయి. ఎముకలకు, కండరాలకు దారుఢ్యాన్ని కలిగించేలా బరువులు ఎత్తడం, గుంజీలు తీయడం, పుషప్స్, మెట్లు లేదా ఎల్తైన గుట్టలపైకి ఎక్కడం వంటి వ్యాయామాలు కూడా తీవ్ర శ్రమను కలిగించే వ్యాయామాల కోవలోకే వస్తాయి. టీనేజీ పిల్లలకు ఇలాంటి వ్యాయామాలు కనీసం వారానికి మూడు రోజులైనా అవసరం.

వ్యాయామం లేని పిల్లలు ఎదుర్కొనే అనర్థాలు
వ్యాయామం లేని జీవనశైలి కారణంగా పిల్లలకు అప్పటికప్పుడే ఎలాంటి అనర్థాలు వచ్చిపడకపోవచ్చు గాని, దీర్ఘకాలికంగా ఈ జీవనశైలి దారుణమైన దుష్ప్రభావాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి.
►తగినంత వ్యాయామం లేకుంటే స్థూలకాయం ఏర్పడే సమస్య ఎక్కువవుతుంది. స్థూలకాయం వల్ల చిన్న వయసులోనే టైప్‌–2 డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులు తలెత్తుతాయి.
►వ్యాయామం లేని పిల్లల్లో కండరాలు, ఎముకలు తగిన రీతిలో బలంగా ఎదగవు. ఇలాంటి వారు పెరిగే కొద్ది ఎముకలను బలహీనపరచే ఆస్టియోపొరాసిస్‌ వంటి వ్యాధుల బారినపడే అవకాశాలు ఉంటాయి.
►శారీరక వ్యాయామం లేనివారిలో మానసిక సై్థర్యం కూడా తక్కువ ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఇలాంటి వారు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో కుంగిపోయే అవకాశాలు ఉంటాయి.
►ఆరుబయట ఆటపాటల్లో గడపాల్సిన సమయంలో స్మార్ట్‌ఫోన్లు, టీవీ, ల్యాప్‌ట్యాప్‌ తెరల ముందు కాలక్షేపం చేయడం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతాయి.
►వ్యాయామం లేని పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి తరచు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
►వ్యాయామం లేని వారిలో ఊపిరితిత్తులు కూడా బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఉబ్బసం వంటివి తరచు ఇబ్బందిపెట్టే అవకాశాలు ఉంటాయి.
►దీర్ఘకాలం వ్యాయామం లేని జీవనశైలి గడిపేవారికి కొన్ని రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదం కూడా ఉంటుందని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి.

చాలా కొద్దిమందిని మినహాయిస్తే పిల్లల్లో ఎక్కువ మందికి ఆటపాటలపై సహజంగానే ఆసక్తి ఉంటుంది. పిల్లల ఆసక్తులను గమనించి తల్లిదండ్రులు వారిని ఆటల వైపు ప్రోత్సహించాలి. శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే ఇంటి పనులు చేయడం అలవాటు చేయాలి. స్వయంగా చేసే పనుల్లోని ఆనందం వారికి తెలిసేలా చేయాలి. ప్రతి పాఠశాలకూ క్రీడామైదానం, క్రీడా పరికరాలు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆటలను, వ్యాయామాన్ని పిల్లల రోజువారీ పాఠ్యప్రణాళికలో భాగం చేయాలి. పిల్లల శారీరక వ్యాయామ అవసరాలపై ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

భారత్‌లో ఇదీ పరిస్థితి
మన భారత్‌లో 73.9 శాతం టీనేజర్లు శారీరక వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. మన దేశంలో 71.8 శాతం బాలురు, 76.3 శాతం బాలికలు తగినంత శారీరక వ్యాయామం లేకుండా ఉంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇది కొంత నయమైన పరిస్థితి. టీనేజర్ల శారీరక వ్యాయామ పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో 2001–16 సంవత్సరాల మధ్య పదిహేనేళ్ల వ్యవధిలో వచ్చిన మార్పులపై అధ్యయనం జరిపింది. భారత్‌లో 2001 నాటికి 76 శాతం బాలురు తగినంత శారీరక వ్యాయా మం లేకుండా ఉండేవారు. బాలురు క్రికెట్‌ మోజులో పడటంతో ప్రస్తుతం ఈ పరిస్థితి కొంచెం మెరుగుపడి ఈ సంఖ్య 71.8 శాతానికి చేరుకుంది. శారీరక వ్యాయామానికి దూరంగా ఉండే బాలికలు 2001 నాటికి 76.6 శాతం ఉండగా, 2016 నాటికి 76.3 శాతానికి చేరుకుంది.

దీనిని పెద్ద మార్పుగా పరిగణించలేం. డబ్ల్యూహెచ్‌వో అధ్యయనంలోని గణాంకాలను సాధారణీకరించి చూడలేమని, భారత్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బాలల జీవన   శైలిలో వ్యత్యాసాలు చాలానే ఉన్నాయని, అలాగే వివిధ ఆర్థిక నేపథ్యాలు గల బాలల జీవనశైలిలోనూ గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి చెందిన వైద్యనిపుణుడు డాక్టర్‌ శశాంక్‌ జోషీ చెబుతున్నారు. భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బాల బాలికలు తమ దినచర్యలో భాగంగా చేసే పనులతోనే తగినంత వ్యాయామం పొందగలుగుతున్నారని, పట్టణాల్లోను, నగరాల్లోనే ఆ పరిస్థితులు లేవని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే, బాలలకు తగిన శారీరక వ్యాయామం లేని పరిస్థితులు భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే పరిస్థితులు లేకపోలేదని, ఈ పరిస్థితులను చక్కదిద్ది, బాలలకు తగిన వ్యాయామం లభించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

వ్యాయామానికి దూరం చేస్తున్నవివే...
టీవీ, స్మార్ట్‌ఫోన్లు, వీడియోగేమ్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వినోద సాధనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా  పిల్లల జీవన శైలిలో పెనుమార్పులు వచ్చాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ వినోద సాధనాలు పిల్లలను వ్యాయామానికి, ఆరుబయటి క్రీడలకు దూరంగా ఉంచుతున్నాయి. పాఠశాలల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి పిల్లలు తీరిక వేళల్లో టీవీ కార్యక్రమాలు, వీడియోగేమ్స్‌ వంటి వినోదాలకు అలవాటు పడుతున్నారు. మితిమీరిన పట్టణీకరణ కూడా పిల్లలను వారి సహజసిద్ధమైన ఆటపాటలకు దూరం చేస్తోంది.

పట్టణాలు, నగరాల్లోని ఇరుకిరుకు ఇళ్లల్లో, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లలో పిల్లలకు ఆడుకునేందుకు తగినంత విశాలమైన స్థలం కరువవుతోంది. చాలా చోట్ల కనీసం ఇళ్లకు చేరువగా పిల్లల పార్కులు కూడా ఉండటం లేదు. బడి తర్వాత ఇంటికి చేరుకుని, కాసేపు విశ్రాంతి తర్వాత పుస్తకాలు ముందేసుకుని చదువులో మునిగిపోయే పిల్లలను బుద్ధిమంతులుగా పరిగణించడం, ఆరుబయట ఆటల కోసం పరుగులు తీసేవారిని అకతాయిలుగా పరిగణించడం వంటి మిథ్యా సామాజిక విలువలు కూడా పిల్లలను వారి సహజసిద్ధమైన ఆటపాటలకు దూరం చేస్తున్నాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top