అన్నదాతా..! సుఖీభవ

అన్నదాతా..! సుఖీభవ


అన్ని దానాల్లో కల్లా గొప్పది ‘అన్నదానం’ అంటారు. అవును మరి, ఏ దానం చేసినా... తీసుకున్న వారికి తృప్తి ఉండదు. ఇంకా ఇచ్చుంటే బాగుండేదనే భావనతో చాలూ అనలేరు. కానీ ఒక్క అన్నదానం చేస్తే మాత్రం.. కడుపు నిండగానే వారు తృప్తిగా చాలూ అంటారు. అలాంటి దానాన్ని మనం ఏడాదిలో ఎన్నిసార్లు ఎంతమందికి చేసుంటామో ఆలోచించుకుందాం.ఇతర వృత్తుల్లో ఉన్నవారు అలాంటి దానం చేయడం వేరు. కానీ రోడ్డు మీద చిన్న షాపులో, ప్లేటుకు రూ.20 తీసుకుంటూ.. ఆ వచ్చే ఆదాయంతోనే బతుకుబండిని నడిపే వాళ్లు చేయడమంటే ఆషామాషీ కాదు కదా.. ఆకలితో ఉన్న మనిషి కడుపు నింపడం ఓ మహోత్తర కార్యమనే చెప్పాలి.



 దాంతో వచ్చే సంతృప్తి అంతాఇంతా కాదంటాడు అలహాబాద్‌కు చెందిన జోగేశ్‌ యాదవ్‌. హనుమాన్‌ గుడి దగ్గరున్న‡అతని చిన్న ఫుడ్‌ స్టాల్‌కు వచ్చే వికలాంగులందరికీ డబ్బులు తీసుకోకుండా, వారి ఆకలిని తీరుస్తాడు. ఇలా గత నాలుగేళ్లుగా ఎంతోమంది ఆకలిని తీరుస్తున్నాడు జోగేశ్‌.ఇలా వికలాంగులకు ఉచితంగా భోజనం పెట్టాలన్న ఆలోచన జోగేశ్‌ది కాదట. ఓ రోజు తన కొడుకు బాబీ, తండ్రి దగ్గరకు వచ్చి ‘‘నాన్నా... ఇలా అందరి దగ్గరా డబ్బులు తీసుకోకుండా, రోజుకు కొంతమంది పేదవాళ్లకు ఉచితంగా భోజనం పెడితే మనకు ఏమైనా నష్టం కలుగుతుందా?’’ అన్నాడట.



ఆ ఆలోచన జోగేశ్‌కు బాగా నచ్చింది. అనుకున్నదే తడవుగా ఇకపై తన షాపుకు వచ్చే ప్రతి వికలాంగుడికి ఉచితంగా భోజనం పెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుంచి వారు ఏది కావాలంటే, అది ఉచితంగా సర్వ్‌ చేస్తున్నాడు. సంపాదించిన డబ్బుకన్నా దానివల్ల దొరికే తృప్తే ఎంతో గొప్పదిగా భావిస్తానంటాడు జోగేశ్‌.‘‘మా దగ్గర భోజనం చేసే చాలామంది వికలాంగులు ఉచితంగా తినడానికి ఇష్టపడరు. తాము డబ్బులు ఇచ్చే స్థితిలో ఉన్నామంటారు. కానీ నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వారికి చెబుతూ ఉంటాను.



అయినా ఇలాంటి గొప్ప ఆలోచన వచ్చిన నా కొడుకును చూసి, నేను చాలా గర్వపడతాను’’ అని జోగేశ్‌ చెబుతుంటాడు. ఇదో పెద్ద సేవ కాదని, ఏదో తమ తృప్తి కోసం చేస్తున్నానంటాడు అతను. అయినా... తన ఆదాయం దెబ్బ తింటుందని తెలిసి కూడా ఇలా చేయడం గొప్ప విషయమే కదా. ఇలాంటి వారిని మనం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి. మనకు చేతనైన సాయం ఎదుటివారికి చేయడంలో దొరికే ఆనందం, సంతృప్తి మరెక్కడా దొరకదు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top