ధనాధ్యక్షుడి ధనదక్షత

ధనాధ్యక్షుడి ధనదక్షత


పూర్వం ఒకసారి భూలోకంలోని ఒక దేశంలో ఎవరూ ఊహించలేనంతటి దుర్భిక్షం ఏర్పడింది. వర్షాలు పడక, తినడానికి తిండిలేక, కొద్దిపాటి ఆహారం కోసమే ఒకరినొకరు చంపుకునేటంతటి కరువది. అలాంటి పరిస్థితులలో ఆ దేశపు రాజుకు కులగురువు ఒక సలహా ఇచ్చాడు. అదేమంటే, వారి కరువు తీర్చడం మామూలు వారి వల్ల అయ్యే పని కాదనీ, కనుక అలకాపురాధీశుడయిన కుబేరుడి సాయం కోరడం మంచిదనీ. దాంతో ఆ రాజు రాజోద్యోగులు, మంత్రులు, పురోహితులు వెంటరాగా, అలకాపురిలో కుబేరుడి నివాసానికి చేరుకున్నాడు. వారు కుబేరుడి వద్దకు వెళ్లిన సమయంలో అక్కడ ధాన్యం నిల్వ ఉండే స్థానం దగ్గర, సాధారణమైన దుస్తులలో ఉన్న ఒక వ్యక్తి కూర్చొని, మట్టిలో పడిన ధాన్యపు గింజలను ఏరుకుంటున్నాడు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే కుబేరుడు రాజుగా ఉన్న అలకాపురిలో వారికి ఆ సంఘటన వింతగా అనిపించింది.



మంత్రి ఒకడు అతని వద్దకెళ్లి, ‘‘మహారాజుగారైన కుబేరుడు ఎక్కడ ఉన్నారు?’’అని అడిగాడు. అతను వారిని సాదరంగా లోనికి ఆహ్వానించి, కూర్చొండబెట్టి, తానే కుబేరుడనని తెలియజేసి వచ్చిన పనేమిటో చెప్పమని అడిగాడు. వారు మరింత ఆశ్చర్యపోతూ కించిత్‌ అసహనంగానే, తామెవరమో, ఎక్కడినుంచి వచ్చామో తెలిపారు కానీ, ఎందుకొచ్చారన్నదీ తెలియజేయకుండానే వెనుదిరగబోయారు... ధాన్యం గాదె వద్ద మట్టిలో పడిన గింజలను ఏరుకునే స్థితిలో ఉన్న ఆ రాజు తమకేమి ఇవ్వగలడన్నదే వారి చిన్నచూపుకు కారణం.



అయితే కుబేరుడు, వారిని మరి కొద్దిసేపు అక్కడే కూర్చోమని వినయంగా చెప్పి, ముందుగా వారికి షడ్రసోపేతమైన భోజనం పెట్టించి, తర్వాత తన సేవకులను పిలిచి, తన ధాన్యాగారం నుంచి కొన్ని వందల ధాన్యపు బస్తాలు తెప్పించి, బళ్లమీదికి ఎత్తించి, వారిని సాదరంగా సాగనంపాడు. అయితే, అలకాపురి నుంచి వీరి రాజ్యానికి వెళ్లే దారి, తీవ్రమైన ఎగుడుదిగుళ్లతో కూడి ఉండి, ధాన్యపుబళ్లు ప్రయాణించేందుకు ఏమాత్రం యోగ్యంగా లేదు. గుర్రాలపై వీరు వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితి కూడా లేదక్కడ. గుట్టలను, మెట్టలను సమం చేసేందుకు కూడా ఆ పరిసర ప్రాంతంలో కొండరాళ్లు తప్ప ఇసుక, మట్టి లేదసలు. ఆ రాళ్లతో గోతులు నింపి, రహదారిని బాగుచేయాలంటే చాలాకాలం పట్టేలా ఉంది.



 దాంతో చేసేదేమీ లేక, అలకాపురి నుంచి వీరిని సాగనంపేందుకు వచ్చిన రాజోద్యోగులు ఇదే విషయాన్ని తమ రాజుగారికి వివరించారు. అప్పుడు కుబేరుడు మరిన్ని వందల బస్తాల ధాన్యాన్ని, బళ్లను తెప్పించి, వారితో ముందువెళ్లిన ధాన్యపు సంచులనన్నింటినీ ఆ గోతులలో పోసి, ఎత్తుపల్లాల్ని సరి చేసి, వాటిపై నుంచి ఈ బళ్లను తోలుకెళ్లమని చెప్పాడు. విషయాన్ని తెలుసుకున్న రాజు, అతని మంత్రులు ఉండబట్టలేక కుబేరుడి వద్దకు వెళ్లి, ‘‘స్వామీ! మేము వచ్చిన సమయంలో మీరేమో, మట్టిలో పడ్డ కొద్దిపాటి ధాన్యపు గింజలను కూడా ఏరుకుని భద్రపరుచుకుంటున్నారు. ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని చూసి, మిమ్మల్ని సాయం చేయమనడానికి మనస్కరించక, మేము వెనుదిరగాలనుకున్నాము. మీరు మాకు వందలకొద్దీ ధాన్యపు బస్తాలను ఇచ్చి పంపారు.



బాట సరిగా లేనందువల్ల ఇప్పుడేమో, తిరిగి ఆ ధాన్యపు బస్తాలనన్నింటినీ గోతులలో పోసి పూడ్పించి, తిరిగి రెట్టింపు ధాన్యపు బస్తాల ధాన్యాన్ని ఇచ్చి తీసుకెళ్లమంటున్నారు. ఇందులోని ఆంతర్యం ఏమిటి?’’అని అడిగారు. అందుకు కుబేరుడు నవ్వి, అన్నం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. దానిని ఏమాత్రం అలక్ష్యం చేయరాదు. వృథా చేయరాదు. అలాగే అడిగిన వారికి లేదనకుండా సాయం చేయడం అలకాపురాధిపతిగా నా నియమం. అయితే, మీరు వెళ్లే మార్గం సరిగా లేనందువల్ల ఆ మార్గాన్ని సరి చేసి, మీరు తిరిగి వెళ్లేందుకు బోలెడంత సమయం పడుతుంది. ఈలోగా మీ రాజ్యప్రజలు ఆకలితో మృత్యువాత పడే ప్రమాదం ఉంది.



ఈ సమయంలో వందలాది మంది ప్రాణాలు నిలపడం ముఖ్యం. అందువల్ల ఆ ధాన్యం బస్తాలను విప్పి, ఎత్తుపల్లాలను సరి చేయమన్నాను. ధాన్యం మూటలతో మీరు మీ రాజ్యానికి వెళ్లిన తర్వాత నేను తిరిగి, ఆ గోతులలో నుంచి ధాన్యాన్ని వెలికి తీసి, ధాన్యాగారానికి రప్పించుకోగలను’’అని సమాధానం చెప్పాడు. ఈ సంఘటనను బట్టి ధనాధ్యక్షుడయిన వారికి సంపదను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, అవతలి వారి ప్రాణాలను కాపాడటమూ అంతే ముఖ్యమని అర్థం అవుతుంది. తగువిధంగా ఉపయోగించడమంటే, పిసినారితనంగా ఉండటం కాదని కూడా తెలుస్తుంది.

– డి.వి.ఆర్‌ భాస్కర్‌

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top