చివరి కోరిక

Special Story On 08/12/2019 In Funday - Sakshi

అది నవంబరు ఆదివారం. నేను నా కారును నడుపుకొంటూ హబ్బాకాదల్‌ వంతెన వైపు వెళుతున్నాను. ఇది వితాస్తా నదిపై రెండో ప్రఖ్యాత వంతెన. కారు అద్దాలు మూసే ఉంచాను. పైకోటూ, ఉన్ని మఫ్లరూ, ఉన్ని టోపీ ధరించి ఉన్నప్పటికీ చలి నా పాదాలలోనికీ, వెన్నెముకలోనికీ పాకుతోంది. రోడ్డు మీది పాదచారులపై బురద చిమ్మకుండా నెమ్మదిగా కారు నడుపుతున్నాను.
నన్నాజీ ఆ వంతెనపైనున్న కాలి బాట వద్ద నా కోసం వేచి ఉన్నాడు. నన్ను చూసి కారు వైపు వచ్చాను. కారు ఆపి అతణ్ణి లోనికి ఎక్కించుకున్నాను. ఒక వంద గజాల దూరంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం వద్ద ఆపమన్నాడు. అక్కడి నుంచి ద్రాబియర్‌లో ఉన్న వారి ఇంటికి కాలినడకన బయల్దేరాం.
అలనాటి నా పాఠశాల టీచరు గోపీనాథ్‌ ద్రాబూగారు నన్ను భోజనానికి పిలిచారు. అంతకు ముందు నేనెప్పుడూ వారింటికి వెళ్లలేదు. వారి కుమారుడు నన్నాజీ ఇప్పుడు తమ ఇంటికి దారి చూపుతూ నన్ను తీసుకువెళుతున్నాడు. ఆ దారి సందులు గొందుల గుండా ముందుకు పోతోంది. ఇరువైపులా మూడు నాలుగు అంతస్తుల ఇల్లుంది. దారి పొడవునా నీడలు కమ్ముకున్నాయి. ఆ భవనాల బాల్కనీలు ఎదురెదురుగా ఇంచుమించు ఒకదానినొకటి తాకుతున్నాయి.
ద్రాబూ వంశంవారు కొన్ని వందల సంవత్సరాల కిందట అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోవడం వల్ల ఆ ప్రాంతాన్ని ద్రాబియర్‌ అనే పేరు వచ్చిందని మా టీచరు చెబుతుండేవారు. 
ఇప్పటి ఈ నా రాకను నేను కొన్ని వారాల పాటు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాను.
ఒకనాడు నేను టీచరు గోపీనాథ్‌గారి ప్రియాతిప్రియమైన శిష్యుడిని. ఈ రోజు నగరంలో పేరున్న డాక్టర్లలో ఒకరిగా ఎదిగాను. ఆయన నాకు శ్రీనగర్‌లోని రాంగ్‌టెంగ్‌ హైస్కూలులో పాఠాలు చెప్పేవారు. ఆ పాఠశాల వితాస్తా నది ఒడ్డునే ఉండేది.
మబ్బులూ చినుకులూ లేని రోజుల్లో మాస్టారు మాకు బడి వరండాలో క్లాసులు తీసుకునేవారు. సన్నని సూర్యకాంతిలో వినీలాకాశం కింద పాఠాలు చెప్పడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన గొప్ప ప్రకృతి ప్రేమికుడు. ఆరుబయటి సూర్యకాంతి మనసులను రంజింపజేసి బోధన ప్రక్రియను ఉత్తేజపరుస్తుందని ఆయన దృఢంగా నమ్మేవారు. గోపీనాథ్‌గారు మాకు ఇంగ్లిషు పద్య గద్య వ్యాకరణాలతో పాటు భాషలోని సంక్లిష్టతను, వైవిధ్యాన్నీ సరళంగా బోధపరచేవారు.
మిగతా టీచర్లు మా అరచేతులపైనా వీపులపైనా బెత్తలను విచక్షణారహితంగా వినియోగించేవారు. ఆయన మాత్రం బెత్తం పట్టుకోవడం నేనెప్పుడూ చూడలేదు. కనీసం పిల్లలను అదిలిస్తూ ఒక పరుషమైన మాట కూడా అనేవారు కాదు.
ఆయన సన్నగా సాధారణ ఎత్తులో ఉండేవారు. నిటారుగా నిలబడేవారు. తెల్లని తలపాగా చుడీదార్‌ ధరించేవారు. ఆ వేషధారణ వారికి ఎంతో హుందాతనాన్నిచ్చేది. సూది ముక్కుపై లోహపు ఫ్రేమ్‌ గల కళ్లద్దాలు ఎంతో అందాన్నిచ్చేవి. విద్యార్థులు ఆయనను ఎంతో గౌరవించేవాళ్లం. ఆ స్నేహపూర్వకమైన వైఖరి మిగిలిన టీచర్లకంటే భిన్నంగా ఉండేది. కేశవ్‌నాథ్‌గారు ఉగ్రస్వభావం గలవారు. ప్రేమ్‌నాథ్‌గారు నోటిదురుసు ఎక్కువగా గలవారు. జియానాథ్‌గారి ఎడమచెయ్యి మా చెక్కిళ్ల మీదనే ఉండేది. కాని గోపీనాథ్‌గారు తన మృదువాక్కుతో సాధుస్వభావంతో చిరునవ్వుతో మా హృదయాలను ఆకట్టుకునేవారు. 
నాకు సంబంధించి వారితో అనుబంధం ప్రత్యేకమైనది. నన్ను ఎప్పుడూ మంచి భవిష్యత్తు గల కుర్రాడిగానే చూసేవారు. దయగానూ ఎంతో నమ్మకంతోనూ ఉండేవారు.
ఆ పాఠశాలలో ప్రతి తరగతిలోనూ మూడు సెక్షన్లుండేవి. ప్రతి సెక్షన్‌లోనూ ముప్పయి మంది విద్యార్థులే ఉండేవారు. ముగ్గురు క్లాస్‌ టీచర్లూ ఒక చోట కూర్చుని చర్చించుకుని, గత పరీక్షలో ఆయా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా విభజించుకునేవారు. నేను ఎనిమిదో తరగతిలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడినయ్యాను. గోపీనాథ్‌గారు నన్ను తన సెక్షన్‌లో విడిచిపెడితే మిగిలిన విద్యార్థులు ఏ ర్యాంకు వారైనా అభ్యంతరం లేదని వక్కాణించారు. దాంతో నేను గోపీనాథ్‌గారి సెక్షన్‌ విద్యార్థినయ్యాను.
మొదటగా నా ఇంగ్లిషు భాషా నైపుణ్యాన్ని పెంచే దిశగా మాస్టారు ప్రయత్నించారు. ప్రతిరోజూ ఒక వ్యాసం రాసి తెమ్మనేవారు. నాకది కష్టంగానే ఉండేది. సీనియర్లనీ మా నాన్నగారినీ సంప్రదించేవాడిని. ఆడుకునే సమయాన్ని కోల్పోయేవాడిని. కాని కొద్దిరోజుల్లోనే మంచి ఇంగ్లిషు చక్కగా రాయడానికి అలవాటుపడ్డాను. మొదట్లో నా వ్యాసాలు నచ్చకపోతే తిరగ రాయమనేవారు. రానురాను వాటిని చిరునవ్వుతో మెచ్చుకోలు సూచనగా తల ఊపుతూ ఆయన పైకి చదివేవారు. నన్ను గర్వంగా ఇతర టీచర్లకు చూపేవారు.
మాస్టర్‌ అఫ్జల్‌ అనేవారు చరిత్ర పాఠాలు చెప్పేవారు. చిన్న పొరపాటుకైనా బెత్తానికి పని కల్పించేవారు. గోపీనాథ్‌గారు ఆయనకు నా వ్యాసాలను చూపేవారు. అఫ్జల్‌గారికి చరిత్రలో ముఖ్యమైన తేదీల గురించి కొంత తడబాటు ఉండేది. కాబట్టి విద్యార్థులు చరిత్ర తేదీలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలని శాసించేవారు. అఫ్జల్‌గారు విరామ సమయంలో గోపీనాథ్‌గారి వద్ద ఇంగ్లిషు నేర్చుకునేవారు. ఈ స్థితిలో ఆయన నేను రాసిన వ్యాసాలను చదవాల్సి వచ్చేది. ఆ విధంగా నేను ఆయనకు పరోక్ష బోధకుడినయ్యాను. ప్రతిఫలంగా ఆయన చేతిలోని బెత్తం నాకిచ్చి సరైన జవాబు చెప్పలేని నా తోటి విద్యార్థులను నా చేతనే దెబ్బలు కొట్టించేవారు. నేను వారికి తగిలీ తగలనట్లుగానే చిన్న దెబ్బలు కొట్టేవాడిని. అయినా నా సహపాఠులకు అది సహజంగానే నచ్చేది కాదు. నా చేత దెబ్బలు తినడం కంటే అఫ్జల్‌గారి చేత గట్టి దెబ్బలు తినడానికే ఇష్టపడేవారు.
గోపీనాథ్‌గారు పాఠం చెబుతూ తరగతిలో ఇతర విద్యార్థులెవరూ లేనట్లు నావైపే చూసేవారు. అంచేత నేను పరిపూర్ణమైన శ్రద్ధాసక్తులతో ఆయన పాఠం వింటూ తల ఊపవలసి వచ్చేది. ఆయన ప్రశ్నలకు ఎవరూ జవాబు చెప్పలేకపోతే అప్పుడు నావైపు చూసేవారు. ప్రతిసారీ నేను సరైన సమాధానాన్ని తప్పకుండా చెబుతానని ఆయన నమ్మకం.
మాస్టారు తనతో పాటు వారి ఐదేళ్ల అబ్బాయి నన్నాజీని బడికి తెచ్చేవారు. పాఠం జరుగుతుండగా నా పక్కనే కూర్చుండబెట్టేవారు. ఆ కుర్రవాడిని నా వద్దనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోవడం నాకు గర్వకారణంగా ఉండేది.
ఆనాటి నన్నాజీయే ఇప్పుడు పెద్దవాడై నన్ను తన తండ్రిగారి వద్దకు తీసుకువెళుతున్నాడు.
నేను మెట్రిక్యులేషన్‌ పాసై కళాశాల చదువు కోసం దూరంగా వెళ్లడం వల్ల మాస్టారికి కాస్త దూరమయ్యాను. అయినా ఎప్పుడు సెలవుల్లో వచ్చినా బడికి వెళ్లి వారిని కలుసుకునేవాడిని. ఆయన వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించేవారు.
యూనివర్సిటీ ఫైనల్లో నాకు ఆరో ర్యాంకు వచ్చింది. కాని గోపీనాథ్‌గారికి ఆ ర్యాంకు సంతృప్తినివ్వలేదు. నాకు మొదటి ర్యాంకే రావాలని వారి వాంఛ. ఆ తర్వాత వైద్య విద్య కోసం పటియాలా, ఢిల్లీ పోయాను. నేను మెడిసిన్‌లో పీజీ పూర్తి చేసి వచ్చేసరికి శ్రీనగర్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటైంది. నేను ఆ సంస్థలో అధ్యాపకుడిగా చేరాను. 
ఈ మధ్యకాలంలో నన్నాజీ బీఏ పాసై ఏజీ ఆఫీసులో గుమాస్తాగా చేరాడు. అతడు తన తండ్రిగారి ఆశలను అందుకోలేకపోయాడనే చెప్పాలి.
సుమారు ఐదేళ్ల తర్వాత నేను స్వతంత్రంగా ప్రాక్టీసు మొదలుపెట్టాను. ద్రాబియార్‌కు సుమారు మైలు దూరంలో ఉన్న ఛోటాబజారులో హాస్పిటల్‌ పెట్టుకున్నాను.
గోపీనాథ్‌గారు వైద్య సలహా కోసం ఒకసారి నా వద్దకు వచ్చారు. మేం సుమారు దశాబ్దం తర్వాత కలుసుకున్నాం. మాస్టారూ రిటైరైపోయారు. నేనూ చాలా మారిపోయాను. కాని నా పట్ల వారికి గల ఆదరాభిమానాలు చెక్కుచెదరలేదు. నన్ను చూడగానే గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. అదొక భావోద్వేగపూరితమైన పునఃసమాగమం. మాస్టారు తన వయసు కన్నా ఎక్కువ వార్ధక్యం పొందినట్లు కనపడుతున్నారు. బాగా బలహీనంగా ఉన్నారు.
మాస్టారు ఆహారం మింగడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి ఆహారానికే చాలా ఆయాసపడిపోతున్నారు. కొద్దిరోజులుగా ద్రవపదార్థాలు కూడా దిగడంలేదు. చాలా బరువు కోల్పోయారు. పేలవంగా తన రూపానికి నీడలాగ తయారయ్యారు. మందుల వల్ల ప్రయోజనం కలగడంలేదు. ఈ లక్షణాలన్నీ ఆహారవాహికలో ఏదో అవరోధాన్ని సూచిస్తున్నాయి. పరీక్షల్లో క్యాన్సర్‌ నిర్ధారితమైంది. పెనుభూతం వంటి ఈ వ్యాధి కశ్మీరీలలో తరచుగా కనిపిస్తోంది. నేను కౌమారంలో ఉండగా మా పినతండ్రి ఒకరు ఈ వ్యాధితోనే చనిపోయారు. అది ఇప్పుడు నా ప్రియతమ ఉపాధ్యాయునికి సోకింది.
గోపీనాథ్‌గారిని నా నర్సింగ్‌హోమ్‌లోనే చేర్చుకున్నాను. ఈసోఫేజియల్‌ క్యాన్సర్‌ వ్యాపిస్తోంది. ట్రీట్‌మెంట్‌ ఇస్తూనే నా వైద్య సహచరులను మరింత మంచి వైద్యం కోసం సంప్రదించాను. ఏమీ లాభంలేదు. ఇది వారు కేవలం ఉపశమన వైద్యం మాత్రమే తట్టుకునే వయసు. తాత్వికంగా అనివార్యమైన పరిణామానికి మానసికంగా సన్నద్ధం కావలసిన వయసు. ఒక క్రూరమైన గమ్యానికి తనను తాను మౌనంగా సమర్పించుకోవలసిన వయసు.
ఈ దశలో వైద్య ప్రయోగాలు ఏమీ చేయకుండా రోగిని మరింత బాధపెట్టకుండా ఒక ప్రశాంతమైన నిష్క్రమణ కోసం ఇంటికి, బంధుజనాల మధ్యకు పంపేస్తారు.
నా ప్రియమైన గురువుగారికి వ్యాధి తీవ్రతను, వైద్యశాస్త్రపు నిస్సహాయతను వివరించాను. కాని ఆయన ప్రియతమ శిష్యుడినైన నేను ఏదో అద్భుతం చేయగలనేమోనని వారిలో ఇంకా ఆశ కొట్టుకుంటోంది.
‘‘నువ్వు తప్పకుండా నాకు కాస్త ఉపశమనం కలిగించగలవు. ఇంకెన్నో ఏళ్లు జీవించెయ్యాలని లేదు. కొంచం ఆహారం మింగగలిగితే చాలు. అదే పదివేలు’’ అన్నారు.
నా పట్ల వారి నమ్మకం చెక్కుచెదరనిది. ఒక గురువుగారికి తన ప్రియశిష్యుడి పట్ల గల అచంచల విశ్వాసం అది. కాని వైద్యశాస్త్రానికీ పరిమితులు ఉంటాయి. అసాధ్యాలు సాధ్యాలు కావడం చాలా అరుదు.
ఒక చిన్న శస్త్రచికిత్స చేసి జీర్ణాశయం లోనికి ఒక గొట్టాన్ని చొప్పించి నేరుగా ఆహారాన్ని పంపే ఏర్పాటుకు వారిని ఒప్పించాను. మరోమాట లేకుండా నా ప్రతిపాదనకు వారు అంగీకరించారు. పోషణను పెంచడానికి రక్తనాళాల ద్వారా పదార్థాలను పంపుతున్నాను. రక్తాన్ని కూడా మార్పిడి చేసి చూశాను. ఫీడింగ్‌ ట్యూబు అమర్చి తన మటుకు తన ఆహారాన్ని లోనికి పంపుకునేలా చేశాను. పదిరోజుల తర్వాత డిశ్చార్జి చేసి ఇంటికి పంపాను. ఆ ట్యూబ్‌ని దుస్తుల్లో ఎలా దాచుకోవాలో, దాని చుట్టూ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించాను.
కొద్ది రోజుల్లోనే తన గురించి తన జాగ్రత్త తీసుకోవడానికీ, కొత్త జీవన విధానానికీ అలవాటు పడ్డారు. అప్పుడప్పుడు హాస్పిటల్‌కు వచ్చి చూపించుకుని వెళుతున్నారు. కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు. కొంచెం బరువూ పెరిగారు.
ఇలా సంప్రదించడానికి వచ్చినప్పుడు ఒకసారి నన్ను వారు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఏదో ఒక సాకు చెప్పి నేను వారి ఆతిథ్యాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. మరి కొద్ది నెలల్లోనే ఆయన మరణిస్తారని నాకు తెలుసు. ఆయన ఆహార వాహిక సమస్యతో బాధపడుతూ ఉండగా అతిథిగా వెళ్లి నేను వారి ఇంట్లో భోజనం చేయడం నాకు ఇంగితంగా అనిపించలేదు. అంతేకాదు వారి పెన్షనూ, నన్నాజీ జీతమూ తక్కువగానే ఉంటాయి. నాకిచ్చే విందు కుటుంబ బడ్జెట్‌ మీద ప్రభావం చూపవచ్చు. ఇన్ని కారణాలు నన్ను వెనక్కు తీస్తున్నాయి. 
మరికొద్ది రోజుల్లో మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. గోపీనాథ్‌గారి ఆహ్వానాన్ని నేను ఐదోసారి వాయిదా వేయడం వల్ల ఆయన చాలా బాధపడ్డారు. ‘‘నేనేమైనా అంటరానివాడినా నాయనా!’’ అని అన్నారు.
ఇక తప్పదని అంగీకరించాను.
‘‘రానున్న ఆదివారమైతే బాగుంటుంది’’ అన్నారు వారు.
‘‘మాస్టారూ! శరత్‌కాలం మంచు కురవడం మొదలైన వెంటనే వస్తాను’’ అన్నాను.
ఈసారి ఆయన బరువు తగ్గిపోతున్నారు. క్యాన్సరు శరీరమంతా వ్యాపిస్తోంది. కంఠంలోని కంతితో పాటు మరికొన్ని కంతులూ ఏర్పడుతున్నాయి. ఆయన జీవితం మరికొద్ది వారాలేనని గ్రహించాను.
ఈసారి ‘‘నేను చనిపోయిన తర్వాత మా ఇంటికి వస్తావా?’’ అన్నారు. నేను సిగ్గుతో సంకోచించాను. ‘‘నేను తప్పకుండా వచ్చి మీ ఇంట్లో తింటాను’’ అన్నాను.
‘‘అయితే ఈ ఆదివారమే పెట్టుకుందాం’’. వారి కళ్లలో ఒక ఉత్సాహం, వారి గొంతులో ఒక సంతోషపు జీర నేను గమనించాను. ‘‘నీకేమిష్టమో చెప్పవూ!’’ అన్నారు.
‘‘మాస్టారూ! నాకు చేపల కూరా, బ్రౌన్‌రైస్‌ ఇష్టం’’ అనేశాను. కాని ఎందుకు నోరుజారానా అని తర్వాత పశ్చాత్తాపపడ్డాను.
‘‘మరింకేం చేపలకూర నా భార్య చక్కగా వండుతుంది’’ అని ఉప్పొంగిపోయారు.
బహుశ తను ఎక్కువకాలం బతకాలని కోరుకోవడం కంటే ఇంకా ముందుగానే మంచు కురవాలని మాస్టారు ప్రార్థించి ఉంటారు. ఆ సంవత్సరం నవంబరులోనే మంచు కురిసింది. మరోసారి తనే స్వయంగా వచ్చి తన ఆహ్వానాన్నీ నా అంగీకారాన్నీ గుర్తు చేయాలనుకున్నారు. కాని చాలా బలహీనపడిపోయారు. తనకు మారుగా కుమారుడిని పంపించారు. అది శుక్రవారం. ముందుగా చెప్పినట్లు ఆదివారం ఖరారు చేశాను.
ఆ విధంగా నాకు దారి చూపడం కోసమే నన్నాజీ ఇప్పుడు వంతెన వద్ద వేచి నన్ను తీసుకెళుతున్నాడు.
మాస్టారు నన్ను సాదరంగా స్వాగతించారు.
నేను ఆ తక్కువ ఎత్తు గల ఇంట్లోనికి ప్రవేశించగానే వారి కళ్లు మెరిశాయి. గది చాలా చిన్నది. ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మాస్టారు ఆ గదిలో ఒక మూల కిటికీ వద్ద తివాచీ మీద పడుకుని ఉన్నారు. లేచి నిల్చోవడానికి ఆయనకు శక్తి చాలదు. బలవంతంగా కూర్చుని చేతులు చాచి నన్ను ఆలింగనం చేసుకున్నారు. ‘‘నీ చేతులను వెచ్చ చేసుకో నాయనా!’’ అంటూ నన్నాజీని పిలిచి అతడు గత వారం కొన్న ఉన్ని దుప్పటిని తెచ్చి నా కళ్ల మీద కప్పమన్నారు.
నేను బాల్కనీ కిటికీ వద్ద మాస్టారి పరుపు వద్దనే కూర్చున్నాను. ఆయన నా ఎదురుగా ఒక దిండు మీద చేరగిల్లారు. చిక్కి శల్యమైపోయి ఉన్నారు. అయినా ఆ క్షణంలో ఆయన ఆనందం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
నేను నా జీవితంలో గుర్తుంచుకోవలసిన భోజనాల్లో అదొకటి. 
శ్రీనగర్‌కు ముప్పయి మైళ్ల దూరంలో ఉన్న సోపాల్‌కు నన్నాజీని పంపించి మంచినీటి చేపలను తెప్పించారు. మాస్టారి సతీమణిగారు వాటిని మంచి మసాలా దట్టించి వండారు. తామరతూళ్ల కూర చేశారు. ఇక బ్రౌన్‌రైస్‌ సంగతి. నిజానికి హరిత విప్లవం తర్వాత సహజసిద్ధమైన పంటల స్థానంలో అధిక దిగుబడిగల సంకరజాతులు ప్రవేశించి బ్రౌన్‌రైస్‌ అరుదైన పదార్థమైపోయింది. ఆ బియ్యం కోసం నన్నాజీ సుమారు పన్నెండు మైళ్ల దూరంలోని గండేర్బాల్‌ వెళ్లి ఒక మిత్రుడి వద్ద నుంచి సేకరించాడు. ఈ వివరాలు నాకు మాటల సందర్భంలో తెలిశాయి. వారికి అంత శ్రమ ఇచ్చినందుకు నాకే ఒక అపరాధ భావం కలిగింది. నిజానికి ఈ అతిథి భోజనం సఫలం కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాని మా గురువుగారు నాపై మోయలేని, తీర్చలేని కృతజ్ఞతా భారం మోపారు.
కిటికీలోంచి ఇరుగు పొరుగు ఇళ్లే కాకుండా వీధి వీధంతా కనబడుతోంది. నేలంతానూ ఇళ్ల పైకప్పులూ చెట్లూ పొదలూ పాడుపడిన గోడలూ మంచుతో నిండిపోయి ఉన్నాయి. కాని మాస్టారి స్వాగత సత్కారాలూ వారు పెట్టిన ఆహారమూ నునువెచ్చగా ఉన్నాయి. ప్రతి వంటకాన్నీ ఎంతో సంతృప్తితో ఆరగించాను.
మాస్టారు నా చేత కొసరి కొసరి తినిపించారు. తనే తింటున్నంత సంబరపడిపోయారు. నన్నాజీ చేరువగా కూర్చుని సలాడ్‌ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్నాజీ భార్య ఆయా పదార్థాలను అందించడానికి వంటగదికీ మాకూ మధ్య తిరుగుతూనే ఉంది. వారి ఆదరణకు విస్తుపోతూనే వారికి శ్రమ కలిగించినందుకు ఇబ్బందిగా భావించాను.
‘‘మీరంతా కేవలం నా భోజనం కోసం అంత ఆత్రపడుతూ ఎదురు చూస్తుండటం నాకేమీ బాగా అనిపించడంలేదు మాస్టారూ! మీరు కూడా నాతో కలసి భోంచేస్తే సంతోషిస్తాను.’’
‘‘నాయనా! నీకు భోజనం పెట్టే ఆనందాన్ని మేమంతా అనుభవిస్తున్నాం. నాకా ఆహారం మీద ఎప్పుడో ఆసక్తి చచ్చిపోయింది. నా జీర్ణాశయంలో ఈ ఫీడింగ్‌ ట్యూబ్‌ అమర్చినప్పటి నుంచి నాకు పదార్థాలతోనూ రుచులతోనూ ప్రమేయమే లేకుండా పోయింది. నా కడుపులోనికి ఏమి వెళుతోందో నా నోటికి అసలే తెలీడం లేదు. నువ్వు తినడం చూస్తుండగా నేను ఆ పదార్థాల రుచిని అనుభవిస్తున్నాను’’ అన్నారు మాస్టారు.
ఇంక నేనేమనగలను?
ఆ క్షణంలో నా ప్రియాతి ప్రియమైన గురువుగారు ఒక పరిపూర్ణ సంతృప్తి చెందిన వ్యక్తిగా నాకు దర్శనమిచ్చారు. ఆయన ప్రేమతో ఆదరంతో నన్ను గమనించసాగారు. బలహీనంగానే నా ఎదురుగా కూర్చుని ఉన్నప్పటికీ అతని కన్నులు సంతోషంగా ప్రకాశిస్తున్నాయి.
భోజనం తర్వాత ఆల్మండ్స్‌ కుంకుమపువ్వు దాల్చిని యాలకులు వేసిన టీ ఇచ్చారు.
మేం భావోద్వేగంతో మా బడి దినాల గురించి, ఆనాటి నా సహాధ్యాయుల గురించి, అప్పటి ఉపాధ్యాయుల వివిధ వైఖరుల గురించి, అనుభవాల గురించి మాట్లాడుకున్నాం. నా జీవితాన్ని దశాబ్దాల వెనక్కు తిప్పి పునశ్చరణ చేసుకున్నాను. మాస్టారి వల్ల కాక ఇంకెలాగూ ఇది సాధ్యమయ్యేది కాదు.
మాటల సందర్భంలో నా కెరీర్‌ని, జీవితాన్ని మలచడంలో మాస్టారి పాత్ర మరువలేనిదనీ అమూల్యమైనదని ప్రకటించినప్పుడు వారి నేత్రాలు గర్వంతోనూ ఆనందంతోనూ మెరిశాయి. ఆయన గతించిన జీవితంలో దేని గురించీ పశ్చాత్తాపపడలేదు. నన్నాజీ మరింత ఎదగగలడని మాత్రం ఆశ వెలిబుచ్చారు. మాస్టారి సతీమణి నన్నొక రక్షకునిగా చూశారు.
నిజానికి ఆమెకు మాస్టారి వాస్తవ పరిస్థితి తెలిసినట్లు లేదు. చేరువవుతున్న వారి మరణం తెలిసినట్లు నేనూ ప్రవర్తించలేదు.
నేను సెలవు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. మాస్టారి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాను. వారి చేతులను నా చేతుల్లోకి తీసుకున్నాను. వారూ నన్ను మరింత దగ్గరగా తీసుకున్నారు.
అదొక అద్భుతమైన క్షణం. నిజమైన గురుశిష్యుల అనుబంధాన్ని ఆవిష్కరించే ఉద్విగ్న సన్నివేశం. నేను బయల్దేరుతున్నప్పుడు అలా అన్నారు: ‘‘ఇప్పుడు నేను ప్రశాంతంగా కన్నుమూయగలను. నేను నా ప్రియశిష్యుడి జ్ఞాపకాలను నాలో పదిలపరచుకుంటున్నాను. నా వృత్తి జీవితం వృథా కాలేదన్నదానికి నువ్వే సాక్ష్యం. నువ్వే నాకొక బహుమతి. నువ్వే నాకొక సత్కారం, సన్మానం.’’
మాస్టారి గొంతు చాలా బలహీనంగా ఉంది. ఆర్ద్రమైన నయనాలతో వీడ్కోలు చెప్పారు. నేనూ నిజంగా చలించిపోయాను. వారి ప్రేమాభిమానాల ముందు నా వయస్సూ చదువూ జ్ఞానమూ సూక్షా్మతి సూక్ష్మమై ప్రణమిల్లాయి.
నేను గదిని విడిచిపెడుతూ ఉండగా ఆయన కళ్లు నన్ను అనుసరించాయి. వీధిలోకి వచ్చి ఒక్కసారి వెనక్కు తిరిగి మాస్టారి ఇంటివైపూ నేను ఇంతవరకు కూర్చున్న కిటికీ వైపు మరోసారి చూశాను. 
మాస్టారు గోపీనాథ్‌ నెమ్మదిగా కిటికీ వద్దకు చేరుకుని నేను బయలుదేరి వచ్చేస్తూ ఉండటం గమనించారు. నేను నా చేతిని వీడ్కోలుగా ఊపాను. వారు కూడా తన చేతిని బలహీనంగా ఆడించి, కన్నీటి చుక్కని తుడుచుకోవడం నాకు కనిపించింది.
అంతలోనే వారి వ్యాధి తీవ్రతా స్థాయి నా గుండెను కలుక్కుమనిపించింది. మరోసారి నా ప్రియతమ మాస్టారిని దర్శించుకోగలనో లేదో అనే భావం మనసులో మెదిలి నా కళ్లూ చెమర్చాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top