రిలేషణం: అనురాగానికి ప్రతిరూపాలు... ఈ అక్కాతమ్ముళ్లు!

రిలేషణం: అనురాగానికి ప్రతిరూపాలు...  ఈ అక్కాతమ్ముళ్లు!


 అన్నయ్య తన చెల్లెలిని అపురూపంగా

 చూసుకుంటాడు. అన్నీ తానై వ్యవహరిస్తాడు.

 అడిగినవన్నీ కొనిస్తాడు. కానీ షారుఖ్ అన్న కాదు... తమ్ముడు.

 అయినా అన్నలానే మెలిగాడు.

 అక్కను కళ్లలో పెట్టుకుని చూసుకున్నాడు.

 ఆమె కష్టంలో ఉన్నప్పుడు కంటికి రెప్పలా

 కాపాడుకున్నాడు. అక్కాతముళ్ల బంధానికి

 అసలైన అర్థం చెప్పాడు!


 

 షారుఖ్ కంటే అతడి అక్క షెహనాజ్ ఏడేళ్లు పెద్దది. అందుకేనేమో... తనను అమ్మలా సాకేదంటాడు కింగ్ ఖాన్. విపరీతంగా అల్లరి చేసే తనను టీచర్‌లా దారిలో పెట్టేదట. కానీ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం... వీల్లేదంటూ అడ్డుపడిపోయేదట. తమ్ముడు అన్నీ చిందరవందర చేస్తుంటే, బాధ్యతగా సర్దిపెట్టేదట. తన కంటే ముందు తమ్ముడి చిన్ని బొజ్జ నిండిందా లేదా అని చూసేదట. అలాంటి అక్కయ్య ఉన్నట్టుండి పిచ్చిదానిలా అయిపోతే? ప్రాణాలతో ఉండి కూడా బొమ్మలా బతకాల్సిన పరిస్థితి వస్తే? ఆ తమ్ముడు తట్టుకోగలడా! అతడి మనసు ఆ వేదనను భరించగలదా!

 

 అది అంత తేలిక కాదంటాడు షారుఖ్. అతడికి పదిహేనేళ్ల వయసు వచ్చాక, తండ్రి తాజ్ మహ్మద్‌ఖాన్ క్యాన్సర్‌తో చనిపోయారు. ఆ జ్ఞాపకాల దొంతరను తిరగేసేటప్పుడు కన్నీరు మున్నీరవుతాడు షారుఖ్. బడి నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉన్న తండ్రి శవాన్ని చూసినప్పుడు కలిగిన బాధను ఈనాటికీ మర్చిపోలేదతడు. అంతకంటే అతడిని బాధించిన విషయం... తండ్రి మరణాన్ని చూసి షాకైన అతడి ప్రియమైన సోదరి షెహనాజ్, మానసికంగా దెబ్బతినడం!

 

 తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది షెహనాజ్. ఆయన శవాన్ని చూడగానే స్పృహతప్పి పడిపోయింది. ఆ తరువాత కోలుకుంది కానీ శారీరకంగా మాత్రమే... మానసికంగా కాదు! ‘‘నాన్న మరణమే పెద్ద షాక్ నాకు. అలాంటిది అక్క కూడా పిచ్చి పట్టినట్టుగా తయారయ్యింది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. అలాగని ఏడ్చేది కూడా కాదు. మనసులోనే కుమిలిపోయేది. చూపులతోనే శూన్యాన్ని కొలుస్తూ గడిపేది’’ అంటున్నప్పుడు షారుఖ్ కళ్లలో తడి చేరుతుంది. అది అతడికి అక్కయ్య మీద ఉన్న అవ్యాజమైన అనురాగాన్ని తెలుపుతుంది.

 

 షెహనాజ్‌ని మళ్లీ మామూలుగా చేయడానికి రెండేళ్లు పట్టింది షారుఖ్‌కి. అప్పటికిగానీ ఆమె మనుషుల్లో కలవలేదు. అయినా కూడా ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూనే ఉండేది. అప్పుడప్పుడూ మానసికంగా డిస్టర్బ్ అయ్యేది. తండ్రి లేని లోటును, అక్క పడుతున్న ఆవేదనను తీర్చేందుకే పట్టుదలతో పైకొచ్చానంటాడు షారుఖ్. అది నిజమే. అతడు తన స్వయంకృషితో ఎదిగాడు. అక్కయ్యని కంటిపాపలా చూసుకున్నాడు. తల్లి చనిపోయాక అక్కకి తానే తల్లి అయ్యాడు. తన భార్యాపిల్లలతో పాటు ఆమెను తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. అతడికి కుటుంబమంటే... తన భార్య గౌరి, ఇద్దరు పిల్లలు, తన అక్కయ్య. ఎక్కడికి వెళ్లినా అందరూ కలిసి వెళ్లాల్సిందే.

 

 ఇప్పుడు షెహనాజ్ బాగానే ఉంది. తమ్ముడు తనకు చేసిన సేవను, చూపిన అభిమానాన్ని కనిపించిన వారందరికీ కథలు కథలుగా చెబుతుంది. అతడు లేకపోతే తాను లేను అంటుంది. ఆ మాట విన్నప్పుడు షారుఖ్ నవ్వేస్తాడు. ‘‘నేను లేకపోతే తాను లేకపోవడం కాదు, తాను నా వెనుక లేకపోతే నేనీ స్థాయికి చేరేవాడినే కాదు’’ అంటాడు అక్కయ్యవైపు ప్రేమగా చూస్తూ. అక్కాతమ్ముళ్ల అనురాగానికి వీళ్లకు మించిన గొప్ప ఉదాహరణ మరొకటి కనిపించదేమో!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top