మనం బాగుంటాం!!

మనం బాగుంటాం!!


మీరు విద్యార్థి అయితే స్టూడెంట్‌ నంబర్‌ వన్‌ అవ్వాలి గాక! మీరు ఉద్యోగి అయితే నెక్ట్స్‌ మంతే మీ జీతాలు పెరగాలి గాక! మీరు హౌస్‌ వైఫ్‌ అయితే.. ఇంటిపని, వంటపని తగ్గించే మెషిన్స్‌ డోర్‌ డెలివరీ కావాలి గాక! మీరు పొలిటీషియన్‌ అయితే త్వరలో అధికారం చేజిక్కాలి గాక! వాట్‌ ఈజ్‌ దిస్‌.. ఆశీర్వాదం? అని ఫైర్‌ కాకండి సుమీ. ఇదంతా మన మంచికే! అందుకే మరి ఓ సారి ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనుకోండి!!మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటే మన పనులు సాïఫీగా సాగుతాయి. మన ప్రవర్తన పాజిటివ్‌గా ఉంటే మన ప్రయాణం లక్ష్యం వైపు నడుస్తుంది. మన కలలు పాజిటివ్‌గా ఉంటే మన జీవితం గమ్యాన్ని చేరుతుంది. అందుకే మన మంచి కోరుకునేవారంతా ‘బీ పాజిటివ్‌’ అని ప్రోత్సహిస్తుంటారు. ‘అంతా మంచికే’ అంటూ సర్ది చెబుతుంటారు. మరి ఈ పాజిటివ్‌ థింకింగ్‌ని సెలిబ్రేట్‌ చేసుకోవడానికి కూడా ఓ రోజు కావాలి కదా!? అందుకే సెప్టెంబర్‌ 13 ‘పాజిటివ్‌ థింకింగ్‌ డే’ సెలిబ్రేట్‌ చేస్తున్నారు ఫారినర్స్‌.నిరాశ నీడ!?

ఎగసిపడే కెరటం మళ్లీ మళ్లీ లేస్తుంది. పడుతూ లేస్తుంది. పడినా లేస్తుంది. కేవలం పడుతున్న కెరటాన్ని మాత్రమే చూస్తే.. నువ్వు ఎప్పటికీ లేవలేవు. ఈ ప్రపంచం మొత్తం నీకోసమే సృష్టించబడింది. అనుకరించు! ఆచరించు! ఆస్వాదించు! అవయవాలు సవ్యంగా లేని వారు, అందరినీ దూరం చేసుకున్నవారు, అవకాశాలు పోగొట్టుకున్నవారు ఇలా ప్రతి ఒక్కరూ మనకు ఆదర్శమే. నీ నిబ్బరాన్ని దెబ్బతీసే నిరాశని నీరుగార్చడానికి ఇంతకన్నా పాఠాలేముంటాయి అన్నాడు చిట్టి బద్రయ్య. ఆయనెవరు అనేగా మీ డౌట్‌! ఎక్కడో ఉండే ఉంటాడు. పాజిటివ్‌ థింకింగ్‌ గురించి రెండు మంచి మాటలు చెప్పు అనగానే ఇదిగో ఇలా బోధిస్తుంటాడు!?ముందు మేలెంచు!

కీడెంచి మేలెంచడమనేది అనాదిగా వస్తున్న సామెత. కానీ ముందు మేలెంచి.. ఆ తరువాత కీడెంచడం అన్ని విధాలా మేలంటున్నారు నిపుణులు. కావల్సిన వాళ్లు ప్రయాణాల్లో ఉన్నప్పుడు, అనుకున్న పని జరిగే ముందు.. అంతా మంచిగానే ఊహించాలి. లేదంటే ఆ నెగిటివ్‌ వైబ్రేషన్‌ వల్ల.. మన ఊహ నిజమయ్యే ప్రమాదంతో పాటు... ఆ టెన్షన్‌తో మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువే.పాజిటివ్‌ పురాణాలు!

రామాయణంలో సీతమ్మ, భారతంలో పాండవులు పాజిటివ్‌ ఆలోచనలతోనే జీవించారు. చివరికి జయించారు. అనుకూలమైన నమ్మకం మనిషికి ఎంత ధైర్యాన్నిస్తుందో.. భవిష్యత్తుని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతుందనేది ఈ పురాణాల ఉపదేశం. వీటిని నమ్మనివారు కథలే కదా అని తీసిపారెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి కథా.. ఇలా ఉండాలని.. లేదా ఇలా ఉండకూడదని చెప్పే నీతి బోధనే కదా!?ఆ ఆలోచనలు వీడుదాం!

ఈ రోజు చాలా ఎక్కువగా నవ్వేశా! ఇకపై ఏం జరుగుతుందో ఏమో!! అనేవాళ్లు కొందరు. నాకు ఎప్పుడూ ఇలాగే జరుగుతుందే! నాకే ఎందుకు ఇలా జరుగుతుంది!? అంటూ బాధలను సిరీస్‌లా ఆపాదించుకుంటారు మరికొందరు. కానీ అదంతా మన భ్రమ. మన మనసులో ఉన్న ఆందోళన మనకు తెలియకుండా మన ప్రవర్తనకు వర్తిస్తుంది. దాంతో కొన్నిసార్లు ఆ భయాలే నిజమైపోతుంటాయి. అందుకే మన ఆలోచనల్ని  పాజిటివ్‌గా మార్చుకోవాలి.టిప్స్‌ ట్రీట్‌మెంట్‌

మనిషికి ట్రీట్‌మెంట్‌ ఉంది కానీ, మనసుకి ట్రీట్‌మెంట్‌ లేదు. అందుకే ఎన్నో మనోవ్యథలు అపరిష్కృతంగానే ముగిసిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో కౌన్సెలింగ్‌ కూడా విఫలమవు తున్నాయి. మనకి మనమే కౌన్సెలర్‌ అవ్వాలి. మనం మాట్లాడే ప్రతీ మాటలో సానుకూల పదాలే వచ్చేలా చూసుకోవాలి. విజయాన్ని ప్రేరేపించే పుస్తకాలు చదవాలి. సంతోషాన్ని, సందేశాన్ని పంచే సినిమాలు చూస్తుండాలి. గుండెల నిండా బాధ ఉన్నాసరే... దాన్ని కనబడకుండా రోజుకంటే ఎక్కువ మేకప్‌ వేసుకోవడం, మన న్యాయమైన కోరికలను తెల్లని పుస్తకాలపై రెడ్‌ పెన్‌తో రాసుకోవడం వంటి చిన్న చిన్న టిప్స్‌ పాటించడం వల్ల అంతా పాజిటివ్‌గానే జరుగుతుంది.ఆరోగ్యం.. ఆనందం...

పాజిటివ్‌ ఆలోచనల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు.. తీవ్రమైన ఒత్తిడి తగ్గుతుంది. అనుకూలమైన ఆలోచనలు చేస్తే.. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సంతోషం మన తోడుంటుంది. అందుకే మరి ఈ సెప్టెంబర్‌ 13న మీ జీవితానికి సంబంధించి ఓ పాజిటివ్‌ ఆలోచన చెయ్యండి! మీ ఆత్మీయులకు ఓ పాజిటివ్‌ సలహా ఇవ్వండి!! ఇక ఇప్పుడైనా ఓ సారి ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనుకోండి!?!నమ్మకమే మూలం

‘మనం బలంగా నమ్మితే దాన్ని నిజం చెయ్యడానికి ఈ ప్రపంచమంతా కుట్ర చేస్తుందట!’ ఊహలు, ఆశలు, ఆలోచనలు అన్నీ మన స్థాయికి తగ్గట్టుగా ఉన్నప్పుడు అవి నిజంగా నిజమవుతాయని, మనలో పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉంటే.. అంతా మనం కోరుకున్నట్లే జరుగుతుందని దాని అర్థం. మన కోరికను నిజం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తే.. ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందనేది కాదనలేని సత్యం.– సంహిత నిమ్మన

Back to Top