దేవతలు పంపిన రాయబారి!

Sean Is Ours The Title Is Yours In Funday - Sakshi

 సీన్‌ మాది – టైటిల్‌ మీది

కెంపరాజ్‌ నిర్మాణ, దర్శకత్వంలో భానుమతి ప్రధాన పాత్ర పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
‘‘నారద మునీంద్రులకు నమస్కారం. విశేషములు ఏమైనా కలవా?’’ నారదుడిని అడిగారు అగ్నిదేవుడు, వరుణదేవుడు, దేవేంద్రుడు, యమధర్మరాజు.
‘‘త్రిభువనసుందరి, విదర్భ రాజకుమారి స్వయంవరమే ఒక అపూర్వవిశేషం. ఆమె రూపలావణ్యాల ముందు రంభ, ఊర్వశీ, మేనక దిగదుడుపు’’ అని చెప్పాడు నారదుడు.
‘‘అయితే నేను ఆమెను వివాహమాడతాను’’ అన్నారు ఆ నలుగురిలో ఒకరు.
‘‘అదిమాత్రం సాధ్యం కాదు’’ అని చెప్పాడు నారదుడు.
‘‘ఎందువల్ల?’’ మూకుమ్మడిగా అడిగారు ఆ నలుగురు.
‘‘ఆమె ఏనాడో నలసార్వభౌముడిని మనసారా ప్రేమించి అతనినే వివాహమాడాలని త్రికరణశుద్ధిగా నిర్ణయించుకుంది’’ అసలు విషయం చెప్పాడు నారదుడు.
‘‘మునీంద్రా! స్వయంవరంలో నా ముఖం చూసిన తక్షణం నన్నే వరిస్తుంది’’ ధీమాగా అన్నాడు యమధర్మరాజు.
‘‘ఆమె దృఢసంకల్పం మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు’’ తనకు తెలిసిన సత్యాన్ని చెప్పాడు నారదుడు.
‘‘మాకంటే అతడే ఎక్కువా?’’ నలమహారాజును దృష్టిలో పెట్టుకొని అడిగాడు దేవేంద్రుడు.
‘‘ఎక్కువో తక్కువో మీరే నిశ్చయించుకోండి’’ అని ఆ బాధ్యత వారి భుజాల మీదే పెట్టి అక్కడి నుంచి కదిలాడు నారదుడు.

అగ్నిదేవుడు, వరుణదేవుడు, దేవేంద్రుడు, యమధర్మరాజులు నలమహారాజు ముందు ప్రత్యక్షమయ్యారు.
‘‘తాము ఎవరో తెలుసుకోవచ్చా?’’ అడిగాడు నలుడు.
‘‘వీరు వరుణదేవుడు’’ 
‘‘వీరు అగ్నిదేవుడు’’
‘‘వీరు దేవేంద్రుడు’’
‘‘వీరే యమధర్మరాజు’’
పరిచయాలు పూర్తయ్యాయి.
‘‘ఆహా! దేవతామూర్తులా... అనేక జన్మల పుణ్యఫలం వల్ల కూడా లభించని మీ దర్శనభాగ్యంతో నా జన్మ చరితార్థం అయింది. ఏ సేవలు చేసి మిమ్మల్ని రంజింప చేయాలో ఆజ్ఞాపించండి’’ సంతోషంగా అడిగాడు నలమహారాజు.
‘‘నలరాజా! నీవల్ల మాకో ఉపకారం కావాలి’’ అడిగాడు దేవేంద్రుడు.

‘‘కామధేనువు, కల్పవృక్షం పెరట్లో ఉన్న మీకు సామాన్య మానవుడి వల్ల కావలసిన ఉపకృతి ఏముంటుంది స్వామి! నన్ను పరీక్షిస్తున్నారా? పరిహసిస్తున్నారా!’’ అడిగాడు నలమహారాజు.
‘‘పరీక్ష కాదు పరిహాసం కాదు. చేస్తానని వాగ్దానం చెయ్యి’’ అడిగాడు యమధర్మరాజు.
‘‘ఎందుకా సందేహం? ఇక ఆనతి ఇవ్వండి’’ అని అడిగాడు నలమహారాజు.
‘‘చక్రవర్తీ! నువ్వు దమయంతిని చూశావా?’’ అడిగాడు దేవేంద్రుడు.
‘‘లేదు స్వామి!’’ అని బదులిచ్చాడు నలుడు.
‘‘నిన్నే వరించి వివాహమాడబోతున్నదట’’ ఒకింత ఈర్ష్యతో అన్నాడు వరుణుడు.
‘‘అయితే నేను చాలా అదృష్టవంతుడిని. ఆమె అనురాగానికి పాత్రుడిని కావడం తమవంటి అమరుల ఆశీర్వాద ఫలితం. నా జన్మ పావనం అయింది’’ అని సంతోషంలో తేలిపోయాడు నలమహారాజు.
‘‘చక్రవర్తీ! సంతోషంతో మైమరచిపోతున్నావు. మరచిపోవాల్సింది దమయంతిని’’ కఠినంగా  అన్నాడు యమధర్మరాజు.
‘‘దమయంతి సౌందర్యం గురించి మేము ఆలకించాం. ఆమెను వరించాలనుకుంటున్నాం. ఆమెను సమీపించి మాలో ఏ ఒకరినైనా వరించమనే సందేశం అందించాలి. చెప్పి ఒప్పించాలి’’  అన్నాడు దేవేంద్రుడు.

‘‘స్వామీ! ఏమిటీ పరీక్ష? నేను దమయంతిని గాఢంగా ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నన్ను ఈ కార్యభారానికి వినియోగించడం సమంజసమా?’’ బాధగా అన్నాడు నలమహారాజు.
‘‘వాగ్దానం చేశావు. మాట నిలుపుకోవడం నీవంతు’’ గుర్తు చేశాడు యమధర్మరాజు.
‘‘దమయంతిపై మరులుగొన్న చక్రవర్తికి తన వాగ్దానం జ్ఞాపకం ఉంటుందా?’’ వెటకారంగా నవ్వాడు దేవేంద్రుడు.
‘‘హరిశ్చంద్రునితోనే సత్యం స్వర్గానికి వేంచేసింది’’ అంటూ దేవేంద్రుడి వెటకారానికి శ్రుతి కలిపాడు వరుణదేవుడు.
‘‘క్షమించండి. ఆడి తప్పే అధముడిని కాదు’’ అన్నాడు నలమహారాజు.
ఈ మాటతో దేవతల కళ్లు సంతోషంతో వెలిగాయి.
‘‘కానీ అంతఃపురంలో నివసించే రాకుమారిని ఏకాంతంలో సందర్శించడం ఎలా సాధ్యం?’’ తన మనసులోని సందేహాన్ని దేవతల ముందు పెట్టాడు నలుడు.
అప్పుడు వారు అతని చేతిలో ఒక ముద్రిక పెట్టి....
‘‘ఇదిగో శంబరీ ముద్రిక. దీనిని ధరించి అదృశ్యరూపుడవై అంతఃపురంలో ప్రవేశించు. నీ ధర్మం, మా వాంఛ నెరవేరుతుంది’’ చెప్పారు దేవతలు.

శంబరీ ముద్రిక సహాయంతో దమయంతి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు నలమహారాజు.
అతడిని చూసి ‘‘ఎవరు మీరు?’’ అని ఆశ్చర్యపోయింది దమయంతి.
‘‘నేను దేవదూతను. నీతో ఏకాంతంగా సంభాషించడానికి రాచమర్యాదను ఉల్లంఘించాను’’ చెప్పాడు నలుడు.
‘‘ఏకంత ప్రసంగమా? ఏమది?’’ అడిగింది దమయంతి.
‘‘ఈ కమనీయ విగ్రహం, చందమామలాంటి ముఖం, అందాలు చిందే నీ చిరునవ్వులు అపూర్వం, అనిర్వచనీయం. సురలకు కూడా అలభ్యమైన ఈ సుందరాకృతి, సుగుణసంపత్తి...’’ చెప్పుకుపోతున్నాడు నలుడు.

‘‘చాలించండి మీ వర్ణన’’ మధ్యలోనే ఆపేసింది దమయంతి.
‘‘ఈ వర్ణన విని ఇంద్రుడు, అగ్ని, యముడు, వరణుడు ముగ్ధులై మైమరిచి...’’ అంటుండగానే మళ్లీ అడ్డుపడి–
‘‘మీరు మైమరచిపోతున్నారే’’ అన్నది దమయంతి.
‘‘వారు మైమరచిపోయి నీ ప్రేమభిక్ష కోరుతున్నారు. వారి వలపు వేడుకోలు విన్నవించమని నన్ను రాయబారిగా పంపారు. మహత్తరశక్తులు కలిగిన దేవతలు బలాత్కారంగా నిన్ను తీసుకువెడితే చేయగలిగింది ఏముంది?’’ అన్నాడు నలుడు.
‘‘ప్రాణత్యాగం చేస్తాను. నా మనసును ఏనాడో ఆ నలసౌర్వభౌమునికే అర్పించాను’’ దృఢంగా చెప్పింది దమయంతి.
‘‘ఒకవేళ నలసార్వభౌముడే నీ ప్రేమను నిరాకరిస్తే?’’ ఆమె కళ్లలోకి చూస్తూ సూటిగా అడిగాడు నలుడు.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top