ఇంత చిన్న వయసులో...

ఇంత చిన్న వయసులో... - Sakshi


సందేహం



మా అమ్మాయి వయసు పదేళ్లు. రెండు వారాల కిందటే మెచ్యూర్‌ అయింది. ఆమె పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు.

– శ్రీలక్ష్మి, చిత్తూరు


పదేళ్ల వయస్సు అంటే ఆడే పాడే చిన్న లేత వయస్సు. ఇంత చిన్న వయస్సులోనే రజస్వల అవ్వడం వల్ల వారికి అది కొత్తగా కనిపించడం, న్యాప్‌కిన్స్‌ వాడటం వంటి విషయాలలో కొద్దిరోజుల వరకు అయోమయంగా ఉంటుంది. మీరు మెల్లగా మీ పాపకి పీరియడ్స్‌ అంటే ఏమిటి? బ్లీడింగ్‌ ఎలా అవుతుంది, ఎలా జాగ్రత్త పడాలి, న్యాప్‌కిన్స్‌ ఎలా వాడాలి, ఆ సమయంలో ఉండే అసౌకర్యాలు, కడుపునొప్పి, శరీరంలో వచ్చే మార్పులు వంటి అనేక విషయాలను అర్థం అయ్యేలాగ వివరించి చెప్పండి. ఇది పిల్లలు శారీరకంగా పెరిగే వయసు కాబట్టి పప్పు, ఆకుకూరలు, పండ్లు, పాలు, మితమైన మాంసాహారం వంటి పౌష్టికాహారం ఇవ్వాలి. మెచ్యూర్‌ అయినా ఒకటి, రెండూ లేదా మూడు సంవత్సరాల వరకూ పీరియడ్స్‌ చాలామందిలో సక్రమంగా ఉండకుండా, ఎప్పుడంటే అప్పుడు రావడం, ఎక్కువగా అవ్వటం వంటివి ఉండవచ్చు. కాబట్టి స్కూల్‌లో ఇబ్బంది పడకుండా స్కూల్‌ బ్యాగ్‌లో ఎక్స్‌ట్రా న్యాప్‌కిన్స్, ప్యాంటీస్‌ వంటివి ఉంచటం మంచిది.



నా వయసు 27 సంవత్సరాలు, బరువు 40 కిలోలు. నాకు పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇదివరకు పీరియడ్స్‌ సరిగా వచ్చేవి కావు. అయితే, మందులు వాడిన తర్వాత ఆరు నెలల పాటు పీరియడ్స్‌ రెగ్యులర్‌గానే వచ్చాయి. గతనెల పీరియడ్‌ రావాల్సి ఉన్నా, రాలేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌ అని వచ్చింది. స్కానింగ్‌ చేయించుకుంటే పీసీఓడీ అని చెప్పారు. థైరాయిడ్‌ సమస్య లేదని పరీక్షల్లో తేలింది. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా? నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.– రామలక్ష్మి, నర్సీపట్నం

పీసీఓడీ అంటే పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ డిసార్డర్‌. ఇందులో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో (ఓవరీస్‌) చిన్న చిన్న నీటి బుడగలు ఎక్కువగా ఏర్పడతాయి. వాటి వల్ల రక్తంలో, మగవారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్‌ అనే ఏండ్రోజన్‌ హార్మోన్‌ పీసీఓడీ ఉండేవారిలో ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అధిక మోతాదులో టెస్టోస్టిరాన్, ఇంకా ఇతర హార్మోన్ల విడుదల వల్ల, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి నెలనెలా తయారయ్యి విడుదలయ్యే అండం సరిగా పెరగకపోవడం, విడుదల కాకపోటం, దాని నాణ్యత సరిగా లేకపోవటం, పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవటం, అధిక మొటిమలు, అవాంఛిత రోమాలు ఏర్పడటం... వంటి అనేక లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడతాయి. అండం పెరగటంలో సమస్య వల్ల, సాధారణంగా గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి కొందరిలో అధిక బరువు, సన్నగా ఉన్నవారిలో కూడా జన్యుపరమైన సమస్య వల్ల, ఇన్సులిన్‌ హార్మోన్‌ సరిగా పనిచెయ్యకపోవటం వల్ల, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంటాయి.



నువ్వు 40 కేజీల బరువు అంటే లీన్‌ పీసీఓ క్యాటగిరీ కింద వస్తావు. నువ్వు డాక్టర్‌ పర్యవేక్షణలో, పీసీఓడీ వల్ల నీలో ఏర్పడిన హార్మోన్ల అసమతుల్యత తగ్గడానికి మందులు వాడుకుంటూ, అండం తయారవ్వటానికి మందులు, వాడటం వల్ల నీకు గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ చికిత్సకు, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొన్ని నెలలు లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. ఓపిక పట్టవలసి ఉంటుంది. మందులతో గర్భం నిలవనప్పుడు, ల్యాప్రోస్కోపీ అనే చిన్న ఆపరేషన్‌ ద్వారా, నీటి బుడగలను కొన్ని తొలగించి, మరలా చికిత్స తీసుకోవలసి వస్తుంది.



నా వయసు 26 ఏళ్లు, ఎత్తు 5.5 అడుగులు, బరువు 68 కిలోలు. నాకు ఏడాది కిందట పెళ్లి జరిగింది. మా వారూ, నేనూ ఇద్దరం జాబ్స్‌ చేస్తున్నాం. నాకు సెక్స్‌పై ఆసక్తి ఉండటం లేదు. దీనివల్ల మా ఆయన తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – కనకదుర్గ, కొల్లూరు

కొంతమంది ఆడవారిలో జాబ్‌ చేస్తూ ఇంట్లో పని ఒత్తిడి వల్ల మానసికంగా, శారీరకంగా అలసిపోవటం వల్ల సెక్స్‌ మీద ఆసక్తి ఉండకపోవచ్చు. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అలా ఉండవచ్చు. కొందరిలో సెక్స్‌ మీద దురభిప్రాయం ఉండటం, భర్త మీద ఇష్టం లేకపోవడం, వారి ప్రవర్తన నచ్చకపోవడం... ఇతర కారణాల వల్ల ఆసక్తి ఉండకపోవచ్చు. ఇద్దరూ కొంచెం సమయం తీసుకొని మీ మనసులోని అభిప్రాయాలను, భావాలను, సందేహాలను మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల కొద్దిగా సమస్య తీరవచ్చు. అతని ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి మీకు అనుగుణంగా మారవచ్చు. ఇద్దరూ కలసి విహారయాత్రకు వెళ్ళడం, సినిమాలు, షికార్లు వెళ్ళడం వల్ల ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగి మీకు సెక్స్‌ మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. రొమాంటిక్‌ సినిమాలు, వీడియోలు చూడటం, నవలలు చదవటం వంటివి చెయ్యడం వల్ల కూడా ప్రయోజనం ఉండవచ్చు. అప్పటికి ఉపయోగం లేకపోతే ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి సలహా, కౌన్సిలింగ్‌ తీసుకోవడం మంచిది.



డా‘‘ వేనాటి శోభ

లీలా హాస్పిటల్‌

మోతీనగర్, హైదరాబాద్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top