అమెనోరియా అంటే?

అమెనోరియా అంటే?


కొందరికి నెలసరి విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నెలసరి సక్రమంగా రాకపోవడానికి కారణం ఏమిటి? శారీరకతత్వాన్ని బట్టి ఉంటుందా? ఆహార అలవాట్లను బట్టి ఉంటుందా? అమెనోరియా అంటే ఏమిటి?

– డి.జానకి, నెల్లిమర్ల



నెలసరి క్రమంగా రాకపోవటానికి, శరీర తత్వాన్ని బట్టి, బరువుని బట్టి, మానసిక స్థితి, హార్మోన్లలో లోపాలు, మెదడు, గర్భాశయం, అండాశయాల పనితీరు, వాటి నిర్మాణంలో లోపాలు వంటి అనేక కారణాలు, ఇంకా ఎన్నో తెలియని కారణాలు ఉంటాయి. ఆహారం సరిగా తీసుకోకుండా, మరీ ఎక్కువ డైటింగ్‌ చేస్తూ, మరీ సన్నగా ఉండి, శరీరంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటే కూడా పీరియడ్స్‌ సక్రమంగా రావు. ఆహారంలో ఎక్కువ జంక్‌ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ అధిక బరువు ఉంటే కూడా పీరియడ్స్‌ సక్రమంగా ఉండవు. అమెనోరియా అంటే పీరియడ్స్‌ అసలుకే రాకపోవడం, ఇందులో ప్రైమరీ అమెనోరియా అంటే 0–16 సంవత్సరాలు దాటినా రజస్వల కాకపోవటం, సెకండరీ అమెనోరియా అంటే ముందు పీరియడ్స్‌ వస్తూ, మూడు నెలలపాటు అంత కంటే ఎక్కువ నెలలు పీరియడ్స్‌ రాకపోవటం, మెదడులో కంతులు, తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి, థైరాయిడ్‌ సమస్య, ఇతర హార్మోన్లలో లోపాలు, జన్యుపరమైన సమస్యలు, గర్భాశయం, అండాశయాలు లేకపోవటం, లేదా మరీ చిన్నగా ఉండటం, అండాశయాలలో కంతులు, నీటి బుడగలు, గర్భాశయంలో టీబీ, యోని ద్వారం పూర్తిగా మూసుకపోయి ఉండటం వంటి ఎన్నో కారణాల వల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవటం, లేదా అసలుకే రాకుండా ఉండటం జరగవచ్చు.



నేను కొంత కాలంగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. బుగ్గలు, నుదరుపై మచ్చలు వస్తున్నాయి. ఇలా రావడం సహజమేనా? లేక సైడ్‌ ఎఫెక్ట్‌ వల్ల ఇలా వస్తాయా? మచ్చలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గర్భనిరోధక మాత్రలు ఎక్కువ కాలం తీసుకోవడం ప్రమాదమా?

– కేఆర్, రామగుండం



కొంతమందిలో హార్మోన్లలో సమస్యల వల్ల, ఎండకు ఎక్కువగా తిరగడం వల్ల, నుదురుపైన, బుగ్గల పైన మచ్చలు ఏర్పడుతుంటాయి. దీనినే మెలాస్మా అంటారు. కొంతమందిలో గర్భంతో ఉన్నప్పుడు వస్తాయి. కొంతమందిలో గర్భ నిరోధక మాత్రలు దీర్ఘకాలం వాడటం వల్ల కూడా మచ్చలు రావచ్చు. అందరికీ వీటివల్ల మచ్చలు రావాలని ఏమీలేదు. మచ్చలు ఏర్పడేటప్పుడు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ క్రీములు వాడుకోవాలి. ఒకసారి చర్మవ్యాధుల డాక్టర్‌ను సంప్రదించి దానికి తగ్గ చికిత్స తీసుకోవాలి. గర్భ నిరోధక మాత్రలలో, తక్కువ హార్మోన్‌ మోతాదు ఉన్న వాటిని వాడి చూడవచ్చు.



వాటితో కూడా మచ్చలు ఎక్కువ అవుతుంటే, మాత్రలు వాడటం మానేసి, వేరే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించవచ్చు. గర్భ నిరోధక మాత్రలు ఒక్కొక్క శరీరతత్వాన్ని బట్టి, బరువుని బట్టి, వారి మెడికల్, ఫ్యామిలీ హిస్టరీని బట్టి, కొంతమందికి బాగానే సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా పనిచేస్తాయి. కొంతమందిలో మటుకే ఇబ్బందులు ఏర్పడవచ్చు. సమస్యలు లేనప్పుడు దీర్ఘకాలం కాకుండా, 2–3 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా వాడవచ్చు.



‘హెల్తీ ప్రెగ్నెన్సీ’కి సంబంధించి ప్రత్యేకమైన మార్గదర్శక సూత్రాలు ఏమైనా ఉన్నాయా? దీని గురించి వివరంగా చెప్పండి. వినికిడి సమస్య, తక్కువ బరువుతో శిశువు పుట్టడానికి కారణం ఏమిటి?

– జె.సుహాసిని, మండపేట



హెల్తీ ప్రెగ్నెన్సీకి, ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రెగ్నెన్సీ రాక ముందు నుంచే బరువు నియంత్రణలో ఉండేటట్లు చూసుకోవాలి. థైరాయిడ్, బీపీ, షుగర్‌ వంటి ఇతర మెడికల్‌ సమస్యలు ఉన్నాయా లేవా చూపించుకోవాలి. ఒకవేళ ఉంటే అవన్నీ నియంత్రణలోకి తెచ్చుకున్న తర్వాత, డాక్టర్‌ సలహా మేరకు ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవటం మంచిది. ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్నప్పటి నుంచి, లేదా ఇంకా ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్‌ రోజూ ఒకటి వేసుకోవటం మంచిది. బరువు ఎక్కువగా ఉంటే తగ్గటం, మరీ సన్నగా ఉంటే కొద్దిగా పెరిగి ప్లాన్‌ చేసుకోవటం మంచిది. ప్రెగ్నెన్సీ వచ్చిన తరువాత డాక్టర్‌ దగ్గర రెగ్యులర్‌ చెకప్స్‌కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవటం, ఐరన్, కాల్షియం, ఇతర అవసరమైన మెడిసిన్స్‌ వాడుకుంటూ, అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్‌ చెయ్యించుకుంటూ, మనసుని ఉల్లాసంగా ఉంచుకుంటూ సాగితే పండంటి బిడ్డను కనవచ్చు.



కొంతమందిలో ఎంత బాగా ప్లాన్‌ చేసుకున్నా, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అనుకోని, కొన్ని తెలియని కారణాల వల్ల కొన్ని కాంప్లికేషన్స్‌ ఏర్పడుతుంటాయి. వాటి నుంచి కొంతమంది బయటపడతారు, కొంతమంది బాగా ఇబ్బందిపడతారు. దీనికి డాక్టర్స్‌ కూడా ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోవచ్చు. వినికిడి సమస్య, బిడ్డ పుట్టుకలో వచ్చే లోపం వల్ల, జన్యుపరమైన కారణాలు, తల్లిలో తీవ్రమైన వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వంటి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడవచ్చు. తల్లి సరైన పోషకాహారం తీసుకోకపోవటం, రక్తహీనత, బీపీ పెరగటం, తల్లి నుంచి బిడ్డకు రక్త సరఫరా సరిగా లేకపోవటం, ఉమ్మనీరు తగ్గటం, తల్లి గర్భాశయంలో లోపాలు వంటి ఇంకా ఎన్నో కారణాల వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టవచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top