ద్రౌపది..

Sakshi Funday Story Droupadi

ఈవారం కథ

‘ఏమే ద్రౌపతీ, బాగుండావా? ఎట్లుంది నీ తుగడా గుడ్డల యాపారం? ఈ మద్దెలో లంగాలూ జాకెట్లు గుడకా కుడతావుండావంటనే!’ వీధిలో చిల్లరంగడి దగ్గర కనిపించి అడిగింది రామలక్ష్మి.
‘బాగుండానే రాములూ! నువ్వెట్లుండావు? శానా దినాలకు కనిపిస్తివి, యేమిటి కొత్త సంగతులు?’ బదులు ప్రశ్నవేసి అడిగింది ద్రౌపది.
‘మన మద్దె తరగతి బతుకుల్లో కొత్త సంగతులు యేముంటాయి ద్రౌపతీ? మామూలే! నిన్న సంగతులే ఈ పొద్దు, ఈ పొద్దుటి సంగతులే రేపు! దినదినామూ కొత్త  సంగతులుండే బతుకులా  మనవి?’  షరా మామూలే అన్నట్లు చెప్పింది రామలక్ష్మి.
‘అది సరే గానీ, నా పేరు ద్రౌపతి కాదు, ద్రౌపది అని ఎన్నిసార్లు చెప్పినానే తల్లీ! ప్రతిసారీ మర్సిపొయి, ‘ద్రౌపతీ’ అనే  అంటావుండావు! నాకు పతి వుండగా నేను పతిని కావడమేమిటే?’ అని నవ్వుతూ మందలించింది ద్రౌపది.
‘నాకు నీపేరు బొలే తికమకగా వుంటుందే! శానాసార్లు అడగల్లనుకుండాను, ఇంతకీ ద్రౌపదికీ ద్రౌపతికీ తేడాయేమిటే?’ అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చింది రామలక్ష్మి.
‘ద్రౌపది అంటే ద్రుపదమారాజు కూతురంట! ద్రౌపతి అనే పదానికి అర్థం యేందీ లేదంట అని మా నాయన చెప్పుతావుంటాడు. భారత కథలోని ద్రౌపది అంటే మా నాయనకు శానా ఇస్టమంట రాములూ! అందుకే ఆయమ్మ పేరు నాకు పెట్టినారంట! సదువుకోండేది ఐదో తరగతి వరకే అయినా మా నాయన భారత రామాయన బాగవతాలు బ్రెహ్మాండంగా సదువుకుండాడే! అందులో ద్రౌపదిని గురించీ ఆయమ్మ గునగనాల్ని గురించీ బొలే చెప్పుతాడు. కథలో ఆయమ్మ నా మాదిరే చామనచాయతో వుంటాదంట! గొప్ప అందగత్తెంట!’ అంటూ తనపేరు వెనకున్న కథ చెప్పింది ద్రౌపది.

‘మీ నాయన నీకు ఈ పేరు ఎందుకు పెట్టినాడు ఇప్పుడర్థమైందే తల్లీ! ఇంగ పొరపాట్న గుడకా నిన్ను ద్రౌపతీ అని పిల్చను లేవే ద్రౌపదీ! మొత్తానికి మీ నాయన నీకు ఈ పేరు పెట్టినందుకేనేమో ఆ ద్రౌపది మాదిరి, ఈ ద్రౌపది, ఇద్దరు పిల్లలు పుట్టి, ముప్పైయేండ్లు దాటినా ఇంత అందంగా వుండేది! ఈ అందాన్ని వొదులుకోల్యాకనే కావొచ్చు, మా సీనా అన్నయ్య నీ సుట్టూరా తిరిగిండేది! నేను మొగోన్నయిపుట్టింటే నీ పక్క యింగొగ మొగోన్ని సూడనిచ్చుందునేమే? మా అన్నయ్య నీకు ఏమి తినిపిస్తావుండాడో గానీ వయసొచ్చేకొద్దే ఎంతందంగా కనిపిస్తావుండావో! నిన్ను చూస్తావుంటే నాకే కన్ను కుట్టుతావుంది!’  అంటూ పెదవులు కొరుక్కుంటూ నడుము వొంపులో గిచ్చింది రాములు.

‘యేయ్, బజార్లో యేమిటీ అల్లరి సేస్టలు? సిగ్గుందా లేదా? పొగిడింది సాలు గానీ, వూరకనే నోర్మూసుకోని రా!’ అని కొంటెగా చూస్తూ ఇంటివైపు నడిచింది ద్రౌపది.
‘పొగడ్తలు గాదే, నిజం! ఈ చీరకట్టులో ఎంతందంగా వుండావో తెలుసునా? ఆ సొట్టబుగ్గలూ కోటేరేసిన ముక్కూ, శారడేసి కండ్లూ బుల్లి గడ్డమూ, బొంగరం మాదిరుండే ఆ మెడా,  ఎంతందంగా వుండావంటే...!’ అంటూ సమ్మోహం చెందసాగింది రామలక్ష్మి.
‘ఇదేమిటే, నీకేమన్నా కైపెక్కిందా?...పొగిడేకి ఈ కర్రిదే కనిపిచ్చిందా నీకు?’ అని బుంగమూతి పెట్టి చిరుకోపం నటిస్తూ ముందుకు నడిచింది ద్రౌపది. 
‘నిన్ను కర్రిదని ఎవురన్నారే? అప్పుడెప్పుడో ఏడోక్లాసులో సదివేటప్పుడు, మా కంటే రోంత నల్లగా వుంటావని జతగాల్లందరమూ నిన్ను ‘కర్రిదానా’ అని వూరకనే తమాషాగా అంటా నిన్ను యేడిపించినాము గానీ చామనచాయ రంగంటే మన తెలుగోల్ల సొత్తే!’ అంటూ చిన్ననాటి చిలిపి చేష్టల్ని గుర్తుచేసింది రాములు.

‘సరే సరే, ఈ రంగులూ నీ పొగడ్తలూ ఇంగ పక్కనబెట్టి, ఇంట్లోకొచ్చి రోన్ని మజ్జిగ తాగి, నీకైపు తగ్గిచుకోని పోదువురావే తల్లీ! శానా దినాలయినంక కల్సుండాం, రోంతసేపు కుచ్చోని పోదువురా!’ అంటూ వాకిలి తీసి లోపలికి పిలిచింది ద్రౌపది. ద్రౌపదివెంట లోనికెళ్లి, మొదట హాల్లోనే వొకమూల, కుట్టు మిషనూ దాని పక్కనే ర్యాక్‌లో అడ్డంగా అమర్చుకున్న పైపులకు యాంగర్స్‌తో వేలాడుతున్న ముప్పై నలభై కొత్త జాకెట్లూ, ఒక ర్యాక్‌ అరల నిండా కుట్టి మడతలు పెట్టిన లంగాలూ, రెండు ర్యాకుల్లో తుగడా గుడ్డలూ చూసి  ‘పెద్ద కార్కానా పెట్టుకుండావు గదే! యాపారం బాగనే వున్నెట్లుందే!’ అని మెచ్చుకుంటూ సంతోషపడింది రామలక్ష్మి.
‘పరవాలేదే రాములూ! ఈ మద్దెనే గద్వాల కాటన్‌సీరలు గుడకా తెచ్చుకోని అమ్ముతాండాను, లోపలికి  రా, సీరలు సూస్తువు’ అంటూ పక్కగదిలోకి పిల్చి చూపించింది ద్రౌపది.

రకరకాల డిజైన్సులో వున్న చీరల్ని చూసి ఆశ్చర్యపోతూ, ‘శానా బాగుండాయే! మొత్తానికి లంగాగుడ్డలూ తుగడాబట్టలూ సీరల యాపారాన్ని పొందిగ్గా చేసుకుంటా, ఇంగొగపక్క జాకెట్లు కుట్టుకుంటా నాలుగురాల్లు కూడబెట్టుకుండే వొనారు చూసుకుండావులే ద్రౌపదీ! ఇంగేం పరవాలేదులే!’ అంటూ ముందరి హాల్లోకి వచ్చి కూర్చుంది రామలక్ష్మి. ద్రౌపది వంటగదిలోకెళ్లి రెండు గ్లాసుల్లో మజ్జిగ తిరగ్గొట్టుకొని వచ్చి వొకగ్లాసు రామలక్ష్మికిచ్చి ఆమె పక్కనే కూర్చొని మజ్జిగ తాగుతూ, ‘పర్వాలేదు రాములూ! మిగులుబాటు కత ఎట్లున్నా దిగుల్లా్యకుండా సంసారం గడిసిపోతావుంది. పిల్లలిద్దర్నీ కానివెంటు స్కూల్లో సదివిచ్చుకుంటా వుండాం. ఈడే ఇందిరమ్మ కాలనీలో నాలుగు సెంట్లు జాగా గుడకా తీసుకుండాం! దేవుని దయవల్ల ఇప్పటికేమో బాగనేవుంది! కాలం కలిసొస్తే నువ్వన్నెట్ల నాలుగుదుడ్లు మిగిల్చుకుండే మార్గమయితే చూసుకుంటాం రాములూ’ అంటూ సంతృప్తిని వెలిబుచ్చింది ద్రౌపది.

‘శానా సంతోసమే, గార్లదిన్నె వొదిలి ఈ కల్లూరు సేరుకోని మంచి పని చేసినావులే! ఈటికొచ్చిన మొదిట్లో ఆ తరిమెల రోడ్డు పక్కనుండే ఇంట్లో కాపురం వున్నెప్పుడు ఇల్లు ఇంత కలకలగా లేదే! ఈ కాలనీకి వచ్చినంక అన్నెందాలా బాగున్నెట్లుంది గదా! సీనా అన్నయ్యా నువ్వూ శానా దూరం ఆలోశెన జేసి ఆ గార్లదిన్నె వొదిలి ఈడ జేరుకోవడం, మంచి పన్జేసినారు. ల్యాకుంటే ఆడ స్కూలు పిల్లోల్లకు నువ్వొగదానివే మద్యాన్నం బోజనం వొండిపెడతా ఎంత కస్టపడతావుంటివి!’ అంటూ గతాన్ని గుర్తుచేసింది రామలక్ష్మి. ఆ మాటలతో వెనకటి బాధల్నీ అనుభవాల్నీ జ్ఞాపకం చేసుకుంటూ బరువుగా నిట్టూరిచ్చింది ద్రౌపది.
‘కస్టపడకుంటే మన సంసారాలు నడుస్తాయా రాములూ? కస్టం ఎక్కవయినందుకు కాదు గానీ, మానం పోగొట్టుకోడానికి మనసురాక ఆ బాడకావు పని వొదులుకుంటినే! ఆ పని నాకిచ్చినందుకు ప్రతినాబట్టా సొంగకార్సుకుంటా కుక్కమాదిరి దగ్గిరికొచ్చేదే!

అడ్డమయినోడల్లా వొచ్చి నాలిక సప్పరిచ్చేదే! యేమి గొడవజేస్తే  యేమయితాదో, తినే కూడు, యాడ అందకుండా పోతాదో, యాడ బతుకు గబ్బయిపోతాదో అని మాటల్తోనే అందరికీ ఆశజూపిస్తా అయిదారు నెలలు, అట్లే పనిజేస్తిని రామలక్ష్మీ. ఎప్పుడయినా పొరపాట్న ఎదలమిందుండే సీరకొంగు పక్కకు బోతే సిగ్గుతో ఆ పక్కా ఈ పక్కా జూస్తా కొంపలు మునిగిపొయినట్ల  బిరబిరా కొంగు సర్దుకుండేదాన్ని, ఆ స్కూలు కాడ మద్యానం బోజనం తయార్జేసే సాట సీరకుచ్చెండ్లు పైకి ఎగజెక్కి ముట్లుడిగిన దాని మాదిరి వంటొండుతావుంటే మనసు నలిగిపొయ్యేది రాములూ! అందికే ఆ పన్జేసేకి కడాకు నావల్ల కాల్యా! ఇంట్లో మీ అన్నయ్యేమో, నేను ఆ పని మానేస్తే ఇంటందరూ లక్షనంగా దినామూ రొండు పూటలా తినే కూట్లో మన్ను పోసుకున్నెట్లయితాదని, నెలనెలా చేతికొచ్చే జీతాన్ని చేజేతులారా పోగొట్టుకుంటే ఎట్లని ఇట్ల నాతో చెప్పనూల్యాక, అట్ల నేను ముడుసుకోని పోతావుంటే సూడనూల్యాక మద్దెలో నలిగిపోయినాడు రాములూ! ఇంగొగపక్క, పదో తరగతి వరకూ సదువుకోనుండే తనకు యాడా నాలుగైదు వేలొచ్చే వొక సన్న వుద్యోగం రాకపాయనే అని దిగుబుర్లయినాడు. మనిసేమో అమ్రుతమట్లావాడు, అట్లా వాన్ని ఇంగా యాల ఇబ్బంది పెట్టల్లని గెట్టిగా ఆలోశెన జేస్తి రామలక్ష్మీ.

ఈదేశెంలో ఆడదానికి మానం కంటే ముక్కెమయింది ఇంగేముందే? ఈ వొచ్చే నాలుగు దుడ్ల కోసరం మానాన్ని అమ్ముకోని యాల బతకల్ల? కండలుండాయి, కూలి పనిచేసి ఆ మాత్తరం సంపాదించ్చుకోలేనా అని గెట్టిగా నిర్నయించుకోని ఆ కొంపనొదిలిపెట్టి ఈ కల్లూరికొచ్చి సేరుకుంటిమి రాములూ! వొచ్చిన యాలావిసేశమేమో గానీ అన్నీ లచ్చనంగా కుదురుకుండాయి. మీ అన్నయ్య గుడకా ఆ యెలకంటోల్ల రైసుమిల్లులో గుమస్తాగా సేరుకుండాడు. ఇప్పుడు మనసుకు నిమ్మలంగా వుంది’ అని బతుకు వివరాలన్నీ చెప్పి రామలక్ష్మి సంసారం గురించి అడిగింది ద్రౌపది. తమ ఇద్దరి స్వగ్రామమైన ‘ముంటిమడుగు’ సంగతున్నీ గుచ్చిగుచ్చి అడిగింది. అన్నీ వివరంగా చెప్పింది రామలక్ష్మి. తన మొగుడు ముంటిమడుగులో ఈ మధ్యనే ఇటికపెల్లల బట్టీ పెట్టుకున్నాడని సంసారానికి ఇబ్బందేమీ లేదని తెలిపింది.

వాళ్లు మాట్లాడుతూ వుండగానే అదే కాలనీలోనే చీటీగుడ్డలు అమ్ముకుండే వసంత ఆ వీధి గుండా ముందుకు పోతూ ఆ ఇంటి వాకిలి దగ్గరికొచ్చి, ‘రేప్పద్దన చీటీగుడ్డలు తెచ్చుకుండేకి నేను పామిడికి పోతావుండాను, నువ్వూ వస్తావా ద్రౌపదీ?’ అని అడిగింది.
‘నేనే సందకాడ మీ ఇంటికాటికొచ్చి పామిడికి పొయ్యే సంగతి అడగల్లని అనుకోనుంటిని వసంతా! నువ్వే వొచ్చినావు, ఆ రంగరాజోల్ల వోల్‌సేల్‌సాపులో పోయినవారం తెచ్చిండే వాయిలో సీరల్లో రెండు సీరలు నట్టనడిమద్యలో నేతలోనే నాలుగు పోగులు ల్యాకుండా వొచ్చినాయి. అవి యెనిక్కిచ్చి వేరేటివి తీసుకోనిరావల్ల. పదాం లే వసంతా! పద్దన్నే టిఫను ముగిచ్చుకోని పదాంలే!’ అని ద్రౌపది తన అంగీకారం తెలపడంతో ఆమె వెళ్లిపోయింది. 
చాలా రోజులు తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితురాలు రామలక్ష్మిని మధ్యాహ్నం భోజనానికి బలవంతంగా నిలుపుకొని వంటపని మొదలుపెట్టింది ద్రౌపది. స్నేహితురాలికి సహాయపడసాగింది రామలక్ష్మి. వంటపని చేస్తూ ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. మాటల సందర్భంలో తన మొగుడు శ్రీనివాసులు టైలరింగ్‌ కూడా నేర్చుకున్నాడని, చిన్నపిల్లల అంగీలకూ నిక్కర్లకూ ఆల్తి ప్రకారం తానే కటింగ్‌ చేసిపెట్టి మిల్లుకు పోతాడని, పిల్లలు కూడా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ తనకు సహాయపడతారని మురిసిపోతూ చెప్పింది ద్రౌపది.

మధ్యాహ్నం భోజనానికి శ్రీనివాసులు ఇంటికొచ్చినాడు. ‘అన్నయ్యా’ అని నోరారా పిలిచే తన భార్య స్నేహితురాలిని ఆత్మీయంగా పలకరించినాడు. ముగ్గురూ కూర్చొని భోజనాలు ముగించినారు. ఎండ తీవ్రంగా వుండడంతో సాయంకాలం వరకూ అక్కడే గడిపింది రామలక్ష్మి. అర్జెంటుగా నాలుగైదు జాకెట్లు కుట్టాల్సినవి వున్నాయని మనసు హెచ్చరిస్తున్నా రాకరాక వచ్చిన స్నేహితురాలితో గడపడం కోసం మూడు నాలుగు గంటలసేపు ఆ పనిని పక్కనబెట్టింది ద్రౌపది. నిండుమనస్సుతో నిర్మలంగా పలకరిస్తూ సొట్టబుగ్గలతో నవ్వులు గుమ్మరిస్తూ వొయ్యారంగా అటూఇటూ పారాడుతూ అందాలన్నీ ఉలకబోస్తూ ముచ్చటగా కనిపించే ద్రౌపదితో సాయంకాలం వరకూ మురిపాలాడి, బ్రహ్మాండంగా వానమోడం పట్టిందని, పల్లెలో పచ్చి ఇటుకలమీద ప్లాస్టిక్‌  పేపర్లు కప్పేపని వుంటుందని బయలుదేరి వెళ్లిపోయింది రామలక్ష్మి.

రాత్రి బాగా పొద్దుబోయినాక పెద్దవర్షం పడడంతో ఉదయం ఇంటిముందున్న రోడ్డంతా బురదబురదగా మారింది. ఒక్కపూట స్కూలుకు పోకపోయినా పిల్లలు వెనకబడిపోతారన్న తాపత్రయంతో అయిష్టంగానే వాళ్లను స్కూలుకు ప్రిపేర్‌ చేసింది ద్రౌపది. శ్రీనివాసులు పిల్లల్ని స్కూల్లో వొదిలి అట్లే డ్యూటీకి పోవల్లని బయలుదేరుతూ, ‘ఎగవన బారీ వర్షం పడి పెన్నేరు పారతావుందంట ద్రౌపదీ, పామిడికి సాయంకాలం పోతే బాగుంటాది గదా! ఈ పొద్దు మన కాలనీ గుండా పామిడికి పొయ్యే బస్సులు కూడా తిరగవంట! బైపాస్‌ మీద కర్నూలుకు పొయ్యే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మాత్రమే పోతావుండాయం!  కాబట్టి సాయంకాలమో రేపో పొయ్యేది మేలు ద్రౌపదీ! కాదు  గూడదనుకుంటే ఆయమ్మ వసంత వచ్చినంక ఇద్దరూ కలిసి ఆ తరిమెల రోడ్డు క్రాసింగు దగ్గరికి పోతే ఆటోలుంటాయి, బైపాస్‌ మీద పోవచ్చు’ అంటూ సలహా ఇచ్చినాడు శ్రీనివాస్‌.

‘అయ్యో, ఆ క్రాసింగుకాటికి పొయ్యేలోపల, ఈ పాత బ్రిడ్జి మింద పోతే పామిడిలో సాపు దగ్గరికే సేరుకోవచ్చు గదా బావా! ఈట్నుంచీ యెంతుంది, రెండు పర్లాంగుల దూరంలో యేరు, యేటిమింద నాలుగు పర్లాంగులు చప్పిడి, అది దాటుతానే పామిడి, అంతా గలిపితే వొగ కిలోమీటరు గుడకా వుండదు గదా! దీనికల్లా ఆ క్రాసింగు కాటికి పొయి ఆడ ఆటో పట్టుకోని ఐదు కిలోమీటర్లు సుట్టుకోని పోవల్లనా బావా? ఈడుండే పామిడికి పొయ్యేకి ఆటోవాళ్లు వొగొగ మనిసికి యాభై రూపాయలు డిమాండు జేస్తే యెట్లిచ్చేది? యా ఆటో వొద్దులే!... యేం పర్వాలేదు. నీళ్లు గుడకా చప్పిడి బ్రిడ్జీ మింద సలపాగ దొర్లుతావుండాయంటలే! ఈ పెన్నేట్లో ఆ మాత్తరం నీళ్లు దొర్లడమే అబ్బురం! మనుసుల్ని దాట్నీకుండా పెన్నేరు పారడం యెవురయినా చూసినారా బావా?... యేం పర్వాలేదుగానీ నువ్వు జాగర్తగా, పిల్లోల్లను పిల్సుకోని పో, రోడ్డంతా బురదబురదగా వుంది, పిల్లోల్లు కిందపడేరు!’ అని జాగ్రత్తలు చెప్పి మొగుని వెంట పిల్లల్ని పంపింది. తాను టిఫెన్‌ తిని తయారుపడి, వాపసు ఇయ్యవలసిన చీరలు రెండూ బ్యాగులో పెట్టుకొని ఇంట్లో నుంచీ బయటికొచ్చింది ద్రౌపది. అంతలోనే వసంత వచ్చి కలుసుకుంది. ఇద్దరూ నడుస్తూ పెన్నేటి పాత బ్రిడ్జి దగ్గరికి చేరుకున్నారు.

జనమంతా తండోపతండాలుగా వచ్చి పారుతున్న యేటివైపు ఆనందోత్సాహాలతో చూస్తున్నారు. ఎగువ భాగంలో కొంపలు కూలిపోయే విధంగా వానొచ్చిందేమో నీళ్లు నురగలు కక్కుతూ చప్పిడిమీద జేనెడులోతున పారుతున్నాయి. దశాబ్దాల తరబడి ఎండిపోయిన పెన్నేరు పల్చగా పారుతూ జనానికి కన్నుల పండువగా వుంది. ఉత్సాహంతో పిల్లలూ యువకులూ కేరింతలు కొడుతూ చప్పిడి బ్రిడ్జీమీద పారుతున్న నీళ్లల్లో కొంతదూరం వెళ్లి, పెద్దలు గట్టిగా మందలిస్తూ కేకలు వేయడంతో వెనుదిరిగి వస్తున్నారు. కొంతమంది, ‘ఇవేమి నీళ్లు’ అని అనుకుంటూ ధైర్యంగా ముందుకు చూస్తూ పామిడి వైపు మెల్లగా అడుగులేస్తున్నారు. గట్టుమీద నిల్చుకొని ప్రవాహం వైపు చూస్తున్న కొంతమంది ముసలీముతకోళ్లు, పెన్నేటిని గురించి ఎప్పుడు విన్నారో ఎప్పుడు చూసినారోయేమో గాని ‘దీని పేరే పీనిగల పెన్నర్రా, నీల్లలేకి యాల దిగుతారు?’ అని గొనుగుతున్నారు. వాళ్ల గొనుగుళ్లు ఎవరికీ వినిపించడం లేదు.

బ్రిడ్జి మీద పొర్లుతున్న నీళ్లు  ప్రమాదకరంగానయితే కనిపించడం లేదు. అందుకే ముందుకు వెళ్లుతున్న వాళ్లు పెద్దగా ఇబ్బంది పడకుండా పోతున్నారు. కొంతమంది, ఏమి అవసరముందో యేమో కలియబలుక్కొని వరుసగా వొకరి చేతినొకరు పట్టుకొని సాగిపోతున్నారు. ముందుకెళుతున్న గుంపును చూసి పర్వాలేదులే అనుకొని ద్రౌపది చీరకొంగును భుజమ్మీదనుంచీ కొంచెం కిందికి లాగి నడుముకు చుట్టి కొంగు కొనభాగాన్ని బొగ్గిట్లోకి చెక్కుకొని నీళ్లల్లోకి దిగింది. తనముందున్న వొక యువకుని కుడిచేతిని ఆసరాగా ఎడమ చేతితో పట్టుకొని తన కుడిచేతిని వసంతకు ఆసరాగా అందించి ధైర్యం చెప్పింది. వసంత అర్ధమనస్కంగా ద్రౌపది చేతినందుకొని మెల్లగా అడుగులు వేయసాగింది.

పదడుగులు ముందుకు పోయినాక వసంతకు ధైర్యం చాలలేదు. తటాలున ద్రౌపది చేతి నుండి తన చేతిని లాక్కొని వెనక్కిపారి వచ్చి గట్టెక్కింది. ద్రౌపది భయపడకుండా బ్యాగు సంకకు తగిలేసుకొని ఆ యువకుని చేయిపట్టుకొని ముందుకు వెళ్లుతూ, పారే నీళ్లల్లో పాదం పైకెత్తకుండా నేలమీద మెల్లగా ముందుకు జరుపుకుంటూ పోవాలని ఆ పిల్లవానికి సూచనలిస్తూవుంది. ఏటి మధ్యలో చేరేసరికి ప్రవాహం కొంచెం పెరుగుతున్నట్లు కనిపించడంతో ఆ యువకుడు భయపడసాగినాడు. బ్రిడ్జి అంచుల్లో ఇనుపచువ్వలున్నాయని అవసరమయితే చువ్వను పట్టుకోవచ్చునని, నీళ్లు మోకాళ్లకింద వరకే వున్నాయని భయపడాల్సిన పనిలేదని ఆమె ధైర్యం చెప్పసాగింది. అయినా ఆ పిల్లవాడు ధైర్యం కోల్పోసాగినాడు.

ఉన్నట్లుండి ప్రవాహంలో వొక కల్ల తొడుగు కొట్టుకొని వచ్చింది. దాన్ని చూసి పూర్తిగా భయపడి ఆ పిల్లవాడు ధైర్యం కోల్పోయి పట్టుదప్పి నీళ్లల్లో పడి, బ్రిడ్జి పక్కనున్న గుంతలోకి జారిపోతూ ‘అక్కా అక్కా’ అని గట్టిగా అరవసాగినాడు. ఆ పిల్లవాని అరుపులు విని, ఈత రాదని అర్థం చేసుకొని గాబరాపడుతూ ఏమి చేయాలో దిక్కుతోచక దగ్గరున్న ఇనుపచువ్వను గట్టిగా పట్టుకొని ధైర్యం తెచ్చుకుంది ద్రౌపది. ఆ ధైర్యంతోనే క్షణకాలం ఆలోచనచేసింది. మెరుపు మాదిరి ఏదో స్ఫురించింది. వెంటనే తాను కట్టుకున్న చీరను లోపల లంగావుంది కదా, యేం పరవాలేదులే అనుకొని సిగ్గును పక్కనబెట్టి విప్పదీసింది. చీర వొకవైపు కొనను చువ్వకు గట్టిగా ముడివేసి ఆ పిల్లవాని వైపు చూసింది. వాడు నిలదొక్కుకొని నిల్చుకోడానికి సాధ్యం కాక దిగువ వైపున్న మరొక గుంతలోకి కొట్టుకొనిపోతూ ప్రాణభయంతో ‘అక్కా అక్కా’ అని అరుస్తున్నాడు. తన ఆరుగజాల చీర తనకూ వానికీ మధ్యవున్న దూరానికి సరీపోదనుకొని వెంటనే గబగబా బ్యాగులో ఉన్న రెండు చీరల్నీ తీసి తడిపి వొకదాని కొనకూ మరొకదాని కొసకూ గట్టిగా ముడివేసి మొత్తం చీరతాడును చుట్టజుట్టి బలంగా వాని వైపు విసిరింది.

ఆమె  ఆలోచనా ప్రయత్నమూ ఫలించినాయి. ఆమె విసిరిన చీరలతాడు కొనభాగం ఆ యువకుని చేతులకు అందింది. అతడు దాన్ని లాగి పట్టుకోవడంతో ఆ ప్రవాహం అతన్ని ముందుకు నెట్టలేకపోయింది. అతడు చీరతాడును గట్టిగా బిర్రుగా పట్టుకొని నీటిమట్టం లోతుగా లేని వైపునుంచీ చప్పిడి (కాజ్‌వే) దగ్గరికి రాసాగినాడు. ప్రాణాపాయం నుంచీ బయటపడి మెల్లగా అతడు కాజ్‌వే దగ్గరికి వొస్తూ వుండడం చూసి ద్రౌపది గర్వంగా తృప్తి చెందసాగింది.

నిజానికి కాజ్‌వే మీద దొర్లుతున్న నీటి ప్రవాహం నదీ ప్రవాహం మాదిరి ఉధృతంగా అయితే ఏమీ లేదు. కాజ్‌వే పక్కన ఇసుక కోసం తవ్విన గుంతలున్న చోట నీటి ప్రవాహం వేగంగా దుముకుతూ వుంది. అటువంటి ప్రవాహం కారణంగానే ఆ యువకుడు నిలదొక్కుకోలేక గుంతలోకి పడిపోయి కొంచెం దూరం కొట్టుకొని పోయినాడు. కాజ్‌వే పక్కన గుంతలు లేని చోట నీటి ప్రవాహం నెమ్మదిగా పోతూవుంది. చీరతాడును గట్టిగా పట్టుకొని ఆ యవకుడు ప్రవాహం తక్కువగా వున్న గుంతలులేని దిన్నె వైపు రాసాగినాడు. అతనికి జాగ్రత్తలు చెప్పుతూ సూచనలిస్తూ ద్రౌపది చీరతాడును తాను కూడా లాగుతూ ఆ యువకుడు కాజ్‌వే చేరుకోడానికి సహాయపడుతూ వుంది.

అంతలో వొక పది మందిని ఎక్కించుకొన్న జీపు పామిడి వైపు వేగంగా వెళ్లింది. అందులో వున్న మనుషులు ద్రౌపది వైపు చూస్తూ ‘యేట్లో నీల్లు ఇంగా యెక్కువయ్యేతట్ల వుండాయమ్మా, బిరిగ్గా ఆ పిల్లోన్ని బయటికి లాక్కోని యెల్లిపోమ్మా! యెవురేగానీ నిల్లల్లేకి దిగి ఈ సప్పిడి మింద ఆ పక్కా ఈ పక్కా పొయ్యేకి బయిపడతాండారు. ఇద్దరు ముగ్గురం జీపు దిగి నీకు సాయంగా వొచ్చేకి సాద్దెమయ్యేతట్ల లేద్దల్లీ’ అంటూ, ఆగని జీపులో ముందుకెళ్లిపోయినారు. జీపును నిలిపితే నీటి ప్రవాహం ఎక్కువయి జీపును పక్కకు నూకుతుందేమోనన్న ఆందోళనతో డ్రైవర్, జీపును వేగంగానూ జాగ్రత్తగానూ ముందుకు నడిపినాడు.

జీపు వేగంగా ముందుకెళ్లడంతో ఆమె లంగా జాకెట్టూ తడిసిపోయినాయి. అదేమీ పట్టించుకోలేదామె. సాహసమయిన సహాయ రక్షణ మీద తప్ప ఇక దేనిమీదా ఆమె దృష్టి లేదు. 
ఆ రోజు మహా వీరాధివీరులతో నిండివున్న కౌరవ మహాసభలో దుశ్శాసనుడు తనను మానభంగం చేయడానికి తన చీరను బలవంతంగా లాగిపడేస్తుంటే నిస్సహాయురాలై తన వక్షస్థలాన్ని రెండు చేతలతో కప్పుకొని తన మానాన్ని కాపాడుకోడానికి ఆరాటపడుతూ భగవంతున్ని ప్రార్థించింది భారత కథానాయిక ద్రౌపది. ఈరోజు అనుకోని ప్రమాదానికి గురై, యేట్లో పడి కొట్టుకొని పోతూ ప్రాణాపాయ స్థితిలో వొక అపరిచయ యువకుడు ‘అక్కా కాపాడు, అక్కా రక్షించు’ అంటూ ఆర్తనాదాలు చేస్తుంటే చూసి చలించిపోయి, తన మానాన్ని, ఎవరెవరి చూపుల కోరలనుంచో అంతులేని అభిమానంతో రక్షించుకొని వచ్చిన తన మానాన్ని లెక్కచేయకుండా దాని మీద స్పృహే లేకుండా పరాయి వ్యక్తి రక్షణలో సాహసోపేతంగా నిమగ్నమయింది ఈ ద్రౌపది. నిమగ్నమై అతనిని కాపాడే ప్రయత్నంలో తనను తాను మరిచిపోయింది.

అంతలోనే పామిడి వైపు నుంచీ ఇరవై మంది మనుషులను ఎక్కించుకొని వొక ట్రాక్టర్‌ వచ్చింది. ద్రౌపది చేస్తున్న సాహసాన్ని గమనించిన ట్రాక్టర్‌లోని కొంతమంది మనుషులు బలవంతంగా ట్రాక్టర్ని ఆపినారు. అందులో వున్న ఆడవాళ్లతో పాటు మగవాళ్లందరూ తన వైపు చూడడంతో అప్పుడు తన వొంటి మీదున్న తడిసిన బట్టలను గురించీ తన శరీర భాగాలను గురించి స్పృహ రావడంతో సిగ్గుపడుతూనే, కాజ్‌వే దగ్గరికొచ్చిన యువకునికి చేతులందించి పైకి లాగసాగింది ద్రౌపది. ట్రాక్టర్‌లో నుంచీ ఇద్దరు మగవాళ్లు కిందికి దిగి జాగ్రత్తగా గైడ్‌పోల్‌ (కాజ్‌వే అంచులో పాతేసిన ఇనుప పోల్‌) దగ్గరికి వచ్చి ఆ యువకునికి చేతులందించినారు. చివరికి అతడు గట్టెక్కి, బతుకు జీవుడా అనుకుంటూ కృతజ్ఞతాభావంతో ద్రౌపది వైపు చూసి కంటతడిపెట్టినాడు.

ద్రౌపది విజయానందంతో తృప్తి  పడుతూనే ఎడమచేతిని తన ఎదభాగానికి అడ్డంపెట్టుకొని, కుడి చేతితో ఐరన్‌ గైడుపోలుకు గట్టిగా కట్టిన తన చీరను బయటికి లాగడానికి ప్రయత్నించింది. అది, ప్రవాహంలో కొట్టుకొని తటాలున వచ్చిన ఈత కొమ్మలకు తగిలి పేలికలు పేలికలు కావడంతో చూసి దిక్కుతోచక సిగ్గు స్పురించడంతో తన ఎదభాగానికి  రెండు చేతులూ అడ్డం పెట్టుకొని అప్పుడు ఆలోచన చేయసాగింది తన మాన సంరక్షణ గురించి. అంతలోనే ట్రాక్టర్లో వున్న వొక నడి వయస్కుడు, ‘తనకు’ లోపల నిక్కరుంది, చాల్లే’ అనుకొని నడుముకు చుట్టుకున్న అడ్డపంచను విప్పదీసి ఆమె మీదికి విసిరేసినాడు.

ఆమె వెంటనే దాన్ని కప్పుకొని వూపిరి పీల్చుకుంటూ ఆ మానవీయుని వైపు చూడసాగింది. ఎక్కువసేపు ట్రాక్టర్‌ గానీ మరెవరు గానీ కాజ్‌వే మీద వుండడం మంచిది కాదని, పెన్నేటికి ఎగువభాగంలో కురిసిన భారీ వర్షం కారణంగా రెండు చెరువులు తెగిపోయి ఆ నీళ్లన్నీ పెన్నా నదిలోకి చేరుతున్నాయని, కాజ్‌వే మీద ఇంకా నీటి ప్రవాహం పెరగవచ్చునని, ద్రౌపదినీ ప్రమాదం నుంచీ బయటపడిన వ్యక్తినీ ట్రాక్టర్లో నుంచీ దిగిన వాళ్లనూ అందరినీ తొందరగా ట్రాక్టర్‌పైకి ఎక్కమని డ్రైవర్‌ గట్టిగా చెప్పినాడు. అందరూ గబగబా ఎక్కడంతో ట్రాక్టర్‌ కల్లూరు వైపు కదిలింది.

ట్రాక్టర్లో కూర్చున్న ఇద్దరు పెద్దవాళ్లు ద్రౌపదినీ ఆ యువకున్నీ పరామర్శిస్తూ ‘చూచ్చూసి పారేపారే పెన్నేట్లేకి ఆడి మనిసిని వొగదానివే యాల దిగితివమ్మా? ఇంగ రోంతసేపుంటే ఏమయిండేదానివి? అంత అర్జెంటుపని యేముండె తల్లీ?... ఇంతకూ నువ్వెవురు సన్నోడా? యెట్ల జారి యేట్లేకి పడితివి? ఈ యమ్మెవురో నిన్ను కాపాడల్లని దైర్రెం జెయిడం బాగానే వుందిగానీ యేట్లో నీల్లు ఇంగరోన్ని వుబికింటే ఇద్దరూ యేమయిండేవాల్లు? గంగమ్మ తల్లి దెగ్గిర మనుసులు యెంతట్లోర్రా?’ అంటూ వాళ్లను మందలించినారు. మందలిస్తూనే ద్రౌపదిని అభినందించినారు. గుంపులోని ఇద్దరు ఆడవాళ్లు కొంచెం చదువుకున్నారేమో, ద్రౌపది సాహసానికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినారు.

‘నీ చీర, ఎంతో సాహసంతో తన మాన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ యువకుని ప్రాణాలను కాపాడడం చాలా గ్రేటమ్మా! ఈ మాదిరిగా ఈ దేశంలో ఏ పట్టుచీరయినా ఎప్పుడైనా ఎక్కడయినా ఇంతటి సాహసం చేయగలదా పెద్దాయనా?’ అంటూ ఆ ఇద్దరూ పెద్దాయన వైపు చూసినారు. ఆ ప్రశ్నకు జవాబు కనిపించని ఆ పెద్దాయన పెదవి విరుస్తూ తల అడ్డం తిప్పినాడు.
మధ్యతరగతి సాహస గమనంతో ట్రాక్టర్‌ కల్లూరు చేరుకుంది.
- శాంతి నారాయణ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top