మెకానిక్‌ రసూల్‌

Sakshi Funday Special Story

కథా ప్రపంచం

కొద్దిపాటి కాలంలోనే ఈ చిన్న పల్లెలాంటి పట్నంలో చాలా మార్పులు వచ్చాయి. పట్నంలో చెత్తనంతా ఎక్కడ పారేసేవారో అదే స్థానంలో ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ విశాలమైన టౌనుహాలు, క్లబ్బులు, గ్రంథాలయం. ఖలీఫా ఫరీద్‌గారి టక్‌టకా టక్‌టకా శబ్దం చేసే ‘సింగర్‌’ మిషన్‌కు, అతని కత్తెరకు కాలం చెల్లిపోయింది. లత్తు మాస్టరుగారి ‘మాడర్న్‌ కట్‌ఫిట్‌’ వెలిసింది.
ఒకవైపు యుద్ధం, మరోవైపు ధరలు పెరిగినప్పటికీ కొత్త కొత్త స్కీములు తయారవుతున్నాయి. చెడిపోతున్నాయి. పట్టణపు రూపురేఖలే మారిపోయాయి. ఇన్ని మార్పులొచ్చినప్పటికీ ఆ పాత మర్రిచెట్టు పక్కన సదరు రోడ్డుపై ఉన్న ‘మెకానిక్‌ రసూల్‌’ రిపేరు దుకాణం పూర్వంలానే ఉంది. కొత్తగాలి దానికి తగల్లేదు.  చిరిగిపోయిన జంపఖానా మీద కూర్చుని మరమ్మతు పనుల్లో నిమగ్నుడై ఉన్న రసూల్, అతని కొడుకు రహీమ్‌లలో మార్పు లేదు. చుట్టూ రిపేరుకు వచ్చిన వస్తువులు– సైకిళ్ల పాతచక్రాలు, ట్యూబులు, సీట్లు, పెడళ్లు, చైన్‌లు, హ్యాండిళ్లు, బ్రేకులు, పెట్రోమాక్స్‌ లైట్లు, స్టౌలు, హార్మోనియంలు, గ్రామ్‌ఫోన్‌లు, చుట్టుపక్కల చెల్లాచెదురై పడి ఉన్న పనిముట్లు చిన్నా పెద్దా పెచీలు, ఒక పాత చెక్కపెట్టెలో అన్ని సామన్లకు చెందిన పాత తుంటలు.
రెంచి, గరుకు కాగితం, ఉలి, సుత్తి, విరిగిపోయిన స్ప్రింగులు వగైరాలు ఉన్నాయి. అలమారపైన పాత గ్రామ్‌ఫోన్‌ గొట్టం తలకిందులుగా పడి ఉంది. ఇనుప కుర్చీ మీద కూర్చుని ఒక కస్టమర్‌ రిపేరవుతున్న తన చెడిపోయిన వస్తువును చూస్తున్నాడు. ఎదురుగా ఉన్న మర్రిచెట్టు మొదలుకు రోజూ వేలాడే కొత్త కొత్త దుకాణాల మందుల ప్రకటనలతో పాటు నేషనల్‌ వార్‌ఫ్రంట్‌ నినాదాలతో నిండిన కరపత్రాలు, సినిమా పోస్టర్లు వేలాడుతున్నాయి. వీటితో పాటు ఎప్పటినుంచో ఒక పాత ఇనుపరేకు కూడా వేలాడుతూ ఉంది. దాని మీద గజిబిజి అక్షరాలతో ‘మెకానిక్‌ రసూల్‌–ఇక్కడ మరమ్మతులు చేయబడును’ అని రాసి ఉంది.ఈ సైన్‌బోర్డును గురించి చదువుకున్నవారెందరో ఎంతకాలం నుంచో వ్యాఖ్యలు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ దాన్ని సరిదిద్దమని రసూల్‌మియాకు చెప్తూ వచ్చారు. కాని ఈనాటికీ ఇనుపరేకు అలాగే వేలాడుతూ ఉంది. ఎవరో చిలిపి పిల్లవాడు ఆ రేకుపైన ‘ఇక్కడ మనుషులకు కూడా మరమ్మతులు చేయబడును’ అని రాశాడు. ఆఖరికి దాన్ని తుడిచేయడం అవసరమని కూడా అతనికి తట్టలేదు.

మెకానిక్‌ రసూల్‌!
అరవై సంవత్సరాలు నిండినప్పటికీ శరీరంలో ఏమాత్రం వృద్ధాప్య లక్షణాలు లేవు. పనిలో స్ఫూర్తి, వేగం యువకుల కన్నా మిన్న. తళుకుబెళుకులు లేని సామాన్యుడు. పైన ఒక చొక్కా, కింద లుంగీ. టీ, పాన్, బీడీలకు దాసుడు. పనీపాటా లేకుండా ఊరికే కూర్చోవటం అంటే తెలియని వాడు. గొప్పలు కొట్టడంలో నేర్పరి. కాని తన కర్తవ్యాన్ని ఎప్పుడూ విస్మరించడు. పనిచేస్తూనే ఎంతసేపైనా మాట్లాడుతూ ఉండగలడు.
 టక్‌.. టక్‌.. టక్‌.. టక్‌..
‘‘స్వర్గమూ నరకమూ ఎక్కడో లేవు. ఇక్కడే ఉన్నాయి. మన మంచి చెడ్డలకు అనుగుణంగా ఇక్కడే వాటి ఫలితాలు మనకు ప్రాప్తిస్తాయి. ఆ బాబు రామచందర్‌కి ఎమైందో మీకు తెలుసు కదా..అరే ఓ రహీమ్‌! కొంచెం ఆ పేచ్‌కస్‌ ఇటు పారెయ్యి.. అరే బాబు రామచందర్, అరే.. అతని తమ్ముడు ఆఖరికి ఏమయ్యాడో తెలుసు కదా..’’
రహీమ్‌! మెకానిక్‌ రసూల్‌కి ఒక్కగానొక్క కొడుకు.  తండ్రి ఆజ్ఞ జవదాటని తనయుడు. అవసరానికి మించి నమ్రత చూపేవాడు. తండ్రి ఎదుట అతను నోరెత్తగా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ఇద్దరూ ముగ్గురూ ఒకేసారి వస్తువులను తీసుకొస్తే, అతని ఓర్పుకి పరీక్ష ప్రారంభమవుతుంది. చిన్న మామూలు తప్పు జరిగిందంటే రసూల్‌మియా ఉగ్రుడైపోతాడు. నిరంతరం పనిచేస్తున్నప్పటికీ తండ్రి అప్పుడప్పుడు అతడికి సోమరి, పనిదొంగ, అజాగ్రత్తపరుడు, తిరుగుబోతు అనే బిరుదులిస్తూ ఉంటాడు. రసూల్‌మియా తిడుతూపోతూ ఉంటే రహీమ్‌ మాత్రం వాటిని లెక్కచెయ్యకుండా రిపేరుకొచ్చిన వాళ్లకు ‘‘దీని స్ప్రింగు విరిగిపోయింది. హోల్డింగు నట్టు కూడా..’’ నచ్చచెపుతూంటే దీంట్లో కూడా రసూల్‌మియా జోక్యం చేసుకుంటాడు. ‘‘ఏది చూపించు ఏమైందో?.. అరే ఏం పిల్లోడివిరా, స్ప్రింగు వేద్దాము. హోల్డింగు నట్టు కూడా మారుద్దాములే. ఈ మిషను నడిపి రికార్డు స్థాపిస్తే అప్పుడు అసలైన మెకానిక్కు అయ్యేది.. అరే గాడిదా.. బ్యాలెన్సు ఎలా సరి అవుతుంది?’’

రహీమ్‌ తనలో తాను నవ్వుకుంటూ ముఖం కిందకు దించుకుంటాడు. పట్నానికి రెండు మైళ్ల దూరంలో తూర్పు దిశలో ఉన్న చిన్న ఊరిలో మెకానిక్కు ఇల్లుంది. మెకానిక్‌ పూర్వీకులు ముందెప్పుడో సంపన్న రైతులుగా ఉండేవారు. కాని ఈనాడు మూడు గుడిసెలు, పశుధనం పేరిట కొన్ని మేకలు, కోళ్లు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు అవే వాళ్ల ఆస్తి.  దుకాణం బంద్‌ అయిన రోజు వాళ్ల తిండి కూడా బందే. ఆదాయం వస్తూంటే నెల్లో ముప్పయి రోజులూ కబాబ్, కైమా, హల్వా, సేమియా వంటకాలు తయారవుతాయి. కొడుకు, కోడలు నోరెత్తరు. రసూల్‌మియా భార్య మాత్రం మొదటి నుంచి కూడా పొదుపు చేయాలని కొంతలో కొంత డబ్బులు కూడబెట్టాలని ప్రయత్నాలెన్నో చేసి ఓడిపోయింది. రసూల్‌మియాగారి ఉమర్‌ఖయాం ఫిలాసఫీ ముందు ఆవిడగారి ఏ తర్కమూ నిలవలేదు. రహీమ్‌ చేతిలో ఏదైనా పొట్లం కనబడితే వెంటనే అడిగేస్తుంది ‘‘పొట్లంలో ఏముందిరా?’’ అని.
‘‘గుండెకాయ’’ రహీమ్‌ మెల్లగా బదులిస్తాడు.
‘‘ఎంత? శేరా?... ధరెంత? అరె అల్లా.. శేరు రెండ్రూపాయలా? ఏమి నాలుకరా? పాడు నాలుక. రెండు రూపాయలకు శేరు గుండెకాయా? అల్లామియా మీకెప్పుడు బుద్ధి చెబుతాడురా? ఆ ముసలాడు తలపైన తిండిపోతు దయ్యం సవారి చేస్తోంది. వాడంటే సరే, వద్దని చెప్పేదానికి నీ నోరు ఏమైంది?’’ ముసల్ది తండ్రి గురించి తిడుతూ ఉంటే రహీమ్‌ అక్కడి నుంచి జారుకుంటాడు. ‘‘ఈ తండ్రీకొడుకులకు ఎప్పుడు బుద్ధి వస్తుందో? కాలాన్ని బట్టి నడుచుకోరు’’  తిండీతిప్పలకే ఆస్తంతా హరించుకుపోయిన వాళ్లను ఉదహరిస్తూ ‘‘ఇలాంటి తిండిపోతులు చచ్చేనాటికి తమ శవాలపై కప్పేదానికి గుడ్డను కూడా మిగుల్చుకోరు’’ అంటూ ఆమె తన దౌర్భాగ్యానికి చింతిస్తూ తలకొట్టుకుంటుంటే రసూల్‌మియా ఇంటికి తిరిగొస్తాడు. వచ్చీరాక ముందే ఆయనది ఒకటే ప్రశ్న ‘‘ఇంకా గుండెకాయ ఇట్లే ఉందే?’’ ముసల్ది మూతి ముడుచుకుని కిమ్మనకుండా ఉంటుంది. రసూల్‌మియా లోపలికెళ్లి చొక్కా విప్పి, వసారాలో దిట్టంగా కూర్చుంటాడు. మనవరాలు హుక్కా తెచ్చిపెడుతుంది.

రసూల్‌మియా హుక్కా పీలుస్తూ సీరియస్‌ అయిపోయి ముసలిదానితో ఇలా అంటాడు. ‘‘రహీమ్‌ అమ్మా, ఆఖరికి నీ గొణుగుడు ఎప్పుడు అంతమవుతుందే? ఎప్పుడు చూసినా నీకిదే గొడవ. ప్రతిసారి ఇది నీతో వచ్చిన ఇబ్బంది. అసలు నీకు సిగ్గూ శరమూ లేదా?’’ ‘‘నోరు మూసుకో! సిగ్గూ శరమూ మాటెత్తకు’’ అని ముసల్ది గద్దిస్తుంది. ‘‘నువ్వెవరివే, నన్ను నోరు మూసుకోమనటానికి? వందసార్లంటాను నీకు సిగ్గూ శరమూ లేదని. అన్నింటికీ తెగించావు. నీకే పెత్తనమిస్తే అందరినీ ఆకలితో చంపుతావు. ఎప్పుడైనా ఏదేనా తింటానికి తెస్తే గొణక్కుండా మమ్మల్ని తిననియ్యవు.’’
‘‘గొగే ముతల్ది’’ కరీమ్‌ బిస్కటు తింటూ నవ్వుతూ అరుస్తాడు. పాపం ముసల్ది ఏడుస్తుంది. ‘‘అల్లా లాలా! నాకెప్పుడు చావొస్తుందో. బతికి నేనేం చెయ్యాలి. ఈ ఇంట్లో నేనెవరిని? నేనెందుకు మాట్లాడాలి? మంచి చెప్పినా చెడ్డే! నాకు సిగ్గూ శరమూ లేదట’’ మనవరాలు గుండెకాయ పొట్లం తీసుకుని కోస్తుంటుంది. రహీమ్‌ గుడిసెలోంచి బయటకు వెళ్లిపోతాడు. ముసల్ది కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తుంటుంది.
రసూల్‌ కాకాగారూ! ఇంట్లో ఉన్నారా? బయటి నుంచి ఎవరో పిలుస్తారు. ‘‘ఎవరూ? ఫక్రుద్దీనా? లోపలికిరా. ఏమిటి విశేషాలు?’’ రసూల్‌మియా నోట్లో నుంచి హుక్కా గొట్టాన్ని తీస్తూ అంటాడు.
‘‘కాకా, రషీద్‌కు పొద్దుటి నుంచి వాంతులు విరోచనాలు. మందుమాకు తీసుకోలేదు. శరీరం కూడా చల్లబడింది.’’
‘‘పొద్దుటి నుంచి ఏం చేస్తున్నారు?’’ అంటూ రసూల్‌మియా లేచి నిలబడతాడు. ‘‘పద చూద్దాం. ఏం కాదులే. భయపడొద్దు. ఆ పిల్ల పులుపు తీపీ ఎక్కువ తిని ఉంటుంది. నయమవుతుందిలే’’ అంటూ మందు కోసం లోనికి వెళ్లాడు.
‘‘ఫక్రూ, ఇస్మైలుకు ఎలా ఉంది?’’ ముసల్ది అడుగుతుంది.
‘‘నీ దువా వల్ల ఇప్పుడు బాగున్నాడు కాకీ. నీవేమో ఈ మధ్య రావడమే మానేశావు. కాకీకి మనమంటే ఎందుకో కోపమంటూంది ఇస్మైల్‌ అమ్మ.’’

రసూల్‌మియా జేబులో కొన్ని చిన్న పెద్ద బాటిల్సు వేసుకుని బయటికొచ్చి ‘పద’ అన్నాడు. ‘‘కొంచెం బాగా చూడు. ఏమైనా మందు కావాల్సుంటే పాట్నా నుంచి తెప్పించు’’ ముసల్ది జాలి అంది.
తాతగారు వెళ్లిపోయిన తర్వాత కరీమ్‌ నెమ్మది నెమ్మదిగా అవ్వ వద్దకు వచ్చి కూర్చుని అవ్వను చూస్తూ నిష్కారణంగా నవ్వుతూ అవ్వతో సంధి చేసుకోవాలని తాపత్రయం చూపుతాడు. అవ్వ తాను తిని మిగిల్చిన అర్ధ బిస్కట్టు తీసుకుని సంధి చేసుకున్నా వాడికి సమ్మతమే.
‘‘పోరా. భడవా. మీ తాత దగ్గరికిపో. బిస్కట్టు ఎరచూపి బతిమాలడానికి వచ్చావు. నేను గొణిగే ముసల్దాన్ని కదా’’ అంటూ ఆమె తన కోపం చూపించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కరీమ్‌కు బాగా తెలుసు. జబర్దస్తీగా అవ్వ ఒడిలో చేరి, ఇప్పుడు తాతపైన చాడీలు చెప్పసాగాడు. ‘‘తాత తిందిపోతు, కోపిత్తి (తిండిపోతు, కోపిష్టి)’’ అవ్వ పెదవుల్లో దాగి ఉన్న నవ్వును వాడు గుర్తించి నవ్వుతూ ఏమేమో చెబుతూ అవ్వను సంతోషపరచాలని ప్రయత్నిస్తాడు. ‘‘అంటే తాతతో చేసుకున్న క్షణిక దోస్తీ బిస్కట్టు కోసమని, చూశావా! తాతను మోసగించి బిస్కట్లు సంపాదించాను’’ దీన్నే రాజకీయం అంటారు.
గుండెకాయ కోస్తూ వాళ్లమ్మ వాడివైపు చూస్తూ ‘‘మీ తాత రానీ, నీ మోసమంతా బట్టబయలు చేస్తాను’’ అంటుంది.
కరీమ్‌ అమ్మ మాటలను ఎలా సహించుతాడు. ఇంట్లో ఉన్న మనుషుల్లో అమ్మ మాటకు విలువ లేదు. కరీమ్‌ అమ్మను ఇంతకు ముందు ఎప్పుడూ పొగడలేదు. పొగడడు కూడా. అమ్మ నన్ను బెదిరిస్తుందా? ఆమెకు ఎన్ని గుండెలు? కొంత సేపు మౌనం పాటించి నవ్వుతున్న అమ్మను చూసి ‘‘ఊలుకో! ఎల్లిదానా’’ (ఊరుకో వెర్రిదానా) అని గద్దించాడు.

‘‘రానీలే, తాతను’’ అని అమ్మ మళ్లీ బెదిరించింది. కరీమ్‌ అమ్మ మాట విని కోపంతో అవ్వ ఒడిలో నుంచి ఉన్నపళంగా లేచి అమ్మపై దాడి చేయడానికి చుట్టూ చూశాడు ఆయుధం ఏమైనా దొరుకుతుందేమోనని. అక్కడున్న లావుపాటి కర్రను ఎత్తలేక చేతులతోనే అమ్మపైకి దాడికి దిగుతాడు. వెంట్రుకలు లాగుతాడు. ‘‘వదులురా వెధవా! వదులు. తాతతో చెప్పనులే’’ అంటూ అరుస్తుంది అమ్మ.
అవ్వ నవ్వుతూ వెళ్లి వాన్ని పట్టుకుని లాగుతుంది. కరీమ్‌ వచ్చీరాని మాటలతో ‘‘కోపిష్టి తాతను, నాన్నను, నిన్ను ఇంట్లో నుంచి బయటకు తోసేస్తాను’’ అని బెదిరిస్తాడు.
ఎప్పుడైనా సరే వాళ్లమ్మ కోపగించుకుంటే ఆమెను కొట్టడానికి ఉరుకుతాడు. కాని ఇంతలోనే వాళ్ల అవ్వ వాన్ని వారిస్తుంది. పండ్లు నూరుతూ, ఏదో వాగుతూ కూర్చుంటాడు. అవ్వ, వాళ్ల అమ్మ వాడి చేష్టలను ముందే పసికడతారు. అప్పుడు ‘‘ఈరోజు పాలు తాగేటప్పుడు నిన్ను ఏడ్పించి తీరుతాడు చూడు’’ అని ముసల్ది అంటుంది.
ఈ మధ్య కరీమ్‌ ఒక కొత్త ఉపాయం కనిపెట్టాడు. పాలు తాగేటప్పుడు వాడు మధ్య మధ్యలో దీన్ని ప్రయోగిస్తాడు. ‘‘చంపినాడురా!’’ అని వాళ్లమ్మ గట్టిగా అరుస్తుంది. తన ఉపాయం సఫలీకృతమైనందుకు కరీమ్‌ కిలకిలా నవ్వుతాడు.
వంటింట్లో కోడలు గుండెకాయ కూర చేస్తుంటే ‘‘కూరను చూడు, ఎక్కువ మాడ్చద్దు. లేకపోతే తినేటప్పుడు మీ మామ పెద్ద తుఫాను లేపుతాడు’’ అంటూ ముసల్ది బయటి నుంచి అరుస్తుంది. ఉప్పు కారం, మసాలా ఎంత వెయ్యాలో మాటిమాటికీ హెచ్చరిస్తూ ఆఖరికి స్వయంగా వంటింట్లోకి వస్తుంది. కరీమ్‌ను కోడలికి అప్పగిస్తూ, బయటికి వెళ్లండి. కూర నేను చూస్తాను అంటుంది. కోడలు నవ్వుకుంటూ బయటికొచ్చేస్తుంది. ఊరంతా చుట్టేసుకుని రహీమ్‌ ఇంటికి తిరిగొస్తాడు. ఇంటి యజమాని, ఇల్లాలు, కొడుకూ ముగ్గురూ కలిసి పాత జపాన్‌ గ్రామ్‌ఫోన్‌పై ‘‘ఆదాసే ఆయోకరో పన్‌ ఘట్‌పర్, జబ్‌తక్‌ రహే జిగర్‌మే దమ్‌’’ కమలా ఝరియా పాటను వినడంలో నిమగ్నులైపోతారు.

ఇంటికి తిరిగి వస్తున్న రసూల్‌మియా చేతిలో కల్లుముంత ఉంటుంది. వరండాలో దస్తర్‌ఖాన్‌ పరుస్తారు. తూగుతున్న కరీమ్‌ కూడా లేచి కూచుంటాడు. కరీమ్‌ జోగాడుతూ చిన్న పళ్లెం, గొట్టంగల చెంబు(బధనా), గ్లాసు  తీసుకుని తాత దగ్గరకు పోతాడు. ముగ్గురూ కలిసి సంతృప్తిగా రొట్టె, గుండెకాయ కూర తింటూ ఉంటారు. మధ్యమధ్యలో కల్లు సేవిస్తూంటారు. ముసల్ది పక్కనే కూర్చుని వడ్డిస్తూ ఉంటుంది. ‘‘అబ్బ, కూర బలేబాగుంది’’ అనే మాట వింటూనే ముసల్ది ఉబ్బితబ్బిబ్బవుతుంది.
కరీమ్‌ కూడా ఒకటి రెండు గుటకలు తాగి ఊగుతాడు. ముంతలో మిగిలిన కల్లు ముసల్దానికందిస్తూ ‘‘ఒక గ్లాసు మిగిలింది. కోడలికిచ్చేసేయి. ఈ మధ్య కోడలు చిక్కి శల్యమైపోతోంది. రోజూ ఒక గ్లాసు తాగితే, శరీరం చక్కబడుతుంది. ఇది కల్లు. బెల్లపు సారాయి కాదు. నీవెప్పుడూ తాగలేదు కదూ? నీకెం తెలుస్తుందిలే!’’ అన్నాడు రసూల్‌మియా.
కొద్దిసేపట్లోనే ఆ గుడిసెల్లోని వారంతా నిద్రాదేవి ఒడిలోకి ఒరిగిపోతారు. అప్పుడప్పుడూ రాత్రిళ్లు రోగులను చూడటానికి రసూల్‌మియాకు వెళ్లే పనిబడుతుంది. అటువంటప్పుడు రాత్రంతా అతను రోగులతోనే గడుపుతాడు. ఉదయం నాస్తా తిని, అతను పట్నానికెళ్లిపోతాడు. మధ్యాహ్న భోజనం రహీమ్‌ తీసుకెళ్తాడు. ఇంటి నుంచి మాత్రం రోజూ ముందుగా బయలుదేరి వెళ్లినా అతని కంటే ముందు రహీమ్‌ దుకాణం చేరుకుంటాడు. ఇంటి నుంచి బయలుదేరి, ఊరిలోని పెళ్ళీ పేరంటాలు, తగాదాలు, రోగాల గురించి పల్లెవాసులకు సలహాలిస్తూ రసూల్‌మియాకు అక్కడే పన్నెండు గంటలవుతుంది. ఊరి పొలిమెర దాటిన తరువాత పొలాల్లో పనిచేసే వాళ్లతో సేద్యం గురించి మాట్లాడందే అతని అడుగు ముందుకు సాగదు.
‘‘ఒరే మహంగూ జాతరలో కొన్న నీ దూడ ఏదిరా?’’
‘‘ఏంచెప్పను మామా, రెండు రోజులయింది. గడ్డి తినడం లేదు. నీళ్లు తాగడం లేదు. దీనికేమయిందో భగవంతునికే ఎరుక’’

ఇంకేముంది. దూడను చూసి, దాని రోగాన్ని గుర్తించి ఫలానా వనమూలికలు ఇమ్మంటాడు. ఇంతటిలో ఆగడు. ఆ వనమూలిక ఏ తోటలో, ఏ చెట్టు కింద దొరుకుతుందో కూడా చెప్పుతాడు. వీలైతే తానే స్వయంగా అక్కడికి వెళ్లి మూలిక తెచ్చి ఇస్తాడు కూడా.
దుకాణం చేరి తన స్థానంలో కూర్చుంటూ, ‘‘అరే! చాలా టయిం అయిపోయిందే!’’ అని గొణుక్కుంటాడు. కొద్ది నిమిషాలు రహీమ్‌ చేసే పనిని చూసి, ‘‘అది ఇట్ల ఇయ్యి. దాని సంగతి నేను చూస్తాను. అంతవరకూ ‘భోలా’ గడియారాన్ని చూడు’’ అని అంటాడు.
విరిగిపోయిన కుర్చీ మీద కూర్చున్న వ్యక్తి భోలా ఎవరని అడిగితే, పని చేస్తూనే భోలా జీవితచరిత్ర ఎత్తుకుంటాడు. ‘‘అరే! భోలా తెలియదా. అదే కాంగ్రెసు భోలా నీకు తెలుసుగదా. అదేనయ్యా జైలులో బి.ఏ పాస్‌ అయినాడు చూడు. ఏం పిల్లోడులే భోలా...ఇది చూడండి. ఈ గడియారం హియర్‌ స్ప్రింగ్‌ ఎంత పాడయిందో! అందుకే అంటారు. చౌక సరుకు చౌకే అని. భోలా పట్టినపట్టు విడిచేవాడు కాదు. నేను ఎంతోమంది పిల్లవాళ్లను చూశాను కాని...’’
వినేవాడు తనకు అపరిచితుడైన భోలాను గురించి చెప్పిన మాటలతో తికమకపడి ‘‘అరే ఏ భోలా గురించి ఇంత మెచ్చుకుంటున్నావయ్యా...ఆ పొడుగుపాటి వెంట్రుకల వాడా?’’ అని అడుగుతాడు.
‘‘అరే సాహేబ్‌ అతనుగాదు’’ అంటూ రసూల్‌మియా చెప్పుకుపోతాడు.
‘‘పొడుగుపాటి వెంట్రుకలతను అవనీందర్‌. ఈయన కూడా భోలా స్నేహితుడే. అతను విచిత్రమైన వ్యక్తి. కవి కూడా. గంగిగోవు మాదిరి  సాధు స్వభావం కలవాడు. కాని ఆకారం చూస్తే తిరుగుబోతులా ఉంటాడు’’
‘‘ఓ రసూల్‌కాకా! చూడు ఏం చేస్తున్నాడో’’ అంటూ ఒక గొల్లపడుచు ఏడుస్తూ అని ముందు నిలబడుతుంది.
‘‘అరే ఎవరు? ఎవరు వాడు?’’
‘‘సతీష్‌బాబు కొడుకు’’
‘‘సతీష్‌బాబుతో చెప్పలేదా?’’
‘‘చెప్పాను. ఏమి లాభం. పో, అంటూ నన్ను కొట్టడానికి వచ్చాడు.

రసూల్‌మియాకు కోపమొస్తుంది.
‘‘ఈ ధనవంతులున్నారే! అందరూ నంబర్‌వన్‌ దొంగలు. చూడు సుదమియా, పోయి సౌదాగర్‌ సింగును కొంచెం పిలువు’’ అని పని వదిలేసి అంటాడు. గొల్లపిల్ల సుదమియా కళ్లనీళ్లు తుడుచుకుంటూ వెళ్లుతుంది. రసూల్‌మియా వాక్కుంటున్నాడు.
‘‘పైసలతో పొగరెక్కింది. ఆడదానిపై అత్యాచారానికి పాల్పడతారా! దొంగవెధవలు’’
‘‘అరే మెకానిక్,  ఈ ఆడపిల్లలను తక్కువగా అంచనా వేయకు. భలే ఆట పట్టిస్తారు’’
‘‘ఊరుకోండి ఆ పిల్ల నా కూతురుతో సమానం. పల్లెటూరి పిల్లలు అమాయకులు. పాలు అమ్మితేగాని పొట్టగడవని చోట మిగతా కుటుంబసభ్యులంతా జబ్బు పట్టిపోతే డాక్టర్‌ను పిలువడానికి, పాలు అమ్మేదానికి యుక్తవయసులో ఉన్న ఈ పిల్ల కాకపోతే వాళ్ల గతేమిటో మీరే చెప్పండి. కష్టాల్లో ఉన్న వాళ్ల ఆడపిల్లలపై అత్యాచారం చేయడమేనా ఈ పెద్దమనుషుల ధర్మం!’’ సౌదాగర్‌కాకా ఇంట్లో లేరని సుదమియా వచ్చి చెపుతుంది. సుదమియాను తీసుకొని రసూల్‌మియా ఒక్కడే వెళతాడు.
చాలాసేపటికి రసూల్‌మియా దుకాణానికి వస్తాడు. దుకాణంలో అడుగుపెడ్తూ గొణుక్కుంటాడు, ‘‘మొనగాడట. ఒకరోజు పద పల్లెటూరికి. అందరి ఎదుట వీధిలో పడేసి తన్నకపోతే నా పేరు రసూల్‌మియా కాదు’’ దుకాణంలో ఒక మూల కూర్చొని ఉన్న కూరలమ్మిని చూసి, ‘‘ఏమమ్మా! ఈరోజు చాలా ముందుగా వచ్చేశారు?’’ అని అబ్దుల్‌ తల్లితో అంటాడు.
‘‘మేము ఎప్పుడో వచ్చేస్తామిక్కిడికి. కొంచెం మా లెక్కలు చూసి చెప్పరాదా ముసలయ్యా’’ వారందరూ మూకుమ్మడిగా అడిగారు.
‘‘ఉండండి. ఒక్కరే చెప్పండి. హమీదన్‌ నీవు చెప్పు. కాకరకాయలెన్ని అమ్మావు?’’ 
‘‘పదమూడు శేర్లు’’ 
‘‘ఏ ధరకు అమ్మావు? నాలుగు అణాలా? పైసలేవి చూపు? ఆ సరే, సరిగ్గా ఉన్నాయి. నీవు చెప్పు నీ దొంగకాయలెన్ని అమ్ముడుపోయాయి?’’ అటువైపు ఉన్న ఒక గ్రాహకున్ని సంబోధిస్తూ ‘‘బాబుగారూ చూస్తున్నారు గదా, ఇప్పుడు నాకు తీరికలేదు. మీరు రహీమ్‌తో పని చేయించుకోండి’’ అని అంటాడు.
వాళ్ల లెక్కలు చూస్తూ, రూపాయి బిళ్లలు చెల్లేవో, చెల్లనివో పరీక్షిస్తూనే సాయంత్రం అయిపోతుంది. పని బంద్‌ చేసి రహీమ్‌ వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంటాడు.
‘‘అరే రహీమ్, వీళ్లని నీ వెంట తీసుకుపో. చీకటి అవుతుంది. నేను అలా కొంచెం వెళ్లివస్తాను’’ అంటూ రసూల్‌మియా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కూరలమ్మలను వెంట తీసుకొని రహీమ్‌ బయలుదేరుతాడు. దారిలో దేనుసాహు దుకాణం రాగానే కూరలమ్మలందరూ ఒకరొకరు రెండు పైసలకు బీడీలు, జిలేబీలు గంటలకొద్దీ కొంటూ ఉండిపోతారు. రహీమ్‌ మాత్రం∙రోడ్డుపై నిలబడి వాళ్ల కోసం నిరీక్షిస్తూ ఉంటాడు.
రసూల్‌ మెకానిక్‌ వద్ద రిపేరయిన వస్తువులు చాలా రోజులు మన్నుతాయి. అందుకే అతని దగ్గరే తమ వస్తువులు రిపేర్‌ చేయించుకోవాలనుకుంటారు అందరూ.
‘‘కానీ రసూల్‌మియాకు దుకాణంలో కాలు నిలవదు. ఒకవేళ కూర్చున్నా ఏదో సగం పనిచేసి మిగతాది కొడుకుపై రుద్దుతాడు’’ అని గ్రామస్తులు వాపోతారు. ఆయన నమ్మకస్తుడు. ఏదేనా దాచుకోకుండా కరాఖండిగా అనేస్తాడు. అందువల్ల గ్రాహకులు తక్కువ ఇస్తారు.

రఘు అనేవాడు మొదట రసూల్‌మియా దగ్గర నౌకరుగా పనిచేసేవాడు. ఇప్పుడు వేరుగా తన సొంత దుకాణాన్ని నడుపుకుంటూ బాగా ధనవంతుడయ్యాడు. రసూల్‌మియా సంగతి ఎక్కడున్న గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది.
పది–పదకొండు సంవత్సరాల క్రిందటి మాట–స్టౌ రిపేర్‌ చేయించుకుందామరని నేను రసూల్‌మియా దగ్గరికి వెళ్లాను. స్టౌ విప్పి చూస్తుండగానే ఓ పల్లెటూరి మధ్యవయస్కురాలు వచ్చి ‘‘నగలేమో తిరిగి  ఇవ్వడు. వడ్డీ తీసుకురాపో అని దబాయిస్తున్నాడు’’ అని అక్కడకొచ్చి వాపోతే రసూల్‌మియా స్టౌ రిపేర్‌ చేసే పని వదిలేసి ఆమెతో పాటు వెళ్లడానికి నిలబడ్డాడు. ‘నా స్టౌ’ అని నేను అతన్ని వారించాను.
‘‘రేపు తయారుచేస్తా’’
‘‘అయితే నా స్టౌ నేను తీసుకుపోతా’’ అని నేను కోపంగా  అంటే ‘‘తీసుసుపోవయ్యా’’ రసూల్‌మియా గర్జిస్తూ అన్నాడు.
‘‘ఇతరుల మానం పోతుంటే, ఈయనకు తన పని ముఖ్యమయింది. పాపం ఈవిడ కూతురికి ఈ రాత్రి శోభనం ఉంది. నగలేమో తాకట్టులో ఉన్నాయి. ఆ సేటుగాడేమో నగలివ్వనంటున్నాడు. నేను స్టౌ తీసుకొని ఎప్పుడూ వీడి దుకాణానికి రాకూడదు. నాకు తెలిసినవాళ్లను కూడా వీడి దగ్గరికి రాకూడదని వారించాలి అని మనస్సులో ప్రతిజ్ఞ చేసి తిరిగొచ్చాను.
కాని ఇప్పుడు రసూల్‌మియాను పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. బాల్యం నాటి ప్రతిజ్ఞ గుర్తుకు వస్తే నాకు ఏదోలాగుంటుంది. ఒకసారి సైకిల్‌ రిపేర్‌కిచ్చాను. 15 రోజుల నుంచి రోజూ వస్తూనే ఉన్నాను. కాని రసూల్‌మియా దుకాణంలో దొరకడు. రహీమ్‌ను అడిగితే వాళ్ల నాన్నే రిపేర్‌ చేసిస్తాడు అని అంటాడు.
ఎప్పుడైనా అదృష్టంకొద్దీ రసూల్‌మియా కంటబడితే ఆయన అంటాడు:
‘‘సైకిల్‌ రిపేర్‌ కంటే కూడా ముఖ్యమైన పని ఉంది బాబు. అనాథమహిళలకు వస్త్రాలు ఇప్పించాలి. ఏడురోజుల నుంచి బట్టల కోసం వీళ్లు తిరుగుతున్నారు. బట్టలు పంచే చోట గుంపులో ఊపిరి ఆడక క్యూలో గంటల తరబడి నిలబడి కూడా ఖాళీగా తిరిగొస్తున్నారు’’
మరొక దఫా విచారిస్తే...
పల్లెలో మలేరియా వ్యాపించిందని, క్వినైన్‌ మాత్రలు దొరకడం లేదని అందుచేత రసూల్‌ మెకానిక్‌ వనమూలికల కషాయం చేసి రోజంతా ఊరిలో పంచుతున్నాడని తెలిసింది.
ప్రతిరోజూ ఖాళీగానే తిరిగొస్తున్నాను. ఒకరోజు మర్రిచెట్టుకు వేలాడుతున్న ఇనుపరేకు పైన రాసిన అక్షరాలు కంటపడ్డాయి....
‘మెకానిక్‌ రసూల్‌–ఇక్కడ మరమ్మత్తులు చేయబడును’ దాని పక్కనే తుంటరివాడు జోడించి రాసిన అక్షరాలు ‘ఇక్కడ మనుషులకు కూడా మరమ్మత్తులు చేయబడును’ కంటబడ్డాయి. లోలోపల ఈ మాటను సమర్థించుకుంటూనే సైకిల్‌ లేకపోతే నాకు చాలా కష్టంగా ఉందన్న విషయాన్ని కూడా మరిచిపోయాను.
హిందీ మూలం : ఫణీశ్వరనాథ్‌ రేణు
 తెలుగు:  పి.విజయరాఘవరెడ్డి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top