ఎ రొటీన్‌ స్టోరీ

A Routine Story - Sakshi

కొత్త కథలోళ్లు

అతను ఆఫీస్‌ నుంచి వచ్చి లాప్‌ టాప్‌ బ్యాగ్‌ టేబుల్‌ మీద పెట్టాడు. అలికిడికి ఆమె బయటకు వచ్చి నవ్వుతూ ‘‘హౌ వాజ్‌ ద డే’’ అన్నది. అతను అలసటగా నవ్వి ‘‘ఫైన్‌’’ అని ఫ్రెష్‌ అవటానికి వెళ్ళాడు. వాష్‌ రూమ్‌ నుంచి రాగానే ఆమె ఏదో చెప్పబోయింది. ఇంతలో అతనికి ఫోన్‌ రావటంతో ఆగిపోయింది. అతను ఫోన్‌ పెట్టేసాక కూడా ఆమె ఏదో చెప్పాలనుకుంటుందని గ్రహించలేదు.  మామూలుగా అతని పని అతను చేసుకుంటూ ఆమె వైపు తిరిగి ‘‘ఏ.సి రిపేర్‌ చేయించటానికి బోయ్‌ని పంపించాను. వచ్చాడా?’’ అని అడిగాడు. ఆమె అవునన్నట్లు తలూపి, ‘మాట్లాడటానికి ఇంతకన్నా గొప్ప విషయాలేం గుర్తురావు కాబోలు’ అని మనసులో అనుకుంటూ కిచెన్‌లోకి నడిచింది. వంటలన్నీ డైనింగ్‌ టేబుల్‌ మీద తెచ్చిపెట్టింది. అతను మరో ఫోన్‌ కాల్‌ మాట్లాడుతుండగానే భోంచేయటానికి రమ్మన్నట్టు సైగ చేసింది. మాట్లాడుతూనే తినటానికి సిద్ధమై కూర్చున్నాడు. ఆమె వడ్డిస్తోంది. ఫోన్‌ మాట్లాడటం అయిపోయాక ఆ ఫోన్‌ తాలూకు ఆఫీస్‌ సంఘటన గుర్తొచ్చి ఆమెకి చెప్పాడు. ‘కనీసం నచ్చిన కూర వండినపుడైనా కాంప్లిమెంట్‌ ఇవ్వొచ్చు కదా!’ అనుకుంది మనసులో. ఆమె కొంచెం విషాదంగానే నవ్వింది. ‘‘ఆర్‌ యూ ఓకే?’’ అన్నాడు. అనుకోని ప్రశ్నకు సంతోషించినా అతను వెంటనే టాపిక్‌ మార్చేయటం ఆమెకి కొంచెం బాధ కలిగించింది. ‘‘పండగ సెలవులకని రేపు అక్కా వాళ్ళు వస్తున్నారు’’ అన్నాడు.  ఆమె చిన్నగా నవ్వి ‘‘అందరూనా?’’ అన్నది. అవునన్నట్లు తలూపాడు. 

తినటం ముగించుకొని చేయి కడుక్కుంటుంటే అంతకు ముందే భోజనం చేసి టి.వి ముందు కూర్చున్న అతని తల్లి ‘‘ఒరేయ్‌ టీవీలో నీకు నచ్చిన గుండమ్మ కథ సినిమా వస్తుందిరా!’’ అని పిలిచింది. ‘‘అవునా!’’ అని చేయి తుడుచుకుంటూ కొంచెం హుషారుగానే వెళ్ళి టి.వి ముందు కూర్చున్నాడు. నట సార్వభౌముడి నటన గురించి, ఆ కాలంలో సినిమాలను పొగుడుతూ, నేటి సినిమాలతో పోలుస్తూ ఇలా రకరకాల విషయాలు మాట్లాడుతూ తల్లీ కొడుకులు సినిమా ఎంజాయ్‌ చేస్తున్నారు.  ఆమె డైనింగ్‌ టేబుల్‌ మెుత్తం సర్దేసి, పెట్‌కి భోజనం పెట్టే కార్యక్రమం కూడా కానిచ్చేసి హాల్లోకి వస్తుంటే ‘‘వసూ! రా కూర్చో సినిమా బాగుంటుంది.’’ అని పిలిచాడు.   ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఈ మెుగుళ్ళు, ఆమె మనసుతో ఒక్క క్షణం కూడా మాట్లాడలేనపుడు ఆమెకి మరేదీ బాగుండదనీ. ఆమె తలనొప్పిగా ఉందని లోపలికెళ్ళి తలుపేసుకుంది. గదంతా ఒంటరితనం ఆవహించింది. ఫ్యాన్‌ రెక్కల చప్పుడు తప్ప మరేం లేదు. ఆ శబ్దం కూడా భయంకరంగా తోచింది. అద్దంలో మెుహం చూసుకొని అమాయకంగా, విషాదంగా నవ్వుకుంది. అతనితో ఏదో మాట్లాడాలని అతను ఆఫీస్‌ నుంచి వచ్చినప్పటి నుంచి ఎదురుచూస్తోంది కానీ, అతను ఆ అవకాశం ఇవ్వలేదు. సెకండ్‌ షో సినిమా కాబోలు.. తల్లీ కొడుకులు 12 గంటలకు కానీ టి.వి ముందు నుంచి కదిలేలాలేరు. ఆమె ఎదురుచూసి చూసి నిద్రపోయింది. అతను గదిలోకొచ్చి ఆమె నిద్రపోవటం చూసి నుదుటన ముద్దు పెట్టి అటు తిరిగి పడుకున్నాడు. అతనికంతా చాలా మామూలుగానే ఉన్నట్టుంది. సినిమా తాలూకు తృప్తి కూడా మెుహంలో కనపడుతోంది. కళ్ళు మూసుకున్న రెండు నిమిషాలకే నిద్రలోకి జారుకున్నాడు. 

ఉదయాన్నే లేచి ఫ్రెషప్‌ అయి అతనేవో ఫైళ్ళు సర్దుకుంటున్నాడు. ఆమె కళ్ళు తెరిచి ఆవలిస్తూ ‘‘గుడ్‌ మార్నింగ్‌’’ అన్నది చిరునవ్వుతో. అతను కూడా నవ్వుతూ చేతులు  చాచాడు అనునయంగా ఆమెని పైకి లేపుతున్నట్టుగా. ‘‘మామయ్యా!’’ అంటూ గదిలోకి పరిగెత్తుకొచ్చింది సౌమ్య. చటుక్కున ఒళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కూడా బుజ్జిదాని తల నిమిరి బయటకు నడిచింది.. ఆడపడుచు వాళ్ళను పలకరించటానికి. ‘‘ఏమ్మా! ఇంత ఉదయాన్నే వచ్చి నీ నిద్ర డిస్టర్బ్‌ చేసామా?’’ అన్నది ఆడపడుచు కొంచెం వెటకారంగా. ‘అది మీకు కొత్తేం కాదుగా’ అని మనసులో అనుకొని ‘‘ఫ్రెష్‌ అవండి.. కాఫీ ఇస్తాను’’ అన్నది నవ్వుతూ. అందరూ ఫ్రెష్‌ అయివచ్చి కాఫీలు, టిఫిన్లు కూడా ముగించారు. అతను ఆఫీసుకు సెలవు పెట్టిన విషయం కూడా చెప్పనే లేదు. పిల్లలతో బయటకెళ్ళినట్టున్నాడు. టిఫిన్‌ చేయటానికి కూడా రాలేదు. ఆడపడుచు వాళ్ళ పిల్లలు వచ్చినపుడల్లా అతను ఇంట్లో ఉండడు. ఆ పిల్లలతో పాటు షికార్లు కొట్టి, సాయంత్రం వరకు జంక్‌ ఫుడ్‌తో బయట గడిపేయటం అతనికి అలవాటు. రెండు సంవత్సరాల్లో ఎన్నోసార్లు, ఎన్నో పండుగ సెలవుల్లో ఆమెకిలాంటివి మామూలే.ఆడపడుచు ఆమెని ‘‘షాపింగ్‌ ఎక్కడ చేశావ్‌? ఏదేమైనా నీ పనే బాగుందమ్మా మీ ఆయన డబ్బులిచ్చి ఏం కావాలో కొనుక్కోమని అన్ని నీకే వదిలేస్తాడు’’ అన్నది ఆడిపోసుకున్నట్టుగా. ‘అదే కదా నా బాధ.. అన్ని నాకు నేనే, నాది నాకే, నన్ను నాకే వదిలేయటమే నాకు ఒంటరితనాన్ని మిగిల్చింది’ అనుకుందామె. ఆడపడుచు మాటలు కొనసాగిస్తూనే ఉంది. పండుగకు చేసుకోవాల్సిన పిండివంటల గురించి, పూజల గురించి, వాళ్ళమ్మ ఆరోగ్యం గురించి (పండుగలకు వచ్చినపుడు తప్ప అమ్మ ఆరోగ్యం ఎప్పుడూ గుర్తుకురాదనుకో) అన్నీ నాన్‌ స్టాప్‌గా మాట్లాడేస్తోంది. వసూ అవసరమైనంత వరకూ క్లుప్తంగా మాట్లాడుతూ ఆమె పని కొనసాగిస్తోంది.

భోజనం చేసి అందరూ మధ్యాహ్నం కునికిపాట్లు పడుతున్నారు. ఆమెకి మధ్యాహ్నం నిద్రరాదు. ఇల్లు డెకరేట్‌ చేస్తూనో, కథల పుస్తకాలు, నావెల్స్‌ చదువుతూనో, మ్యూజిక్‌ వింటూనో గడిపేస్తుంది. అవి నచ్చిన ఆక్టివిటీసే అయినా అంత చదువుకొని ఇంట్లో కూర్చోవటం ఆమెకి ఇష్టం లేదు. ఆమె ఉద్యోగం చేయటం అతనికి ఇష్టం లేదు. కానీ ఆమె అంత నిర్జీవంగా, అన్నింటినీ కోల్పోయి అలా బతకాల్సి రావటం ఒకానొక సమయంలో చాలా మూర్ఖత్వంగా తోచవచ్చు. కానీ కంఫర్ట్‌ జోన్‌ అనుకుంటున్న మూర్ఖత్వం ఎంత బాధైనా సరే, బంధాల్ని అలా కట్టిపడేసే ఉంచుతుంది. తెల్లారింది. మళ్ళీ పండుగలు, పబ్బాలు, పూజలు, వంటలు, చుట్టాలు.. క్షణం ఆమె గురించి ఆమెకు గుర్తుంటే ఒట్టు. అతన్ని చూసి కూడా చాలా రోజులు అవుతున్నట్టుంది ఆమెకు, ఇంట్లోనే ఉంటున్నా కూడా. ఆనందాన్ని, సంబరాన్ని ఇచ్చేవి పండుగలని చెప్పిన పెద్దమనిషి ఎవరయ్యా? క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూ వచ్చిన చుట్టాలకు, భర్తకు, పిల్లలకు సేవచేస్తూ ఉన్నా ఆఖరుకి ఆమెని తిన్నావా లేదా? అని ఎవరూ అడగరు.మళ్ళీ తెల్లారుతుంది. మళ్ళీ అన్ని పనులు చేస్తూపోతుంది. ఎప్పటిలాగే ఒంటరిగానే మిగిలిపోతుంది. ఇలా కాలచక్రంలో ఆమె జీవితం నడుస్తూనే ఉంటుంది.. ఎటువంటి మార్పూ లేకుండా.. నిరాశగా.. నిర్జీవంగా! ఎప్పటిలాగే ఆమె అలసిపోయి నిద్రపోతుంది అమాయకంగా. అతను గదిలోకొచ్చాడు. ఆ రాత్రి వీస్తున్న గాలికి టేబుల్‌ మీద కాగితం రెపరెపలాడుతుండటంతో అతని దృష్టి అటువైపు మళ్ళింది. కాగితం తీసి చదవటం మెుదలుపెట్టాడు.

‘డియర్‌ వినయ్‌! 
ఇలా పిలిస్తే కొత్తగా ఉంది కదూ! నాక్కూడా అలాగే ఉంది. పిలవాల్సిన అవకాశమెుచ్చి కూడా చాలా కాలమైనట్టుంది. ఇంతకీ ఈ లెటర్‌ రాసే కార్యక్రమం ఏమిటి అనుకుంటున్నావా? కుండపోతగా కురుస్తున్న భావాలను ఇన్నాళ్ళు నాకు నేనే ఒంటరిగా చెప్పుకుంటూ కుమిలిపోతున్నాను.. నువ్వైనా అర్థం చేసుకుంటావని. అయినా నేనొక పిచ్చిదాన్ని. ఒకరు నన్ను అర్థం చేసుకోవాలి అని కోరుకోవటం మూర్ఖత్వమే. ఎవరికుంటుంది అంత తీరిక, ఓపిక. ఎవరి మనసు వాళ్ళకే సరిగ్గా అర్థంకాదు. ఇంకా పక్కవాళ్ళ మనసులు కూడా అర్థం చేసుకోవాలా? నిజమే కానీ మనకోసం, మనతోనే బతుకుతున్న ఒక వ్యక్తిని జీవితకాలంలో ఒక్కసారైనా అర్థం చేసుకోలేనపుడు ఆ బంధానికి అర్థమే లేదు. ఒక్కమాట చెప్పనా? అల్లంత దూరాన ఉన్న పక్షిని చూసి ఎంత ఉల్లాసంగా ఎగురుతుంది అనుకుంటాను నేను. అది ఎంత దూరంలో ఎగురుతుందని క్యాలుక్యులేట్‌ చేస్తావ్‌ నువ్వు. ఇద్దరం ఆలోచించేది పక్షి గురించేగా.. రెండింటిలో తేడా ఏముంది అనుకుంటున్నావ్‌ కదూ! అది ఆనందానికి, అన్వేషణకు ఉన్న తేడా. నిరంతరం ఏదో ఒకటి అన్వేషిస్తూనే కూర్చుంటే జీవితంలో అవసరమైన చిన్న చిన్న ఆనందాల్ని కోల్పోతాం. నేను చెప్పేది నీకీపాటికే అర్థమైందనుకుంటాను.

ఒకరితో ఒకరు మాట్లాడటం అంటే పక్కనుండి అస్తమానం బయట జరిగిన విషయాలో లేదా ఎవరో వ్యక్తుల గురించో, వ్యవస్థల గురించో మాట్లాడటం కాదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగానైనా ఒకరి మనసుతో ఒకరు మాట్లాడగలగాలి. పెళ్ళయి రెండేళ్ళవుతున్నా నేను ఏ కూర ఇష్టంగా తింటానో, ఏ వంటకం చిరాగ్గా తింటున్నానో ఎపుడైనా గమనించావా? నాన్సెన్స్‌ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమేముంది అంటావా? చిన్న చిన్న విషయాలే ఒకరిపై ఒకరి ప్రేమను తెలియజేస్తాయి. ఇదంతా ఎందుకు కానీ సూటిగా చెప్పనా.. నువ్వు నాకు చాలా ఇచ్చావ్‌. చాలా ప్రేమిస్తావ్‌ నన్ను. కానీ ఆత్మీయంగా ఎపుడైనా ఒక చిన్న పలకరింపు, ప్రేమగా ఒక చూపు, మనసు విప్పి మాట్లాడుకోవటానికి కొంత ప్రైవసీ లేనపుడు ఎన్ని ఉన్నా వృథానే. అలాంటి నిర్జీవమైన జీవితాన్నే నేనిపుడు గడుపుతున్నాను. నవ్వొస్తోందా? బంధాలు అంతే ఫూలిష్‌గా ఉంటాయి. లేకపోతే బతకలేమని కాదు అర్థం. జీవితాన్ని కలసి పంచుకోవాలని ఒక్కసారి నిర్ణయించుకున్నాక అవన్నీ తప్పవు. అంటే నచ్చకపోయినా నామమాత్రంగా ఇద్దరిలో ఎవరో ఒకరి ఆనందం కోసమే బతకమని కాదు. బతకటంలో అందులోనూ కలసి బతకటంలో ఉన్న ఆనందం ఏ ఒక్కరూ మిస్సవకూడదని. అర్థమైతే ఆచరించు. తప్పైతే మన్నించు.– నీ వసూచదవగానే నిద్రపోతున్న ఆమె మెుహంలోకి వంగి చూసాడు. నిర్మలమైంది అతని వదనం. అప్రయత్నంగా అతని  కన్నీటి చుక్క జారి ఆమె నుదుటిని ముద్దాడింది.  
సరిత భూపతి  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top