వివేకం: కలుపుకొనిపోవడం నేర్పాలి!

వివేకం: కలుపుకొనిపోవడం నేర్పాలి! - Sakshi


 దురదృష్టవశాత్తూ, నేడు విద్య పిల్లల విషయ పరిజ్ఞానం పెంచుతున్నప్పటికీ, వారి గ్రహణశక్తి పెరుగుదలలోగానీ, తమ చుట్టూ ఉన్న జీవితాన్ని కలుపుకుపోవడంలోగానీ ఉపయోగపడటం లేదు. పాతకాలంలో, ఉమ్మడి కుటుంబాల్లో సామరస్యంగా జీవించాలంటే, బాగా కలుపుకుపోయే స్వభావం ఉండాలి. కానీ ఈ రోజుల్లో, అది చాలా అరుదు. పాశ్చాత్య విద్య వచ్చేసరికి, మొదట మన బాబాయి, పిన్నులను, పెదనాన్న, పెద్దమ్మలను, నానమ్మ తాతయ్యలను వదిలిపెట్టాం. తరువాత తల్లిదండ్రులు మరీ ముసలివాళ్లని, అన్నిటికీ అడ్డుతగులుతున్నారని అనుకుంటున్నాం. ఇప్పుడు కుటుంబం అంటే నేను, నా భార్య, పిల్లలు. సమాజంలో విద్య పెరిగేకొద్దీ, కలుపుకునే తత్వం మనిషి నుంచి మాయమవుతోంది. కాని కలుపుకుపోవడమే జీవితం; ప్రత్యేకంగా ఉండటం కాదు.

 

 జిప్సీల (సంచార జాతి) గురించి ఒక కథ ఉంది. ఒకసారి ఓ తండ్రి తన కొడుకుతో, ‘‘ఎందుకూ పనికిరాకుండా పోతున్నావు. నువ్వు పొట్టకూటి కోసం ఈ ఇంద్రజాలాన్ని, గారడీని నేర్చుకోకపోతే, నిన్ను స్కూల్లో వేసేస్తా. దాంతో చదువుకోవడం వల్ల వచ్చే అంతులేని కోరికలతో నువ్వు అల్లాడిపోతావు’’ అని తిడతాడు.

 దురదృష్టవశాత్తూ, విద్య మనుషులకు నేర్పిన మరొకటి - అంతులేని కోరికలను కలిగించడం. ప్రజలు విద్యావంతులయ్యేటప్పటికి, వారి కోరికలు నమ్మలేని విధంగా తయారవుతున్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో గ్రహాన్ని తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే విద్యలో ఏదో తప్పుందని కాదు, దాన్ని అందించే విధానంలో ప్రాథమికంగా ఏదో పెద్ద పొరపాటు జరుగుతోంది. మనుషుల్ని పాడుచేసేది విషయ పరిజ్ఞానం కాదు. వాళ్లని పాడుచేసేది... దాన్ని సేకరించే పద్ధతి, దాన్ని అందజేసే పద్ధతి, అలాగే దాన్ని అందజేసేటప్పటి పరిస్థితులు.

 

 ప్రస్తుతం విద్య కేవలం బతుకు తెరువుకే పరిమితమైంది. విద్య బతుకు తెరువుకి సంబంధించినదై ఉండకూదు; విద్య మీ పరిధుల్ని విస్తృతపరచాలి. ఎందుకంటే ప్రజలు తమ ఆర్థిక స్తోమత గురించే ఎల్లప్పుడూ చింతించడం వల్ల, మనం మొత్తం విద్యను సమాజంలో డబ్బులు పిండే సాధనంగా మార్చేశాం. ఇది మారాలి.

 

 తన తెలివిని సక్రమంగా ఉంచుకునే వ్యక్తిని ఎక్కడ పెట్టినా, అతను బతుకు తెరువు చూసుకోగలడు. అతన్ని నరకంలో పెట్టినా, అతను దాన్ని మెల్లగా స్వర్గంలా మారుస్తాడు. పిల్లలు పెరగాల్సింది అలానే. ప్రేమపూర్వకమైన, అద్భుతమైన మనుషుల్ని మాత్రమే కాదు, దేన్నైనా తట్టుకోగల మనుషుల్ని విద్యతో తయారుచేయాలి.

 

 సమస్య - పరిష్కారం

 వయసు పెరుగుతున్నకొద్దీ, ఒక రకమైన భయమేస్తోంది. మరి ఈ వృద్ధాప్యాన్ని ఎలా ఎదుర్కోవాలి?

 - టి.చంద్రశేఖర్, హైదరాబాద్

 వయసు పైబడుతున్నకొద్దీ జీవితం తన సుంకం వసూలు చేస్తూనే ఉంటుంది. శరీరం యవ్వనంలో ఉన్నప్పుడు, అన్నీ జరిగిపోతున్నప్పుడు, మీకంతా తెలుసునని, మీరేదైనా చేయగలరని అనుకుంటుంటారు. శరీరంలోని ఎముకలు కాస్త కిర్రుమంటున్నప్పుడు, ‘నేనెందుకు బతికున్నానా?’ అని దిగులుపడుతుంటారు. జీవితమంటే శరీరం కాదనీ, ఈ శరీరానికి మించినదేదో ఉందనీ తెలుసుకున్నవాడే ఆనందంగా ఉండగలుగుతాడు. శరీరం మాత్రమే తెలిసినవాడికి వృద్ధాప్యం అనేది భయం పుట్టిస్తూ, బాధగా ఉంటుంది. శరీరానికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు,  వడలిపోతున్నప్పుడు, అవస్థలు పడుతున్నప్పుడు, మీకు ఇక ప్రతిదీ అర్థరహితంగానే కనిపిస్తుంటుంది. ఈ భౌతిక శరీరానికి మించినదాన్నేదో రుచి చూస్తే తప్ప, జీవితం పూర్తిగా అర్థరహితంగా, బాధాకరంగా, మోయలేని భారంగానే కనిపిస్తుంది.

 

 శరీరానికి మించినదేదో ఉందనే సంగతి కొద్దిగానైనా అనుభవానికి వచ్చినప్పుడు, వెంటనే మీరు దాన్ని అన్వేషించాలి. మీ శక్తిలో, మీ సమయంలో కొంత భాగాన్నైనా ఆ దిశలో వెళ్లే అవకాశం కల్పించాలి. ఆ అన్వేషణా దిశలో మీరు మీ పూర్తి శక్తిని, పూర్తి జీవితాన్ని మళ్లించగలిగితే, అది చాలా ఉత్తమం. అంతకుమించి కావాల్సిందేమీ ఉండదు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top