పనిష్మెంట్లన్నీ పాఠాలే!


 ఆత్మబంధువు

  ‘‘అమ్మా... ఇదిగో!’’ అంటూ రేఖ చేతికి నోట్‌బుక్ అందించాడు మిత్ర. ‘‘ఏంటి కన్నా.. ఏం రాశావ్?’’ అడిగింది రేఖ.‘‘చుట్టూ ఉన్నవాటిని పరిశీలించి అవేం పాఠాలు చెప్తున్నాయో, ఎలా స్ఫూర్తి నిస్తున్నాయో రాయమన్నావుగా... రాశా.’’‘‘యూ ఆర్ సో స్వీట్ కన్నా’’ అంటూ ముద్దు పెట్టుకుని, ఏం రాశాడో అని చూసింది. ఇలా రాసి ఉంది...‘మొన్ననే టీవీలో రాజమౌళి ఈగ సినిమా చూశాను.

 

  చాలా బాగుంది. రాజమౌళి ఈగపైన సినిమా చూస్తే నేను దోమపైన రాయాలని నిర్ణయించు కున్నాను. చిన్న దోమనుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చని దాన్ని పరిశీలించాక తెలుసుకున్నా. మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా దోమలు మన చెవి దగ్గర చేరి గోల చేస్తూనే ఉంటాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రయత్నం విడవవు. అది నాకు చాలా నచ్చింది.

 

  దోమ చాలా చిన్నది. కానీ అది కుట్టిందంటే టైఫాయిడ్ నుంచి స్వైన్‌ఫ్లూ దాకా అనేక జబ్బులు వస్తాయి. అలాగే చీమలు కూడా తమ బరువుకంటే 100 రెట్లు ఎక్కువ మోయ గలవు. అంటే దేన్నీ తక్కువగా అంచనా వేయకూడదన్నమాట. మనం ఎంత ప్రయత్నించినా దోమల్ని పారదోలలేం. అలాంటప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసి సర్దుకుపోవాల్సిందే. లైఫ్‌లో కూడా కొన్ని విషయాల్లో అలా సర్దుకుపోవాల్సిందే. ఆహారం కోసం దోమలు చాలా రిస్క్ చేస్తాయి. తమకన్నా ఎన్నోరెట్లు పెద్దవైన జంతువులతో తలపడ తాయి. అంటే రిస్క్ చేస్తేనే అనుకున్నది సాధిస్తామన్నమాట.

 

 దోమలు ఉండకూడదని, వాటివల్ల జబ్బులు వస్తాయని అందరూ అంటుంటారు. కానీ మనకంటే దోమలే పురాతనమైన జీవులు. అవి 170 మిలియన్ సంవత్సరాలనుంచీ ఉన్నాయట. అలాంటప్పుడు వాటిని వద్దనే హక్కు మనకు ఎక్కడిది? వాటిని, అన్ని జీవులనూ బతకనివ్వాలి. మనం శాస్త్రీయంగా ఎంత ఎదిగినా తుఫానును ఆపలేం. సుడిగాలిని ఆపలేం. కాబట్టి దోమల్లా ఏ వాతావరణంలోనైనా, ఎలాంటి పరిస్థితులకైనా సర్దుకుని బతకటం అలవాటు చేసుకోవాలి.’కొడుకు రాసింది చూసి రేఖ కంట ఆనందబాష్పాలు రాలాయి... తన బిడ్డ పరిశీలనా శక్తి చూసి మురిసి పోయింది. దగ్గరకు తీసుకుని బాగా రాశావని చెప్పి ముద్దాడింది. అలాగే అన్నిటినీ పరిశీలించి నేర్చుకోమని చెప్పింది. సరేనంటూ మిత్ర చాలా ఆనందంగా స్కూల్‌కు వెళ్లాడు. ‘‘అమ్మా... అమ్మా...’’ స్కూల్ నుంచి వస్తూనే పిలిచాడు మిత్ర.కొడుకేదో కొత్త ఆలోచనలతో వచ్చాడని వాడి గొంతులోని హుషారు చూసి గుర్తుపట్టింది రేఖ.

 

 ‘‘ఏంటి కన్నా?’’ అని అడిగింది. ‘‘ఇవ్వాళ స్కూల్‌లో చాలా అబ్జర్వ్ చేశాను’’ ఎగ్జయిటింగ్‌గా చెప్పాడు మిత్ర.‘‘అది నీ మాటల్లో అర్థమవుతోందిలే, నాన్నా, ముందు ఫ్రెష్ అయ్యిరా.’’‘‘నో మమ్మీ. ముందు నువ్వు కూర్చో. నీకు చెప్పాక ఫ్రెషప్ అవుతా. స్కూల్‌లో ఇచ్చే పనిష్‌మెంట్లు కూడా మనకు చాలా పాఠాలు చెప్తాయి’’ అని మొదలెట్టాడు. ‘‘బెంచ్ ఎక్కి నిల్చోమన్నప్పుడు.. మనకు క్లాసు మొత్తం కనిపిస్తుంది. మనం ఎక్కడ ఉన్నామో తెలిసివస్తుంది. చేతులెత్తి నిలబడ్డప్పుడు... లక్ష్యం ఉన్నతంగా ఉండాలని, దాన్ని చేరాలని తెలుస్తుంది.

 

  గోడవైపు చూస్తూ నిలబడితే.. ఇంట్రాస్పెక్షన్. క్లాసు బయట నిలబెడితే... పరిశీలించి నేర్చుకో మని, ప్రపంచాన్ని చూడమని. మోకాళ్లమీద కూర్చోబెడితే... వినయంగా ఉండమని. బ్లాక్‌బోర్డుని తుడవడం... తప్పులన్నీ మర్చిపోయి, క్షమించి, కొత్త పలకలా ప్రారంభించమని. నోటిమీద వేలు వేసుకోమంటే... నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దని. చెవులు పట్టుకోమంటే... శ్రద్ధగా వినమని. కాలి బొటనవేలు పట్టుకోమంటే.. శారీరకంగా, మానసికంగా ఫ్లెక్సిబుల్‌గా ఉండమని. 25 సార్లు రాయమంటే... పర్‌ఫెక్షన్ కోసం ప్రయత్నించమని’’ అంటూ గడగడా చెప్పాడు.  ‘‘సూపర్ కన్నా. ఇవన్నీ నీకెవరు చెప్పారు?’’ అని అడిగింది రేఖ.‘‘ఎవరూ చెప్పలేదమ్మా. అబ్జర్వ్ చేస్తుంటే తెలిసింది... పనిష్మెంట్లన్నీ పాఠాలేనని.’’‘‘ఇంకా.. ఏం అబ్జర్వ్ చేశావు?’’

 

 ‘‘ఓడిపోవడం ఎలా ఉంటుందో, ఓడిపోతే ఎలా సర్దుకుపోవాలో గేమ్స్ చెప్తాయి. అలాగే పదిమందితో కలిసి ఆడటం కూడా నేర్పిస్తాయి. మన బలం చూపించడం కాదు, ప్రత్యర్థి బలాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించు కోవాలని మా కరాటే సార్ చెప్పారు.’’ ‘‘గుడ్, గుడ్... ఇవ్వాళ్టికి ఇవి చాల్లే. ఇలాగే రోజూ అబ్జర్వ్ చేసి మంచి విషయాలు నేర్చుకో. వెళ్లి ఫ్రెషప్ అయ్యిరా... బూస్ట్ తాగుదువుగాని.’’‘‘ఓకే మమ్మీ’’ అంటూ ఆనందంగా వెళ్లాడు మిత్ర. కొడుకు హుషారును మురిపెంగా చూస్తూండిపోయింది రేఖ.

 - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top