‘మేలి గుణముల’ ‘గాథా’నువాదం

‘మేలి గుణముల’ ‘గాథా’నువాదం


సమీక్షణం

 ‘మేలి గుణముల’ ‘గాథా’నువాదం

 పుస్తకం    :    గాథాత్రిశతి (హాల ప్రాకృత గాథలకు ఆంధ్రాంగ్లానువాదం)

 అనువాదం    :    డా॥కోడూరు ప్రభాకరరెడ్డి

 విషయం    :    రెండు వేల సంవత్సరాల కిందట శాతవాహన చక్రవర్తులలో 17వ వాడైన హాలుడు, ఆనాటి గ్రామ్య భాష ప్రాకృతంలో స్వీయ రచనలను, సమకాలీన కవుల గాథలను సేకరించి సంకలనం చేశాడు. అదే హాల గాథాసప్తశతి. ఇది ఏడు శతకాల ముక్తక కావ్యం. వీటిలో మూడు వందల గాథలకి ఆంధ్రాంగ్లానువాదం ఈ గాథాత్రిశతి. ‘గాథ’ అంటే ప్రాకృత భాషా ఛందస్సులో రాయబడిన కవిత. ఆనాటి సామాజిక జీవనం, ముఖ్యంగా గ్రామీణ జీవితం, సంస్కృతి, వేషభాషలు, స్త్రీ పురుష సంబంధాలు ఈ గాథల విషయం. సున్నితమైన శృంగార భావనలు వ్యక్తీకరించే ధ్వని చమత్కారాలు, శ్లేష విశేషాలు, అన్యాపదేశాలు, అర్థాంతర వ్యాసాలు, దృష్టాంతాలు వీటి ప్రత్యేకత. రచయిత ఈ గాథల్ని తేటతెనుగు పద్యాలుగా అనువదించడంతో పాటు, ఇంతవరకు వచ్చిన అనువాదాలలో లేని ఆంగ్ల అనువాదాన్ని చేర్చడం విశేషం. ఆంధ్రాంగ్లానువాదాల మధ్య అర్థ వివరణ, వ్యాఖ్యానం, అవసరమైన చోట్ల భవభూతి, కాళిదాసుల శ్లోకాలు, భర్తృహరి సుభాషితాలు, ఉర్దూ కవితలు పోలికలుగా, ఉదాహరణలుగా చేర్చబడ్డవి. సరళంగా, సంక్షిప్తంగా, కోమలంగా, రమణీయంగా తేటగీతులలో సాగిన అనువాదం ప్రాకృత గాథాకర్త హృదయాన్ని ఆవిష్కరించింది.

 - చింతపట్ల సుదర్శన్

 

  ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్,

 ఆర్యసమాజ్ మందిర్ ఎదురువీధి, కాచిగూడ, హైదరాబాద్-27. ఫోన్: 040-24652387

 

 విలక్షణ కథలు- విలక్షణ శిల్పం

 

 పుస్తకం    :    పుట్టిల్లు (కథాసంపుటి)

 రచన    :    డా॥కె.వి.రమణరావు

 విషయం    :    విలక్షణమైన వస్తువులతో పాటు అంతే విలక్షణమైన శిల్పంతో రచించిన 26 కథల సంకలనమిది. చీకటి నీడల మధ్య వెలుతురు జాడ కోసం అన్వేషించే రచయిత కావడం వల్ల, వైవిధ్యభరిత కథల్తో పాఠకుల్ని రసానుభూతికి లోనుచెయ్యగలిగారు.

 తనకోసం ఏమీ వెనకేసుకోకుండా బతికేయడం ఎట్లానో చూపించి, విలువలున్న మనిషి కోసం వెతుక్కుంటూ స్వార్థ సమాజపు దృష్టిలో ‘పరిచ్యుతుడు’గా మిగిలిపోయిన కేశవయ్య లాంటి నిజమైన మనిషిని మనం చూడొచ్చు. పదార్థానికీ చైతన్యానికీ ఆలోచనకూ అస్తిత్వానికీ ఉన్న సంబంధానికి అద్దం ‘నియాండర్‌థల్ మనిషి’. ఈ సృష్టిలోని మానవుడు పరిణామ దశలోనే ఉన్నాడనీ, ఇంకా పూర్ణ పరిణతిని సాధించలేదనీ, తెలివి తెచ్చుకుని జీవన గమనం సాగించాలనే సూచన దీనిలోని సారాంశం. పరిమితులు, నిర్బంధాలు, పూర్వ నిర్ణీత గమ్యాలు లేని స్వేచ్ఛ కథా పద్ధతిలో రాసిన నిసర్గ సౌందర్య ప్రతిపాదిత కథ ‘పుట్టిల్లు’లో ఆర్థిక కారణాల వల్ల ఛిద్రమైన తన స్నేహితుల కోసం మలి వయసులో ప్రయాణమైన పార్వతమ్మ ఔదార్యం పాఠకులను ఆలోచనకు గురిచేస్తుంది.

 

 గొప్ప కథంటే తడుముకోకుండా చెప్పాల్సిన కథ ‘ఆడదరి’. మార్మిక వాస్తవ కథన కోవకి చెందిన ఈ కథలో గంగ పాత్ర సంఘం కట్టుబాట్లను త్రోసిరాజని మగధీరులు చెయ్యలేని పనులు చెయ్యడం వల్ల సొంత బావమరుదులే గంగను హత్య చేయటానికి పూనుకున్నప్పుడు, బేలగా మిగలక, బెదిరిపోక ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రాణాలు దక్కించుకుంటుంది. స్త్రీ సాహసానికి ప్రతీకగా ‘గంగ’ మనసుల్లో ‘స్త్రీమూర్తి’గా నిలిచిపోతుంది. కథలన్నీ స్థల కాల పరిమితుల్ని అధిగమిస్తూ శాశ్వత విలువల్ని ప్రోది చేస్తాయి.

 - మీరాసాహెబ్

 పేజీలు:  256 వెల: 140

 ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని బ్రాంచీలు

 

 అస్తిత్వ చైతన్యపు అవగాహన

 

 పుస్తకం    :    {పాంతీయ చైతన్యం

         - తెలంగాణ సాహిత్యం

 రచన    :    కాత్యాయనీ విద్మహే

 విషయం    :    వచన సాహిత్య ప్రక్రియలో ఉత్తమ స్థాయి విమర్శకురాలుగా పేరెన్నికగన్న కాత్యాయనీ విద్మహే కలం నుండి జాలువారిన ఇరవై మూడు వ్యాసాల్ని ‘పాలపిట్ట బుక్స్’ ‘ప్రాంతీయ చైతన్యం - తెలంగాణ సాహిత్యం’గా వెలువరించింది.

 ఒక దృక్పథానికి పరిమితం కాకుండా, చలనాల్లోని హేతుబద్ధతను దర్శించి, మారుతున్న సందర్భాలను గ్రహించి, దృష్టికోణాల్ని పదునుపెట్టుకున్నారు రచయిత్రి. సామాజిక రాజకీయ ఆర్థికాంశాలే ప్రధాన పరికరాలుగా విశ్లేషణ కొనసాగింది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక వికాసానికి దోహదం చేసిన ప్రముఖులను గూర్చిన వ్యాసాలు ఏడు, తెలంగాణకథపై వ్యాసాలు మూడు, కథలపై ప్రత్యేక విశ్లేషణలు మూడు, తెలంగాణ నవలలపై విశ్లేషణ వ్యాసాలు ఐదు, తెలంగాణలో పరిశోధన విమర్శన రంగాల్లో జరుగుతున్న కృష్టిని ఎత్తిచూపుతూ విశ్లేషించిన వ్యాసాలు రెండు, ఈ సంకలనంలో ఉన్నాయి. తెలంగాణ  అస్తిత్వ చైతన్యాన్ని అధ్యయనం చేయడానికి ఈ వ్యాస సంపుటి దోహద పడుతుంది.

 - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

 పేజీలు: 304

 వెల: 150

 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట్, హైదరాబాద్-36. ఫోన్: 040- 27678430

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top