చరితకు చిరునామాలు

చరితకు చిరునామాలు - Sakshi


మే 18 ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే సందర్భంగా...



మ్యూజియంలు చరితకు చిరునామాలు.

నాగరికత పరిణామానికి నిలువెత్తు సాక్ష్యాలు.

అవి జ్ఞానభాండాగారాలు, విజ్ఞాన నిక్షేపాలు.

కళాఖండాల కోశాగారాలు, సాంస్కృతిక సారస్వత కేంద్రాలు.

మ్యూజియంలు రేపటి తరాలకు దారిచూపే వెలుగు దివ్వెలు.






లె లూవర్‌ మ్యూజియం ప్యారిస్‌

ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లోని ప్రాచీన మ్యూజియం ఇది. సువిశాలమైన ఈ మ్యూజియంలో చరిత్ర పూర్వయుగం నాటి వస్తువుల మొదలుకొని ఇరవై ఒకటో శతాబ్ది నాటి ఆధునిక వస్తువుల వరకు అనేక అరుదైన వస్తువులు సందర్శకులను ఆకర్షిస్తాయి. పన్నెండో శతాబ్దిలో రెండో ఫిలిప్‌ హయాంలో కోటగా నిర్మించిన ఈ భవంతిని ఫ్రెంచి విప్లవం తర్వాత 1793లో మ్యూజియంగా మార్చారు.



ప్రాడో మ్యూజియం మాద్రిద్‌

స్పెయిన్‌ రాజధాని మాద్రిద్‌లో ఉన్న ఈ మ్యూజియంలో అత్యంత అరుదైన యూరోపియన్‌ కళాఖండాలు కనిపిస్తాయి. స్పెయిన్‌ రాజుల హయాంలో వారు వాడిన వస్తువులు, వారు సేకరించిన వస్తువులతో, కళాఖండాలు, ఆభరణాలతో ఈ మ్యూజియంను 1819లో ఏర్పాటు చేశారు. ఇందులో పన్నెండో శతాబ్ది నుంచి ఇరవయ్యో శతాబ్ది నాటి వరకు గల పలు అరుదైన వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటాయి.



స్టేట్‌ హెర్మిటేజ్‌ మ్యూజియం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌

రష్యాలోని అతి పురాతనమైన మ్యూజియం ఇది. ఆరు భవంతుల ప్రాంగణంలో 1754లో ఏర్పాటైంది ఈ మ్యూజియం. ఈ ప్రాంగణంలోనే అప్పట్లో రష్యన్‌ జార్‌ చక్రవర్తులు విడిది చేసే ‘వింటర్‌ ప్యాలెస్‌’ కూడా ఉంది. ఇందులో పురాతన ఈజిప్షియన్, గ్రీకు, రోమన్‌ నాగరికత లకు చెందిన అరుదైన వస్తువులు ఉన్నాయి. చరిత్ర పూర్వయుగానికి చెందిన కళాకృతులు, జార్‌ చక్రవర్తులు వాడిన వస్తువులు, ఆభరణలు, మధ్యయుగం నాటి యూరోపియన్‌ కళాఖండాలు ఇక్కడ కనువిందు చేస్తాయి.



రైక్స్‌ మ్యూజియం ఆమ్‌స్టర్‌డామ్‌

నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న ఈ మ్యూజియం డచ్‌ కళాఖండాలకు ఆలవాలంగా సందర్శకులకు కనువిందు చేస్తోంది. తొలుత దీనిని 1800లో హేగ్‌ నగరంలో ఏర్పాటు చేసినా, 1808లో ఆమ్‌స్టర్‌డామ్‌లోని రాజప్రాసాదానికి తరలించారు. ఆ తర్వాత 1885లో ప్రస్తుత భవంతిలోకి మార్చారు. అప్పటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా 2013లో దీనిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు.



స్మిత్‌సోనియన్‌ మ్యూజియం వాషింగ్టన్‌

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న ఈ మ్యూజియం పురాతన వస్తువులకు, జ్ఞాన సమాచారానికి, పురావస్తు పరిశోధనలకు కేంద్రంగా ఉంటోంది. ఇదివరకు దీనిని యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ మ్యూజియం అని కూడా అనేవారు. వాషింగ్టన్‌లో స్థిరపడిన బ్రిటిష్‌ శాస్త్రవేత్త జేమ్స్‌ స్మిత్‌సన్‌ 1829లో మరణించాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంలో ఆస్తిలో చాలా భాగాన్ని మేనల్లుడికి రాసిచ్చాడు. ఆయన నివాస భవనం అమెరికా ప్రభుత్వానికి దక్కడంతో దీనిని మ్యూజియంగా మార్చారు.



బ్రిటిష్‌ మ్యూజియం లండన్‌

రబ్రిటిష్‌ రాజధాని లండన్‌లోని పురాతన కట్టడాల్లో ఒకటి బ్రిటిష్‌ మ్యూజియం. వైద్యుడు, శాస్త్రవేత్త సర్‌ హాన్స్‌ స్లోన్‌ 1753లో తాను సేకరించిన పురాతన వస్తువులతో దీనిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు దీనిని చూసేందుకు ప్రజలను అనుమతించడం మొదలుపెట్టారు. ఈజిప్షియన్‌ మమ్మీల మొదలుకొని అనేక అరుదైన పురాతన చారిత్రక వస్తువులకు ఇది కేంద్రంగా ఉంటోంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top