మలేసియా... ప్రతిరోజూ పండగే!

మలేసియా... ప్రతిరోజూ పండగే!


ట్రావెల్

వారాంతమైనా... సెలవు రోజులైనా మనకు వినోదమంటే సినిమానే. మలేసియన్ల వినోద డైరీలో మాత్రం సినిమాకు చోటు తక్కువే. వారికి వినోదం అంటే పండగలు. ‘షూ ఫెస్టివల్’ అంటూ ఏడాదిలో నాలుగు రోజులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌వేర్ బ్రాండ్లన్నిటినీ కొలువు దీర్చినా, అబోరిజిన్ ఉత్సవం పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల్ని ఒక్కచోట చేర్చినా... అవన్నీ వారికి పండగలే.



ఆ దేశం 2015ను ‘ఇయర్ ఆఫ్ ఫెస్టివల్స్’గా ప్రకటించింది కూడా అందుకే. అబోరిజిన్ ఫెస్టివల్‌కు వెళ్లిన మా పాత్రికేయ బృందం... అభివృద్ధి చెందిన కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి సైతం గిరిజనులొచ్చి సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించటం చూసి ఒకింత ఆశ్చర్యపోయిందనే చెప్పాలి. మేం హాజరైన ప్రధాన ఈవెంట్లలో బైక్ గ్రాండ్ ప్రిక్స్ ఒకటి. వీటితో పాటు కౌలా లంపూర్, మలక్కా, జొహోర్ బహ్రు రాష్ట్రాలను కూడా సందర్శించాం.

 

కౌలాలంపూర్ బర్డ్ పార్క్‌ను ఏ ఒక్కరూ మిస్ కారు.  స్వేచ్ఛగా సంచరిస్తోన్న పక్షుల మధ్య మనుషులు కూడా తిరిగే అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు! ప్రపంచంలోని ఈ తరహా పార్కుల్లో ఇదే అతి పెద్దది. పెద్ద పెద్ద నెమళ్లతో సహా 200 రకాల దేశ, విదేశీ పక్షులున్న ఈ పార్కులో జలపాతం, యాంఫీ థియేటర్, బర్డ్ స్కూల్, ఫ్లెమింగో పాండ్, కియోస్క్... ఇలా రకరకాల ఆకర్షణలున్నాయి.

 

ట్విన్ టవర్స్ వంటి ఆకర్షణలతో పాటు కౌలాలంపూర్‌లో భారీ షాపింగ్ మాల్స్‌కు కొదవ లేదు. చైనా టౌన్‌ను ఆనుకుని ఉండే పురాతన సెంట్రల్ మాల్‌కి అయితే ఓ ప్రత్యేకత ఉంది. అందులోని ఒక బ్లాకు మొత్తం ఆర్టిస్టులు, వారి పెయిం టింగ్‌‌సతో నిండి ఉంటుంది. కమల్‌హాసన్, రజనీకాంత్, శివాజీ గణేశన్ వంటి సౌత్ స్టార్ల పెయింటింగ్‌లూ కనిపిస్తాయక్కడ.

 

రాయల్ సెలంగూర్ అనేది ఉన్నత స్థాయి కళాకృతుల చెయిన్. ఇక్కడి వస్తువులన్నీ ‘ప్యూటర్’తో తయారైనవే. ప్యూటర్ అంటే దాదాపు తగరమే కానీ... 1 నుంచి 15 శాతం వరకూ రాగి, ఆంటి మొనీ, సీసం, వెండి వంటి ఇతర లోహాలూ కలుస్తాయి. అందుకే ధర రూ. 3 వేల నుంచి రూ.3 కోట్ల వరకూ ఉంది.  

 

ఇక కౌలాలంపూర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హిందూ యాత్రాస్థలం ‘బటు గుహల’ గురించి. బంగారు వర్ణంలో మెరిసే భారీ మురుగన్ విగ్రహం స్వాగతం పలుకుతుండగా... కొండపైన ఉంటాయి ఈ గుహలు. ప్రధాన గుహ వద్ద మురుగన్ ఆలయం... లోపల ఇతర ఆలయాలు ఉంటాయి. కౌలాలంపూర్‌కు 40 నిమిషాల దూరంలో నిర్మించిన పాలన రాజధాని పుత్రజయ కూడా సందర్శకుల స్పెషలే.



నీటిపై తేలుతున్నట్లుగా కనిపించే అతి పెద్ద మసీదు, రోడ్డు చివర నుంచి చూసినా ఠీవిగా కనిపించే ప్రధాని కార్యాలయం, 70 ఎకరాల బొటానికల్ గార్డెన్, 76 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల ఆఫీసులు, 39 ఇతర ప్రభుత్వ భవనాలు, 3000 మంది సమావేశమయ్యే కన్వెన్షన్ సెంటర్... ఇవీ పుత్రజయ విశేషాలు.



మద్యం కానీ, నైట్‌క్లబ్‌లు గానీ ఉండవిక్కడ. రెండు నదుల్ని కలిపేసి... వాటి మధ్య దీవిలా నిర్మించారు దీన్ని.  

 కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టు సమీపంలో నిర్మించిన సెపంగ్ రేసింగ్ సర్క్యూట్లో తరచూ జరిగే ఫార్ములావన్, బైక్ గ్రాండ్‌ప్రిక్స్ తదితర ఈవెంట్లకు విదేశాల నుంచి భారీగా అభిమానులు వస్తుంటారు.  

 

ఇక మలక్కా గురించి చెప్పాలంటే, అది ప్రధానంగా సాంస్కృతిక నగరం. ఇక్కడి కట్టడాల్లో డచ్, పోర్చుగీసు, బ్రిటిష్ నిర్మాణ శైలి కలినిస్తుంది. మలక్కా వరల్డ్ హెరిటేజ్ సిటీ, హార్మొనీ స్ట్రీట్‌లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హెరిటేజ్ సిటీ హస్త కళాకృతుల కేంద్రం కాగా... హార్మొనీ స్ట్రీట్‌లో పురాతన హిందూ ఆలయం, చర్చి, మసీదు పక్కపక్కనే కనిపిస్తాయి.  



మ్యూజియములూ ఎక్కువే. మలక్కా మొత్తాన్నీ చూపించే బోట్ క్రూజ్ కూడా చూడాల్సిందే.

 మలక్కా తరవాత వచ్చేది జొహోర్ బహ్రు రాష్ట్రం. సింగపూర్‌ను ఆనుకుని ఉండే ఈ రాష్ట్రంలో... ఆసియాలోనే మొట్ట మొదటి లెగోలాండ్ థీమ్‌పార్క్‌తో పాటు పిల్లల కోసం హలోకిట్టీ థీమ్‌పార్క్ ఉన్నాయి. జొహోర్ శివార్లలో...



అర్మాని, బర్బెర్రీ, జెగ్నా, కెల్విన్ క్లీన్, మిఖాయెల్ కోర్స్ వంటి 80కి పైగా విదేశీ దిగ్గజ బ్రాండ్లు ప్రత్యేక ఔట్‌లెట్లలో కొలువుదీరి ఉంటాయి. 25 శాతం నుంచి 65 శాతం డిస్కవుంట్‌తో విక్రయాలు చేయటం ఇక్కడ ప్రత్యేకం. సింగపూర్‌కు జొహోర్ సమీపంలోనే ఉండటంతో... అక్కడి నుంచి వచ్చి కొనుగోళ్లు చేసేవారు కూడా ఎక్కువే.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top