చదవాలి... ఎదగాలి...

చదవాలి... ఎదగాలి...


జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘హైహై నాయకా’ చిత్రంలోని గురుశిష్యుల సంబంధాన్ని తెలిపే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఇది నా మొదటి చిత్రం. ఈ పాటను 1988 ఆగస్టు 22న రికార్డు చేశాం. తండ్రి పెంపకంలో చెడ్డ మాటలు నేర్చుకుని, గురువులను దూషించే శిష్యుడిని తన దారిలోకి తెచ్చుకోవడానికి తెలుగు మాస్టారు ఆటలను ఎంచుకుంటాడు. అందులో భాగంగా ఆ విద్యార్థితో గోళీలు సైతం ఆడతాడు. ఆటలు లేదా కథలతోనే పిల్లలను దారిలో పెట్టడం తేలిక. పంచతంత్ర కథలు సైతం రాజకుమారులకు విద్యాబుద్ధులు నేర్పడమే. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానబోధ చేసే ఉపాధ్యాయవృత్తి పరమపవిత్రమైన వృత్తి.



‘గురువంటే గుండ్రాయి కాదు... బుడుగంటే బుడిచెంబు కాదు’ అంటూ తమాషాగా పలికే మాటలతో పల్లవి మొదలవుతుంది. ఆ తరవాత పాట మొత్తం తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ‘ఆడాలి గెలవాలి... చదవాలి ఎదగాలి... మనసులు విరబూసి మధువులు చిందాలి’ అంటూ పిల్లలకు ఆటలు, గెలుపు, చదువు, ఎత్తుకు ఎదగటం... ఎంత అవసరమో చెబుతూనే, మానసిక వికాసంతో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు. ప్రతిగురువు శిష్యులకు ఏం నేర్పాలో ఇందులో స్పష్టం చేశారు ముళ్లపూడి శాస్త్రి.ఈ పాటలో మరొక విచిత్రం ఉంది. చరణాలు ‘పరోపకారం పుణ్యం... పరహింసనమే పాపం...’ ‘అసతోమా సద్గమయా... తమసోమా జ్యోతిర్గమయా...’ అనే సూక్తులతో ముగుస్తాయి. ఇదొక కొత్త ప్రయోగమనే చెప్పాలి. ‘దోషిని దండించమని ద్రోహిని ఎదిరించమని... స్వార్థాన్ని పక్కకు నెట్టి మానవతను పెంచమని...



ఎలెగుత్తి చాటాయి...’ అంటూ మన రామాయణమహాభారతాల సారాన్ని ఒక్కమాటలో చెప్పారు రచయిత. రెండవ చరణంలో ‘మంచికి విలువీయకుంటే... వంచన విడనాడకుంటే... మతసహనం మాట మరచి సమతకు తను సమాధి కడితే... నరుడే దానవుడవుతాడు’ అంటూ మానవత్వపు విలువలను కొబ్బరినీళ్ల వంటి తేటతెలుగు పదాలతో వివరించారు. ఇందులోని అన్ని విషయాలూ గురువులంతా శిష్యులకు బోధించవలసిన అంశాలే.



ఈ పాట పల్లవిని సింధుభైరవి రాగంలోను, చరణాలు చక్రవాక రాగంలోను స్వరపరిచాను. ముళ్లపూడి శాస్త్రి రాసిన పాటకు నేను ట్యూన్‌ చేశాను. సినిమాలోని పిల్లల పాత్రలకు ఆ రోజుల్లో ఎస్‌. జానకి, సుశీల గార్లు పాడేవారు. ఈ చిత్రంలో శిష్యుడిగా విన్నకోట రామన్నపంతులుగారి మనవడు  విన్నకోట కిరణ్‌ నటించాడు. ఆ పిల్లవాడి గొంతుకు అనువుగా, మాల్గుడి డేస్‌లో స్వామిగా వేసిన మంజునాథ్‌ను బెంగళూరు నుంచి పిలిపించి, పాడించాను. మంజునాథ్‌కి ఇది మొదటి పాట. బాలుతో కలిసి పాడటం విశేషం. ఈ పాట మంచి పాటలలో ఒకటిగా నిలిచింది. – సంభాషణ: డా. వైజయంతి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top