గ్రంథాలయ హంస

గ్రంథాలయ హంస


విశిష్ట సేకర్త: ఒక్క చేతి మీదుగా లక్షల పుస్తకాలను బీరువాలలో సబ్జెక్ట్ వారీగా సర్దడం - అదీ 80 ఏళ్ళ వ్యక్తికి- సాధ్యమవుతుందా? గుంటూరు వచ్చి చూడండి సాధ్యమని నమ్ముతారు.

 

 ముందు గదిలో, వెనుక గదిలో, పడక గదిలో, పక్క గదిలో... ఎటు చూసినా పుస్తకాలే. త్యాగరాజస్వామి ‘ముందు వెనుక ఇరుప్రక్కలా తోడై’ అని చెప్పినట్టు అన్నివైపులా పుస్తకమయంగా కనబడే ఆ ఇల్లు గుంటూరు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య వీధిలోని లంకా సూర్యనారాయణ గారిది. తెలిసినవారు ఆయన ఇంటిని పుస్తకాల లంక అని చమత్కరిస్తుంటారు.

 

 లంకా సూర్యనారాయణ గుంటూరు సమీపంలోని పెదగొట్టిపాడు గ్రామంలో జన్మించారు. సెంట్రల్ ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌గా రిటైర్ అయ్యారు. భార్య వరలక్ష్మి. ముగ్గురు పిల్లలు. అయిదుగురు మనవ సంతానం. వీరి జీవిత విశేషాలు ఎంత విశదంగా చెప్పినా యింతే. అయితే, ఈ జీవిత కాలంలో వారు చేసిన పని, కూర్చిన సేకరణ, సెలవు చేసిన పైకం, వెచ్చబెట్టిన కాలం - పుస్తక ప్రియులు కృతజ్ఞతలు చెల్లింపక తప్పని పరిస్థితిని కల్పించాయి.

 

 సూర్యనారాయణ 1951లో ఇంటర్మీడియెట్ చదవడానికి గుంటూరు వచ్చారు. గుంటూరులో ఆంధ్రపత్రిక వారిని బాగా ఆకర్షించింది. కొని చదివి పారేయకుండా భద్రపరచడం మొదలుపెట్టారు. అలా మొదలైన సేకరణ లక్ష పుస్తకాలతో త్రివిక్రమావతారం దాల్చింది. 880 భగవద్గీతలు, 774 భాగవతాలు, 1634 రామాయణాలు, 681 భారతాలు, 2975 పైన స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు, 2000 శతకాలు, 1500 నాటకాలు, 1000 సంగీత గ్రంథాలు, 150 సంవత్సరాల పంచాంగాలు, అరచేతి సైజు నుండి తలగడ సైజు వరకు ఉండే 1000 నిఘంటువులు వీరి సేకరణలో ఉన్నాయి. పరిశోధకులకు ఇంత విపులసేకరణ ‘కెలకులనున్న తంగెటి జున్ను, పండిన పెరటి కల్పకము’.

 గీతాంజలికి ఆదిపూడి సోమనాథరావు తొలి అనువాదం నుండి నిన్న మొన్న వచ్చిన భార్గవి తాజా అనువాదం వరకు 51 అనువాదాలు, గోదామాత సాయించిన ద్రవిడ వేదం తిరుప్పావై - 30 చిన్నపాటల గ్రంథం - దీనికి అనువాదాలు గాని, వివరణలు గాని 300 పుస్తకాలు - వీటన్నింటిని ఒక చోట చేర్చగలిగారు.

 

 సాధారణంగా మనం వినే భారతి, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి లాంటివి కాకుండా సరస్వతి, అభినవ సరస్వతి, తెలుగు స్వతంత్ర, నందిని, వేకువ, సాహితి, పుస్తక ప్రపంచం, నవ్యభారతి, నీలిమ, హిందూసుందరి, వీణ, మహతి, ఆంధ్రభూమి (ఆండ్ర శేషగిరిరావు పత్రిక), పరిషత్ పత్రిక లాంటివెన్నో వీరు సేకరించి పెట్టారు కాబట్టి మనం చూడగలం.

 ఇక్కడ ఒక చిన్న ముచ్చట! ప్రసిద్ధ సాహిత్య పత్రిక భారతి 1987లో పత్రిక రూపంలో రాలేదు. ఆంధ్ర దినపత్రికలో పక్షానికో మారు అనుబంధంగా దినపత్రిక సైజులో ఇచ్చారు. మొత్తం 24 అనుబంధాలు. బహుశా సూర్యనారాయణ సేకరణలోనే వీటిని ఒక్కచోట చూడగలం! ఇక నవలలు, కథా సంపుటాలు, వ్యాస సంకలనాలు, కవితా సంకలనాలు లెక్క చెప్పనక్కరలేదు.

 వీరి అభిరుచి పుస్తక సేకరణే గాని ఫలనా పుస్తక సేకరణ కాదు. అందుకే ఆధ్యాత్మికం, ప్రాచీన, ఆధునిక సాహిత్య శాఖలు, వాస్తు, హేతువాదం, చరిత్ర, వైద్యం, జ్యోతిషం, సిద్ధాంత గ్రంథాలు, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, జర్నలిజం, క్రీడలు, శిల్పం, యాత్రలు అన్నీ ఒక చోట చేరాయి.

 

 ఆయన చేసిన ఒక శ్రమదాయకమైన పని గురించి చెప్పాలి. గత 50 ఏళ్లుగా దిన, వార, మాస పత్రికలలో వచ్చిన లలిత కళా సంబంధ వ్యాసాలన్నింటినీ కత్తిరించి పెట్టారు. ఈ కత్తిరింపులు సుమారు 3 లక్షల వరకు ఉంటాయి. వీటిని అధ్యయనం చేస్తే గత 50 ఏళ్ల తెలుగు సాహితీ ప్రస్థానం గురించి ఒక అంచనాకు రావచ్చు. వీటన్నింటినీ ఆయన సమాజానికి ఇచ్చేసారు. గుంటూరులోని శ్రీ అన్నమయ్య సేవా సమితి వారు ఈ నిధినంతటినీ స్వీకరించారు. మూడంతస్తుల విశాల భవనాన్ని ఏర్పాటు చేశారు. అన్నమయ్య గ్రంథాలయం అని పేరు పెట్టారు. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్థిక సహాయం చేశారు.

 

 ఇప్పటి వరకూ చెప్పినదంతా తెలుగు పుస్తకాల గురించి. ఇంగ్లిష్ విభాగం వేరే. ‘‘ఎందుకండీ, ఇన్ని పుస్తకాలు సేకరించారు?’’ అని అడిగితే ‘‘ఏ ఉద్దేశం లేదండీ! సేకరించాను అంతే’’ అని నిష్కల్మషంగా నవ్వుతారు. ఆర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్ లాగ సేకరణ ఫర్ ది సేక్ ఆఫ్ సేకరణ అన్నమాట! ఏ గుర్తింపునూ ఆశించకుండా ఇంత పని చేశారు. ప్రభుత్వం గుర్తించి మొన్నటి ఉగాది నాడు ‘హంసను’ (కళారత్న పురస్కారం) వారింటికి పంపింది. ‘‘అది నాది కాదు. నన్ను అభిమానించి సహకరించిన వారందరిది’’ అన్నారాయన పాత పుస్తకంలోని పేజీలను సరిగా సర్దుతూ.

  - శెట్లెం చంద్రమోహన్

 (వ్యాసకర్త ప్రిన్సిపల్, ఎస్‌ఎంఎస్ అండ్ ఎస్‌ఎంసిఎంఆర్ బిఇడీ కళాశాల, గుంటూరు; గ్రంథాలయం ఫోన్ నం: 0863-2246365

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top