కాల్పులను కాచుకుంటూ... బంకర్లు కట్టాం !

కాల్పులను కాచుకుంటూ... బంకర్లు కట్టాం !


యుద్ధ క్షేత్రం: సైనికుడు తలదాచుకోవడానికి, ప్రత్యర్థి మీద దాడి చేయడానికీ ఓ స్థావరం ఉండాలి. సైనికుల కంటే ముందే వెళ్లి బంకర్ కట్టిన ఓ లెఫ్టినెంట్ కల్నల్ కామేశ్ అనుభవాలు...

 

 మా సొంతూరు తెనాలి. కానీ నాన్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి కావడంతో పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. స్కూలు రోజుల్లో ఎయిర్ ఫోర్సు చీఫ్ దిల్‌బాగ్ సింగ్, జనరల్ జె.ఎన్. చౌదరికి ఉత్తరాలు రాసేవాడిని. ప్రత్యుత్తరంగా వచ్చిన ఫొటోగ్రాఫ్‌లు, ఆటోగ్రాఫ్‌లను భద్రంగా దాచుకునేవాడిని. అంతే తప్ప సైన్యంలో చేరాలనే ఉద్దేశం అప్పుడు లేదు. గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు మద్రాసు రెజిమెంట్‌లో పని చేస్తున్న మా కజిన్ బ్రదర్ కలసి ‘నువ్వూ సైన్యంలో చేరకూడదూ’ అని మాట మాత్రంగా అనడం, ఇంజనీరింగ్ పూర్తవగానే అప్లయ్ చేయడం జరిగిపోయాయి. అలా 1973లో రక్షణరంగంలో ఇంజనీర్‌గా చేరాను. ఇరవై మూడేళ్ల పాటు పని చేసి 1996లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో రిటైరయ్యాను.

 

 ఇంజనీర్ల పాత్ర...

 యుద్ధక్షేత్రానికి మొదట వెళ్లేది, చివరగా వచ్చేదీ ఇంజనీర్లే. నదుల మీద ఫ్లోటింగ్ బ్రిడ్జిలు నిర్మించాలి. అవి సెమీ పర్మినెంట్ వంతెనలు. పిల్లలు బ్లాక్స్‌తో బిల్డింగులు కట్టినట్లు ఇనుపరాడ్లు, ప్లాంక్‌ల వంటి విడిభాగాలతో వంతెన కట్టాలి. అలా కట్టిన వంతెనకు మూడు వేల వాహనాలు ప్రయాణించగలిగిన సామర్థ్యం ఉంటుంది. ఆ వంతెన మీద నుంచి మన సైనికులు అవతలికి వెళ్లి, ఆపరేషన్ పూర్తి చేసుకుని వెనక్కి వచ్చాక తీసేయాలి. అలా చేయకపోతే శత్రుదళాలు కూడా ఆ వంతెన ఆధారంగా మన భూభాగంలోకి సులువుగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎడారుల్లో ట్రాక్ లేయింగ్ ట్యాంకులతో దారులు వేస్తారు. అల్యూమినియం చుట్టను పరుచుకుంటూ వెళ్లి పనయ్యాక చుట్టేసి వెనక్కి తెచ్చేయాలి. మాకు శిక్షణలో ఆయుధాలను ఉపయోగించడంతోపాటు ల్యాండ్‌మైన్స్ పెట్టడం, తీసివేయడం రెండూ నేర్పిస్తారు.

 

 అది జమ్మూ-కశ్మీర్‌లోని రజోరి సెక్టార్ పరిధిలోని ఖేరి. బహుశా 1978-79ల్లో అనుకుంటాను. భారత సైన్యం పహరా కాయడానికి వీలుగా రెండు బంకర్లు కట్టాలని ఆదేశం వచ్చింది. అంతా కొండలమయం, వాహనం వెళ్లలేదు, భవన నిర్మాణానికి అవసరమైన వస్తువులను మనుషులే మోయాలి. అలాగే బంకర్ కట్టడానికి ముందు ఆ ప్రదేశానికి అడ్డుగా ఒక గోడ కడతాం. ఎందుకంటే బంకర్ కడుతున్నప్పుడే కాల్పులు జరిగే అవకాశం ఉంటుంది. మేము సినిమాల్లో చూపించినట్లుగా చెట్ల కొమ్మలను కట్టుకుని, ఒంటికి మట్టి రాసుకుని మా కదలికలను పసిగట్టలేని విధంగా తయారై గోడ నిర్మాణం పూర్తి చేశాం. బంకర్ పనులు మొదలయ్యాయి.

 

 కొందరు ఆ పరిసరాల్లో సంచరించారు. మూడు గంటల పాటు మా మీద కాల్పులు జరిపారు. గోడ వెనుక దాక్కున్నాం. దాంతో పగటి పూట పని ఆపేసి బంకర్ కట్టే ప్రయత్నం మానుకున్నట్లు ప్రత్యర్థులు భ్రమపడేటట్లు చేసి రాత్రి పూట నిర్మాణం పూర్తి చేశాం. సరిహద్దు నుంచి కొంత దూరం మైన్ ఫీల్డ్స్ ఉంటాయి. ప్రత్యర్థులు చొచ్చుకుని రాకుండా అడ్డుకోవడానికి ఆ ప్రదేశమంతా మందుపాతరలు అమర్చి ఉంటాం. చీకట్లో ఆ మందు పాతరలు ఎక్కడ పెట్టామో గమనించుకుంటూ నడవాలి. అలా పదిహేను రోజుల్లో రెండు బంకర్లు కట్టాం.  

 

 ‘డిఫెన్స్ వెటరన్స్ వాలంటీర్ గ్రూప్ హైదరాబాద్’లో పనిచేస్తున్నాను. వాయుపురి, సైనిక్‌పురిల్లో మాజీ రక్షణరంగ ఉద్యోగుల కుటుంబాలు ఆరువందలకు పైగా ఉన్నాయి. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు మందులు తెచ్చివ్వడం, ఈ-మెయిల్, చాటింగ్ ద్వారా పిల్లలతో మాట్లాడించడం, ఆరోగ్య నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించడం చేస్తున్నాం. డిప్రెషన్‌లో ఉన్న వారికి ధైర్యవచనాలతో సాంత్వన కలిగిస్తున్నాం.

 - లెఫ్టినెంట్ కల్నల్

 పి. కామేశ్

 

 అఖ్నూర్‌లో వరదల సమయంలో మా యూనిట్‌కి ప్రశంసలందాయి. భారీ వరదలకు వంతెనలు కొట్టుకుపోయాయి. తిరిగి కట్టడానికి ప్లాన్, సామగ్రిని సిద్ధం చేసుకుని పడవల్లో వెళ్లి తీరాలను సరి చేసుకుంటూ వెళ్తుంటే వెనుక మరొక బృందం వంతెన నిర్మించాలి. నేను ప్లానింగ్, ఎగ్జిక్యూటివ్ అధికారిని. 150 మీటర్ల వంతెనను 15 గంటలలోపు పూర్తి చేసినందుకు ప్రశంసలందుకున్నాను.

 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

 manjula.features@sakshi.com

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top