అమ్మ కావడం... అంత తేలిక కాదు!

అమ్మ కావడం... అంత తేలిక కాదు!


కాలం మారింది. స్త్రీలు సైతం పురుషులతో సమానంగా జీవించాలని తపన పడుతున్నారు. ఒక్కోసారి పురుషుడికి తన జీవితంలో స్థానం ఇవ్వకుండానే బతకాలని ఆశపడుతున్నారు. ఈ పరిణామక్రమంలో పుట్టుకొచ్చిందే... సింగిల్ మదర్ అనే మాట. భర్త చనిపోవడం వల్లనో, భర్తనుంచి విడిపోవడం వల్లనో ఒంటరిగా బిడ్డను పెంచడం అనేది ఎప్పుడూ ఉన్నదే. కానీ పెళ్లే చేసుకోకుండా, అనాథాశ్రమాల నుంచో, ఏన్జీవోల నుంచో బిడ్డలను తెచ్చి పెంచుకునే సింగిల్ మదర్స్ మాత్రం ఇప్పుడిప్పుడే ఎక్కువవుతున్నారు.


 ఓ ఆడపిల్ల పెళ్లి వద్దు అనుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. తన మనసుకి నచ్చినవాడు దొరకకపోవడం వల్ల ... ప్రేమించినవాడి వల్ల దెబ్బతిని, ఇక ఎవరికీ ఆ అవకాశం ఇవ్వకూడదు అనుకోవడం వల్ల... పెళ్లి చేసుకుని కష్టాలపాలైన వారిని కళ్లారా చూసి, తనకా పరిస్థితి రాకూడదన్న విరక్తితో... పెళ్లే జీవితం కాదు, పెళ్లి లేకపోయినా గౌరవంగా బతకవచ్చు అన్న ఆత్మవిశ్వాసంతో... ఏ కారణంతోనైనా ఆమె ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ అవేమీ ఆలోచించకుండా ఆమెను అపహాస్యం చేసేవాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే సింగిల్ మదర్‌కి సవాళ్లు కాస్త ఎక్కువే!


‘మీరే కనుక సింగిల్ మదర్‌గా మిగిలిపోవాలనుకుంటే, అందుకు మీరెంత సిద్ధంగా ఉన్నారో ముందు పరీక్షించుకోండి’ అంటారు ఎలిజబెత్ గాల్డ్. మానసికంగా సంసిద్ధంగా లేకపోతే పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమంటారు ఈ అమెరికన్ సైకాలజిస్ట్. నిజానికి విడాకులు తీసుకోవడం, పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం, పెళ్లి కాకుండానే తల్లి కావడం వంటివి విదేశాల్లో పెద్ద విషయం కాదు. కానీ మన సమాజం ఇలాంటి వాటికింకా అలవాటు పడలేదు. అందుకే విమర్శలు ఎదురవుతాయి. కాబట్టి మానసిక సంసిద్ధత చాలా అవసరం. అలాగే... భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనే గానీ లోటు లేకుండా జీవించలేని రోజులివి. మరి మీరు ఒంటరిగా బిడ్డ అవసరాలన్నిటికీ తీర్చగలుగుతారా! ఏ అనారోగ్యమో, మరేదైనా సమస్యో వస్తే ఎదుర్కోగలరా అనేది ఆలోచించుకోవాలి. ఆర్థికంగా ఒక్కరే అన్నీ భరించాలి కాబట్టి మిగతా వారిలాగ ఎక్కువకాలం బిడ్డ దగ్గర ఉండలేరు. వీలైనంత త్వరగా ఉద్యోగానికి వెళ్లి తీరాలి. మరి బిడ్డను ఎవరు చూస్తారు! పనిమనిషిని పెట్టుకుంటారా! లేదంటే డే కేర్ సెంటర్‌లో వదిలిపెడతారా! ఇదీ ఆలోచించుకోవాలి. అది మాత్రమే కాదు... రేపు మీకు తగిన వ్యక్తి ఎవరైనా తారసపడితే, పెళ్లి చేసుకోవాలనిపిస్తే... అతణ్ని కన్విన్స్ చేయగలరా! మీకు పిల్లలు పుడితే ఈ బిడ్డను మీ సొంత బిడ్డలతో సమానంగా చూడగలరా!


వీటన్నిటికంటే పెద్ద సమస్య... రేపు బిడ్డ పెద్దయ్యాక తనకేం చెప్పాలి! అందరిలాగా తనకు తండ్రి ఎందుకు లేడని అడిగితే ఏం సమాధానం చెప్పాలి! మీ సమాధానంతో తనని కన్విన్స్ చేయగలరా! ఆడపిల్లయితే మంచి సంబంధం తెచ్చి చేయగలరా! అవతలివారికి వచ్చే సందేహాలను తీర్చగలరా!


వీటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర ఉంటేనే బిడ్డను మీ జీవితంలోకి ఆహ్వానించండి. తనకి మంచి జీవితాన్ని ఇవ్వలేనప్పుడు తల్లి స్థానంలోకి వెళ్లాలని అనుకోవడంలో అర్థం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటుంది. మీ ఆనందం కోసమో, మీకు కాస్త రిలీఫ్ కావాలనో... ఏదో ఒక స్వార్థంతోనే మీరు బిడ్డను తెచ్చుకుంటున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది మానేసి మీరేదో ఓ అనాథ బిడ్డకు జీవితాన్ని ఇచ్చేస్తున్నారనుకునో లేదంటే సమాజం ముందు గొప్పగా కనబడాలనో మాత్రం ఈ నిర్ణయం తీసుకోకండి. అలాంటి ఆలోచనలే కనుక ఉంటే... మీరు నిజమైన తల్లి కాలేరు. నిర్మలమైన ప్రేమను పంచలేరు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top