పచ్చటి ప్రపంచం కోసం...

పచ్చటి ప్రపంచం కోసం...


‘మీ పిల్లలు మీ పిల్లలు మాత్రమే కాదు’ అనే కవి భావన కెహ్‌ కషాన్‌ బసును(దుబాయి, యూ.ఏ.ఈ) చూసినప్పుడు మరింత లోతుగా అర్థమవుతుంది. మంచి పనులు చేసే పిల్లలు ‘ఒక’ కుటుంబానికే చెందిన పిల్లలు కాదు... వసుధైక కుటుంబానికి పిల్లలవుతారు.పరిశుద్ధమైన పర్యావరణం కోసం పోరాటం చేస్తున్న భారత సంతతికి చెందిన కషాన్‌ బసు అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి అందుకోవడం ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.ఎనిమిది సంవత్సరాల వయసులోనే... పొరుగింటి పిల్లలకు పర్యావరణ ప్రాముఖ్యత గురించి చెప్పేది కషాన్‌ బసు. కూతురి అభిరుచిని తమ వంతుగా ప్రోత్సహించారు తల్లిదండ్రులు. పర్యావరణ స్పృహను పెంపొందించే వస్తువులు, సాహిత్యాన్ని కూతురికి కానుకగా ఇచ్చేవారు. తన పుట్టిన రోజు సందర్భంగా... తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో మొక్కలు కొని నాటేది కషాన్‌ బసు. అలా ఇప్పటి వరకు ఎన్నో మొక్కలు నాటింది.



పన్నెండు సంవత్సరాల వయసులో ‘గ్రీన్‌ హోప్‌’ అనే స్వచ్ఛందసంస్థను స్వయంగా స్థాపించింది. ఈ సంస్థ ద్వారా పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ సంరక్షణ... మొదలైన విషయాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ‘చిల్డ్రన్‌ అండ్‌ యూత్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం’కు గ్లోబల్‌ కోఆర్డినేటర్‌గా నియమితురాలై ప్రపంచ  దృష్టిని ఆకర్షించింది.‘గ్రీన్‌ హోప్‌’ తరపున ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఉపన్యాసం ఇచ్చింది. పర్యావరణ ప్రాముఖ్యత గురించి స్కూలు, యూనివర్శిటీలలో చురుగ్గా ప్రచారాన్ని నిర్వహించింది. యునైడెట్‌ నేషన్స్‌కు సంబంధించి ఎన్నో  ఫోరమ్స్‌లో తన ప్రసంగాన్ని వినిపించింది. యుఎన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పర్యావరణ సంబంధిత విషయాలపై కషాన్‌ బసుకు మరింత పట్టు పెరిగింది. కొత్త పరిచయాలు... ఆమె క్రియాశీలతకు మరింత పదును పెట్టాయి.కొన్ని సంవత్సరాల క్రితం... బ్రెజిల్‌లో జరిగిన ‘ఎర్త్‌ సమ్మిట్‌’లో పాల్గొంది కషాన్‌.



అక్కడి నుంచి దుబాయికి తిరిగి వచ్చిన తరువాత... పర్యావరణ సంబంధిత కార్యక్రమాలకు మరింత నిర్మాణాత్మక రూపం ఇవ్వడానికి ‘గ్రీన్‌ హోప్‌’ను ప్రారంభించింది. మొదట్లో... ఈ సంస్థలో ఉన్న సభ్యులు అయిదుమంది మాత్రమే. ఇప్పుడు అది వెయ్యి దాటింది. వీరిలో అనేక దేశాల వారు ఉన్నారు.‘బై యూత్‌–ఫర్‌ యూత్‌’ నినాదంతో పనిచేస్తుంది ‘గ్రీన్‌ హోప్‌’. విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకొని ‘గ్రీన్‌ హోప్‌’ తరపున... వర్క్‌షాప్‌లు, సదస్సులు, రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం నుంచి జీవవైవిధ్యం వరకు రకరకాల కోణాల్లో యువతకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది ‘గ్రీన్‌ హోప్‌’. ఒకప్పుడు స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ‘గ్రీన్‌ హోప్‌’ కార్యక్షేత్రం ఇప్పుడు కార్పోరేట్‌ కార్యాలయాలకు విస్తరించింది. ‘రోడ్డు షో’ల ద్వారా తన పరిధిని మరింత విస్తరిస్తుంది ‘గ్రీన్‌ హోప్‌’. ‘‘ఆరోగ్యకరమైన వ్యవస్థకు  మూడు స్తంభాలు ఉంటాయి. ఆర్థికం, పర్యావరణం, సమాజం. ఇవి ఒకదాని కొకటి అనుసంధానమై పనిచేస్తేనే ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. ఆర్థికాభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పణంగా పెట్టవద్దు’’ అని చెబుతుంది కషాన్‌ బసు.



పదహారు సంవత్సరాల కెహ్‌ కషాన్‌ బసు ప్రఖ్యాత పర్యావరణ వేత్త రాబర్ట్‌ స్వాన్‌ మాటను తరచుగా  ఉటంకిస్తుంటుంది. ఆమె చేపడుతున్న కార్యక్రమాల్లాగే... రాబర్ట్‌ స్వాన్‌ మాట కూడా  ఎంతో విలువైంది. ‘మన భూగ్రహానికి పొంచి ఉన్న ముప్పు ఏమిటంటే... ఎవరో ఒకరు వచ్చి దాన్ని రక్షిస్తారు అనే నమ్మకం’ ఆ నమ్మకం సడలి పోయి మన మీద మనం నమ్మకం ఏర్పాటు చేసుకొని పర్యావరణ స్పృహతో ముందుకు కదలడానికి ‘గ్రీన్‌ హోప్‌’లాంటి సంస్థలు, వాటిని నడిపిస్తున్న కెహ్‌ కషాన్‌ బసులాంటి వారి అవసరం ఎంతైనా ఉంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top