ఆనందం కనిపించడం లేదా?

ఆనందం కనిపించడం లేదా?


‘ఆనందో బ్రహ్మ’ అన్నారు వేదాంతులు.

‘సంతోషమే సగం బలం’ అన్నారు పెద్దలు.




‘అదంతా ఒక రసాయనిక చర్య’ అంటున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు సంతోషంగా ఉండాలనే అందరూ అనుకుంటారు. కొద్దిమంది మాత్రమే అలా ఉండగలరు. సంపదలు ఎన్ని ఉన్నా సంతోషంగా ఉండలేరు కొందరు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా చిరునవ్వులొలికిస్తూ ఉల్లాసంగా, సంతోషంగా జీవితాన్ని గడిపేయగలరు ఇంకొందరు. మరి వాళ్లకు కనిపించిన సంతోషం మనకు ఎందుకు కనబడటం లేదు? సంపదే సమస్తం అనుకుంటే పొరపాటే! సంపద పుష్కలంగా ఉంటే సకల సౌకర్యాలనూ సమకూర్చుకోగలరేమో గానీ సంతోషాన్ని మాత్రం కొనుక్కోలేరు.



మత గ్రంథాలు మొదలుకొని ఆధునిక మనస్తత్వ శాస్త్రం వరకు అనేక పురాణ, శాస్త్ర గ్రంథాలు సంతోషం గురించి తెగ వర్రీ అయిపోతూ చాలానే చర్చించాయి. ‘సంతోషంగా ఉండాలనుకుంటే, అలా ఉండటమే మార్గం’ అని సెలవిచ్చాడో మేధావి. అంత ఈజీనా అనిపించవచ్చు సందేహరాయుళ్లకు. ఇట్స్‌ వెరీ ఈజీ యార్‌ అనుకుంటారు నిక్షేపరాయుళ్లు. లేనిపోని శంకలేవీ పెట్టుకోకుండా ‘సందేహ’త్యాగం చేసేసి సంతోషం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను సంతోషంగా తెలుసుకోండి.



ఏమిటి..? ఎక్కడ..? ఎలా..?

సంతోషం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? అనే ప్రశ్నలు చాలామందిని సతమతం చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలతో మితిమీరిన మీమాంసలో పడితే అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఆనందాలు కూడా అరక్షణంలో అవిరైపోతాయి. సంతోషం కూడా దైవం లాగానే ఒక అమూర్త భావన. అందుకే అద్వైతంలో తరించిన వేదాంతులు ‘ఆనందో బ్రహ్మ’ అన్నారు. వారి దృష్టిలో సంతోషానికీ, దైవానికి ఎలాంటి భేదం లేదు.



 దైవం వలెనే సంతోషం కూడా సర్వాంతర్యామి. ఎక్కడైనా దొరుకుతుంది. ఏ రీతిలోనైనా దొరుకుతుంది. పొద్దు పొడుపుతోనే వినిపించే పిట్టల కువకువలను ఆలకిస్తే ఉదయమంతా ఉల్లాసంగా ఉండదూ! ముద్దులొలికే పసిపాపల బోసినవ్వుల్లో సంతోషం కనిపించదూ! కాలం పెట్టిన గడ్డు పరీక్షలను గట్టెక్కినప్పుడు, జీవన పోరాటంలో ఘన విజయాలను సాధించినప్పుడేనా సంతోషమూ, సంబరమూ..! ఇంపైన దృశ్యాన్ని కళ్లారా తిలకించినప్పుడు, నాలుకకు నచ్చిన మిఠాయిని రుచి చూసినప్పుడు,



వీనుల విందైన సంగీతాన్ని ఆలకించి ఆదమరచినప్పుడు ... ఇలాంటి చిన్న చిన్న సంగతులకు కూడా సహజంగానే సంతోషిస్తాం కదా! అయితే, వర్తమానాన్ని విస్మరించే వారికి చిన్న చిన్న సంగతులే కాదు, పెద్ద పెద్ద విజయాలు కూడా సంతోషాన్ని ఇవ్వలేవు. నిన్నటి గురించి దిగులు వదిలేసి, రేపటి గురించి ఆందోళనను మరచి వర్తమానంలో జీవించడాన్ని అలవాటు చేసుకుంటే చిన్న చిన్న సంగతులే సంతోషసాగరంలో ఓలలాడిస్తాయని మానసిక శాస్త్ర నిపుణుల ఉవాచ.



మతం... శాస్త్రం... సమాజం...

‘మతం నల్లమందు’ అని కార్ల్‌ మార్క్స్‌ చెప్పిన మాటలను కమ్యూ‘నిష్టా గరిష్ఠులు’ ఇప్పటికీ వల్లిస్తూనే ఉన్నా, మతాతీతంగా బతికేసే నాస్తికుల కంటే మత విశ్వాసాలు కలిగి ఉన్న ఆస్తికులే సంతోషంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనాలు సశాస్త్రీయంగా చెబుతున్నాయి. వివిధ మతాలకు చెందిన వారిపైన, ఏ మతాన్నీ పాటించని నాస్తికులపైన బ్రిటన్‌కు చెందిన ‘ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌’  జరిపిన అధ్యయనంలో నాస్తికుల కంటే మత విశ్వాసాలు కలిగిన వారే సంతోషంగా ఉన్నట్లు తేలింది.



 ఇక ఆర్థిక పరిపుష్టి గల సమాజాలు సంతోషంగా మనుగడ సాగిస్తుంటాయని అంతా భావిస్తుంటారు. సంతోషానికి దోహదపడే చాలా అంశాల్లో ఆర్థిక సుసంపన్నత ఒక పార్శ్వం మాత్రమే. ఉగ్రవాదం, జాత్యహంకారం, అవినీతి, అంతఃకలహాలు, అసమానతలు వంటి సమస్యలు కుదిపేస్తున్నప్పుడు ఎంతటి ఆర్థికబల సంపన్న దేశాలైనా సంతోషంగా ఉండలేవు. ప్రశాంతతకు భంగం కలిగించే పరిస్థితులేవీ లేనప్పుడు ఆర్థికశక్తి కాస్త సన్నగిల్లి ఉన్న దేశాలు కూడా సుఖసంతోషాలతో మనుగడ సాగించగలవు. ఇందుకు ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌’లోని గణాంకాలే సాక్ష్యం.



ఆహారం... ఆరోగ్యం... ఆనందం...

‘తిండి కలిగితె కండగలదోయ్‌’ అన్నాడు గురజాడ. తిండి వల్ల కండబలం పెరగడానికి కొంత సమయం పట్టొచ్చు గానీ, రుచికరమైన తిండి తక్షణమే ఆనందాన్ని ఇస్తుంది. నచ్చిన తిండి తిన్నప్పుడు కలిగే సంతోషమే వేరు. ఆకలి వేసినప్పుడు తినే తిండి కంటే ఆనందమిచ్చేది ఏది ఉంటుంది? ఆకలితో అలమటించే వాళ్లకు ఏ ఆనందమూ ఉండదు. అలాంటి అభాగ్యులకు అన్నం పెట్టి చూడండి. అప్పుడు వాళ్ల కళ్లలో కనిపించే మెరుపు ఇచ్చే సంతోషం ఎంత వెలపెట్టినా దొరకదు.



 జిహ్వచాపల్యం కొద్దీ నచ్చిన పదార్థాలు తినడం ద్వారా సంతోషం పొందడం అందరికీ అనుభవమే. అలాగని నచ్చినవన్నీ ఎడాపెడా తినేస్తూ ఆరోగ్యాన్ని పణంగా పెడితే ఆ ఆనందం ఎంతోకాలం నిలవదు. అందుకని ఉదర పోషణతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా కొంత దృష్టిపెడితే ఆనందాన్ని ఎల్లకాలం కాపాడుకోవచ్చు. జీవితంలో ఈతిబాధలు తప్పవు. నిరాశా నిస్పృహలు చిరాకు పెట్టే సందర్భాలూ తప్పవు. అలాంటి సమస్యలకు కుంగిపోవడం మొదలుపెడితే, జీవితంలో ఆనందమే కరువవుతుంది. చిన్నా చితకా శారీరక, మానసిక రుగ్మతలకు మరీ అతిగా ఆలోచించి కుంగిపోవద్దు.



 శరీరానికి కాస్త పనిచెబితే ఇలాంటి సమస్యలన్నీ తేలికగా పటాపంచలైపోతాయి. ఒళ్లొంచి చేసే తోటపని కావచ్చు, ఆరుబయట ఆడే ఆటలు కావచ్చు... ఇవేవీ కుదరనప్పుడు నాలుగు గోడల మధ్యనే వీలైన యోగాసనాలు, వ్యాయామం వంటివి చేయడం ద్వారానైనా కొంత ఉత్సాహాన్ని పుంజుకోవచ్చు. శారీరక వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, ఆనందమూ పెరుగుతుందని పలు అంతర్జాతీయ అధ్యయనాల్లో ఇప్పటికే తేటతెల్లమైంది.



కూసింత కలాపోసన... కొండంత సంతోషం

‘మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల’న్నాడు ‘ముత్యాలముగ్గు’లో రావు గోపాలరావు. అందులో ఆయన చెప్పినట్లే ఊరకే తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ అట్టే తేడా ఉండదు. ‘తిన్నామా... పడుకున్నామా... తెల్లారిందా...’ అనే పద్ధతిలో బతికేస్తూ పోతే త్వరలోనే జీవితం మీద విసుగు పుడుతుంది. ఈ విసుగనేది ఉంది చూశారూ...! ఇది యమ డేంజరస్‌ లక్షణం. సంతోషాన్ని సైలెంట్‌గా చంపేస్తుంది. జీవితంలో సంతోషం చచ్చిన మనిషి వయొలెంట్‌గా మారే ప్రమాదాలు లేకపోలేదు.



 అలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ఉండాలంటే కూసింత కలాపోసనే ఉత్తమ మార్గం. పెయింటింగ్, డ్యాన్స్, యాక్షన్, మ్యూజిక్, మ్యాజిక్‌... ఏదైనా కావచ్చు. నచ్చిన కళలో సాధన మొదలుపెట్టి చూడండి. సంతోషం మీ సొంతమవుతుంది. యోగసాధన స్థాయిలో కళాసాధన సాగించే కళాతపస్వులు ప్రపంచంలో చాలామందే ఉన్నారు. కళలనే కాదు, ఏదైనా çసృజనాత్మకమైన పనిలో నిమగ్నమైతే తేలికగా సంతోషం దొరుకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘సృజనాత్మకమైన పనిలో ఎంతగా నిమగ్నమైతే అంతగా ఆనందం లభిస్తుంది’ అని అమెరికన్‌ మనస్తత్వ శాస్త్ర నిపుణుడు రాబర్ట్‌ ఎప్‌స్టీన్‌ తన ప్రయోగాల ద్వారా నిరూపించారు.



పంచండి... పెంచండి... తుంచండి

పంచుకుంటే సంపదలు తరిగిపోవచ్చేమో గానీ, సంతోషం మాత్రం తరిగిపోదు సరికదా మరింత పెరుగుతుంది. సంతోషంగా ఉండాలంటే సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడమే తగిన మార్గం. సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే రెట్టింపు అవుతుందని ‘జర్నల్‌ ఆఫ్‌ సోషల్‌ అండ్‌ పర్సనల్‌ రిలేషన్‌షిప్స్‌’ ఒక అధ్యయనంలో వెల్లడించింది.  నచ్చిన వాటిని పెంచుకోవడం ద్వారా కూడా సంతోషం పొందవచ్చు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు పెంచవచ్చు. మనం నాటిన మొక్క చిగుళ్లు తొడిగి, మెల్ల మెల్లగా ఎదిగి పూలతో కళకళలాడినప్పుడు కలిగే మనోల్లాసమే వేరు.



 పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులను, రామచిలుకల వంటి పక్షులను పెంచుకున్నా ఆనందం కలుగుతుంది. పెంపుడు జంతువులు, పక్షులు మనపై చూపే అవ్యాజమైన ప్రేమాభిమానాలు ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే దూరం చేసి ఆనందాన్ని ఇస్తాయని ‘జర్నల్‌ ఆఫ్‌ పర్సనాలిటీ అండ్‌ సోషల్‌ సైకాలజీ’ ఒక అధ్యయనంలో వెల్లడించింది. పంచుకోవడం, పెంచుకోవడం సంగతి సరే, సంతోషంగా ఉండాలంటే కొన్నిటిని తుంచుకోక తప్పదు. దిగులు, గుబులు, అసూయ, ద్వేషం, పగ వంటి ప్రతికూల భావనలను సమూలంగా తుంచేస్తే తప్ప సంతోషంగా ఉండటం సాధ్యం కాదని ప్రపంచంలోని అన్ని మతాలూ చెబుతున్నాయి.



చిన్నదేశం... చింతలు లేని దేశం...

మన పొరుగునే ఉన్న చిన్న దేశం భూటాన్‌. చింతలు లేని దేశం ఇది. ఇరుగు పొరుగు దేశాలు నానా సమస్యలతో, అశాంతితో అల్లాడుతున్నా భూటాన్‌ మాత్రం తన సంతోషాన్ని కాపాడుకోగలుగుతోంది. ఇందుకు కారణం అక్కడి ప్రజల జీవనశైలి మాత్రమే కాదు, ప్రజల సుఖసంతోషాల పట్ల ఆ ప్రభుత్వానికి గల నిబద్ధత కూడా. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రజల సంతోషం కోసం ప్రత్యేకంగా ‘మినిస్ట్రీ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ను ఏర్పాటు చేసిన ఘనత భూటాన్‌కే దక్కుతుంది. కేవలం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో  పెరుగుదల నమోదైనంత మాత్రాన పూర్తి అభివృద్ధి సాధించినట్లు కాదని, ప్రజల సుఖ సంతోషాల కోసం స్థూల జాతీయ సంతోషం (జీఎన్‌హెచ్‌) మరింత ముఖ్యమని 1970 ప్రాంతంలోనే అప్పటి భూటాన్‌ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌ అభిప్రాయపడ్డారు. భూటాన్‌ స్ఫూర్తితో ప్రజల సుఖ సంతోషాలను తెలుసుకునేందుకు గణాంకాలు సేకరించి, స్థూల జాతీయ సంతోష సూచికను (జీఎన్‌హెచ్‌ ఇండెక్స్‌) రూపకల్పనకు అమెరికన్‌ ఆర్థికవేత్త మెడ్‌ జోన్స్‌ 2005లో నాంది పలికారు. ఇదిలా ఉంటే, భూటాన్‌ బాటలోనే వెనిజులా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వంటి దేశాలు ఇప్పటికే ప్రజల సంతోషం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖలను ప్రారంభించాయి.



హ్యాపీ కెమికల్స్‌

ఆనందానుభూతికి కారణం మెదడులో జరిగే రసాయనిక చర్య అని ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆనందానికి దోహదపడేవి నాలుగు రసాయనాలు. అవి: డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్‌. వీటినే సంక్షిప్తంగా ‘డీఓఎస్‌ఈ–డోస్‌’గా అభివర్ణిస్తారు. సానుకూలమైన ఆలోచన మదిలో మెదలగానే మెదడులో విడుదలయ్యే డోపమైన్‌ ఆనందం కలిగిస్తుంది. నచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు మనసు ఉల్లాసభరితంగా మారడానికి ఆక్సిటోసిన్‌ దోహదపడుతుంది.



 ఇక శుభ్రంగా భోంచేశాక ఆకలి తీరడమే కాదు, ఒకరకమైన భోజనానందంతో మనసంతా నిండిపోతుంది. ఇలాంటి ఆనందానికి కారణం ‘సెరటోనిన్‌’ ప్రభావమే. ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు, లక్ష్య సాధన ప్రయత్నంలో ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది. అలాంటి సమయంలో ఎంతటి కష్టాన్ని అయినా సంతోషంగానే భరిస్తాం. ఆశించిన లక్ష్యాన్ని సాధించాక అంతవరకు పడిన కష్టాన్ని అవలీలగా మరచిపోయి, ఉబ్బితబ్బిబ్బవుతాం. ఇదంతా ‘ఎండార్ఫిన్స్‌’ మాయాజాలం అంటున్నారు శాస్త్రవేత్తలు.

 

ఆర్‌ యూ హ్యాపీ?

మీరు ఎంత సంతోషంగా ఉంటారు?

1.సాధారణంగా ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను

2.సంతోషం కలిగినప్పుడు ఉబ్బితబ్బిబ్బవుతాను. కష్టం కలిగినప్పుడు కుంగిపోతాను.

3.పెద్దగా సంతోషంగా లేను. అలాగని పెద్దగా విచారంగానూ లేను

4.జీవితంలో సంతోషమనేదే లేదు. రోజులో ఎక్కువ సేపు విచారంలోనే ఉంటాను



పైన అడిగిన ప్రశ్నకు మీ సమాధానం...

‘1’ అయితే మీరు 75 శాతానికి మించి సంతోషంగా ఉన్నట్లే లెక్క. మీ మానసిక ఆరోగ్యం అద్భుతం.

‘2’ అయితే మీరు 50 శాతం సంతోషంగా ఉన్నట్లు లెక్క. కష్టాలకు అతిగా కుంగిపోవడం మానుకుంటే మీ ఆనందం రెట్టింపు అవుతుంది.

‘3’ అయితే మీరు మరీ నిర్లిప్తంగా బతికేస్తున్నట్లు లెక్క. చిన్న చిన్న ఆనందాలకు మీరు సానుకూలంగా స్పందించడానికి ప్రయత్నిస్తే మంచిది.

‘4’ అయితే మీరు దుఃఖసాగరంలో ఈదులాడుతున్నట్లు లెక్క. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. దుఃఖం కూడా అందుకు అతీతమైనది కాదు. మీరు ఆశాభావాన్ని పెంచుకుంటే మంచిది.



నిరంతరానందభరితుడు

ప్రపంచంలో నిరంతర ఆనందభరితులు ఎవరైనా ఉన్నారా? ఇదేం ప్రశ్న... అసలే ఇది కల్లోలాల కలికాలం. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యానందంలో మునిగి తేలేవారు ఎవరుంటారని అనుకుంటున్నారా..? ఇంతటి కానికాలంలోనూ నిరంతరం ఆనందసాగరంలో ఓలలాడే మనిషి ఒకడు ఉన్నాడు. ఔను! ప్రపంచంలో అలాంటి మనిషి ఒక్కడే ఉన్నాడు. అతడి పేరు మాథ్యూ రికార్డ్‌. ఫ్రెంచి శాస్త్రవేత్త. మాలిక్యులర్‌ జెనిటిక్స్‌లో పీహెచ్‌డీ చేశాడు. శాస్త్ర సాంకేతిక పరిశోధనలేవీ అతడికి ఆశించిన సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. తన మానసికానందానికి బౌద్ధాన్ని మించినది లేదనుకున్నాడు.



 ఫ్రాన్స్‌ విడిచిపెట్టి హిమాలయాల బాట పట్టాడు. నేపాల్‌లోని షెచెన్‌ టెన్యీ డారై్గలింగ్‌ బౌద్ధారామంలో స్థిరపడ్డాడు. ధ్యానమార్గంలో నిత్యానందాన్ని సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా మతాల్లో ఇలాంటి సాధు సన్యాసులు పెద్దసంఖ్యలోనే ఉంటారు కదా! అలాంటప్పుడు ఇతడొక్కడే నిత్యానందభరితుడని ఎలా చెప్పగలరని అనుకుంటున్నారా? అంతర్జాతీయ నాడీ వైద్య నిపుణులు, మానసిక వైద్య నిపుణులకు కూడా ఇలాంటి సందేహమే వచ్చింది. వారంతా రకరకాలుగా మాథ్యూపై పరీక్షలు నిర్వహించారు. వివిధ సమయాల్లో, వివిధ పరిస్థితుల్లో అతడి మెదడు పనితీరును అధ్యయనం చేశారు. చివరకు ప్రపంచంలో ఇతడొక్కడే నిత్యానందభరితుడని నిర్ధారించారు.



Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top