ఏం కావాలన్నా కోరుకో! 

Funday social media story - Sakshi

సోషల్‌ మీడియా

సోషల్‌ మీడియా. ఈతరానికి ఏం చెప్పుకోవాలన్నా ఒక గొప్ప వేదిక. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌.. ఏదో ఒక యాప్‌ ఓపెన్‌ చెయ్యనిదే చాలామందికి రోజు మొదలవ్వదు. అంతగా అందరి జీవితాల్లోకి వచ్చేసిన సోషల్‌ మీడియా, ‘ఈజిప్టు రివల్యూషన్‌’ మొదలుకొని మొన్న ‘మీటూ’ వరకూ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. ఆ ఉద్యమాలను విజయవంతంగా ముందుకు నడిపించింది. ఇదే సోషల్‌ మీడియాలో ఊసుపోక సరదా కబుర్లు చెప్పుకునే వారూ లేకపోలేదు. అలా ఊసుపోక, వింత కోరికలు కోరిన కొందరు అనూహ్యంగా పాపులర్‌ అయి సెలెబ్రిటీ స్టేటస్‌ను కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి కథలు కొన్ని... 
ఫ్రీ చికెన్‌ నగ్గెట్స్‌! 
‘వెండీస్‌’ అమెరికాలో ఒక పాపులర్‌ ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌. ఇక్కడ చికెన్‌ నగ్గెట్స్‌ కోసం నాన్‌వెజ్‌ అభిమానులు పిచ్చిగా ఎగబడుతుంటారు. కార్టర్‌ విల్కర్సన్‌ అలాంటి వాళ్లలో ఒకడు. చికెన్‌ నగ్గెట్స్‌ అంటే అతడికి ప్రాణం. ఓరోజు ట్విట్టర్‌లో ఊరికనే సరదాగా ‘నాకు ఒక సంవత్సరం పాటు ఫ్రీగా చికెన్‌ నగ్గెట్స్‌ ఇవ్వడానికి ఎన్ని రీట్వీట్స్‌ కావాలి?’ అనడుగుతూ వెండీస్‌ ట్విట్టర్‌ పేజ్‌ను ట్యాగ్‌ చేశాడు. (రీట్వీట్స్‌ అంటే ట్విట్టర్‌లో షేర్‌ చేయడం అని). దీన్ని సరదాగానే తీసుకున్నా, ‘18 మిలియన్‌’ అని రిప్లై ఇచ్చింది వెండీస్‌. ఇంకేం, మనవాడు స్క్రీన్‌షాట్‌ తీసి ‘ఎ మ్యాన్‌ నీడ్స్‌ హిజ్‌ నగ్గెట్స్‌’ అని పోస్ట్‌ చేశాడు. అంతే! వందలు, వేలు, లక్షల్లో రీట్వీట్స్‌ వచ్చాయి. ఈ రోజుకీ ట్విట్టర్‌లో ఇదే మోస్ట్‌ రీట్వీటెడ్‌ పోస్ట్‌. ట్విట్టర్‌ జనం కూడా సరదాగానే తీసుకొని అతనికి రీట్వీట్స్‌ ఇస్తూ పోయారు. ఇక ఏ రోజైతే ఇది ఆల్‌ టైమ్‌ రికార్డుకు చేరుకుందో (ఇప్పుడు ఈ ట్వీట్‌కు 3.6 మిలియన్‌ రీట్వీట్లు) ఆరోజే వెండీస్‌ విల్కర్సన్‌కు నగ్గెట్స్‌ ఫ్రీగా ఇచ్చేసింది. అదేవిధంగా విల్కర్సన్‌ కోరినట్టు ఒక ఫౌండేషన్‌కు 100జు డాలర్లు (సుమారు 69 లక్షల రూపాయలు) డొనేట్‌ చేసింది. విల్కర్సన్‌ ఏదో సరదాకి చేసిన పోస్ట్‌ ట్విట్టర్‌ అతన్నొక సెలెబ్రిటీగా మార్చేసింది. 

కుక్క కావాలి! 
ర్యాన్‌ సెస్స్‌ల్‌మ్యాన్‌కు కుక్కలంటే ప్రాణం. ఇంట్లో అప్పటికే చాలా కుక్కలు ఉన్నాయి. అయినా అతనికి మార్కెట్లో జర్మన్‌ షెపర్డ్‌ నచ్చింది. కావాలనుకున్నాడు. అమ్మకు ఫోన్‌ చేస్తే తిట్టింది. ‘పోనీ ఎన్ని రీట్వీట్లు తెచ్చుకుంటే ఈ జర్మన్‌ షెపర్డ్‌ను కొనిస్తావు?’ అనడిగాడు. ‘1 మిలియన్‌’ అంది అమ్మ, అంత తెచ్చుకోవడం అసాధ్యమని భావించి. ర్యాన్‌ ఇదే విషయం ట్విట్టర్‌లో పెట్టి ‘నాకు ఈ కుక్క కావాలి’ అని అడిగాడు. క్యూట్‌ అనిపించి కొందరు, పిచ్చి అనుకొని కొందరు, సరదాగా కొందరు రీట్వీట్లు కొడుతూనే ఉన్నారు. అది ఈమధ్యే వన్‌ మిలియన్‌ దాటింది. ‘అసాధ్యుడు వీడు’ అనుకుంటూ అమ్మ ఆ కుక్కను కొనిచ్చేసింది. దానికో పేరు కూడా పెట్టుకున్నాడు ర్యాన్, – ‘మిలీ’. మిలీకి ఫ్యాన్స్‌ ఉన్నారిప్పుడు. కొన్ని ఫూడ్‌ కంపెనీలు మిలీ కోసం ప్రత్యేకంగా ఫుడ్‌ ఐటమ్స్‌ కూడా పంపిస్తున్నాయి. 

ఒకే ఒక్క పదం... 
‘లిమోనడ’ (స్పానిష్‌ పదం. నిమ్మ జ్యూస్‌ అని అర్థం) అనే ఒకే ఒక్క పదాన్ని ట్వీట్‌ చేశాడు ఎరుబియస్‌. అతనొక పాపులర్‌ యూట్యూబర్, గేమర్‌. ఆ ఒక్క ట్వీట్‌కు ఇప్పుడు ట్విట్టర్‌లో 1.4 మిలియన్‌ రీట్వీట్లు ఉన్నాయి. ఈ ఒక్క పదానికి ఇన్ని రీట్వీట్లు ఎందుకొచ్చాయంటే, ఎరుబియస్‌ యూట్యూబ్‌లో విడుదల చేసిన ఒక వీడియోలో, ‘నేను ఒక్క పదాన్ని ట్వీట్‌ చేస్తా. దానికి రీట్వీట్‌ చేసిన వాళ్లకు గేమింగ్‌ పాస్‌కోడ్స్‌ నుంచి మొదలుకొని లెక్కలేనన్ని గిఫ్ట్‌లు ఇస్తా. కమాన్‌’ అన్నాడు. ఆ గిఫ్ట్‌ల కోసం, పాస్‌కోడ్స్‌ కోసం గేమింగ్‌ అభిమానులు ఈరోజుకీ ఆ ట్వీట్‌కు రీట్వీట్లు కొడుతూనే ఉన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top