వచ్చినవాడు...

Funday Laughing story  23 dec 2018 - Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

వైట్‌హౌజ్‌లోకి దూసుకుపోబోతున్న ఒక వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది ఆపారు.ఆ వ్యక్తి చాలా  సన్నగా  ఉన్నాడు.సెక్యూరిటీ వాళ్లను కొరకొరమని చూశాడు.‘‘ఎవరు నువ్వు?’’ అని గద్దించారు సెక్యూరిటీ వాళ్లు. ‘‘నన్నే ఎవరని గద్దిస్తావా? ఉద్యోగాలే కాదు మెడ మీద తలకాయలు లేకుండా చేస్తాను’’ అని కోపంతో చిందేశాడు ఆ బక్కపలచటి వ్యక్తి.‘‘ఇంతకీ ఎవరయ్యా నువ్వు?’’ మరోసారి గద్దించారు సెక్యూరిటీ వాళ్లు.‘‘నేనయ్యా... ట్రంపును. నాలుగు రోజులు ఊళ్లో లేకపోయేసరికి కళ్లు హెడ్‌కెక్కాయా!’’ అని తాడి చెట్టంత ఎత్తు లేచాడు ఆ వ్యక్తి.‘‘నువ్వు ట్రంప్‌ ఏమిటి మా బొంద! ఆయన 150 కిలోలతో మహా దిట్టంగా ఉంటారు. నీలా ఉండరు. వెళ్లు...వెళ్లు...’’ అని సిబ్బంది నెట్టేశారు.అయినా అతడు కదలేదు.‘‘న్యాయం జరిగే వరకు కదిలేది లేదు’’ అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు.

‘‘విన్నావు కదా రాజా! ఎవరో అనామకుడు వచ్చి నేనే ట్రంపును అనడం  ఏమిటీ? సెక్యూరిటీ వాళ్లు నెట్టేసినా వెళ్లక పోవడం ఏమిటి? అసలు ఏంజరుగుతోంది?’’ అడిగాడు భేతాళుడు.‘‘వచ్చిన వాడు అనామకుడు కాదు... ట్రంపు!’’ అన్నాడు  విక్రమార్కుడు.‘‘బక్కపలచని వ్యక్తిని పట్టుకొని ట్రంపు అంటావేమిటి? మరొకటి ఏమిటంటే ట్రంపు ఫేస్‌ తెల్లగా నిగనిగలాడుతుంటుంది... ఈయన ఫేసు మాత్రం నల్లగానిగనిగలాడుతోంది. ఇతను ట్రంపు ఎలా అవుతాడు?’’ అయోమయంగా అడిగాడు భేతాళుడు.‘‘బరువు, రంగులు అశాశ్వతమని పెద్దలు చెప్పిన విషయం గుర్తులేదా భేతాళా?’’ గంభీరంగా అన్నాడు విక్రమార్కుడు.‘‘గుర్తుందా లేదా? అనేది  ఇప్పుడు అప్రస్తుతం. అసలు నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు!అసలు ఏంజరిగింది? ఆ రివటలాంటి వ్యక్తి ట్రంప్‌ ఎలా అవుతాడు?’’ బుర్ర గోక్కుంటూ అడిగాడు భేతాళుడు.చెప్పడం మొదలు పెట్టాడు విక్రమార్కుడు:

అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు అనే వార్త ప్రపంచాన్ని కంపింపచేయలేదు.అదేమిటి?!!!!ఎందుకంటే అతను కిడ్నాప్‌ అయిన విషయం ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు అంతరంగికులు. శాంతిభద్రతలు, రాజకీయ సమీకరణల దృష్ట్యా.... ట్రంపు కిడ్నాప్‌ వ్యవహారాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఒంట్లో కాస్త నలతగా ఉండటం వల్ల అజ్ఞాతప్రదేశంలో ట్రంపు  విశ్రాంతి తీసుకుంటున్నారని నమ్మబలికారు.అమెజాన్‌ కీకారణ్యం.ఒక ముండ్ల చెట్టు దగ్గర ట్రంపు కాళ్లుచేతులను తాళ్లతో కట్టేశారు.‘షేకింగ్‌ షాకింగ్‌’ అనే సరికొత్త ఉగ్రవాద సంస్థ అతడిని కిడ్నాప్‌ చేసింది.‘‘ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్‌ చేశారు?’’ కూల్‌గా అడిగాడు ట్రంపు.‘‘ఎందుకు కిడ్నాప్‌ చేశాం అనే దాని మీద మా మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరడం లేదు. అందరం ఒక నిర్ణయానికి వచ్చాక ఎందుకు కిడ్నాప్‌ చేశామనేది చెబుతాం. ఒక గంట ఓపిక పట్టండి’’ అన్నాడు ‘షేకింగ్‌ షాకింగ్‌’ కమాండర్‌ ధడదఢా.‘‘కిడ్నాప్‌ చేసి కారణం కోసం వెదుక్కునే దద్దమ్మల్ని మిమ్మల్నే చూశాను’’ భళ్లున నవ్వాడు ట్రంపు.‘‘మాటలు తిన్నగా రానీయండి’’ హెచ్చరించాడు అసిస్టెంట్‌ కమాండర్‌ గడగడా.... ఏకె97 పైకెత్తి.‘‘తిన్నగానే రానిస్తానుగానీ ముందైతే నా కట్లు విప్పండయ్యా,  ఛస్తున్నాను’’ అసహనంగా అన్నాడు ట్రంపు.‘‘కొంపదీసి పారిపోతావా ఏమిటి?’’ క్వశ్చన్‌ మార్క్‌ ముఖం పెట్టాడు కమాండర్‌ ధడధడా.‘‘నువ్వు పారిపొమ్మని బతిమిలాడినా పారిపోను’’ గంభీరంగా అన్నాడు ట్రంపు.‘‘ఎందుకు?’’ ఆశ్చర్యంగా అడిగాడు అసిస్టెంట్‌ కమాండర్‌ గడగడా.‘‘ఫస్ట్‌ పాయింట్‌... ఈ బరువుతో నేను పరుగెత్తలేను. సెకండ్‌ పాయింట్‌.... పుసుక్కున నేను పరుగెత్తి పారిపోయినా  ఏ  పులినోటికో చిక్కి ఫుల్‌మీల్స్‌ అవుతాను’’ అసలు విషయం చెప్పాడు ట్రంపు.‘‘నిజమే సుమీ’’ అంటూ ట్రంపు కట్లు విప్పాడు కమాండర్‌ ధడధడా.‘‘అబ్బ ఇప్పుడు హాయిగా ఉంది’’ అంటూ ఆనందంలో తేలిపోయి... తన ముందు నిల్చొన్న నైజీరియా ఉగ్రవాదిని చూస్తూ...‘ఈ నల్లని రాయిలో ఏ కన్నులు దాగేనో’ అని పాట అందుకున్నాడు.

రెండు వారాల తరువాత...‘‘ఏమయ్యా గడగడా.... ఇప్పటికైనా మీకు క్లారిటీ వచ్చిందా? నన్ను ఎందుకు కిడ్నాప్‌ చేశారు?’’ మరోసారి ఆసక్తిగా అడిగాడు ట్రంపు.‘‘అదిగో అటు చూడు...’’ అని చూపించాడు అసిస్టెంట్‌ కమాండర్‌ గడగడా.అప్పటివరకు కలిసిమెలిసి ఒకటిగా ఉన్న ఉగ్రవాదులు గట్టిగా వాదులాడుకుంటున్నారు. తొడలు కొడుతున్నారు. మీసాలు తిప్పుతున్నారు.‘‘ఏమైంది?’’ ఆశ్చర్యంగా అడిగాడుట్రంపు.‘‘మీ గురించే. మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్‌ చేశామనేదానిపై పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకరి అభిప్రాయం ఇంకొకరికి నచ్చడం లేదు. కాల్పులకు కూడా సిద్ధపడుతున్నారు.అయ్యో!’’అనిగట్టిగా నిట్టూర్చాడు యువ ఉగ్రవాది బొటాబొటా.మరోవారం తరువాత...‘‘అయ్యా! బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని కిడ్నాప్‌ చేశాం. మీ లెగ్‌ పుణ్యమా అని ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకునే పరిస్థితి వచ్చింది. మేము పదికాలాల పాటు పచ్చగా ఉండాలంటేమీరు ఇక్కడ ఉండవద్దు. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి రిటన్‌ పంపిస్తాం’’ అని అన్న మాట నిలబెట్టుకున్నాడు కమాండర్‌ ధడధడా. ఆకలైనప్పుడల్లా  ఆ అమెజాన్‌ అడవిలో ఆకులు అలములు తినడం వల్ల, చికెన్‌ బర్గర్‌లు లేకపోవడం వల్ల 150 కేజీల ట్రంపు  బక్కచిక్కిపోయాడు. ఎండల్లో తిరగడం వల్ల ముఖం రంగు మారిపోయింది. బక్కచిక్కి రంగుమారిపోవడం వల్ల ట్రంపును సెక్యూరిటీ సిబ్బంది గుర్తుపట్టలేకపోయారు. అదీ విషయం!
– యాకుబ్‌ పాషా 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top