రూల్స్‌ బ్రేక్‌!

Funday Laughing fun story - Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

అప్పుడే ప్రెస్‌మీట్‌కి వచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మని చూసి ప్రెస్‌ వాళ్లు అదిరిపడ్డారు.దీనికి కారణం... అతని వేషం.టెర్రరిస్ట్‌ వేషం!వినకపోయినా సరే, రామ్‌ గోపాల్‌ వర్మ పాటలు పాడతాడని తెలుసు... వేషాలు కూడా వేస్తున్నాడా? అనేదే కదా మీ డౌటు? మీలాగే జర్నలిస్టులకూ డౌటొచ్చి...‘‘ఏమండీ ఏ సినిమాలోనిది ఈ వేషం?’’ అడిగారు.‘‘వేషాలు వేసుకునే ఖర్మ నాకేం పట్టింది? యూ నో... ఐయామ్‌ ఎ డైరెక్టర్‌. యూ నో... యాన్‌ యాక్టర్‌ ఈజ్‌ జస్ట్‌ ఎ పార్ట్‌ ఆఫ్‌ ఎ మూవీ, బట్‌ డైరెక్టర్‌... హీ ఈజ్‌ ది మూవీ... మరలాంటప్పుడు నేను వేషాలెందుకు వేస్తాను. వేస్తేగీస్తే తెరవెనక వేస్తాను’’ అన్నాడు వర్మ.‘‘సినిమా కోసం కాకుండా మరి ఈ టెర్రరిస్ట్‌ వేషం ఎందుకు వేసినట్లు?’’ అడిగాడు ఒక జర్నలిస్ట్‌.‘‘గుడ్‌ క్వశ్చన్‌. నెక్స్‌›్ట...’’ అన్నాడు వర్మ.‘‘ముందు ఈ కొచ్చన్‌కు ఆన్సర్‌ చెప్పండి!’’ విసుక్కున్నాడు సీనియర్‌ జర్నలిస్ట్‌.‘‘ఓకే! చెబుతాను. నన్ను అందరూ ప్రేమగా సెల్యులాయిడ్‌ టెర్రరిస్ట్‌ అంటుంటారు కదా. అందుకే ఈ వేషంలో వచ్చాను. ఎలా ఉంది! బాగుండక చస్తుందా! తప్పకుండా బాగుంటుంది. ఒకవేళ బాగోలేదని ఎవరైనా అనుకున్నా... వాళ్లు అనుకున్నారని నేనేమీ అనుకోను. నేనేమీ అనుకోలేదు కదా అని మీరేమి అనుకున్నా... అదేం ఖర్మ అని నేను అనుకుంటే నేను వర్మను ఎలా అవుతాను. యూ నో... ఎవరేం అనుకున్నా అనుకోకపోయినా... అన్నదానికి విన్నదానికి మధ్య యూ నో... వేవ్‌ లెంత్‌ ఈజ్‌ ది స్ట్రాంగ్‌ స్ట్రెంత్‌ ఆఫ్‌...’’‘‘అయ్యా.... ఆపండయ్యా... మొన్న రోజంతా మోషన్స్‌ అయినప్పుడు కూడా ఇంత బాధ పడలేదయ్యా... మనసును గుండుసూదితో నైపుణ్యంగా చెక్కేస్తున్నారు కదయ్యా... ఆపండయ్యా...’’ ఒక జర్నలిస్టు కడుపు బాదుకుంటూ ఏడుపు అందుకున్నాడు.

ఈ దెబ్బతో వర్మ ప్రసంగానికి మధ్యలోనే బ్రేక్‌ పడింది.‘‘అయ్యా! ఈరోజు మీరు సడన్‌గా ప్రెస్‌మీట్‌ ఎందుకు పెట్టారో చెప్పనేలేదు’’ అన్నాడు ఒక జర్నలిస్టు.‘‘గుడ్‌ క్వశ్చన్‌. నన్నందరూ సెల్యులాయిడ్‌ టెర్రరిస్ట్‌ అంటుంటారు కదా! నాలాంటి ఎంతో మంది చేయి తిరిగిన, కాలు తిరిగిన, బ్రెయిన్‌ తిరిగిన టెర్రరిస్ట్‌లను ఇండస్ట్రీకి అందించాలనేది నా కల. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను’’ఆనందోద్వేగంతో చెప్పాడు వర్మ.‘‘అంటే ఇండస్ట్రీలోకి రావాలనుకునేవాళ్లు మీలాగే టెర్రరిస్ట్‌ వేషం వేసుకోవాలన్నమాట’’ అని ఆవులిస్తూ కామెంట్‌ చేశాడు ఒక జర్నలిస్టు.‘‘ఇక్కడ ఇష్యూ వేషం గురించో రోషం గురించో కాదు... ట్రెడీషినల్లీ గేట్‌ ఈజ్‌ ది విండో ఆన్‌ ది కెమెరా బాడీ వేర్‌ లైట్‌ ఫ్రమ్‌ ది లెన్స్‌ ప్రాసెస్‌ త్రో టు ఎక్స్‌పోజ్‌ ది ఫిల్మ్‌... చెప్పొచ్చేదేమిటంటే... ఎవరు చేశారనేది ఇంపార్టెంట్‌ కాదు... ఎలా చేశామనేదే ఇంపార్టెంట్‌... ఎలా చేశామనేదానికంటే... ఎవరు చేయించారు అనేది మరింత ఇంపార్టెంట్‌...’’‘‘అయ్యా... అయ్యా...’’ మరోసారి కడుపు పట్టుకొని ఏడ్చాడు ఆ జర్నలిస్టు.‘‘అయ్యా... ఇంతకీ మీరు ఏం చేయబోతు...’’ అని ఒక కుర్ర జర్నలిస్టు సగం ప్రశ్న అడిగాడో లేదో మైక్‌ సవరించాడు వర్మ... ‘‘ఆర్జీవి అన్‌స్కూల్‌ పేరుతో నేనొక యాక్టింగ్‌ స్కూల్‌ స్టార్ట్‌ చేస్తున్నాను. యాక్టింగ్‌ స్కూలే అయినప్పటికీ డైరక్షన్‌కే ఇంపార్టెన్స్‌ ఇస్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి జిల్లా నుంచి ప్రతి ఊరి నుంచి నాలాంటి సెల్యులాయిడ్‌ టెర్రరిస్ట్‌లు పుట్టుకురావాలన్న నా కోరికను  ఈ అన్‌స్కూల్‌  నెరవేర్చబోతుంది’’ ఆనందంగా అన్నాడు వర్మ.

 ఒక నెల తరువాత. ఆర్జీవి స్కూల్‌ ఫస్ట్‌ బ్యాచ్‌ క్లాసులు మొదలయ్యాయి.‘యాయిరే యాయిరే జోర్‌ లగాకే నాచెరే’.... ‘రంగీలా’ సినిమాలోని ఈ పాట ఆర్జీవి స్కూల్‌ విద్యార్థులకు ప్రార్థన గీతం.పాట పూర్తయిన తరువాత విద్యార్థులు క్లాసురూమ్‌లోకి వచ్చారు.‘‘ఆ... మీ పేర్లు చెప్పి మిమ్మల్ని మీరు పరిచయం చేస్కోండి’’ ఆప్యాయంగా  ఆదేశించాడు వర్మ.ఒకొక్కరు లేచి తమ పేర్లు చెప్పడం మొదలుపెట్టారు.‘నా పేరు శ్యామ్‌గోపాల్‌ కర్మ’, ‘నా పేరు జామ్‌గోపాల్‌ బర్మా’, ‘నా పేరు మామ్‌గోపాల్‌ సుర్మా’‘‘ఏం తమాషాగా ఉందా? నేను అడిగింది మీ పేర్లు’’ గద్దించాడు వర్మ.‘‘మీ మైండ్‌లోని స్ట్రెంత్‌ మా మైండ్‌లోకి రావడానికి మీ పేరు ధ్వనించేలా మేము కొత్త పేర్లు పెట్టుకున్నాం సార్‌. దీవించండి’’ అన్నాడు ఒక స్టూడెంట్‌ సిగ్గుతో మెలికలు తిరుగుతూ.‘‘మీ చావుతెలివితేటలను షట్‌డౌన్‌ చేసి కొత్తగా ఆలోచించండి’’ అని తిట్టి ఇలా అన్నాడు వర్మ... ‘‘డియర్‌ స్టూడెంట్స్‌... మీకో కెమెరా ఇస్తాను. కెమెరా మాత్రమే నాది. స్టోరీ, స్క్రీన్‌ప్లే, పాటలు, మాటలు... అన్నీ మీవే’’‘‘అలాగే సార్‌’’ అని శిష్యులు ఆనందంగా అరిచారు.నెలరోజులు తిరగకుండానే సినిమా షూటింగ్‌ పూర్తయింది.సినిమా పేరు ‘రూల్స్‌ బ్రేక్‌’.వర్మ ఆశించినట్లే  ఈ సినిమా సకల రూల్స్‌ను బ్రేక్‌ చేసింది. ఈ సినిమాలో ఒక హీరో ఉంటాడు.మూమాలుగానైతే... హీరో హీరోయిన్‌ను  ప్రేమిస్తాడు. ఈ సినిమాలో మాత్రం హీరో... విలన్‌ని ప్రేమిస్తాడు. మామూలుగానైతే... విలన్‌ అనేవాడు హీరో హీరోయిన్‌లను విడదీయడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటాడు. ఈ సినిమాలో మాత్రం... హీరో హీరోయిన్‌ల పెళ్లి ఘనంగా జరగాలని ముక్కోటి దేవతలకు  మొక్కుకుంటాడు. ఎన్నో వ్రతాలు సీరియస్‌గా చేస్తుంటాడు. పాటలు వచ్చే సీన్‌లలో పాటలు కాకుండా మేకబలి దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో!ఎట్టకేలకు సినిమా విడుదలైంది. ఈ సినిమా వల్ల రూల్స్‌ బ్రేక్‌ కావడం మాట ఎలా ఉన్నా... సినిమా హాళ్ల అద్దాలు మాత్రం నామరూపాలు లేకుండా బ్రేకయ్యాయి!
– యాకుబ్‌ పాషా 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top