ఇది వస్తే ప్రమాదమా?

funday health counciling - Sakshi

సందేహం

మా బంధువుల్లో ఓ అమ్మాయికి ‘జస్టేషనల్‌ డయాబెటిస్‌’ వచ్చిందని విన్నాను. సాధారణ డయాబెటిస్‌కు, దీనికి తేడా ఏమిటి? ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్లకు ఇది వస్తే ప్రమాదమా?
– డీయస్, కావలి

సాధారణ డయాబెటిస్‌ అంటే మధుమేహ వ్యాధి. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. ముందు నుంచి డయాబెటిస్‌ లేనప్పుడు, గర్భం దాల్చిన తర్వాత డయాబెటిస్‌ అని నిర్ధారణ అవ్వడాన్ని జస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. ఇది సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల, అధిక బరువు, జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు. ఇది సాధారణంగా ఆరో నెల తర్వాత మొదలవుతుంది. కొంతమందికి ముందుగా కూడా మొదలు కావచ్చు. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ను గుర్తించి సక్రమంగా చికిత్స తీసుకుంటూ షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుకుంటే, గర్భిణీ సమయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. దీనిని గుర్తించలేకపోవడం లేదా గుర్తించినా సరిగా చికిత్స తీసుకోకుండా, ఆహార నియమాలు పాటించకుండా, షుగర్‌ పరీక్షలు క్రమంగా చేయించుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు (ఇవి డయాబెటిస్‌ ముందు నుంచే ఉంటే), ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం, దాని ద్వారా కాన్పు సమయంలో ఇబ్బందులు, ఉమ్మనీరు పడిపోయి నెలలు నిండకుండా కాన్పులు, కడుపులో బిడ్డ చనిపోవడం, తల్లికి పొట్ట పెద్దగా పెరిగేకొద్దీ ఆయాసం, బీపీ పెరగడం వంటి ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాక్సినేషన్‌ వల్ల పుట్టబోయే శిశువులపై ప్రతికూల ప్రభావం ఏమైనా ఉంటుందా?
– సత్య, రాజమండ్రి

మీరు ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాక్సినేషన్‌ అన్నారు కానీ, ఏ వ్యాక్సిన్‌ అని వివరించి రాసి ఉంటే బాగుండేది. సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒక నెల వ్యవధిలో రెండు డోస్‌ల టీటీ వ్యాక్సిన్‌ ఇస్తారు. ఇది కాన్పు సమయంలో తల్లికీ బిడ్డకీ ధనుర్వాత వ్యాధి రాకుండా కాపాడుతుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందీ రాదు. ఇప్పుడు కొత్తగా రెండో డోస్‌ టీటీకి బదులుగా ఏడో నెలలో ఇవ్వడానికి టీడాప్‌ అనే వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది ధనుర్వాతంతో పాటు డిఫ్తీరియా, కోరింత దగ్గు వంటి అంటు వ్యాధుల నుంచి తల్లిని, బిడ్డని దూరంగా ఉంచుతుంది. అలాగే ఫ్లూ వ్యాధి నుంచి ఇబ్బంది పడకుండా ఉండటానికి నాలుగో నెల నుంచి ఎప్పుడైనా ఫస్ట్‌ డోస్‌ ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. పైన చెప్పిన వ్యాక్సిన్స్‌ వల్ల ప్రెగ్నెన్సీలో దాదాపుగా బిడ్డపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. కాకపోతే అఛ్టిజీఠ్చ్టి్ఛఛీ, వ్యాక్సిన్స్‌ను ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోకూడదు. వీటి వల్ల శిశువుపై దుష్ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయి. ఏ వ్యాక్సిన్‌ కూడా డాక్టర్‌ను సంప్రదించకుండా తీసుకోకూడదు.

ovarian rejuvenation అని ఎక్కడో చదివాను. దాని గురించి వివరంగా తెలియజేయగలరు.
– మాలిని, జహీరాబాద్‌

ఆడవారికి ఉండే అండాశయాల్లో అండాలు, తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారిలో తయారవుతాయి. ఇవి తర్వాత మళ్లీమళ్లీ తయారు కావు. అమ్మాయి పుట్టినప్పుడు, బిడ్డలో ఇరవై లక్షల అండాలు ఉంటాయి. రజస్వల అయ్యే సమయానికి కొన్ని అండాలు నశించిపోయి కేవలం మూడు, నాలుగు లక్షలు మాత్రమే మిగులుతాయి. వీటిలో నెలకి ఒకటి, రెండు చొప్పున విడుదల అవుతూ ఉండి, మిగతావి పీరియడ్స్‌ ఆగిపోయే సమయానికి చాలావరకు నశించిపోతాయి. ఒక స్త్రీ జీవితకాలంలో దాదాపు 400 అండాల వరకు విడుదల అవుతాయి. 20–25 ఏళ్ల సమయంలో అండాలు ఎక్కువగా ఉంటాయి. 35 ఏళ్లు దాటితే ఆ అండాలు తొందరతొందరగా నశించిపోతాయి. తద్వారా పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలుగుతుంది. కొందరిలో పీరియడ్స్‌ తొందరగా ఆగిపోతాయి. ఇలాంటి వారికి పిల్లలు కలగడానికి, చాలావరకు దాత నుంచి  అండాలను తీసుకొని, గర్భం కోసం ప్రయత్నం చేయవలసి వస్తుంది. తమ అండాల ద్వారానే పిల్లలను కనడం కంటే, తమ జీన్స్‌ అందుతాయనే ఆశతో ఉన్నవారు దాతల నుంచి అండాలను తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసమే కొత్తగా ovarian rejuvenation అనే ప్రక్రియ మీద అనేక దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా ఇవి ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. వీటిని వాడటానికి అనుమతులు లేవు. ఈ ప్రక్రియలో అండాలు తగ్గిపోయిన వారికి, పీరియడ్స్‌ త్వరగా ఆగిపోయిన వారికి, వారి అండాశయాల్లో అండాల పెరుగుదలను ప్రేరేపించడానికి వారి రక్తంలోని తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లను వేరుపరిచి, వాటిని అండాశయంలోకి ఇంజెక్షన్‌ ద్వారా పంపించడం జరుగుతుంది. వీటివల్ల అండాశయాల్లో అండాలు ప్రేరేపణ చెంది, పెరిగే అవకాశాలు ఉంటాయన్న ఆశతో ఈ ప్రక్రియను చేయడం జరుగుతుంది. అలా పెరిగిన అండాలను బయటకు తీసి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ద్వారా గర్భం దాల్చడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ ఫలించి, దాన్ని అవసరమైన వారికి వాడటానికి అనుమతి దొరికే వరకు వేచి చూడవలసి ఉంటుంది.
డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ హైదరాబాద్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top