స్వామి ట్రంపానంద!

funday fun:special on trump - Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

వాషింగ్టన్‌లోని వైట్‌హౌజ్‌లో ప్రెసిడెంట్‌ చాంబర్‌. అప్పుడే ఫోన్‌ మోగింది.‘‘సార్‌... నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌జోంగ్‌  లైన్లో ఉన్నాడు’’ అని కేకేశాడు ప్రెసిడెంట్‌ పిఏ.‘వీడికి నాతో ఏం పని?!’’ అనుకొని భయంభయంగానే ఫోన్‌ ఎత్తి ‘హలో’ అన్నాడు ట్రంప్‌.‘‘నేను హలోని కాదు... జోంగ్‌ని  మాట్లాడుతున్నాను’’ బదులిచ్చాడు జోంగ్‌.‘వీడు తిక్కనాయాల అని మరోసారి నిరూపించుకున్నాడు’ అని మనసులోనే తిట్టుకుంటూ...‘‘చెప్పు అబ్బాయ్‌! చాలా రోజులైంది నీతో మాట్లాడక. ఎలా ఉన్నావు? మీ ఆవిడ ఎలా ఉంది?’’ ఇలా నాన్‌స్టాప్‌గా కుశలప్రశ్నలు వేస్తూ పోతున్నాడు ట్రంప్‌.‘‘నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ఒక్క కిలో కూడా తగ్గలేదు. మా ఆవిడ ఎలా ఉందో అలాగే ఉంది.

ఒక్క కిలో కూడా పెరగలేదు’’ అని సమాధానం చెప్పి నిదానంగా ఏడ్వడం మొదలుపెట్టాడు జోంగ్‌.ట్రంపుకు దిమ్మ తిరిగింది.‘‘ఏమిటి నువ్వేనా ఏడ్చేది? నువ్వేనా?’’ అని రెట్టించి అడిగాడు ట్రంప్‌.‘‘ఏం నేను మనిషిని కాదా! నాకు కళ్లు లేవా? ఆ కళ్లలో నీళ్లు లేవా!’’ బొంగురు పోయిన గొంతుతో భోరుమన్నాడు జోంగ్‌.‘‘ఆ దక్షిణ కొరియా వాడు మీ దేశం మీద బాంబులు వేస్తానని ఏమైనా బెదిరించాడా? నేను వాడితో మాట్లాడి ఝలక్‌ ఇస్తాను లే.

నువ్వేం బాధ పడకు’’ ఓదార్చే ప్రయత్నం చేశాడు ట్రంప్‌.‘‘ఎవడి పేరు చెబితే...బాంబులు భయపడి తుస్సుమంటాయో...వాడే జోంగు. నేను బాంబులకు భయపడటం ఏమిటి నాన్సెన్స్‌! న్యూసెన్స్‌! కామన్‌సెన్స్‌! సివిల్‌సెన్స్‌’’ అని మళ్లీ ఏడ్వడం మొదలు పెట్టాడు జోంగ్‌.‘‘ఒరేయ్‌...నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పి చావరా బాబు....అమెరికా ప్రెసిడెంట్‌ ఎలక్షన్‌ రిజల్ట్‌ టైమ్‌లో కూడా ఇంత టెన్షన్‌ పడలేదు’’ అన్నాడు ట్రంప్‌.

‘‘ఏంలేదు బాబాయ్‌! నీకు తెలుసు కదా నాకు చుట్టలు తాగే అలవాటు ఉంది. అయితే ఈమధ్య మరీ ఎక్కువ తాగడం వల్ల విపరీతంగా దగ్గు మొదలైంది. సరే... నా దగ్గు నా ఇష్టం అనుకున్నాను. కాని బయట చాలా ప్రాబ్లం అయింది. ఒకరోజు మిలటరీ ఆఫీసర్ల మీటింగ్‌లో పెద్దగా దగ్గు వచ్చింది. నా దగ్గు ధాటికి ఒక ఆఫీసర్‌ అక్కడికక్కడే చచ్చిపోయాడు. మరోరోజు కారులో వెళుతుంటే దగ్గొచ్చింది. నా దగ్గు దెబ్బకు నా కారుతో పాటు కాన్వాయ్‌లో ఉన్న కార్లటైర్లన్నీ పంక్చరయ్యాయి. మరో రోజు ఎక్కడో దగ్గితే... పాతబిల్డింగ్‌ ఒకటి కుప్పకూలిపోయింది.... ఇది చూసి మా ఆవిడ, మన దేశం నాశనం కావడానికి  దక్షిణ కొరియా అక్కర్లేదు. మీ దగ్గు చాలు... అని  ఇజ్జత్‌ తీసింది’’ అని మళ్లీ ఏడ్వడం మొదలు పెట్టాడు జోంగ్‌.‘‘జోంగ్‌ అంటే సాక్షాత్తు కింగు.

కింగ్‌ ఎక్కడైనా చిన్నపిల్లాడిలా ఏడుస్తాడా! డాక్టర్‌ దగ్గరికి వెళ్లు... దగ్గు తగ్గిపోతుంది’’ అని సలహా ఇచ్చాడు ట్రంప్‌.‘‘నీ బోడి సలహా కోసం ఫోన్‌ చేయలేదు. అసలు నేను ఎందుకు ఫోన్‌ చేశానంటే...’’ అని మళ్లీ ఏడుపు అందుకున్నాడు జోంగ్‌.‘‘ఆ... ఎందుకు చేశావు?!’’ అని అత్యంత ఆసక్తిగా చెవులు, నోరు పెద్దవి చేసి అడిగాడు ట్రంప్‌.‘‘నా భార్య సలహా ప్రకారం దగ్గు బారి నుంచి బయట పడటానికి డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను. మీరు చుట్టలు కాల్చడం మానేయకపోతే ఆ సృష్టికర్త కూడా మీ దగ్గును నయం చేయలేడు. ఒక్కసారిగా ఈ అలవాటు మానడం కష్టం కాబట్టి డైవర్ట్‌ కోసం కొత్తగా ఏదైనా అలవాటు చేసుకోండి.

సంగీతం వినడం కావచ్చు...పుస్తకాలు చదవడం కావచ్చు అని చెప్పాడు. నేను రెండో దాన్ని ఎంచుకొని పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ‘ధూమపానంతో దుష్ఫలితాలు’తో పుస్తక పఠనం మొదలుపెట్టాను. అలా ఎన్నో పుస్తకాలు చదివాను. అయితే... ప్రపంచ శాంతి గురించి పది ఫేమస్‌ పుస్తకాలు చదివిన తరువాత... నాలో పశ్చాత్తాపం మొదలైంది. ప్రపంచమంతా ఒక్కటై ‘అణ్వాయుధాలు వద్దురా బాబూ’ అని మొత్తుకున్నా నేను పట్టించుకోలేదు. నన్ను మించిన నర హంతకుడు ఎవరు లేరు అనే బావనతో ఆత్మశాంతి కోల్పోయాను. అప్పటి నుంచి  ఏడుస్తూనే ఉన్నాను. అలా  వైర్యాగ్యంలోకి వెళ్లాను.

రేపు సన్యాసం స్వీకరించి హిమాలయాలకు వెళుతున్నాను. అది చెప్పడానికే ఫోన్‌ చేశాను.‘య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్‌ఉ భౌ తో న విజానీతో నాయం హన్తి న హన్యతే’ అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు జోంగ్‌.‘‘అంటే ఏమిటి?’’ అడిగాడు ట్రంప్‌. ‘‘ఏదో ఫ్లోలో అన్నానేగానీ నాకు కూడా తెలియదు. ఒక్క నిమిషం లైన్లో ఉండు చెబుతాను’’ అని భగవద్గీతను చేతిలో తీసుకుంటూ ఇలా చెప్పాడు జోంగ్‌...‘జీవుడు చంపువాడని తలచువాడు....చంపబడువాడని తలచువాడుఇరువురు అజ్ఞానులే....ఎందుకంటే ఆత్మ చంపదు మరియు చంపబడదు’

జోంగ్‌తో మాట్లాడిన తరువాత ట్రంప్‌ను అణువణువు వైరాగ్యం ఆవహించింది.‘‘ఛీ! మానవజన్మ! తుచ్చమైన జన్మ. తెలిసో తెలియకో నేను కూడా ఎన్నో తప్పులు చేశాను. నా పాపాలు నాశనమైపోవాలంటే మోక్షసాధన ఒక్కటే మార్గం. మోక్షంతోనే ఈ జన్మకు సార్థకత దొరుకుతుంది. జోంగ్‌ నాకు వెలుగు దారి చూపాడు. ఆత్మశాంతి కోసం నేను కూడా సన్యాసం స్వీకరిస్తున్నాను’’ అని ప్రెసిడెంట్‌ పదవికి రిజైన్‌ చేసి మరుసటి రోజు కాషాయ దుస్తులు ధరించి హిమాలయాలకు వెళ్లాడు ట్రంప్‌.‘హిమాలయాల్లో కొలనుకొండ అనే ప్లేస్‌ ఉంది. దానికి దగ్గరలో ఒక గుహ ఉంది. అందులో కూర్చొని నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను’ అని జోంగ్‌  చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆ గుహ దగ్గరికి వెళ్లి ‘జోంగు స్వామి! ఓ జోంగ్‌ స్వామి’’ అని అరిచాడు ట్రంప్‌.

ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. ఇక లాభం లేదనుకొని గుహలోనికి వెళ్లాడు. గుహ గోడలపై వైట్‌ పెయింట్‌తో రాసిన పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి...‘డియర్‌ ట్రంప్‌...నీకు నాకంటే తిక్క ఎక్కువని తెలుసు. నీకు నా కంటే తెలివి తక్కువ అని తెలుసు. నువ్వు ఇక్కడికి వస్తావని కూడా తెలుసు. నేను సన్యాసం స్వీకరిస్తున్నాను...అని నేను నీకు ఏరోజు చెప్పానో గుర్తు తెచ్చుకో....గుర్తొచ్చింది కదా...ఏప్రిల్‌ 1. నీ చెవిలో ఏప్రిల్‌పూలు  పెట్టినందుకు గర్విస్తున్నాను...ఇట్లు నీ జోంగ్‌’ఇది చదివి హిమాలయాలు దద్దరిల్లేలా ‘మోసం దగా కుట్ర’ అని గట్టిగా ఏడుపందుకున్నాడు ట్రంప్‌.
– యాకుబ్‌ పాషా 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top