నేరం దాగ‌దు!

Funday crime story 24-03-2019 - Sakshi

క్రైమ్‌ స్టోరీ

‘బాస్‌ని చంపేయాలి!’ – అనుకున్నాడు షమీర్‌ కసిగా. అతను అలా అనుకోవడం అది నూరవసారి.    అతని బాస్‌ తిరుపతిరావు. ‘క్రెడిబుల్‌ కన్‌స్ట్రక్షన్స్‌’ కంపెనీ యజమాని. షమీర్‌ అతని పర్సనల్‌ సెక్రెటరీ. అది మూడు రోజుల కిందటి మాట. ఇప్పుడు షమీర్‌ నిరుద్యోగి. రేదర్, స్యాక్డ్‌ ఎంప్లాయీ.షమీర్‌కి ముప్పయ్యేళ్లుంటాయి. ఆరడుగుల పొడవు. ఫెయిర్‌గా, హ్యాండ్సమ్‌గా ఉంటాడు. మూడు రోజుల కిందట తిరుపతిరావు షమీర్‌ని తన ఛాంబర్‌కి పిలిపించి, ‘‘యూ ఆర్‌ ఫైర్డ్‌!’’ అన్నాడు కూల్‌గా. షమీర్‌ ఏదో చెప్పబోతే, ‘‘గెటౌట్‌!’’ అని అరిచాడు. ఆల్సేషియన్‌ డాగ్‌ అరచినట్టనిపించింది షమీర్‌కి. బాస్‌అరుపులు షమీర్‌ బుర్రలో ఇంకా గింగుర్లెత్తుతున్నాయి. మనసు కుతకుతలాడిపోతోంది.ఐదేళ్ళుగా తన వద్ద నమ్మకంగా, సమర్థంగా పనిచేస్తున్న సెక్రెటరీని తిరుపతిరావు హఠాత్తుగా డిస్మిస్‌ చేసేయడానికి కారణం లేకపోలేదు. తన భార్య సారికతో షమీర్‌కి ఉన్న రహస్య సంబంధం గురించి అతనికి తెలిసిపోయింది.తిరుపతిరావుకు యాభయ్యేళ్ళుంటాయి. ఏడాది కిందట భార్య క్యాన్సర్‌తో మరణించింది. ఆరు నెలలు తిరక్కుండానే సారికను పెళ్ళిచేసుకున్నాడు. సారిక ఓ పేద రైతుకుటుంబానికి చెందినది. పాతికేళ్లుంటాయి. అద్వితీయమైన అందం. కట్నాల రేసులో వెనుకబడిపోయిన ఆమెతల్లిదండ్రులు పాతికేళ్లు వచ్చినా కూతురికి పెళ్లి చేయలేకపోయినందుకు బెంగపెట్టుకున్నారు. ఏదో ప్రాజెక్ట్‌ వర్క్‌ మీద ఆ గ్రామానికి వెళ్ళిన తిరుపతిరావు కంటపడింది సారిక. ఆమె అందం ఆకట్టుకోవడంతో వెంటనే ఆమె గురించి ఆరా తీయించాడు. ఆమెను వివాహం చేసుకుంటానంటూ మధ్యవర్తుల ద్వారా కబురు పంపాడు.  వయసుల తేడా, రెండవ పెళ్లివాడు అన్న అంశాలు మనసును తొలిచినా తిరుపతిరావు కోట్లకు అధిపతి, పెద్ద కంపెనీకి యజమాని,  కూతురు ఐశ్వర్యంతో తులతూగుతుందన్న ఒకే ఒక ఆలోచన సారిక తల్లిదండ్రులను ఆ సంబంధానికి అంగీకరించేలా చేసింది. సారిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. కన్నవారి బాధ, భారం ఆమె ఎరుగును. తిరుపతిరావు, సారికల వివాహం ఘనంగా జరిగిపోయింది. 

ఉద్యోగరీత్యా తరచు సీఎండీ నివాసానికి వెళ్లి వస్తూంటాడు షమీర్‌. సారిక అందం అతన్ని ఫ్లాట్‌ చేసేసింది. చూసిన ప్రతిసారీ కొత్తగా అనిపించేది. మదిలో ఏదో అయిపోతున్నట్టుండేది.  షమీర్‌ చూపుల తూపులు శరీరానికి తీయని తూట్లుపెడుతూంటే, సారిక మది రాయి విసరబడ్డ తటాకమే అయ్యేది. తనకు తెలియకుండానే మేను పులకింతకు గురయ్యేది. ఎంత అదుపు చేసుకుందామన్నామనసు మాట వినడంలేదు. తన ప్రమేయం లేకుండానే షమీర్‌ వలపు గేలానికి చేపపిల్లలా తగులుకుంది ఆమె. కొద్దిరోజులలోనే వారి నడుమ అనుబంధం నెలకొనడమే కాకుండా, ఓ బలహీన క్షణంలో ‘బంధం’ కూడా ఏర్పడిపోయింది. చాటుమాటు వ్యవహారాలకు తెరలేచింది. తాను చేస్తున్నది తప్పని మదిఅప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూంటే, ధనగర్వంతో కూతురి వయసున్న దాన్ని భార్యగాచేసుకున్నతిరుపతిరావుది అంతకంటే పెద్దతప్పు అంటూ మనసును జోకొట్టేది సారిక.ఓసారి తిరుపతిరావు బిజినెస్‌ పనిమీద టూర్‌ వెళ్ళాడు. తిరిగి రావడానికి నాలుగు రోజులు పడుతుంది.. .బాస్‌అటు వెళ్ళగానే, షమీర్‌ ఇటు ఆఫీసుకు డుమ్మా కొట్టేశాడు. సారిక ఏదో కారణం చెప్పి అడక్కుండానే నౌకర్లకు ఆ నాలుగు రోజులూ సెలవు ఇచ్చేసింది.   నగరం శివార్లలో ఉన్న ఓ స్టార్‌ హోటల్లో సూట్‌బుక్‌ చేశాడు షమీర్‌. ఆ హోటల్‌ గదిలో మనసులు కలబోసుకుని, శరీరాలు పెనవేసుకుని స్వర్గధామపు ద్వారాలు తెరిచింది ఆ యువజంట... గది బయట ‘డోంట్‌ డిస్టర్బ్‌’ బోర్డ్‌ ను పెట్టుకుని రెండురోజులుగా బాహ్యప్రపంచానికి ‘బై బై’ చెప్పేశారు. మూడవ రోజున డోర్‌ బెల్‌ మ్రోగడంతో ప్రేమమైకం నుంచి ఊడిపడ్డారు వాళ్ళు. బెల్‌ బాయ్‌ అయ్యుంటాడని, ఒంటిపైన నిక్కర్‌ తప్ప మరేఆచ్ఛాదనాలేకుండానే వెళ్లి తలుపు తెరిచాడు షమీర్‌. గుమ్మంలో ప్రత్యక్షమైన బాస్‌ని చూసి కొయ్యబారిపోయాడు!‘‘వచ్చింది ఎవరు, డియర్‌?’’ అంటూ బెడ్‌ మీంచే అడిగింది సారిక.తిరుపతిరావు చూసిన చూపుకే గాని శక్తి ఉంటే, షమీర్‌ నిలువునా దహించుకుపోయేవాడే!తిరుపతిరావు లోపలికి రాలేదు. గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.అనంతరం అతను షమీర్‌ ని ఉద్యోగంలోంచి పీకేయడం జరిగిపోయింది.

అయితే, తిరుపతిరావు భార్యను పల్లెత్తుమాట అనకపోవడం విశేషం! ఎంత జాగ్రత్త వహించినా తమ వ్యవహారం తిరుపతిరావుకు ఎలా తెలిసిపోయిందా అని ఆలోచిస్తూంటే షమీర్‌ అనుమానపు ముల్లు మేరీ వైపు మొగ్గింది. మేరీ ఎవరో కాదు – షమీర్‌ ఒకప్పటి ‘లివ్‌–ఇన్‌’ పార్ట్‌నర్‌!మేరీకి ఇరవయ్‌ ఎనిమిదేళ్ళు ఉంటాయి. చామనఛాయలో, సోగకళ్ళతో, కొంచెం బొద్దుగా ఉన్నా ఆకర్షణీయంగా ఉంటుంది. ఓ ప్రైవేట్‌ కంపెనీలో పర్సనల్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఓ మల్టీప్లెక్స్‌లో షమీర్‌తోపరిచయమయింది ఆమెకు. మేరీకి ఐదేళ్ళ క్రితమే పెళ్ళయింది. భర్త ఈవెంట్‌ మేనేజర్‌. అతని అసిస్టెంట్‌ ఓ అందమైన యువతి. మేరీఅనుమానపు పక్షి. లేడీ అసిస్టెంటును తీసేసి మగవాళ్ళను పెట్టుకోమని తరచూ భర్తతో గొడవపడేది. అతను ఎంతగా నచ్చజెప్పబోయినా వినిపించుకునేది కాదు. చివరకు రెండేళ్ళ క్రితం భర్తకు విడాకులుఇచ్చేసి, వర్కింగ్‌ విమెన్స్‌ హాస్టల్‌కి మూవ్‌ అయిపోయింది. షమీర్‌ ఫ్రీ బర్డ్‌. వివాహబంధంతో ఎవరితోనో ముడిపడడం అతనికి ఇష్టం ఉండదు. అందుకే పెళ్ళి చేసుకోలేదు. మేరీ, షమీర్‌ల పరిచయం‘లివ్‌–ఇన్‌’ రిలేషన్‌ షిప్‌కు దారితీసింది. ఆరు నెలలపాటు వారి ‘కాపురం’ సజావుగానే సాగింది. అయితే, సారిక తిరుపతిరావుకు భార్యగా వచ్చాక ఆ కాపురంలో బీటలు బారాయి. షమీర్, సారిక అందాన్ని పొగుడుతూంటే అసూయతో లోలోపలే రగిలిపోయేది మేరీ. బాస్‌ ఇంటికి వెళ్లొద్దనీ, వెళ్లినా అతని భార్యతో మాట్లాడవద్దనీ ఆంక్షలు పెట్టనారంభించింది. సారిక వలపులో పడి అతను తనను ఎక్కడనిర్లక్ష్యం చేస్తాడోనన్న అభద్రతాభావం ఆమెది. చివరకు మూణ్ణెల్ల కిందట విడిపోయారు ఇద్దరూ. మేరీ మళ్ళీ హాస్టల్‌కి వెళ్ళిపోయింది, తమ రిలేషన్‌షిప్‌కి ఫుల్‌స్టాప్‌ పెడుతూ.మేరీది కేవలం స్త్రీ సహజమైన అసూయే తప్ప, ఆమె తన పైన నిఘాపెడుతుందనీ, ఎక్స్‌పోజ్‌ చేస్తుందనీ ఊహించలేదు షమీర్‌. మేరీని కలసి నిలదీశాడు.మేరీకి అహంభావం ఎక్కువ. అతని ఆరోపణను తోసిపుచ్చడానికి అహం అడ్డు వచ్చింది. తిరుపతిరావుకు ఫోన్‌ చేసి రప్పించింది తానేనని ఒప్పుకుంది. అలా చెబుతూంటే విజయగర్వంతో ఆమె కన్నులు మెరవడం షమీర్‌ దృష్టిని తప్పించుకోలేదు. ఆగ్రహం పట్టలేక  చెంప ఛెళ్లుమనిపించాడు. 

‘ఆమెను లేపేద్దామా?’ అనిపించింది ఓ క్షణం. అంతలోనే, ‘మేరీని చంపితే నాకు ఒరిగేదేమీ లేదు. తిరుపతిరావును చంపేస్తే అందాల భామతో పాటు అతని కంపెనీ పైన ఆధిపత్యం కూడా లభిస్తుంది’ అనుకున్నాడు. ఆ ఆలోచన క్రమంగా బలపడడంతో తిరుపతిరావు హత్యకు స్కెచ్‌ వేయనారంభించాడు షమీర్‌. కిరాయి హంతకుణ్ణి నియమిస్తే వాడు దొరికిపోతే, తానూ దొరికిపోతాడు. ఆ హత్య ఏదో తానే స్వయంగా చేయాలనుకున్నాడు.షమీర్‌ ఆలోచనలు ఓ కొలిక్కి రాకుండానే, తిరుపతిరావు శ్రీశైలం వెళ్ళబోతున్నాడన్న వార్త తెలిసింది. ఆ మధ్య ‘క్రెడిబుల్‌ కన్‌స్ట్రక్షన్స్‌’కి ఓ కొత్త ప్రాజెక్ట్‌ వచ్చింది. కొత్తప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసేముందు శ్రీశైలం వెళ్ళి శివుడికి అభిషేకం చేయించడం తిరుపతిరావుకు సెంటిమెంటు. షమీర్‌తో తన వ్యవహారం బయటపడినప్పట్నుంచీ సారిక మదిలో బెరుకుగానే ఉంది. తప్పించుకు తిరుగుతోంది. అందుకే, భర్త శ్రీశైలం రమ్మంటే, తనకు ఒంట్లో బాగోలేదని చెప్పి తప్పించుకుంది. తిరుపతిరావు ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌లోనే బసచేస్తాడు. ఆ విషయం షమీర్‌కు తెలుసు. తన ఎక్స్‌–బాస్‌ ని అక్కడే తుదిముట్టించడానికి పకడ్బందీగా పథకం రచించాడు.  తిరుపతిరావు లేని సమయం చూసి అతని ఇంటికి వెళ్లాడు షమీర్‌. సారిక అతన్ని కౌగలించుకునిఏడ్చేసింది.హోటల్‌ ఎపిసోడ్‌ తరువాత వాళ్లు కలవడం అదే ప్రథమం. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరూ. సారిక కాఫీ కలుపుకు రావడానికి కిచెన్‌కి వెళ్ళింది. ఆ సమయంలోతిరుపతిరావు పడగ్గదిలో ప్రవేశించాడు షమీర్‌. బెడ్‌ పక్కనున్న క్యాబినెట్‌ అరలో ఉన్న పిస్టల్‌ని తీసి జేబులో వేసుకున్నాడు. సారిక కాఫీ తెచ్చేసరికి ఏమీ ఎరుగనట్టు వచ్చి కూర్చున్నాడు. అది తిరుపతిరావు స్వీయరక్షణ కోసం తీసుకున్న లైసెన్స్‌డ్‌ పిస్టల్‌. ఎప్పుడూ బెడ్‌ పక్కనున్న డ్రాయర్‌లోనే ఉంటుంది. ఆ సంగతులన్నీ షమీర్‌కి ఎరుకే.తిరుపతిరావును చంపబోతున్నట్టు సారికకు చెప్పలేదు. అతను అక్కడి నుంచి తిన్నగా పాతబస్తీకి వెళ్ళి ఆ పిస్టల్‌కి సైలెన్సర్‌ని పెట్టించాడు.‘డి–డే’ రానే వచ్చింది. తిరుపతిరావు శ్రీశైలానికి ఉదయమే కారులో బయలుదేరితే – షమీర్‌ తన మోటార్‌ బైక్‌ మీద సాయంత్రం బయలుదేరాడు. తన ఆనవాళ్ళు తెలియకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అతను.

బైక్‌ నంబర్‌ ప్లేట్‌ మీద ఓ ఫేక్‌ నంబర్‌ స్టిక్కర్ని అతికించాడు. తలకు హెల్మెట్‌ ధరించడం వల్ల అతని ముఖం తెలియదు. దారిలో టోల్‌ గేట్స్‌ దగ్గర ఉండే సి.సి. కెమేరాలలో తన ఐడెంటిటీ నమోదు కాదు. షమీర్‌ రాత్రికి శ్రీశైలం చేరుకుని, ఓ లాడ్జ్‌లో దిగాడు. తిరుపతిరావు ఎప్పటిలాగే ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌లో దిగినట్లూ, అతను లోన్‌ గెస్ట్‌ అనీ తెలుసుకున్నాడు షమీర్‌. అంతకు మునుపు కొన్నిసార్లు బాస్‌తో కలసి అక్కడికి వచ్చాడు తాను. అందువల్ల ఆ ప్రాంతమంతా అతనికి సుపరిచితం. ఆ అతిథిగృహం అందమైన ప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉంటుంది. వాకింగ్‌ కోసం అడవిలో కాలిబాట కూడా ఉంది. ఆ గెస్ట్‌హౌస్‌లో బస చేసేవారు ఉదయం, సాయంత్రం అక్కడ వాకింగ్‌ చేస్తూ చక్కని అనుభూతిని పొందుతుంటారు.  తిరుపతిరావుకు తెల్లవారు జామునే లేచి వాకింగుకు వెళ్ళడం అలవాటు. ఆ సంగతి షమీర్‌కి తెలుసును. ఆ సమయంలో వెళ్లి అతని పిస్టల్‌తోనే తిరుపతిరావును షూట్‌ చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలన్నది అతని ప్లాన్‌. అడవి పూర్తిగా మేల్కొనకముందే లేచి వాకింగుకు బయల్దేరాడు తిరుపతిరావు. అప్పుడే మేల్కొంటున్న పక్షుల కిలకిలా రావాలు ఆరంభమయ్యాయి. సూర్యకిరణాలు లోపలికి చొచ్చుకు రావడానికి ఇంకా గంట టైమైనా ఉంది. చీకటితోనే మాటువేసిన షమీర్, తిరుపతిరావును రహస్యంగా వెంబడించాడు. కాళ్ళకు గమ్‌ బూట్సూ, చేతులకు గ్లవ్సూ ఉన్నాయి. కొంతదూరం వెళ్ళాక వెనుక నుంచి తిరుపతిరావు నోరు మూసేసి, పిస్టల్‌తో అతని కుడి కణతపైన పాయింట్‌ బ్లాంక్‌లో షూట్‌ చేశాడు. తిరుపతిరావు నేలకు ఒరిగిపోయాడు. పిస్టల్‌ని హతుడి కుడిచేతిలో ఉంచి, నిష్క్రమించాడు షమీర్‌. 

షమీర్‌ మూడు రోజులుగా ఇల్లు కదల్లేదు. సెల్‌ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేసేశాడు.తిరుపతిరావు చావును గురించిన వార్తలను టీవీలో వాచ్‌ చేశాడు. ‘క్రెడిబుల్‌ కన్‌స్ట్రక్షన్స్‌ యజమాని తిరుపతిరావు శవం శ్రీశైలం అడవిలో లభించిందనీ, అతను స్వంత పిస్తోలుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడనీ, అందుకు కారణం వ్యాపారంలో నష్టాలు రావడమా, లేక కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నాయా అన్న విషయాన్నిపోలీసులు పరిశోధిస్తున్నారనీ’ వాటి సారాంశం. నాలుగవ రోజున పూర్తిగా తెల్లవారకుండానే డోర్‌ బెల్‌ మ్రోగడంతో లేచి వెళ్ళి తలుపు తెరచిన షమీర్, పోలీసులను చూసి కంగుతిన్నాడు. ‘‘యూ ఆర్‌ అండర్‌ అరెస్ట్‌!’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్‌. ‘‘క్రెడిబుల్‌ కన్‌స్ట్రక్షన్స్‌ యజమానీ, నీ ఎక్స్‌–బాసూ అయిన తిరుపతిరావును హత్య చేసినందుకు!’’ అవాక్కయ్యాడు షమీర్‌. తేరుకుని, ‘‘అతనిది ఆత్మహత్య కదా!అలాగని టీవీలో...’’ అంటూంటే, చెంప ఛెళ్లుమనిపించాడు ఇన్స్‌పెక్టర్‌. తన సెల్‌ఫోన్లో అతను చూపించిన వీడియో చూసి అదిరిపడ్డాడు షమీర్‌. అందులో – ‘ఆ రోజు శ్రీశైలంలో షమీర్, తిరుపతిరావును పిస్టల్‌తోకాల్చి చంపిన ఘటన చిత్రీకరింపబడివుంది’..!!షమీర్‌ హఠాత్తుగా జబ్బుపడ్డవాడిలా అయిపోయాడు. ‘‘బట్‌ హౌ!?’’ అన్న పలుకులు అప్రయత్నంగా అతని నోటి నుంచి వెలువడ్డాయి.‘‘ఐ విల్‌ టెల్‌ యూ హౌ’’ అంటూ ఇన్స్‌పెక్టర్‌ చెబుతూన్నది ఆలకిస్తూంటే అతని మతిపోయింది. ‘చైతన్య అనే ఓ వైల్డ్‌ లైఫ్‌ వీడియోగ్రాఫర్‌ నేచర్‌ని చిత్రీకరించి నేషనల్‌ జియోగ్రఫీ లాంటి ఛానెళ్ళకు పంపిస్తూంటాడు. తిరుపతిరావు హత్య జరిగిన రోజున అప్పుడే మేల్కొంటూన్న పక్షులనూ, వాటి విధానాలనూ, వలసపక్షులనూ ఫిల్మ్‌లో బంధించే నిమిత్తం పూర్తిగా తెల్లవారకుండానే శ్రీశైలం అడవికి వెళ్ళాడు అతను.అనుకోకుండా తిరుపతిరావు హత్య దృశ్యం కూడా అతను తీసిన వీడియోలో పడింది. దృష్టి పక్షులపైనే కేంద్రీకరించడంవల్ల అతను దాన్ని చూళ్ళేదు. గతదినం, తాను తీసిన వీడియోలనుఎడిట్‌చేస్తున్నప్పుడు ఆ ఘోర సంఘటనను అతను చూడడమూ, వెంటనే పోలీసుల దృష్టికి తేవడమూ జరిగాయి.’‘‘తీగ లాగితే డొంకంతా కదిలింది. ఆ వీడియోలోని ఫేస్‌ నీది. ఉద్యోగంలోంచి తీసేశాడన్న కక్షతో తిరుపతిరావును నువ్వు హత్యచేశావన్నది స్పష్టమయింది’’ ఇన్స్‌పెక్టర్‌ అన్నాడు. ‘‘ఎంత తెలివిగా చేసినా నేరందాగదు, మేన్‌!’’అతని పలుకులు పూర్తికాకుండానే కుప్పకూలిపోయాడు షమీర్‌.  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top