పథకం పతనం

Funday crime story - Sakshi

క్రైమ్‌ స్టోరీ

‘‘హేయ్‌ శ్యామ్‌! రావడం కాస్త ఆలస్యమైంది’’ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది శశి. ‘‘కాస్త ఆలస్యమా! అరగంట నుంచి నీకోసం ఎదురుచూపులే!’’ నవ్వుతూ అన్నాడు శ్యామ్‌. ‘‘మేడమ్‌! ఏం తీసుకుంటారు?’’ అడిగాడు సర్వర్‌. ‘‘రెండు స్పెషల్‌ కాఫీ’’ అంది శశి. ‘‘శ్యామ్‌! నీకు స్వేచ్ఛ ఉంది. నాకు లేదు. మా అన్నను మభ్యపెట్టి వచ్చేసరికి ఆలస్యమైంది’’ అంది శశి.‘‘ఓకే! నీ ఆలస్యానికి జరిమానా విధిస్తున్నా’’ అన్నాడు శ్యామ్‌. ‘‘జరిమానానా?’’ అంది శశి. ‘‘అవును. మనం ఫస్ట్‌ షో సినిమాకెళ్లాలి. అదే నీకు నేను విధించే జరిమానా!’’ అన్నాడు శ్యామ్‌. అంగీకారంగా తల ఆడించింది శశి. ‘‘ఎవరు మీరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు?’’ అసహనంగా అరిచాడు శ్యామ్‌. ‘‘శ్యామ్‌! మేం శత్రువులం కాము. నీకు ప్రియ మిత్రులం. శాంతించు. శ్రద్ధగా నా మాట విను’’ అన్నాడతను. ‘‘ఏవిటామాట?’’ ప్రశ్నించాడు శ్యామ్‌. ‘‘నువ్వు కోటీశ్వరుని కూతుర్ని వలలో వేశావు. ఒడుపుగా పట్టుకున్నావు. నీ తెలివికి నా అభినందనలు’’ అన్నాడతను. ‘‘మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అంతా అబద్ధం’’ అన్నాడు శ్యామ్‌. ‘‘శ్యామ్‌! నీ కథ అంతా నాకు తెలుసు. ఇంతకుముందే శశిని చంపాలనుకున్నావు! కానీ కుదర్లేదు. నువ్వేం వర్రీ అవ్వకు. నేను చెప్పినట్టుగా విను. పథకం ప్రకారం ఆచరించు. ఆమెను అంతమొందిస్తే మనకు అరవై కోట్ల దాకా వస్తాయి’’ అన్నాడతను. శ్యామ్‌ కొద్ది క్షణాలు దీర్ఘంగా ఆలోచించాడు. ‘‘ఓకే! అలాగే చేస్తాను. పథకం చెప్పండి’’ నవ్వుతూ అన్నాడు శ్యామ్‌. 

శశి అన్నయ్య అచ్యుత్‌ నగరంలో లేకపోవడం వల్ల ఆమె మహదానందంగా ఉంది. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని టీవీలో వస్తున్న హారర్‌ మూవీని దీక్షగా చూస్తోంది. అంతలో ఆమె ముందు ఓ ముసుగు మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ ముసుగు మనిషిని చూసి ఆమె షాక్‌ అయింది. ‘ఆ మనిషి హాల్లోకి ఎలా వచ్చాడు? మెయిన్‌ డోర్‌ కీ భద్రంగా తన వద్దే ఉంది. డూప్లికేట్‌ కీ అన్నయ్య వద్ద ఉంది’. ఆమె చేతికి రివాల్వర్‌ తగిలింది. తనపై దూకబోతున్న వ్యక్తిపైకి రివాల్వర్‌తో షూట్‌ చేసింది. ఆ వ్యక్తి నేలపై కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. అదే సమయంలో అచ్యుత్‌ అక్కడకు వచ్చాడు. ఆమె అచ్యుత్‌ను చూడగానే ఘొల్లుమంది. అచ్యుత్‌ కిందపడి ఉన్న ముసుగు వ్యక్తి మొహంపై ఉన్న ముసుగును తొలగించాడు. ఆ వ్యక్తిని చూసి శశి కెవ్వుమంది. 

‘‘శశి! ముందు మీరు ఏడుపు ఆపండి. అసలేం జరిగిందో చెప్పండి’’ అన్నాడు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ దీక్షిత్‌. ‘‘అతను నా స్నేహితుడు శ్యామ్‌ సార్‌’’ అంది శశి. ‘‘వీడా నీ స్నేహితుడు. నేను మొదట్నుంచీ నీకు చిలక్కి చెప్పినట్టుగా చెప్తూనే ఉన్నాను. నేను అనుకున్నట్టే అయింది’’ ఆగ్రహంగా అన్నాడు అచ్యుత్‌. ‘‘అచ్యుత్‌! ఇతను మీకు ఇంతకుముందే తెలుసన్నమాట’’ అని ఒకసారి హాలునంతా నిశితంగా పరిశీలించాడు ఎస్సై దీక్షిత్‌. దీక్షిత్‌కు తన ప్రేమకథ మొత్తం చెప్పింది శశి. ‘‘డోర్‌లాక్‌ ఎలా తెరిచారు మీరు?’’ అచ్యుత్‌ను ప్రశ్నించాడు దీక్షిత్‌. ‘‘డూప్లికేట్‌ కీ నావద్దే ఉంది’’ అన్నాడు అచ్యుత్‌. ‘‘అసలు డోర్‌ కీ నా పర్సులో ఉంది సార్‌’’ అంది శశి.దీక్షిత్‌ చూపు గోడకున్న రెండు ఫొటోల వైపు వెళ్లింది. ఆ రెండు ఫొటోల్లోనూ ఉన్న వ్యక్తి ఒక్కడే. కానీ అతడి పక్కనున్న స్త్రీలు వేరుగా ఉన్నారు. ఆ ఫొటోలకు దండలు వేసి ఉన్నాయి. ఆ ఫొటోల గురించి అచ్యుత్‌ను అడిగాడు దీక్షిత్‌. ‘‘ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి మా నాన్నగారు. మాది పెద్ద జమీందారీ వంశం. ఒక ఫొటోలో ఉన్న ఆమె మా అమ్మగారు. నేను పుట్టిన ఏడాదికి అమ్మగారు మరణించారు. ఆ తర్వాత రెండో ఫొటోలో ఉన్న ఆమె నా సవతి తల్లి. ఆమెకు శశి పుట్టింది. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో నాన్నగారు, ఆమె మరణించారు’’ చెప్పడం పూర్తి చేశాడు అచ్యుత్‌. 
 
‘‘శశిగారూ! మీ చేతికి ఆ రివాల్వర్‌ ఎలా వచ్చింది?’’ ప్రశ్నించాడు దీక్షిత్‌. ఆ కంగారులో నేను గుర్తించలేదు. నా ప్రాణ రక్షణ కోసం శ్యామ్‌ను షూట్‌ చేశాను’’ అంది శశి. అంతలో కానిస్టేబుల్‌ వీర్రాజు దీక్షిత్‌కు శ్యామ్‌ తాలూకు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను అందించాడు. ఆ రిపోర్ట్‌ను దీక్షిత్‌ శ్రద్ధగా చదివాడు. ‘‘అచ్యుత్‌ గారు! శశి శ్యామ్‌ను హత్య చేయలేదు.’’ అన్నాడు దీక్షిత్‌. ‘‘మరెవరు చేశారు సార్‌’’ అడిగాడు అచ్యుత్‌. ‘‘అచ్యుత్‌. నీ అమాయకత్వం నా ముందు చెల్లదు. మీ నాన్నగారు మరణించడానికి ముందే అతని యావదాస్తిని సమానంగా చేసి వీలునామా రాశారు. కానీ మీలో అత్యాశ మేల్కొని మీ చెల్లెలు వాటా మీద కన్ను పడింది. ఆమెను చంపాలనుకున్నావు. అందుకు శ్యామ్‌ను పావులా వాడుకున్నావు. రివాల్వర్‌ను ముందు సోఫాలో ఉంచావు. నీ వద్దనున్న డూప్లికేట్‌ కీని వరండాలో ఉన్న పూలకుండీలో ఉంచి శ్యామ్‌కి అందించావు. శ్యామ్‌ను శశి షూట్‌ చేసింది. కానీ అతని చేతిలో కానీ కడుపులో కానీ గాయం అవ్వలేదు. శ్యామ్‌ కడుపులో లభించిన బుల్లెట్స్‌ నువ్వు డాబాపై ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో దాచిన రివాల్వర్‌లోవని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో, నా పరిశోధనలో తేలింది. ఆస్తికోసం చెల్లెల్ని ఒక హంతకురాలిగా మార్చాలని ప్లాన్‌ చేశావు. కానీ నీ పథకం పతనమైంది’’ అన్నాడు దీక్షిత్‌. 
- రాణీ మోహన్‌రావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top