మర్డర్ మిస్టరీ

funday crime story - Sakshi

క్రైమ్‌ స్టోరీ

సమయం రాత్రి ఎనిమిది గంటల నలభై నిముషాలు. ‘‘నమస్కారం సార్‌! భైరిపురం డ్యామ్‌ దగ్గర మర్డర్‌ జరిగింది.’’ ఫోన్‌కాల్‌ రావడంతోనే ఇన్‌స్పెక్టర్‌ వర్మ జీపు రెడీ చేయమని చెప్పాడు. అమావాస్య కావడంతో చిమ్మ చీకటిగా వుంది. అప్పటికే డెడ్‌బాడీ చుట్టూ దగ్గర్లోని గ్రామ ప్రజలు చేరి పోయారు. పోలీసులను చూసి దారిచ్చారు జనం. హెడ్‌లైట్‌ వెలుగు అక్కడ పరుచుకునేలా జీపు ఆపారు. రక్తపు మడుగులో పాతికేళ్ళ యువకుడు పడి వున్నాడు. ఒక యువతి డెడ్‌బాడీ మీద పడి హృదయ విదారకంగా ఏడుస్తోంది – ‘‘పెళ్ళయిన వారానికే నన్ను వదిలేసి పోయాడు దేవుడా!’’.ఇద్దరు కానిస్టేబుళ్ళు జనాన్ని కంట్రోల్‌ చేస్తున్నారు. స్టేషన్‌కి ఫోన్‌ చేసిన వ్యక్తిని పిలిచి, ‘‘ఏం జరిగిందో చెప్పండి?’’ అనడిగాడు వర్మ. ‘‘బొబ్బిలి నుండి వస్తున్న ఆ దంపతులు మూత్ర విసర్జన కోసం  బైకు ఆపారు. పొదల్లో దాగి వున్న నలుగురు యువకులు నగలిమ్మని అమ్మాయిని బెదిరించారు. ఆమె పెద్దగా కేకలు వేసేసరికి మూత్ర విసర్జన కోసం వెళ్ళిన ఆమె భర్త పరిగెడుతూ వచ్చి వారి మీద తిరగబడ్డాడు. నలుగురునీ ఒక్కడు ఎదిరించేసరికి వాళ్ళకి పౌరుషం వచ్చి బలమైన ఇనుప రాడ్‌తో యువకుడి  తల వెనుక కొట్టి, డొక్కలో కత్తితో పొడిచారు. ఆ అమ్మాయి మీదున్న నగలను దోచుకెళ్లారు. మా బైకు వెలుతురు చూసి దొరికిపోతారనే భయంతో పారిపోయారు’’ చెప్పాడతను. అంతలో అంబులెన్స్‌ రావడం, యువతికి చేతుల మీద, మెడ దగ్గర ఏర్పడ్డ గాయాలకు చికిత్స కోసం లేడీ కానిస్టేబుల్‌ సహాయంతో ఆసుపత్రికి పంపించారు. జనాన్ని అడిగి సమాచారం సేకరిస్తూ, ఆధారాల కోసం వెతికాడు ఇన్‌స్పెక్టర్‌ వర్మ.

హంతకులు హత్యా స్థలంలో ఎలాంటి ఆధారాలు విడిచిపెట్టలేదు. హత్యకు వాడిన రాడ్, కత్తిని తీసుకుపోయారు. హతుడు, అతడి భార్యల మొబైల్‌ ఫోన్లు కూడా తీసుకుపోయారు. అన్ని ఫోన్లు స్విచ్చాఫ్‌ చేశారు. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక పోలీసులు తీవ్ర ఆలోచనలో పడ్డారు. నాలుగు స్పెషల్‌ టీములు ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలింపు ప్రారంభించారు. ఆ జిల్లా ఎస్పీ ఈ  కేసును సీరియస్‌గా తీసుకున్నారు. 
ఇన్‌స్పెక్టర్‌ వర్మ తన శైలిలో విచారణ ప్రారంభించాడు. హత్య కాబడ్డ సింహాచలం నివాసముండే గ్రామం వెళ్లి అతడి కుటుంబ సభ్యులను కలిశాడు. సింహాచలం తండ్రి సీతారాముణ్ని సముదాయించడం కష్టమయింది వర్మకి. పాపం ఒక్కడే కొడుకు. ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కొడుకుని చదివిస్తే ఆరునెలల క్రితమే ఉద్యోగం వచ్చిందట. కూతురు, అల్లుడూ అగ్ని ప్రమాదంలో పదిహేనేళ్ళ క్రితమే చనిపోగా మనుమరాలిని చదివించి కొడుకుతో పెళ్లి చేశారు.  మనుమరాలిని ఆ స్థితిలో చూడలేక బాధపడుతున్నాడు మరో వైపు. చేతికి అంది వచ్చిన కొడుకు తనకి ఆసరాగా నిలుస్తాడనుకుంటే దారుణ హత్యకు గురవడం అతడిని బాగా కుంగదీసింది. ఆ బాధలో ఏదేదో మాట్లాడాడు. అంతులేని దుఃఖాన్ని ఆయన మాటల్లో కనుగొన్నాడు ఇన్‌స్పెక్టర్‌ వర్మ.‘‘హంతకుల కోసం గాలిస్తున్నాము. తొందరలోనే పట్టుకుంటాము’’ అని భరోసా ఇచ్చాడు వర్మ.

ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న వర్మకు సింహాచలం హత్య కేసులో కొన్ని సందేహాలు కలిగాయి. బంగారం కోసం హత్య చేశారా లేక హత్య చేసి బంగారం కోసమే చేసినట్టు పోలీసులను తప్పుదారి పట్టించాలన్న పథకం ఈ హత్య వెనుక ఉందా?  రెండు కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించాడు వర్మ. సింహాచలం తల్లిని, చిన్నాన్న, పిన్ని, ఇరుగు పొరుగులనీ ఆ కోణంలో ప్రశ్నించాడు. అతడికి  శత్రువులు లేరని, హాస్టల్‌లో ఉంటూ చదువు పూర్తి చేశాడని, పండుగలకు మాత్రమే వస్తుంటాడని తెలిపారు. ఎవరిమీదైనా అనుమానం ఉంటే చెప్పమన్నాడు వర్మ. తిరిగెళ్తూ గ్రామం దాటుతుండగా పొలాలకు అడ్డంగా పరిగెత్తుకుంటూ జీపు దగ్గరకు వచ్చిన కుర్రాడిని చూసి జీపు ఆపారు. ఆ  కుర్రాడు, హతుడి  చిన్నాన్న కొడుకు తిరుపతి. ఏడో తరగతి చదువుతున్నాడు. సింహాచలం పెళ్ళిలో గొడవ అయిందన్న కొత్త విషయం చెప్పడానికి వచ్చాడు. వివరంగా చెప్పమనడంతో మాట్లాడాడు తిరుపతి.పెళ్లి రోజు మధ్యాహ్నం భోజనాలకు వూళ్ళోని రెండు రాజకీయ పార్టీల వారు ఒకేసారి రావడంతో ముందుగా ఒక పార్టీ వారికి వడ్డించారు. రెండో పార్టీ వారికి కోపం వచ్చి రభస చేసారు. నచ్చజెప్పడానికి వెళ్ళిన సింహాచలం తండ్రిని వెంకన్న అనే మేస్త్రీ బలంగా  తోయడంతో దెబ్బలు తగిలాయి. వరుడు సింహాచలంకి  కోపం వచ్చి తండ్రిని తోసిన వాడి మీద తిరగబడ్డాడు. సింహాచలాన్ని కూడా కింద పడేలా తోసి ‘నీ అంతు చూస్తా’ అని వెళ్ళిపోయాడు వెంకన్న.ఆ విషయం చెప్పి మేస్త్రీ వెంకన్న మీద తనకు అనుమానంగా వుందన్నాడు. ఇంట్లో వాళ్ళు చెప్పడానికి జంకడంతో  తాను వచ్చినట్టు చెప్పాడు తిరుపతి. జీపు వెనక్కు తిప్పి గ్రామంలోకి వెళ్లారు. అప్పటికి వెంకన్న ఇంట్లో లేడు. జీపుని చూసి అతడి  కొడుకు వచ్చాడు. ఈ విషయం కాసేపటికే సర్పంచికి తెలిసి ఆయన వచ్చి వర్మ గారికి నమస్కరించాడు. వెంకన్న మీద అనుమానం నిర్ధారణకు వచ్చినట్టు చెప్పగానే ‘‘పీకల దాకా తాగి పెళ్లికి వెళ్ళాడు. అన్నం పెట్టడం ఆలస్యమయిందని వాగాడు. వాడు తాగితే మనిషే కాదు. తాగింది దిగగానే అన్నీ మరచిపోతాడు’’ అని నమ్మకంగా చెప్పాడు  సర్పంచి.  వెంకన్న రాగానే  స్టేషన్‌కి పంపించమన్నాడు  వర్మ. మండుటెండలో ఉన్నవాడికి మజ్జిగ దొరికినట్టు మంచివార్తతో వచ్చాడు కానిస్టేబుల్‌ రాజు. పెళ్లికి  మూడు రోజుల ముందు ఫ్రెండ్స్‌కి సింహాచలం పార్టీ ఇచ్చాడని, అక్కడ గొడవైందని వూళ్ళో అనుకోవడం విన్నాడట.  

‘‘సర్పంచికి ఫోను చేసి అతడి ఫ్రెండ్స్‌ని పిలిపించు’’ అని వర్మ చెప్పగానే ‘‘వద్దు సార్‌. జస్ట్‌ ఇన్ఫర్మేషనే కానీ కన్ఫర్మేషన్‌ కాదు. స్టేషనుకి పిలిచినందుకు పరువు పోయిందని ఆ మధ్య ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనమే వెళదాం సార్‌ ’’ సూచించాడు రాజు. సరే అన్నాడు వర్మ. గ్రామంలోని రామమందిరమే రచ్చబండ అయింది. సర్పంచితో పాటు కొందరు గ్రామ పెద్దలు కూర్చున్నారు. సింహాచలం స్నేహితులను పిలిపించమన్నాడు వర్మ. సర్పంచి కొందరి పేర్లు చెప్పాడు. కబురు వెళ్ళింది. కాసేపట్లో కొందరు యువకులూ, పెద్దలు ఆవేశంగా వచ్చారు. వచ్చీ రావడంతోనే సర్పంచి మీద కలబడ్డారు. ‘‘ఎగస్పార్టీ వాళ్ళమని మా పిల్లల పేర్లు కేసులో ఇరికిస్తావా? ఎమ్మెల్యే, మినిస్టర్‌ మాకు కూడా  తెలుసు. మీ అబ్బాయి పేరు తప్పించేసి మా పిల్లల జోలికి వస్తే ఊరుకోం’’ అన్నారు. ఇదేదో రాజకీయ గొడవకి దారి తీసేలా వుందని భావించాడు వర్మ.   భయపడాల్సింది  లేదనీ, కేవలం విచారణ కోసమే పిలిచానన్నాడు. సర్పంచి గారి అబ్బాయికి కబురు వెళ్ళింది. అప్పటికి అక్కడకి వచ్చిన వారిలో ఒక యువకుడు ముందుకు వచ్చి తన  పేరు కుమార్‌ అని, షుగర్‌ ఫ్యాక్టరీలో ఫిట్టర్‌ ఉద్యోగమని, నైట్‌ షిఫ్టు వల్ల పార్టీకి వెళ్ళలేదని చెప్పాడు. సింహాచలాన్ని చంపే అవసరం స్నేహితుల్లో ఎవరికీ  లేదన్నాడు. మిగతా వాళ్ళూ అతడి మాటలను బలపరిచారు.  

సర్పంచి కొడుకు వచ్చాడు కానీ ఇన్‌స్పెక్టర్‌ని చూసి భయంతో జవాబు చెప్పలేదు. తండ్రిని, ఇన్‌స్పెక్టరుని మార్చిమార్చి చూశాడు. భయం లేదన్నట్టు సర్పంచి తలాడించడంతో ‘‘కొండముచ్చుకి  చందమామ పెళ్ళాం అవుతోంది. అందగాడికి అనాకారి పెళ్ళాం అయింది. ఇదేం న్యాయం దేముడా?’’ అన్న వాసు మాటలతో  సింహాచలానికి కోపం వచ్చింది. ‘‘నా గురించే కదరా? అక్కాబావ చనిపోతే మేనకోడల్ని పెద్ద చేశాము. కట్నానికి కక్కుర్తి పడి నల్లటి మొద్దుతో నీ పెళ్లి చేసాడు మీ అయ్య’’ కోపంగా బదులిచ్చాడు  సింహాచలం. అలా   మాటామాటా పెరిగి ఒకరి మీద ఒకరు చెయ్యి చేసుకున్నారు’’  జరిగింది మూడుముక్కల్లో చెప్పాడు సర్పంచి గారి కుమారుడు. ‘‘ఆ మాత్రం దానికే  చంపేస్తారా?’’ ఊహించని ప్రశ్నకు షాకయ్యాడు సర్పంచి కొడుకు.‘‘అందగాడైన వాసుకి నల్లమ్మాయితో అర్నెల్ల క్రితం పెళ్లయింది. మనసులో దాచుకోలేక బయటకు కక్కేసాడు తప్ప చంపేంత దుర్మార్గుడు కాదు సార్‌’’ స్నేహితుణ్ణి వెనకేసుకొచ్చాడు సర్పంచి కొడుకు.‘‘ఈ వూరు కుర్రాళ్ళు మంచివాళ్ళు. మర్డర్‌ చేసే రౌడీలు, గుండాలు కాదు సార్‌’’ అన్నాడొక పెద్దాయన. పెళ్లి తర్వాత నుండి వాసు ఊర్లో లేడని, వాళ్ళ అత్తకు హాస్పిటల్‌లో సాయంగా ఉన్నాడని చెప్పారు. వాసు రాగానే స్టేషనుకి పంపమని చెప్పాడు వర్మ.

స్టేషన్‌కి వెళ్లేసరికి ఎస్పీ నుండి  కేసు ప్రోగ్రెస్‌ చెప్పమని ఫోను. జరిగింది చెప్పాడు వర్మ. కేసులో ముందుకి వెళ్ళే మార్గం కనబడలేదు. అప్పటికే హత్య జరిగి మూడు రోజులైంది. ఆ రోజు ఉదయం పేపర్‌ చదువుతుండగా ఒక వార్త వర్మను ఆకర్షించింది. నేటి యువత ప్రేమలో మునిగి తప్పులు చేసి బలి అవుతున్న సంఘటనే ఆ వార్త సారాంశం. సింహాచలం విషయంలో ఆ కోణంలో పరిశోధిస్తే ఫలితం ఉండొచ్చని భావించి వెంటనే  క్రైమ్‌ బ్రాంచీకి సూచించాడు.సింహాచలం గురించి మరికొన్ని విశేషాలు తెలిశాయి. డిగ్రీలో వున్నప్పుడు శివునిపేట గ్రామానికి చెందిన గాయత్రితో ప్రేమలో పడ్డాడు సింహాచలం. అమ్మాయిది చేపలు పట్టే కులం. భైరిపురం డ్యాం దగ్గర, చెరువుల్లోనూ చేపలు పట్టి అమ్ముతాడు గాయత్రి  అన్న. తండ్రి లేడు.  గాయత్రితో పెళ్లికి సింహాచలం కుటుంబం ఒప్పుకోలేదు. చెల్లిని ప్రేమించి పెళ్లికి నిరాకరించిన సింహాచలంపై గాయత్రి అన్నే పగ తీర్చుకున్నాడని  కొందరు చెప్పారు.శివునిపేట వెళ్ళింది పోలీసు జీపు. నూట యాభై ఇళ్లు ఉన్న చిన్న వూరు. గాయత్రి గురించి అడగ్గానే ఇల్లు చూపించారు. చిన్న పెంకుటిల్లు. యాభై ఏళ్ళున్న స్త్రీ  బయటకు వచ్చి  పోలీసులను చూసి భయపడింది. గాయత్రి కోసమని చెప్పగానే కుర్చీ చూపించింది.  సింహాచలం చావు వార్త విని బాధ పడింది గాయత్రి తల్లి. గాయత్రి ప్రేమ విషయం అడగగానే కులాలు కలవలేదని, పెద్దలు ఒప్పుకోలేదని చెప్పింది. కొడుకు, కూతురు వైజాగులో వున్నారని, ఆర్నెల్ల నుండి వూర్లోకి రాలేదని చెప్పింది. కేసుకి పనికొచ్చే సమాచారం దొరకనందుకు వర్మ చిరాకు పడుతుండగా  మొబైల్‌  రింగయింది. భైరిపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరికి ఒక స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్‌ దొరికినట్టు, దానిని స్టేషనుకి తెచ్చి అప్పగించినట్టు, ఫోను మీద రక్తం మరకలు వున్నట్టు రైటరు చెప్పాడు. వెంటనే జీపు బయలుదేరింది.

వర్మ ఎదురుగా కూర్చుంది సింహాచలం భార్య శ్రావణి. ‘‘సింహాచలాన్ని ఎందుకు మర్డర్‌ చేయించావు?’’ తూటాలా ఆయన నోటి నుండి వచ్చిన మాటలకు చిగురుటాకులా వణికింది శ్రావణి.‘‘నేనెందుకు మర్డర్‌ చేయిస్తాను?’’ అంది శ్రావణి. ఆమె గొంతులో అంతులేని భయం. ‘‘నువ్వే చంపించావనడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. కారణం మాత్రం చెప్పు!’’ ఈసారి గద్దించాడు వర్మ.‘‘భర్త పోయి నేనేడుస్తుంటే హంతకుల్ని పట్టుకోలేక నా మీద నేరాన్ని నెట్టారు’’ నెత్తీనోరు కొట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది శ్రావణి. ఆమెతో పాటొచ్చిన బంధువులు బయట కూర్చున్నారు. ఆసక్తిగా లోపల ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు.  ‘‘ఆపు నీ దొంగ ఏడుపులు. నీ సెల్‌ ఒక గొర్రెల కాపరి ద్వారా మాకు వచ్చింది. ముందు జాగ్రత్తతో స్విచ్చాఫ్‌ చేసి వాళ్ళకి ఇచ్చావు. వారు పారిపోతుండగా జేబులో నుండి జారి పొదల్లో పడి ఎవరి దృష్టికి వెళ్లకపోవడం వల్ల ఇంత ఆలస్యమైంది తప్ప ఎప్పుడో కేసు చిక్కుముడి విడిపోయేది. హంతకులతో నువ్వు చేసిన చాటింగు, పంపిన ఫొటోలు అన్నీ దొరికాయి. హంతకులను కాసేపట్లో అరెస్ట్‌ చేస్తాం. నేరం అంగీకరిస్తే మర్యాద దక్కుతుంది. లేదంటే మా పద్ధతిలో అడుగుతాం’’ కటువుగా పలికింది వర్మ స్వరం. కన్నీళ్లు పెట్టుకుంటూ నోరు విప్పింది శ్రావణి.అమ్మానాన్న చనిపోవడంతో తాతగారింట్లో పెరిగిన శ్రావణికి మేనమామతో పెళ్లి చేస్తామని చెప్పేవారు అమ్మమ్మ, తాతయ్య. వయసు పెరుగుతున్న కొద్దీ మామయ్య తనకి సరిపోడనే భావం పెంచుకున్న శ్రావణి, డిగ్రీ తరువాత వైజాగ్‌లో జాబ్‌ చేస్తున్నప్పుడు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ శివను ప్రేమించింది. పెళ్లికి సిద్ధమయ్యారు కూడా. అలాంటప్పుడే మామయ్యతో పెళ్లిని ఫిక్స్‌ చేశారు. ఈ విషయం శివకు చెప్పింది శ్రావణి. లేచిపోయి పెళ్లి చేసుకుందామన్నాడు శివ. ఊళ్ళో పరువు పోతుందని, అలాంటి ఆలోచన వద్దని చెప్పింది శ్రావణి. సింహాచలాన్ని శాశ్వతంగా అడ్డు తొలగించాలని కోరింది. దానికీ రీజన్‌ చెప్పింది శ్రావణి. అలా జరిగితే పెద్దలే  పెళ్లి చేస్తారని ఒప్పించింది. స్నేహితుల దగ్గర అప్పు చేసి కొంత డబ్బు ఇచ్చింది. చెన్నైలో రౌడీ గ్యాంగుకి యాభై వేలకి సుపారీ మాట్లాడి పాతిక వేలు అడ్వాన్సు చెల్లించాడు శివ. వాళ్ళు హత్య చేయకుండా ఆ డబ్బుతో పారిపోయారు. ఈ లోగా పెళ్లి జరిగింది. 

అప్పటి నుండి శివే సలహాలు ఇచ్చి ప్లాన్‌ అమలుపరిచాడు. తాళి కట్టించుకోమని చెప్పిన శివ మాటలతో అయిష్టంగానే పెళ్ళికి కూర్చుంది. వారం పదిరోజుల్లో మర్డర్‌ చేయిస్తానని మాట ఇచ్చాడు శివ. మర్డర్‌ జరిగిన రోజు వరకు రోజూ శివతో ఫోనులో మాట్లాడుతూనే వుంది శ్రావణి. భర్త పక్కనే ఉంటూ అతడి మర్డర్‌కి పూర్తిగా సహకరించింది. అతడిని వూరి నుండి దూరంగా తీసుకువస్తానని, అలాంటి టైములో సింహాచలాన్ని మర్డర్‌ చేయమని శివకు చెప్పిన శ్రావణి బొబ్బిలిలో నగలు మార్చాలని, పాత స్నేహితురాలిని కలవాలని, కొత్త చీరలు కొనాలని మాయమాటలు చెప్పింది. సింహాచలాన్ని వాళ్లకు అప్పగించింది. 
మర్డర్‌ రోజు ఉదయానికే  వైజాగ్‌ నుండి నలుగురు యువకుల్ని కార్లో రప్పించాడు శివ. తమ ప్రతి కదలిక వారికి షేర్‌ చేసింది శ్రావణి. భైరిపురం డ్యామ్‌ దగ్గర సులువుగా పని ముగించారు. మర్డర్‌ చేయగానే సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేయాలని ముందే అనుకున్నారు. ‘‘పెళ్లి చేసుకోవాలంటే ఎటైనా పారిపోయి చేసుకోవచ్చు. స్వయాన మేనమామని మర్డర్‌ చేయించాలనే క్రూరమైన ఆలోచన ఎందుకు వచ్చింది?’’ అడిగాడు వర్మ.నగల కోసమే సింహాచలాన్ని చంపారంటే తన మీద సానుభూతి పెరుగుతుందని, విధవరాలిగా జీవితాంతం వదిలేయకుండా మళ్ళీ పెళ్లి చేస్తారని, అప్పుడు శివని రప్పించి జాలితో పెళ్ళికి ఇష్టపడ్డట్టు చెప్పి, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలన్న  అసలు గుట్టు విప్పింది శ్రావణి. 
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top